tsmagazineకొణతం దిలీప్‌
తెలంగాణ ఏర్పడితే ఏదో ఉపద్రవం వస్తుందన్న స్థాయిలో సాగిన దుష్ప్రచారాన్ని తుత్తునియలు చేస్తూ గత నాలుగేళ్లలో ఐటీ రంగంలో దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలబడింది మన రాష్ట్రం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికత, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు వ్యూహచతురత, అనితర సాధ్యమైన కృషి ఇవ్వాళ రాష్ట్రాన్ని ఈ స్థాయికి చేర్చాయి.

అటు దిగ్గజ కంపెనీలను తెలంగాణలో పెట్టుబడులు పెట్టించేలా ఒప్పించడం మొదలు ఈ-గవర్నెన్స్‌, ఎం-గవర్నెన్స్‌లో తెలంగాణ దూసుకుపోయేలా చేసిన యువ మంత్రి కేటీఆర్‌ ఇవ్వాళ దేశానికే ఆదర్శ ఐటీ మంత్రిగా నిలిచారు. అయితే ఇవేవీ యాధచ్చికంగా జరిగినవి కావు. నిజానికి ఆనాటి ఉద్యమకాలంలోనే రాష్ట్ర సాధన తరువాత ఒక్కోరంగంలో ఏం చేయాలనే ప్రణాళికలు సిద్ధం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.

జూన్‌ రెండు 2014 నాడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలినాడే కార్యాచరణ మొదలుపెట్టారు కేటీఆర్‌. ముందుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి కొందరు పనిగట్టుకుని వ్యాప్తి చేసిన అపోహలను తొలగించే పని చేపట్టారు. హైదరాబాదులో ఉన్న ఐటీ కంపెనీల సి.ఈ.ఓ.లతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఆయన రాష్ట్ర నాయకత్వానికి ఐటీ అభివృద్ధి పట్ల ఉన్న విజన్‌ను ఆవిష్కరించారు. ఐటి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఏయే చర్యలు తీసుకోబోతున్నదో ఆనాడు జరిగిన సమావేశంలో మంత్రి పూసగుచ్చినట్టు వివరించారు. ఆనాటి నుండి మొదలుకొని తొలి ఆరు నెలలు మంత్రి కేటీఆర్‌ అప్పటికే హైదరాబాదులో ఉన్న ఐటీ పరిశ్రమను కుదురుకునేలా చేయడం, ఇంకా విస్తరింపజేయడానికి అవసరమైన సహాయసహకారాలు అందించడం మీదనే పూర్తి దృష్టి కేంద్రీకరించారు.అనతికాలంలోనే ఈ కృషికి ఫలితం లభించింది. తెలంగాణ ఏర్పాటుపైన ఉన్న అపోహలు తొలగిపోయి అనేక దిగ్గజ కంపెనీలు మన రాష్ట్రం వైపు దృష్టి సారించాయి.tsmagazine

నూతన రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ముఖ్యమంత్రి అలోచనలకు అనుగుణంగా ప్రకటించిన నూతన విధానాలు ఇక్కడ పరిశ్రమ అభివృద్ధిలో ఇతోధిక పాత్ర పోషించాయని చెప్పొచ్చు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించి తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే అలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక విప్లవాత్మకమైన టి.ఎస్‌.ఐపాస్‌ సింగిల్‌ విండో అనుమతుల విధానం తీసుకొచ్చారు. దీని ఫలితంగా ఐటీ పరిశ్రమలు నెలకొల్పడానికి సులభంగా అనుమతులు జారీ చేయడం మొదలైంది.

ఇక ఐటీ రంగంలో వేగంగా వస్తున్న మార్పులను, నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకుని ఆయా రంగాల్లో అభివృద్ధిని సాధించేందుకు రాష్ట ఐటీ శాఖ నూతన ఐటీ పాలసీని 2016లో ప్రకటించింది. దానికి అనుబంధంగా ఇన్నోవేషన్‌, రూరల్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌, యానిమేషన్‌, గేమింగ్‌, డేటా సెంటర్స్‌, డేటా అనలిటిక్స్‌, ఓపెన్‌ డేటా, సైబర్‌ సెక్యూరిటీ, ఈ-వేస్ట్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ రంగాల్లో ప్రత్యేక పాలసీలు తీసుకొచ్చింది.

