కొందరికి కొన్నికొన్ని శాస్త్రాలలో పాండిత్యం వుంటుంది. కొందరికి కవిత్వం, కళలు మొదలైన వాటిలో నైపుణ్యం వుంటుంది. మరికొందరికి లౌకిక కార్యకలాపాలలో వ్యవహార దక్షత వుంటుంది. కానీ, విభిన్న రంగాలలో సమర్థుడుగా ఓ వెలుగు వెలిగిన మహోన్నత వ్యక్తి శాస్త్రుల విశ్వనాథ శర్మ. ఆయన సాహిత్య, వేదాంత మీమాంస, వ్యాకరణ శాస్త్రాలతోపాటు, ఆయుర్వేదం, కవిత్వం, అష్టావధానం మొదలైన అనేక విషయాలలో లబ్దప్రతిష్టుడు. ఆంధ్రదేశాన పురోహిత బ్రాహ్మణ వేదవిద్యా పరిషత్, తదితర సంస్థలను స్థాపించి ప్రఖ్యాతిగాంచారు.
విశ్వనాథ శర్మ మెదక్ జిల్లా శివంపేట గ్రామంలో 1926లో జన్మించారు. అన్నపూర్ణమ్మ, గుండయ్య శాస్త్రి వీరి తల్లిదండ్రులు. విశ్వనాథ శర్మ మూడవ యేటనే తండ్రి మరణించడంతో మేనమామ, మేనబావల సంరక్షణలో పెరిగారు. ప్రాథమిక వేదవిద్య, స్మార్తజ్యోతిషాలు ఇంటిలోనే అద్దంకి తిరుమలాచార్యుల వద్ద నేర్చుకున్నారు. ఆ తరువాత అన్నగారైన అనంతరామ శర్మతోబాటు మున్నాలాల్ కళాశాలలో చేరి ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు.
ఆనాటి తెలంగాణలోని బ్రాహ్మణులు కొంత వేదం, స్మార్తం, జ్యోతిషం నేర్చుకొని పౌరోహిత్యం, భూములు వుంటే వ్యవసాయం చేసేవారు. విశ్వనాథ శర్మకి చిన్నతనంలోనే వేదాధ్యయనం, శాస్త్రాధ్యయనం చేయాలనే సంకల్పం, పట్టుదల కలిగాయి. అందుకు ఆనాటి మద్రాసులోని మైలాపూర్ సంస్కృత కళాశాలలో చేరాలని భావించారు. కానీ, అక్కడ నిజాం రాష్ట్రం వారికి ప్రవేశం వుండేది కాదు. తెలిసిన పెద్దల సలహాతో సికింద్రాబాద్ వాసిగా (అప్పుడు సికింద్రాబాద్- లష్కర్‌లపై ఆంగ్లేయుల ఆధిపత్యం వుండేది) చెప్పుకొని సాహిత్య శిరోమణి విభాగంలో చేరారు. వీలున్నప్పుడల్లా వేదాంత మీమాంస తరగతులలో కూర్చొని వాటిలోనూ ప్రావీణ్యం సంపాదించారు.
మద్రాస్ లో వున్నప్పుడే పూజ్యశ్రీ హరహరానంద స్వామి (కరపాత్ర స్వామి) రావడం, వారి ప్రభావానికిలోనై వారివద్ద శ్రీమద్భాగవత, వాసుదేవాష్టాక్షరీ ఉపదేశాలను పొందారు. ఆ తర్వాత వారికి చాలా సన్నిహితులైన వారు చేపట్టిన ఎన్నో కార్యక్రమాలలో పాల్గొని, వారివద్ద శ్రీ విద్యాసంపూర్ణ పాదుకాంత దీక్షను కూడా పొందారు.
బ్రాహ్మణుల ఉద్ధరణకు కంకణం సాహిత్య శిరోమణి పూర్తిచేసి వచ్చిన తరువాత వారికి అప్పటి తెలంగాణ పరిస్థితులు బాగా అవగాహనకు వచ్చాయి. దేశపాండ్యాలు, దేశ్ ముఖ్‌లు, భూస్వాములు బ్రాహ్మణులను సేవకులుగా చూసేవారు. ఒకప్పుడు పాలకులను శాసిస్తూ, లోక కల్యాణాన్ని కొనసాగించిన బ్రాహ్మణులను ఈ దుస్థితి నుంచి ఉద్ధరించి, వారికి సమాజంలో తిరిగి సముచిత స్థానం కల్పించాలని విశ్వనాథ శర్మ కంకణం కట్టుకున్నారు. దానికి అనుగుణంగానే వేదవిద్యా పీఠాన్ని, పురోహిత బ్రాహ్మణ పరిషత్తును స్థాపించి పాఠశాలలను, శిక్షణా తరగతులను నిర్వహించారు.
పురోహితులపై సమాజంలో వున్న చిన్న చూపును తొలగించడానికి సభలు, సమావేశాలు నిర్వహించారు. పౌరోహిత్య మీమాంస అనే గ్రంథాన్ని ప్రచురించి పురోహితులు, పౌరోహిత్యం ప్రాశస్త్యాన్ని చాటిచెప్పారు. పురోహితులలో సక్రమమైన అధ్యయనం, శిక్షణ, సంప్రదాయ జ్ఞానం లేకపోవడం కూడా చిన్నచూపునకు కారణమని భావించి, పాఠశాలలు స్థాపించి పురోహితులకు తగిన శిక్షణ ఇచ్చే విధానాన్ని రూపొందించారు. 1972లో కొన్నిమాసాలు ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్ పేటలో, ఆ తరువాత మెదక్‌లో, శివంపేటలోని తమ ఇంట్లోనే పాఠశాలను నిర్వహించారు. ముగ్గురు విద్యార్థులతో, ఇద్దరు ఉపాధ్యాయులతో ప్రారంభమై ఆరుగురు ఉపాధ్యాయులతో, వందమంది విద్యార్థులతో సుమారు రెండు దశాబ్దాలపాటు పాఠశాలను నిర్వహించారు. ఈ పాఠశాలలో వేదం, సంస్కృతం, స్మార్తంతోపాటు కొంత ఆంగ్లభాష కూడా బోధించేవారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం గుర్తింపుతోబాటు దీనికి కేంద్రప్రభుత్వ ఆర్థిక సహాయం కూడా అందేది.
