మానవ జీవనం కాలాధీనం. పుట్టుకనుండి మొదలుకొని పుడమి గర్భంలో కలిసేదాకా మనిషి కాలంతోనే ప్రయాణించాలి.
కాల సముద్రాన్ని ఈదాలి. కాలశిఖరాన్ని అధిరోహించాలి. కాలగమ్యాన్ని చేరుకోవాలి.
కాలం అనే వంతెన మీదుగానే కలకాలం ప్రయాణించాలి.
ఇదే మానవ జీవన సత్యం.
డా|| అయాచితం నటేశ్వరశర్మ
భారతీయ కాలమానం ప్రకారం అరవై సంవత్సరాలకు ఒకసారి కాలచక్రం పునరావృతమౌతుంది. ప్రభవనామ సంవత్సరంనుండి ప్రారంభమయ్యే సంవత్సర చక్రం అక్షయనామ సంవత్సరం వరకు అరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ అరవై సంవత్సరాలపాటు జీవించే మనిషి ‘షష్టిపూర్తి’ చేసుకుంటాడు. అసలు మానవుని సంపూర్ణమైన ఆయుర్దాయం నూట ఇరవై సంవత్సరాలని జ్యోతిశ్శాస్త్రం చెబుతోంది. అందులో సగం పూర్తయితే అరవై సంవత్సరాలు నిండుతాయి. ఇలా కాల (సంవత్సర) చక్రం రెండుసార్లు తిరిగేదాక జీవించిన మనిషి సంపూర్ణాయుష్యంతో బ్రతికినవాడుగా కీర్తింపబడుతాడు. కనుక సంవత్సరాత్మక కాలానికి మనిషి జీవితంలో ఎనలేని ప్రాధాన్యం ఉంది.
ప్రతి ఏడాదీ చైత్రమాసం తొలి రోజుతో సంవత్సరం ప్రారంభమౌతుంది. చైత్రమాసంలో ప్రకృతిలో వసంతం వెల్లివిరుస్తుంది. చెట్లు చిగురిస్తాయి. పచ్చని ఆకులు నేత్రపర్వం చేస్తాయి. కోకిలలు కూస్తాయి. ప్రకృతిలో కొత్తదనం పరచుకొంటుంది. నవవికాసం అంతటా ఆవిష్కృతమౌతుంది. మానవజీవితం వసంతంలాగే వికాసశీలం. చిగురు పుట్టుకకు, కాయలు ఎదుగుదలకు, పండ్లు అనుభూతులకు, కోకిల కూతలు మంగళధ్వనులకు సంకేతాలు. కనుక మానవజీవనం ప్రతినిత్య వసంతమే.
చైత్రమాసంలోని ప్రథమ దినాన్ని ఉగాది అనీ, యుగాది అనీ, సంవత్సరాది అనీ పిలవడం పరిపాటి. యుగం అంటే యోగం. మనిషి బ్రతుకు కాలంతో ముడివడి ఉండడమే యోగం. అలాంటి యోగానికి తొలినాడు కావడంవల్ల ‘యుగాది’ అనే పేరు ఈ పండుగకు సార్థకం.
మానవ జీవితం అనేక రుచుల కలయిక. అన్ని రుచులు కలిస్తేనే మనిషి శరీరం సమగ్ర వికాసాన్ని అందుకొంటుంది. మనస్సు విశ్వతోముఖంగా ప్రసరిస్తుంది. అందుకే ఉగాదినాడు ఆరు రుచుల పచ్చడిని ప్రసాదంగా ఆరగిస్తారు. మధురానుభూతుల తీపి, కష్టాల చేదు, సమస్యలతో మింగుడుపడని కారం, బాధల ఉప్పు, కడగండ్ల పులుపు, అపజయాల వగరు మానవ జీవితంలో సహజ రుచులే. వీటిని సమన్వయం చేసుకొని అనుకూలంగా రంగరించుకొని ప్రయాణించడమే జీవనం. ఆశలు చిగురులవంటివి. అవి ఎప్పుడూ వికసిస్తూ ఉండాలని కోరుకోవడమే జీవన వసంతం. ఎల్లప్పుడూ మంగళధ్వనులనే వినాలనే తపనకు ప్రతిరూపమే కోకిలకూత.ఇలా ఉగాది పండుగ మనిషి బ్రతుకులో కీలకంగానూ, మూలకంగానూ ఆవిర్భవించింది.
