సమాచార సాంకేతిక రంగంలో తన సత్తాను చాటుతూ దూసుకుపోతున్న రాష్ట్ర ప్రభుత్వం సైబర్ భద్రతా రంగంపై దృష్టి సారించింది. ఐటి పరిశ్రమకు ముఖ్యమైన సైబర్ సెక్యూరిటీ రంగంలో కలిసి పనిచేసేందుకు సిఆర్‌రావు అడ్వాన్స్‌డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్‌తో జూలై 6వ తేదీన హైదరాబాద్, మాదాపూర్‌లోని టెక్ మహీంద్ర మెయిన్ క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో సీఆర్ రావు సంస్థ చైర్మన్, రిజర్వ్‌బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు సమక్షంలో ఎంవోయూపై ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, సీఆర్ రావు సంస్థ డైరెక్టర్ అల్లం అప్పారావు సంతకాలు చేశారు.
డిజిటల్ తెలంగాణలో పాల్గొనడం సంతోషంగా ఉంది: రంగరాజన్
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డిజిటల్ తెలంగాణ కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు సీఆర్‌రావు సంస్థ చైర్మన్ రంగరాజన్. మారుతున్న కాలంలో డిజిటల్ సాధనాల వాడకం సర్వసాధాణమైందని, ఈ మార్పు మరో పారిశ్రామిక విప్లవానికి మార్పు చూపుతుందన్నారు. ఈ పరిణామంలో అవకాశాలతోపాటు కొత్త సవాళ్లు కూడా ఎదురవుతున్నాయని, వీటిని ఎదుర్కోవడానికి సైబర్ సెక్యూరిటీలో రాష్ట్ర ప్రభుత్వం కృషి అభినందనీయమన్నారు. సిస్టమ్ సెక్యూరిటీ, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, సైబర్ సెక్యూరిటీకి తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. మంత్రి కేటిఆర్ నేతృత్వంలో ఐటి రంగాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు.
సైబర్ సెక్యూరిటీ ఓ సవాల్: మంత్రి కెటిఆర్
సైబర్ సెక్యూరిటీ బలంగా లేకపోవడంతో ఐటీ తదితర సంస్థలు భారీగా నష్టపోతున్నాయని, రక్తపాత రహిత యుద్దం జరుగుతున్నదని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఐటి యుగంలో కొందరు తమ జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ నేరాలకు పాల్పడుతూ ఐటి రంగానికి సవాల్ విసురుతున్నారన్నారు. అందువల్లే రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసి ఆయా అంశాల్లో సవాళ్లను ఎదుర్కొని అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నదని మంత్రి కెటిఆర్ చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలను సమన్వయం చేసుకొని ఐటి రంగంలో ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ వ్యర్థాల నిర్వహణలో నాస్కాంతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు.