christmas

సర్వమానవాళి పాపాలను తన భుజాలపై మోసిన కరుణామయుడు… ప్రేమ, అహింసలతోనే ప్రపంచ మనుగడ సాధ్యమని చాటిన మహనీయుడు. ప్రపంచానికి శాంతి, అహింస, ప్రాణిప్రేమ, పరోపకారం, సోదరభావాలను సందేశంగా అందించిన యేసు ప్రభువు జన్మదినమే క్రిస్మస్‌. ఈ పర్వదినాన్ని క్రైస్తవులు భక్తిప్రపత్తులతో జరుపుకుంటారు. క్రిస్మస్‌కు నెల రోజుల ముందు నుంచే అంతటా ఈ పండగ ప్రభావం కనిపిస్తుది. క్రిస్మస్‌ ట్రీల అలంకరణలు, నక్షత్రాల ధగధగలతో ఇళ్లు, చర్చీలు ముస్తాబవుతాయి. ఇది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదు. ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్‌ పండగ వాతావరణం నెలకొంటుంది.

కారెల్స్‌తో శుభోదయం…

క్రిస్మస్‌ అనగానే ముందుగా గుర్తొచ్చేవి ‘కారెల్స్‌’. అంటే ఇటాలియన్‌ భాషలో జానపద గీతాలు పాడటం అని అర్థం. క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్‌లు అందరూ డిసెంబరు మొదటి వారం నుంచే కారెల్స్‌ వేడుకలు మొదలు పెడతారు. యువకులు కారెల్‌ బృందాలుగా ఏర్పడి రాత్రి వేళ ఇంటింటికి తిరుగుతూ ‘క్రీస్తు జన్మదినం.. అందరికి శుభోదయం.. క్రిస్మస్‌ పర్వదినం.. అందరికి ఆనందదాయకం’ అంటూ భక్తి గీతాలు ఆలపిస్తారు.

నక్షత్రాల ధగధగలు…

క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా పల్లెలు, గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఎక్కడ చూసినా క్రైస్తవుల ఇళ్లముందు నక్షత్రాలు వేలాడుతుంటాయి. క్రీస్తు జన్మించినపుడు ఆకాశంలో నక్షత్రం కనిపించిందట. నక్షత్ర దర్శనాన్ని బట్టే దేవుని కుమారుడు భువిపై జన్మించాడని విశ్వసిస్తారు. అందుకని క్రీస్తు జననానికి గుర్తుగా క్రైస్తవులు తమ ఇళ్లముందు విద్యుత్తు దీపాలతో వెలుగులు విరజిమ్మే నక్షత్రాలను వేలాడదీస్తారు.

క్రిస్మస్‌ ట్రీ…

క్రిస్మస్‌ పండగ సందర్భంగా పిరమిడ్‌ ఆకారంలో ఉండే క్రిస్మస్‌ ట్రీని ఇళ్లలో, చర్చిల్లో అలంకరించడం సంప్రదాయం. నక్షత్రాలు, రంగురంగుల విద్యుత్తు బల్బులు, గ్రీటింగ్‌ కార్డులు, గంటలు, బొమ్మలతో క్రిస్మస్‌ ట్రీని ఎంతో ఆకర్షణీయంగా అలంకరిస్తారు. క్రిస్మస్‌ పండగ వేళలో క్రిస్మస్‌ ట్రీ కనువిందు చేస్తుంది. మన బ్రతుకు పచ్చగా ఉండాలని, జీవితాలు పచ్చగా కళకళలాడాలనే సందేశాన్ని ఈ క్రిస్మస్‌ ట్రీ అందిస్తుందని చెబుతారు.

ఆకట్టుకునే వేడుకలు..