‘ఉగాది’ పండుగనాడు ఉషస్సులోనే మేల్కొని అభ్యంగన పుణ్యస్నానాలను ఆచరించాలి. నూతన వస్త్రాలను ధరించాలి. ఇష్ట దేవతలను ఆరాధించాలి. దేవాలయాలను సందర్శించాలి. పంచాంగ శ్రవణం చేయాలి. ఆరు రుచుల పచ్చడిని ఆరగించాలి. ఇదీ సంప్రదాయం.
ఉగాదినాడు పంచాంగ శ్రవణానికి ప్రత్యేకత ఉంది. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అయిదు అంశాలను ప్రతినిత్యం అనుసరిస్తూనే మనిషి తన జీవితానికి కావలసిన శుభకర్మలను ఆచరించాలని శాస్త్రం చెబుతోంది. ఏ పనిచేసినా మంచిగా చేయాలి. మంచి ఫలితాలను సాధించాలి. అందరికీ మంచిని పంచాలి. ఇదే పండుగలోని పరమార్థం. ఉగాదినాడు చేసే పంచాంగ శ్రవణంలో అనంతమైన కాలంలో మానవుల ఉనికినీ, కాలగణననూ, కాలంలోని గుణదోషాలనూ తెలిపే అంశాలెన్నో ఉన్నాయి. కనుక పంచాంగాన్ని తెలుసుకోవడం ఈ పండుగనాడు అవశ్య విధి.
‘పంచాంగశ్రవణం’ ఎంతటి భాగ్యాన్ని ప్రసాదిస్తుందో తెలుపుతోంది ఈ ప్రాచీన శ్లోకం-
‘శ్రీకల్యాణగుణావహం రిపుహరం దుస్స్వప్నదోషాపహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణామ్
ఆయుర్‌వృద్ధిద ముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం
నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతామ్’
ఓ మానవులారా! పంచాంగం సిరిసంపదలను ప్రసాదిస్తుంది. సకల మంగళాలనూ ప్రసాదిస్తుంది. ఎన్నో గుణాలను అందిస్తుంది.
శత్రువులను దూరం చేస్తుంది. పీడకలలను రాకుండా చేస్తుంది. దోషాలను తగ్గిస్తుంది. గంగాది పుణ్య నదులలో స్నానం చేసినంతటి పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది. గోవులను దానం చేసినంతటి పుణ్యాన్ని కలిగిస్తుంది. ఆయుష్యాన్ని పెంచుతుంది. ఉత్తమ జీవన మార్గాన్ని సూచిస్తుంది. అనేక శుభాల ను అందిస్తుంది. చక్కని సంతా నాన్ని అందిస్తుంది. ప్రతి పనిలోనూ విజ యాన్ని చేకూర్చడం ద్వారా అనేక ఫలితాలను అందిస్తుంది. కనుక పంచాంగాన్ని వినడం, చదవడం మనిషికి సముచితం. పంచాంగాన్ని తప్పక వినండి’ అని ఈ శ్లోకంలోని భావం.
ఇంతటి గొప్పతనాన్ని మనిషికి అనుగ్రహించే ఉగాది పండుగ అందరికీ ఆనందదాయకమే. తెలంగాణ జనపదాలలో ఉగాది పండుగనాడు నూతన వ్యాపారాలను ప్రారంభించడం, అభ్యుదయ కర్మలను ఆచరించడం, వ్యవసాయానికి ఉప యోగపడే సాధనాలను పూజించడం, పశువులను, బండ్లను అలంకరించి ఊరేగించడం, మామిడి ఆకులతో మంగళ తోరణాలను ఇంటింటికీ కట్టుకోవడం కనబడుతుంది.
కుటుంబసభ్యులతోనూ, బంధుమిత్రులతోనూ కలిసి భోజనం చేయడం, విందులూ, వినోదాలతో కాలక్షేపం చేయడం పరిపాటిగా కనబడుతుంది.
ఈ ఉగాది ‘హేవళంబి’ నామ సంవత్సరంగా ప్రసిద్ధి. బ్రహ్మదేవుడు సృష్టించిన అరవై సంవత్సరాల కాలచక్రంలో ఒకటైన హేవళంబినామ సంవత్సరం ప్రపంచానికి అన్నిరంగా లలోనూ పురోగతినీ, శాంతినీ, సౌ భాగ్యాన్నీ అందిస్తుందనడంలో సందేహం లేదు.
