ఏర్పడిన మూడేళ్లలోనే తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో బలీయమైన శక్తిగా ఎదిగింది. దార్శనికుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో, విషయ పరిజ్ఞానం కలిగిన యువమంత్రి కేటీఆర్ సారధ్యంలో ఐటీ శాఖ కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. పెట్టుబడుల ఆకర్షణ మొదలు ఉద్యోగకల్పన వరకూ, నూతన విధానాల రూపకల్పన మొదలు డిజిటల్ లావాదేవీల్లో ముందువరుసలో నిలవడం వరకూ, ఐటీకి సంబంధించిన ప్రతి అంశంలోనూ తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచింది.
అయితే ఇవేవీ యాదృచ్చికంగా వచ్చిన ఫలితాలు, సాధించిన విజయాలు కావు. దీని వెనుక ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అకుంఠిత దీక్ష, అసమాన నాయకత్వ పటిమ ఉన్నాయి. తెలంగాణ ఏర్పడ్డ తొలినాళ్లలోనే మంత్రి కేటీఆర్ తనదైన ఒక జట్టును తయారుచేసుకున్నారు. ఐటీ రంగంలో దశాబ్దాల అనుభవం కలిగిన ఆఫీసర్లను ఆయన ఏరికోరి తెచ్చుకున్నారు. ఆనాడు ఎంతో ముందు చూపుతో మంత్రి వేసిన ఆ తొలి అడుగే ఇవ్వాళ ఐటీ శాఖ అప్రతిహతంగా ముందుకుసాగడానికి ప్రధాన కారణం అయ్యింది.
రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ వ్యతిరేకులు ప్రత్యేక రాష్ట్రం వస్తే ఐటీ రంగం కుదేలవుతుందని, పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతాయని ఎన్నో పుకార్లను వ్యాప్తిచేశారు. చాలా మంది ఈ పుకార్లను నిజమనుకున్నారు కూడా. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ అబద్ధపు ప్రచారానికి అడ్డుకట్ట వేశారు. పదవీ బాద్యతలు తీసుకున్న తొలి రోజు నుండే ఇక్కడ ఉన్న ఐటీ కంపెనీల అధిపతులతో, ఐటీ సంఘాలతో, ఉద్యోగస్తులతో, సమావేశమయ్యారాయన. ఉద్యమ సమయం నాటి అనిశ్చితి ఇప్పుడు తొలగిపోయిందని, తెలంగాణలో ఇప్పుడు ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిందనే స్పష్టమైన సందేశాన్ని మంత్రి ఇచ్చారు. ఐటీ రంగానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందనే భరోసాను కేటీఆర్ కలిగించారు. మంత్రి కృషి ఫలించి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అనేక పెద్ద ఐటీ కంపెనీలు గత మూడేళ్లలో తమ కార్యకలాపాలను ఇంకా విస్తరించాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకులు చేసిన దుష్ప్రచారం పటాపంచలయ్యింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న అద్భుతమైన సింగిల్ విండో పారిశ్రామిక అనుమతుల విధానం (టీ.ఎస్.ఐ.పాస్) అమలులోకి వచ్చిన తరువాత ఐటీ రంగంలో కూడా గణనీయంగా పెట్టుబడులు రావడం జరిగింది. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కంపెనీలను ఆహ్వానించడానికి మంత్రి కేటీఆర్ ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. అమెరికా, జపాన్, కొరియా, సింగపూర్, మలేషియా దేశాల్లో ఐటీ శాఖ బృందాలు పర్యటించి తెలంగాణలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు పెట్టడానికి గల అనుకూలతలు, ఇక్కడి పారదర్శక పారిశ్రామిక విధానాల గురించి వివరించడం జరిగింది.
ఈ పర్యటనల ఫలితాలు కూడా రావడం మొదలయ్యింది. తెలంగాణ ఏర్పడ్డ మూడేళ్లలోనే గూగుల్, ఆపిల్, అమెజాన్, ఊబర్, డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్, సేల్స్ ఫోర్స్, జెడ్.ఎఫ్, ఫ్లై దుబాయ్, డి.ఈ.షా వంటి దిగ్గజ కంపెనీలు ఇక్కడ భారీ పెట్టుబడులు పెట్టాయి.
ఐటీ ఎగుమతుల్లో భారీ వృద్ధి: గత మూడేళ్లుగా ఐటీ రంగంలో తెలంగాణ జైత్రయాత్ర కొనసాగుతోంది. ప్రతి యేడూ అంచనాలను మించి ఐటీ రంగంలో ఎగుమతులు సాగుతున్నాయి. ఈ రంగంలో మన రాష్ట్ర వృద్ధి రేటు దేశ సగటుకన్నా ఎక్కువగా నమోదు కావడం గమనార్హం
సంవత్సరం ఎగుమతులు (రూ.కోట్లలో)
2014-15 66,276
2015-16 75,070
2016-17 85,470
దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల వాడకం నానాటికీ పెరుగుతున్నది. కానీ ఈ ఉపకరణాల్లో అత్యధిక శాతం విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీని పర్యవసానం ఏమిటంటే మన దేశపు ఎలక్ట్రానిక్స్ దిగుమతి బిల్లు ఆయిల్ దిగుమతి బిల్లును దాటేసేటట్టుంది. ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీకి తెలంగాణ రాష్ట్రంలో అనేక అనుకూలతలు ఉన్నాయి. వీటిని అందిపుచ్చుకుని ఈ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్శించడానికి వీలుగా తెలంగాణ ఎలక్ట్రానిక్స్ పాలసీని తీసుకువచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం. తత్ఫలితంగా ఒక ఏడాదిన్నర కాలంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీలైన మైక్రొమాక్స్, సెల్కాన్, స్మార్ట్రాన్, డేటావిండ్ తెలంగాణలో తమ మొబైల్ తయారీకేంద్రాలను నెలకొల్పాయి.
