గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని, కాబట్టి గ్రామాభివృద్ధిపై ఎక్కువ దష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పిలుపు నిచ్చారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక గ్రామ కార్యదర్శిని నియమించాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి గ్రామాల రూపురేఖలు మార్చాలని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పూర్తి కాగానే, గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచే కార్యక్రమాలను ఉదృతంగా నిర్వహించాలని చెప్పారు.
ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీరాజ్ అంశాలతో పాటు, ఎన్నికల హామీలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, సీనియర్ అధికారులు ఎస్. నర్సింగ్ రావు, రాజేశ్వర్ తివారి, రామకష్ణా రావు, వికాస్ రాజ్, స్మితా సభర్వాల్, నీతూ ప్రసాద్, రఘునందన్ రావు, పౌసమి బసు తదితరులు పాల్గొన్నారు.
కొత్తగా 9,355 మంది గ్రామ కార్యదర్శుల నియామకం
రాష్ట్రంలోని 12,751 గ్రామాలకు గాను, ప్రతీ గ్రామంలో ఒక గ్రామ కార్యదర్శిని నియమించడం కోసం కొత్తగా 9,355 మంది గ్రామ కార్యదర్శుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. కొత్త జోనల్ వ్యవస్థ ద్వారా చేపట్టిన మొదటి నియామక ప్రక్రియ కూడా ఇదే. నియామక ప్రక్రియ కూడా ముగిసింది.
57 ఏళ్లు నిండిన వృద్ధులకు పెన్షన్లు
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన వారికి వ ద్దాప్య పెన్షన్ అందించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయాలని, అర్హులను ఎంపిక చేయాలని సిఎస్ ను ఆదేశించారు. లబ్ధిదారుల లెక్క తేలిన తర్వాత 2019-20 బడ్జెట్లో దీనికి సంబంధించి నిధులు కేటాయించి, ఏప్రిల్ మాసం నుంచి పెన్షన్లు అందివ్వాలని చెప్పారు.
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారిని ఆదేశించారు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినట్లయింది. కోరుట్ల కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, నల్లగొండ జిల్లాలో గట్టుప్పల్, భూపాలపల్లి జిల్లాలోని మల్లంపల్లి మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం జనగామ జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో కలపాలని సూచించారు.
ఎమ్మెల్యేల ద్వారా కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ చెక్కులు
కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులను తిరిగి ఎమ్మెల్యేల ద్వారానే పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఎన్నికల కోడ్ కారణంగా కొద్ది రోజుల పాటు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించామని, ఇప్పుడు తిరిగి పాత పద్దతిలోనే ఎమ్మెల్యేల ద్వారా పంపిణీ చేయాలని చెప్పారు.