క్రిస్మస్‌ కాలంలో నిర్వహించే వేడుకలు అందరిని ఆకట్టుకుంటాయి. క్రైస్తవ విద్యాసంస్థల విద్యార్థులు క్రీస్తు కాలం నాటి వేషధారణలతో యేసు ప్రభువు జన్మవృ త్తాంతాన్ని తెలియజెపుతూ నిర్వహించే ప్రదర్శనలు అలరిస్తాయి. క్రిస్మస్‌కు ముందు యునైటెడ్‌ క్రిస్మస్‌ పేరుతో నిర్వహించే వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

క్రిస్మస్‌ తాత బహుమతులు…

క్రిస్మస్‌ తాత వేషదారణ క్రిస్మస్‌ పండగ వేళ పిల్లలను విశేషంగాఆకట్టుకుంటుంది. శాంతాక్లాజ్‌ వేషం వేసుకుని పాటలు పాడుతూ, ఆడుతూ పిల్లలను అలరించడంతో పాటు వారికి మంచి మంచి బహుమతులు పంచుతారు. పలు చర్చిల వద్ద భారీ క్రిస్మస్‌ తాత బొమ్మలను సైతం ఏర్పాటు చేస్తారు.

అందంగా ముస్తాబు…

క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా చర్చిలన్నింటిని సర్వాంగసుందరంగా ముస్తాబు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చర్చిలన్ని ప్రత్యేక అలంకరణలతో శోభిల్లుతాయి. మెదక్‌ పట్టణంలోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కెథడ్రల్‌ చర్చి క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా రంగురంగుల విద్యుత్తు దీపాల అలంకరణతో వెలుగులు విరజిమ్ముతుంది. రాష్ట్ర రాజధాని హైద్రాబాద్‌ నగరంలోని చారిత్రక చర్చిలు కూడా ప్రత్యేక అలంకరణలో శోభిల్లుతాయి.

పశువుల పాక…

క్రిస్మస్‌ పర్వదినం రోజున చర్చిల్లో క్రీస్తు జన్మవృత్తాంతాన్ని తెలిపేలా పశువుల పాకను ఏర్పాటు చేస్తారు. బెత్లెహాములో పశువుల పాకలో యేసు ప్రభువు జన్మించాడనే విషయాన్ని తెలియజేసేలా సహజసిద్ధంగా కనిపించేలా కర్రలు, గడ్డితో పాక నిర్మించి దానిని అందంగా అలంకరిస్తారు. ముందు బాగంలో క్రీస్తు జననానికి గురుతుగా నక్షత్రాన్ని వేలాడదీస్తారు.

ప్రత్యేక ఆరాధనలు…

క్రిస్మస్‌ పర్వదినం రోజున క్రైస్తవులందరూ తెల్లవారు జామునే నిద్రలేచి స్నానాలు చేసి, కొత్త వస్త్రాలు ధరించి చర్చిలకు చేరుకుంటారు. తెల్లవారు జామున 4 గంటలకు జరిగే తొలి ఆరాధన అతి పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయక కుటుంబ సమేతంగా తొలి ఆరాధన వేళకు చర్చిలకు చేరుకుంటారు. క్రిస్మస్‌ రోజున అన్ని చర్చిల్లో ప్రత్యేక ఆరాధనలు, బైబిల్‌ పఠనాలు ఉంటాయి. బిషప్‌లు, క్రైస్తవ గురువులు భక్తులకు దైవసందేశాన్ని అందిస్తారు.

మెదక్‌లో అంగరంగ వైభవంగా…

విఖ్యాతిగాంచిన మెదక్‌ కెథడ్రల్‌ చర్చిలో క్రిస్మస్‌ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ పర్వదినం సందర్భంగా చర్చిని శోభాయమానంగా అలంకరిస్తారు. రంగురంగుల విద్యుత్తు దీపాల కాంతిలో చర్చి కాంతులీనుతు కనువిందు చేస్తుంది. చర్చ్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా మెదక్‌ డయాసిస్‌ పరిధిలోని మెదక్‌, హైద్రాబాద్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల పరిధి నుంచి సుమారు లక్షమంది భక్తులు ఇక్కడ జరిగే క్రిస్మస్‌ వేడుకలకు తరలివస్తారు.

దుస్తులు… సత్కారాలు..

క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం పేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేయడంతోపాటు. వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులకు, సంస్థలకు గౌరవ సత్కారాలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది.

Other Updates