తెలంగాణ రాష్ట్రానికి హేవళంబినామ సంవత్సరం అపూర్వ సంపదలనూ, శాంతి సౌభాగ్యాలనూ, ప్రజా శ్రేయస్సునూ, దినదినాభివృద్ధినీ, సుపరిపాలననూ, అభ్యుదయ పరంపరలనూ తప్పక అందిస్తుంది. ఎల్లప్పుడూ మంచిని కోరడమే పండుగ. అందుకే-
‘సర్వే భవంతు సుఖినంః
సర్వే సంతు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యంతు
మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్’
అనే ఆకాంక్షను హృదయాలలో పదిలపరుచుకొందాం!
శ్రీహేవళంబి సంవత్సర ఫలితాలు
– విరివింటి ఫణిశశాంకశర్మ
మేషం
ఆదాయం – 2 వ్యయం-5 రాజపూజ్యం – 3, అవమానం – 1
ఈ రాశివారికి సంవత్సరాది నుండి నవమ స్థాన శని ప్రభావం వలన అన్నిపనులయందు విజయము, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీ శ్రమను సమాజం గుర్తిస్తుంది. సుఖశాంతులతో జీవించేందుకు కావలసిన అన్ని వ్యవస్థలు సమకూర్చుకుంటారు. సంపాదనకంటే మానసిక ప్రశాంతత ముఖ్యం అని తెలుసుకొని, ఆ దిశగా ప్రయత్నం చేస్తారు. ఉదర సంబంధమయిన, రక్త సంబంధమయిన అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కిందిస్థాయి ఉద్యోగులకు, ఇంజినీరింగ్ వాళ్ళకు, రైతులకు, గృహనిర్మాణ కార్మికులకు అనుకూలంగా ఉంటుంది. దైవబలం రక్షిస్తుంది. ‘సాధనాత్ సాధ్యతే సర్వం’ అనే మాటను గుర్తుకు పెట్టుకుని ముందుకు సాగండి. ఆలోచనా పరిధిని పెంచుకొని ఆచార సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తే మంచిది.
వృషభం
ఆదాయం – 11 వ్యయం-8 రాజపూజ్యం – 6 అవమానం – 1
ఈ రాశి వారికి సంవత్సరాదినుండి అష్టమశని ప్రభావం వలన అనారోగ్య సమస్యలు, ఆప్తులతో వియోగము, ధననాశము, అనుకున్న పనులు సమీపానికి వచ్చి ఆగిపోవడం, మిథ్యాపవాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రవి, శుక్రుల అనుగ్రహం వలన రాజకీయక్షేత్రంలో ఉన్న వారికి ఉన్నత స్థాన ప్రాప్తి; ప్రభుత్వ పరమయిన పనులు చకచకా జరిగిపోవడం, కోర్టు సంబంధమయిన పనులు ఒక కొలిక్కి రావడం, వ్యాపారరంగం వారికి, పాత్రికేయులు, రంగస్థల కళాకారులకు, అభివృద్ధి, కష్టానికి తగిన ప్రతిఫలం పొందే అవకాశం ఉన్నది. పెద్దలతో మన:స్పర్థలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కార్యసాధనలో ఎన్ని ఆటంకాలు ఎదురయినా ఆత్మస్థైర్యంతో అనుకున్నది సాధిస్తారు. వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఈశ్వర, వెంకటేశ్వర ఆరాధన వలన అంతా మంచి జరుగుతుంది.
మిథునం
ఆదాయం – 2 వ్యయం-11 రాజపూజ్యం – 2 అవమానం – 4
ఈ రాశి వారికి ఈ సంవత్సరం అత్యంత ఉత్తమమయిన కాలం, తోటివారి సహాయ సహకారాలతో అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. పనులను వాయిదా వేయకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. మీమీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో విజయాలు వరించే అవకాశం. లేఖక వృత్తి, మాటలే ప్రధానమయిన వృత్తి, కల్పనా వృత్తి (యానిమేషన్) వాళ్ళకు అత్యంత గుర్తింపువస్తుంది. కుటుంబంలో భార్యాభర్తల మధ్య వృధా నిష్కారణ కలహాలు, దానితో ఉత్సాహం తగ్గి, భావోద్వేగాలను పొంది, అనారోగ్యాలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అందరినీ కలుపుకొని వెళ్ళడంవలన సమస్యలు తీరుతాయి. విజయం వరిస్తుంది. విద్యావంతులతో పరిచయాలు, ధనధాన్యాభివృద్ధి, సన్మానాలు పొందే అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీనారాయణులను అనన్యభావంతో ఆరాధిస్తే ఉత్తమమయిన ఫలితాలు పొందుతారు.
కర్కాటకం
ఆదాయం – 11 వ్యయం-5 రాజపూజ్యం – 5 అవమానం – 4
ఈ రాశివారు సంవత్సరాదినుండి చేపట్టే పనులలో విజయం సాధిస్తారు. వీరు భవిష్యత్ ప్రణాళికలను వేసుకొని, బంధుమిత్రుల సహకారంతో స్థిరనిర్ణయాలు తీసుకుంటే అభివృద్ధి నిశ్చయంగా వరిస్తుంది. కానీ స్థాయిలో, విద్యలో, ప్రతిభలో మీకన్నా చిన్నవాళ్ళు మిమ్ములను మించిపోతారు. తోబుట్టువుల సహకారాలు ఉంటాయి. ‘దేవుడు వరమిచ్చినా పూజారి ఇవ్వలేదు’ అనే సామెత మీ జీవితంలో నిజమవుతుంది. సంవత్సర మధ్యమునుండి చతుర్థ గురు సంచారంవలన నూతన గృహయోగం, స్థలాలు, వాహనాలు సంపాదించుకొని ఆర్థికంగా సుస్థిరతను పొందుతారు. అప్పులు ఇచ్చే విషయంలో, ష్యూరిటీ విషయంలో ఇతరులకు మాట ఇచ్చిన జాగ్రత్తగా వ్యవహరించాలి. అంత్య నిష్ఠూరంకన్నా ఆది నిష్ఠూరం మంచిది అన్న సామెతను గుర్తు పెట్టుకుని వ్యవహారం చేయాలి. చిన్నచిన్న అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చండికాపరమేశ్వరీ ఆరాధనవలన సర్వత్రా విజయం పొందుతారు.
సింహ
ఆదాయం – 14, వ్యయం-2 రాజపూజ్యం – 1 అవమానం – 7
ఈ రాశి వారికి పూర్వార్థంలో ద్వితీయ గురు సంచారంవలన, నాయకత్వ లక్షణాలు పెరిగి ఉద్యోగంలో ఉన్నత స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆర్థికంగా ఇబ్బందులు, చేతిలో డబ్బు నిలవకపోవడం, మొదలు పెట్టిన పనులు మందకొడిగా సాగడం జరుగుతుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. విరోధులు తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉన్నాయి. చెడు సహవాసాలను దూరంగా ఉండడం మంచిది. అకాల భోజనాలవలన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. మీమీ రంగాలలో పట్టుదల వదలకుండా పోరాడాల్సిన సమయం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలను పెడచెవిన పెట్టరాదు. సాధ్యా సాధ్యాలు దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగితే ఉత్తమమయిన ఫలితాలు పొందుతారు. సూర్య ఆరాధన, ఈశ్వర ఆరాధన వలన మంచి ఫలితాలు పొందుతారు.
కన్య
ఆదాయం – 2, వ్యయం-11 రాజపూజ్యం – 4, అవమానం – 7
ఈ సంవత్సరం ఈ రాశి వారికి లాభనష్టాలు, సుఖదు:ఖాలు, జయాపజయాలు, ఆరోగ్య అనారోగ్యాలు ఇలా మిశ్రమమయిన ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. గురువు సుఖ సంతోషాలను ఇవ్వాలని చూస్తే చతుర్థ (అర్థాష్టమ)శని వాటిని అనుభవించకుండా చూస్తాడు. పిత్రార్జిత ఆస్తి విషయంలో సమస్యలు, బంధువర్గంనుండి అపవాదులు, వాహనాలు నడిపే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. కీళ్ళ నొప్పులు, నరాలకు సంబంధించిన అంతుచిక్కని వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిమ్ములను మోసం చేయాలని చూసే వారిని తొందరగా నమ్మే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎంత సంపాదన ఉన్నా ఆర్థిక సమస్యలు బాధిస్తాయి. కీలక విషయాలలో నిపుణులను సంప్రదించడం మంచిది. శ్రీమహా విష్ణువు ఆరాధన వలన కష్టాలుదూరం అవుతాయి.
