ఐటి రంగంలో తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటు అభివృద్ధిని మించిపోయింది. ఐటి రంగంలో దేశం మొత్తంలో సరాసరి 13శాతం అభివృద్ధి నమోదుచేస్తే, తెలంగాణ వరకు 16శాతం అభివృద్ధి నమోదైంది. ఇన్నాళ్ళు రాష్ట్ర రాజధానికే పరిమితమైన ఐటీ పరిశ్రమలు ఇతర నగరాలకు కూడా విస్తరింప చేయాలని ప్రభుత్వ సంకల్పించింది. అందులో భాగంగా వరంగల్ నగరంలోని మణికొండలో ఇంక్యుబేషన్ టవర్‌ను ఫిబ్రవరి 19న ప్రారంభించారు. దీనితోపాటు ప్రపంచ ప్రసిద్ధ సియెంట్ కంపెనీకి ఐటీ, పంచాయతీ రాజ్, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి ఫిబ్రవరి 19న శంకుస్తాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ వరంగల్ నగరానికే కాకుండా నిజామాబాద్, కరీంనగర్ నగరాలకు కూడా ఐటీ విస్తరింపచేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వరంగల్‌లో ఇంక్యుబేషన్ టవర్స్ రూ. 4. 5 కోట్లతో నిర్మించామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ మహా నగరంతో పాటు వరంగల్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వరంగల్‌లో ఐటి పరిశ్రమ ఏర్పాటుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉపాధి లభించడంతో పాటు శిక్షణ, నైపుణ్యాలు పెంపొందుతాయన్నారు.
విద్యార్థుల చదువులు పూర్తికాగానే క్యాంపస్ నియామకాలు చేపట్టేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని 16 ఇంజనీరింగ్, 15 డిగ్రీ, పీజీ కళాశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టిందని మంత్రి పేర్కొన్నారు. ఇందులో భాగమే ఇంక్యుబేషన్ టవరు ప్రారంభించడమని తెలిపారు.
రెండోదశ ఇంక్యుబేషన్ టవరు నిర్మాణానికి రూ. 5 కోట్లు తక్షణమే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో కేవలం బీపీఓ సెంటర్లు మాత్రమే ప్రారంభించాల్సి ఉందన్నారు. ఆనవాయితీని పక్కనబెట్టి పూర్తిస్థాయి ఐటీ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సంకల్పించిందన్నారు. టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్, గ్లోబల్ ఇన్‌ఫర్‌మేషన్ సిస్టమ్‌తో జిల్లాను ఐటీ రంగంలో ముందకు తీసుకుపోతామన్నారు.
వరంగల్ నగరం త్వరలో ఐటీ హబ్ గా మారుతుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. 45 ఎకరాల స్థలాన్ని ఐటీ కంపెనీల కోసం కేటాయించినట్లు తెలిపారు. సీఎం జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.