ఐటి దిగ్గజాలకు కేరాఫ్‌ అడ్రస్‌
నూతన రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి మంత్రి కేటీఆర్‌ అమెరికా, జపాన్‌, కొరియా, సింగపూర్‌ వంటి దేశాల్లో పర్యటించారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీల అధిపతులతో సమావేశమయ్యి పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణలో గల అనుకూలతలని వారికి వివరించారు. మంత్రి చేసిన ఈ కృషి అప్పుడే సత్ఫలితాలు ఇవ్వడం మొదలైంది. గూగుల్‌, యాపిల్‌, ఊబర్‌, సేల్స్‌ఫోర్స్‌, డెవలప్మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సింగపూర్‌, జెడ్‌.ఎఫ్‌, మైక్రోమాక్స్‌ వంటి ఎన్నో కంపెనీలు తెలంగాణలో నూతన ఆఫీసులను నెలకొల్పడానికి, తమ కార్యకలాపాలు మొదలుపెట్టడానికి ముందుకు వచ్చాయి.
tsmagazine
ఈ-గవర్నెన్స్‌ నుండి ఎం-గవర్నెన్స్‌ వరకు
టెక్నాలజీ ఆధారంగా పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, పరిపాలనలో పారదర్శకత పెంపొందించేందుకు తెలంగాణ ఐటీ శాఖ అనేక ఎలక్ట్రానిక్‌ గవర్నెన్స్‌ (ఈ-గవర్నెన్స్‌), మొబైల్‌ గవర్నెన్స్‌ (ఎం-గవర్నెన్స్‌) అప్లికేషన్లను ఆవిష్కరించింది. డీమానెటైజేషన్‌ జరిగి దేశ వ్యాప్తంగా నగదు కొరతతో ప్రజలు ఇబ్బందిపడ్డ వేళ తెలంగాణ స్వంతంగా మొబైల్‌ చెల్లింపుల అప్లికేషన్‌ టీ-వ్యాలెట్‌ను ఆవిష్కరించింది. స్మార్ట్‌ ఫోన్‌ తో మాత్రమే కాకుండా మామూలు ఫీచర్‌ ఫోన్‌తో కూడా చెల్లింపులు జరపగలిగే ఈ టీ-వ్యాలెట్‌ యాప్‌ అనతికాలంలోనే ప్రాచుర్యం పొందింది. భారతదేశంలో ఇటువంటి యాప్‌ ను ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే కావడం విశేషం.

ఆన్లైన్లో ప్రభుత్వ సేవలు అందించే విధానాన్ని మరింత ఆధునీకరిస్తూ మొబైల్‌ ద్వారా అన్ని ప్రభుత్వ సేవలు అందజేసే టీ-ఆప్‌ ఫోలియో మరో విప్లవాత్మకమైన ముందడుగు.
జైపూర్‌లో జరిగిన బిజినెస్‌ వరల్డ్‌ డిజిటల్‌ ఇండియా 2018 సమ్మిట్‌లో టీ-వ్యాలెట్‌, టీ-యాప్‌ ఫోలియో రెండూ కూడా ఉత్తమ అప్లికేషన్లుగా అవార్డులు పొందాయి.

రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలను ఆన్లైన్లో, మొబైల్‌ ద్వారా అందించడంలో సాధించిన పురోగతి వల్ల తెలంగాణ ఇప్పుడు దేశంలోనే డిజిటల్‌ ట్రాన్జాక్షన్స్‌లో నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలిచింది. ప్రతి వెయ్యి మంది పౌరులకు 673 డిజిటల్‌ ట్రాన్జాక్షన్స్‌తో ఇవ్వాళ మనం ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల కన్నా ముందున్నాం.