తుల
ఆదాయం – 11, వ్యయం-8 రాజపూజ్యం – 7, అవమానం – 7
ఈ రాశివారికి ఏలినాటి శని దోషంపోయింది అని సంతోషించే లోపే, వ్యయంలో ఉన్న గురువు వలన పూర్వార్థంలో, మీ ఆత్మాభిమానాన్ని అహంకారంగా భావించే వాళ్ళు, మీ మంచి మనసును చెడుగా అర్థం చేసుకునే వాళ్ళు, మిమ్ములను మోసం చేయాలి అనే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. స్థానభ్రంశ సూచనలు ఉన్నాయి. తల్లికి అనారోగ్య సూచనలు. మానసికంగా ఆందోళనలు కలుగుతాయి. ఉత్తరార్థంలో సమాజంలో పేరు ప్రఖ్యాతులు, మీ ఆదర్శవంతమయిన నడవడికవలన సమాజంలో ఒక గురుతరమయిన బాధ్యత మీ వద్దకు వచ్చే అవకాశం, సుఖసంతోషాల అనుభవము, విదేశీ ప్రయాణాలు కలిసివస్తాయి. మొత్తంమీద పూర్వార్థంలో ఎటువంటి అనిష్ట ఫలితాలు ఉన్నాయో వాటికి విరుద్ధమయిన మంచి ఫలితాలు ఉత్తరార్థంలో పొందే అవకాశాలు ఉన్నాయి. మహాగణపతిని ఆరాధించడంవలన ఈ సంవత్సరం మిమ్ములను రాజయోగం వరిస్తుంది.
వృశ్చిక
ఆదాయం – 2, వ్యయం-5 రాజపూజ్యం – 3, అవమానం – 3
ఏలినాటి శని చివరి దశలో ఉన్న మీకు ఈ సంవత్సరం ఇష్టానిష్ట ఫలితాలు రెండూ అనుభవంలోకి వస్తాయి. మీ మాటతీరు మారే అవకాశం, కుటుంబంలో నిరంతరంగా కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందించేందుకు వెళ్ళి వారితో నిందలు పొందే అవకాశాలు ఉంటాయి. కానీ లాభస్థానంలో ఉన్న గురువు అనుగ్రహంవలన, సమాజంలో జెంటిల్‌మన్ అనే పేరు తెచ్చుకొంటారు. నలుగురికి మంచి జరిగే పనులు మీరు ఏవీ తలపెట్టినా విజయం నిశ్చయం. తల్లిదండ్రుల బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన సమయం, ఇతరుల బలవంతంమీద అయిష్టంగా చేసిన వ్యవహారాలలో అనుకోని ధనలాభం ఉంటుంది. శనిదోష నివారణకు బీదవాళ్ళకు అన్నదానం చేయడం, సద్గురువుల ఆరాధన వలన అంతా మంచి జరుగుతుంది.
ధనుస్సు
ఆదాయం – 14, వ్యయం-8 రాజపూజ్యం – 6, అవమానం – 3
ఈ రాశివారికి శనైశ్చరుడు జన్మలో సంచారం చేయడంవలన వచ్చే చెడు ఫలితాలను లాభంలో ఉన్న గురువు మంచి ఫలితాలుగా మారుస్తాడు. విశేషంగా ధనలాభం జరిగే సూచనలు గోచరిస్తున్నాయి. కానీ చేసే ప్రతి పనిని నిశితంగా పరిశీలించి ఆప్తుల సలహాలు తీసుకొని చేయడం ఉత్తమం. మానసికంగా అశాంతి, అపవాదులు, నానా విధమయిన వాత, పిత్త సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనేకమయిన ప్రముఖ పనులను ఏకకాలంలో నిర్వహించే సామర్థ్యం, పరంపరగా వచ్చే ఆస్తులు పొందే అవకాశాలు వచ్చి అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తారు. లక్ష్యసాధనలో నలుగురినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సంఘటనలు మానసిక ప్రశాంతతను మింగేస్తాయి. ఆవేశపూరితమయిన నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. దత్తాత్రేయ స్వామి ఆరాధన, వేద పారాయణం చేయడం మంచిది.