విశ్వనాథ శర్మ నిర్యాణం తరువాత వారి కుమారులు కూడా కొంతకాలం ఈ పాఠశాలను నిర్వహించారు. కానీ, విద్యార్థులు లేకపోవడంతో చివరకు మూసివేయవలసి వచ్చింది.
హిందీలో భూషన్ పరీక్ష, వ్యాకరణ అద్వైత శాస్త్రాలలో బి.ఓ.ఎల్ పట్టాలను సాధించారు. ఏ శాస్త్రంలోనైనా, ధర్మాచరణలోనైనా సందేహాలు వస్తే పండిత సభలను ఏర్పాటుచేసి చర్చించి, నిర్ణయాలు తీసుకునేవారు. చాలా అరుదుగా వచ్చే క్షయ మాసం వారికాలంలో వచ్చినప్పుడు కొన్ని విభేదాలు, వివాదాలు తలఎత్తాయి. అప్పుడు పండిత పరిషత్తును ఏర్పాటుచేసి కూలంకషంగా చర్చించి, సరైన నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే, బాలశబ్దార్థ విచారము, వివాహంలో వధూవరుల దీక్ష, మూర్తిపూజ, తదితర అంశాలపై పండిత సభలు నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వ లాల్ బహదూర్ శాస్త్రి విద్యాపీఠ ప్రణాళికలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్కృత శతాబ్ది గ్రంథాన్ని (1970) ఎంతో శ్రమకోర్చి ప్రచురించారు. ప్రతి రాష్ట్రంలోనూ సంస్కృతం, ప్రాచీన చరిత్రను సంగ్రహంగాను, ముందు వంద సంవత్సరాలలోని సంస్కృత వైభవాన్నివిపులంగాను సంకలనం చేయటం ఈ ప్రణాళిక ఉద్దేశం. విశ్వవిద్యాలయాలు, పరిశోధక సంస్థలు, కళాశాలలు, విద్యాసంస్థలు, సంస్థానాలు, పండితులు, రచయితలు, కవులు, ముద్రిత, అముద్రిత గ్రంథాలు మొదలైనవి అన్నీ ఈ గ్రంథంలో చోటుచేసుకున్నాయి. ఈ కార్యభారాన్ని వహించడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ప్రణాళికా కార్యదర్శి ఆచార్య మండనమిశ్రుల ప్రోద్బలంతో ఈ భారాన్ని తానే వహించి 500 పేజీల గ్రంథాన్ని విశ్వనాథ శర్మ ప్రచురించారు. ఇది ఆంధ్రదేశంలోని సంస్కృత సంపదకు ఆయన అందించిన మహోజ్వల ఆభరణం.
శృంగేరి ఆస్థాన పండితునిగా..
ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ రచనా వ్యాసంగాన్ని మాత్రం ఆయన విడనాడలేదు. శాస్త్రార్థ చర్చల్లోనూ భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో పాల్గొనేవారు. వీరి అసమాన శేముషీ వైభవాన్ని, పాండిత్య ప్రకర్షను, ధర్మనిష్టను గమనించి శ్రీ శృంగేరి స్వామివారు తమ ఆస్థాన పండితునిగా గౌరవించారు. 1961లో అష్టగ్రహ కూటమి సందర్భంగా ఫీలుఖానాలో జరిగిన బ్రహ్మాండమైన యజ్ఞకార్యక్రమంలో విశ్వనాథ శర్మను ఏనుగుపై ఉరేగించి సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా వీరిని వరించింది. మెదక్ మండల సాహిత్య పరిషత్ వారు వీరిని ‘అభినవ విద్యారణ్య’ బిరుదుతో సత్కరించారు. శారదా బిల్లు, హిందూకోడ్ బిల్లులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలలో కూడా ఎంతో చురుకుగా పాల్గొన్నారు.
విశ్వనాథ శర్మ అనేక కార్యక్రమాలలో తీరిక లేకుండా గడిపినప్పటికీ, అనేక గ్రంథాలను కూడా రచించారు. వీటిలో ముఖ్యమైనది నామసహాస్రి. ఇది విష్ణుసహస్ర నామాలకు శంకర భాష్యాన్ని అనుసరించి చేసిన పద్యానువాదం. ఇది ఇంకా ముద్రణకు నోచుకోలేదు. ఇవిగాక, రాజోపచారపూజ, న్యాయ మీమాంస, ఏడుపాయల దుర్గాభవానీ సుప్రభాతం, ఏడుపాయల దుర్గాభవాని మహాత్మ్యం, రఘువంశం మొదటి మూడు సర్గల పద్యానువాదం (ఆంధ్ర రఘువంశావతరణం), మాండూక్యోపనిషత్తు అనువాదం వీరి రచనలలో కొన్ని. విశ్వనాథ శర్మ 1985 మే 5వ తేదీన పరమపదించారు.