కొలువుల్లో మన వాళ్లు
రాష్ట్రంలోకి ఇబ్బడిముబ్బడిగా వస్తున్న కంపెనీల్లో వేలాది ఉద్యోగాలు కొత్తగా సష్టించబడుతున్నాయి. ఇట్లా వస్తున్న కొత్త ఉద్యోగాల్లో తెలంగాణా యువతరానికే ఎక్కువ అవకాశాలు ఉండాలనే సంకల్పంతో మంత్రి చేతుల మీద రూపుదిద్దుకున్న సంస్థనే తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ ఎండ్ నాలెడ్జ్ (టాస్క్). ఏర్పాటయిన రెండేళ్లలోనే దాదాపు లక్ష మంది తెలంగాణ యువతీయువకులకు నైపుణ్యాభివ ద్ధి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించింది టాస్క్. అనేక వేలమంది తెలంగాణ యువతీయువకులకు పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేలా చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న విద్యార్ధులు కూడా పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు సాధించగలరని టాస్క్ నిరూపించింది.
అంకుర పరిశ్రమలకు ఊతం టీ-హబ్
తెలంగాణ యువత కేవలం ఉద్యోగార్ధులుగా ఉండకూడదు, వారు ఉద్యోగాలు కల్పించే దిశగా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అన్న మంత్రి కేటీఆర్ సంకల్పమే అంకుర పరిశ్రమల ఇంక్యుబేటర్ టీ-హబ్ రూపం తీసుకున్నది. దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ అయిన టీ-హబ్ ఏర్పాటు దేశవ్యాప్తంగా సంచలనం సష్టించింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, (అప్పటి) రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా, మైక్రోసాఫ్ట్ సీ.ఈ.ఓ సత్య నాదెళ్ల వంటి ప్రముఖులెందరో టీ-హబ్ ను సందర్శించి ఇదొక అద్భుతమని అభివర్ణించారు. ఇవ్వాళ టీ-హబ్ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. అమెరికాలోని కాలిఫోర్నియా, మిస్సోరీ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మొదటి ఫేజ్ లో దాదాపు 200 అంకుర పరిశ్రమలు ఉండగా ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద ఇంక్యుబేటర్ గా టీ-హబ్ రెండో ఫేజ్ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది.
డిజిటల్ లావాదేవీల్లో మనమే నెంబర్ వన్!
నవంబర్ 8, 2016 నాడు రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించినప్పుడు దేశమంతా ఉలిక్కిపడ్డది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెంటనే ప్రత్యామ్న్యాయంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సాహించే, డిజిటల్ ఫైనాన్షియల్ అక్షరాస్యతను పెంపొందించే కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టింది. కొన్ని స్వచ్చంద సంస్థలతో కలిసి గ్రామాల్లో డిజిటల్ లావాదేవీలపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలు చేపట్టింది. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు జోరందుకున్నాయి. బాసర, యాదాద్రి వంటి పర్యాటక ప్రదేశాలతో పాటు అనేక గ్రామాలు 100 శాతం డిజిటల్ లావాదేవీలు నిర్వహించుకునే స్థాయికి చేరుకున్నాయి. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం మొబైల్ లావాదేవీలకు ఉపకరించే టీ-వ్యాలెట్‌ను ప్రవేశపెడుతోంది. గత ఆరు నెలలుగా దేశంలో జరుగుతున్న డిజిటల్ లావాదేవీల్లో తెలంగాణ రాష్ట్రమే నెంబర్‌వన్‌గా కొనసాగుతోంది.
విధానాల రూపకల్పనలో కొత్త పుంతలు
కొత్త రాష్ట్రమైనా కూడా తెలంగాణ ఐటీ రంగంలో నూతన విధానాల రూపకల్పనలో ఇవ్వాళ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునేందుకు, ఆయా రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు, తద్వారా నూతన ఉపాధి అవకాశాల కల్పనకు ఈ విధానాలు తోడ్పడతాయి. తొలుత ఐటీ పాలసీని ఆవిష్కరించిన ప్రభుత్వం వెంటవెంటనే ఎలెక్ట్రానిక్స్, గేమింగ్ అండ్ ఆనిమేషన్, ఇన్నోవేషన్, రూరల్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, డేటా సెంటర్స్, ఓపెన్ డేటా పాలసీలను ఆవిష్కరించింది. త్వరలోనే ఐ.ఓ.టీ, ఈ-వేస్ట్ పాలసీలను కూడా ప్రవేశపెట్టబోతోంది.
ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ
ఉమ్మడి రాష్ట్రంలో జరిగినట్టు ఐటీ, అనుబంధ రంగాలు మొత్తం రాజధాని హైదరాబాదు చుట్టూనే కేంద్రీకతం కాకుండా తగు చర్యలు తీసుకుంటున్నది మన ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల్లో, ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ పరిశ్రమలు నెలకొల్పేందుకు అనేక రాయితీలను ప్రకటించింది. వరంగల్ లో సయింట్ కంపెనీ గత యేడాది తన కార్యకలాపాలను ప్రారంభించింది. అట్లాగే కరీంనగర్ లో ఎక్లాట్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ తన ఆఫీసును నెలకొల్పింది. త్వరలోనే ఖమ్మం, కరీంనగర్ పట్టణాలలో కూడా ఇంక్యుబేషన్ టవర్లను నిర్మించనున్నారు.