మకరం
ఆదాయం – 8, వ్యయం-3 రాజపూజ్యం – 2, అవమానం – 6
ఈ రాశి వారికి సంవత్సరాదినుండి ఏలినాటి శని ప్రభావంవలన, దూరదృష్టి లోపించడం, స్వంత ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోవడం, నేత్ర సంబంధమయిన అనారోగ్యాలు, వాహన ప్రమాదాలు, అవమానాలు, అపవాదులు, స్వంతవాళ్ళు, మీరు అభిమానించే వాళ్ళు మిమ్ములను విమర్శించడం తట్టుకోలేకపోతారు. కానీ నవమ దశమ స్థానాలలో దేవగురువు సంచారంవలన దేవస్థానాల జీర్ణోద్ధారం చేయటం, మీ పూర్వీకులకు అసాధ్యమయిన మహత్కార్యాలు చేయడం, వేల మందికి అన్నదానం చేసే భాగ్యం, పుణ్యకార్యాలు చేసే అదృష్టం మిమ్మలను వెతుక్కుంటూ వస్తుంది. కానీ ప్రారంభంలో ఉన్న ఉత్సాహం తరువాత తగ్గకుండా జాగ్రత్త వహించాలి. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. నూతన గృహ, వాహనయోగం ఉన్నది. లక్ష్మీనరసింహస్వామి ఆరాధనవలన అంతా మంచి జరుగుతుంది.
కుంభం
ఆదాయం – 8, వ్యయం-3 రాజపూజ్యం – 5, అవమానం – 6
ఈ రాశివారికి లాభస్థానంలో ఉన్న శనైశ్చరుడి ప్రభావంవలన స్థిరమయిన సంపాదన, మంచి ఆరోగ్యం, స్థిరాస్తులు కొనే అవకాశాలు వస్తాయి. పిల్లల విద్యాభ్యాసం, అనారోగ్య విషయంగా కొంత ప్రశాంతత లోపించి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడం, దగ్గరివారు దూరం కావడం, కొన్ని అపవాదులవల్ల ఉద్వేగానికి లోనుకావడం జరుగుతుంది. ఉత్తరార్థంలో భాగ్యస్థానంలో ఉన్న గురువు సంచారం వలన రాజసన్మానాలు, ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలలో విశేషమయిన పనులు చేసే పరిస్థితులు, వృత్తి, ఉద్యోగాల్లోనివారికి ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న కలలు నెరవేరేకాలం. రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలి. ఆదాయానికి తగ్గ వ్యయం కూడా ఉందని గ్రహించాలి. మహాలక్ష్మి అనుగ్రహం వలన అంతా మంచి జరుగుతుంది.
మీనం
ఆదాయం – 14, వ్యయం-8 రాజపూజ్యం – 1, అవమానం – 2
ఈ రాశివారికి సంవత్సర పూర్వార్థంలో సప్తమంలో ఉన్న గురువు అనుగ్రహం వలన గతంలో పరిష్కారం కాని కొన్ని సమస్యలు పరిష్కరింపబడతాయి. పెద్దలవల్ల, అధికారులవల్ల మేలు జరుగుతుంది. చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. హుందాగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. షష్టరాహు సంచారం వలన, ధైర్యంగా వ్యవహరించి శత్రువులపై విజయం సాధిస్తారు. మంచి జరుగుతుంది. భూలాభం జరిగే అవకాశం ఉంది. ఉత్తరార్థంలో అష్టమ గురు, దశమ శనియొక్క ప్రభావంవలన, ప్రతిరోజూ ప్రతి పనిని ఒక యుద్ధం చేసినంత కష్టంగా అడుగడుగునా ఆటంకాలు ఎదురౌతాయి.కొన్ని విషయాలలో స్పష్టత లోపిస్తుంది. దగ్గరివారివల్ల మోసం జరిగే సూచనలు ఉన్నాయి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కలహాలకు దూరంగా ఉండండి. వేంకటేశ్వరస్వామిని ఆరాధించడంవలన మనోధైర్యం పెరిగి ఆటంకాలను అధిగమించి విజయాన్ని సాధిస్తారు.