డిజిటల్‌ తెలంగాణ దిశగా
ప్రపంచంలో ఎక్కడా చేయని ఒక విన్నూత్న ప్రయోగం మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ ఐటీ శాఖ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ వాటర్‌గ్రిడ్‌ నీటి పైపులతో పాటు ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌ వేసేందుకు ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. దీని ద్వారా తెలంగాణలోని ప్రతి ఊరికీ హై-స్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌తో పాటు కేబుల్‌ టీవీ, ఫోన్‌, ఆన్లైన్‌ విద్య, వైద్యం వంటి ఎన్నో సేవలు అందించేందుకు వీలవుతుంది. హైదరాబాద్‌ శివార్లలోని మహేశ్వరం మండలంలో ఇప్పటికే ఫైబర్‌ గ్రిడ్‌ టెక్నాలజీ డెమానిస్ట్రేషన్‌ నెట్‌వర్క్‌ను స్థాపించి భవిష్యత్తులో ఏయే సేవలను అందించే వీలు ఉన్నదో ప్రయోగాత్మకంగా చూపిస్తున్నారు.
tsmagazine
నిరుద్యోగులకు వరం టాస్క్‌ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి వల్ల రాష్ట్రంలో వస్తున్న నూతన పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు దక్కే విధంగా మంత్రి కేటీఆర్‌ అలోచనల మేరకు తెలంగాణ అకాడెమీ ఆఫ్‌ స్కిల్‌ ఎండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) నెలకొల్పారు. ఇంజనీరింగ్‌, డిగ్రీ తదితర కోర్సులు చేస్తున్న విద్యార్ధులకు ఏయే నైపుణ్యాలు నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయో వాటిల్లో టాస్క్‌ శిక్షణ ఇస్తుంది. ఇప్పటికే దాదాపు రెండు లక్షల నలభై వేల మంది విద్యార్ధులు శిక్షణ పొందారు. కేవలం ఐటీ రంగంలోనే కాక, హెల్త్‌ కేర్‌, రీటెయిల్‌, బ్యాంకింగ్‌, మరియు ఏరోస్పేస్‌ రంగాల్లో కూడా ఇప్పుడు టాస్క్‌ శిక్షణ ఇస్తోంది. హైదరాబాదులో ప్రధాన కార్యాలయం ఉండగా వరంగల్‌, ఖమ్మం, కరీం నగర్‌ వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా తన కార్యకలాపాలను విస్తరించింది టాస్క్‌

స్టార్టప్‌ రాజధానిగా హైదరాబాద్‌!
ఐటీ, అనుబంధ రంగాల్లో భవిష్యత్తులో జరిగే ఉద్యోగ కల్పనలో సింహభాగం అంకుర పరిశ్రమల ద్వారానే జరగనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే ఇన్నోవేషన్‌, స్టార్టప్‌ రంగాలకు శరవేగంగా పెరుగుతున్న ప్రాధాన్యతలను గమనించిన మంత్రి కేటీఆర్‌ ఈ రంగానికి మద్దతుగా నిలిచేవిధంగా విధాన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు దేశంలోనే అతిపెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ టీ-హబ్‌ను నెలకొల్పారు. ఇంతింతై వటుడింతై అన్నట్టు దినదిన ప్రవర్ధమానం అవుతున్న టీ-హబ్‌ ఇవ్వాళ దేశంలోని అనేక రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఇందులో ఉన్న అనేక అంకుర పరిశ్రమలు దేశవిదేశాల్లో ఖ్యాతిని పొందాయి. 2018 జనవరిలో దావోస్‌ లోజరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో టీ-హబ్‌ స్టార్టప్‌ బాన్యన్‌ నేషన్‌ ప్రతిష్ఠాత్మకమైన సర్క్యులర్‌ అవార్డు కూడా గెలుచుకుంది. ఇప్పుడు టీ-హబ్‌ రెండో ఫేజ్‌ కూడా శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. హార్డ్‌వేర్‌ అంకుర పరిశ్రమలకు ఉపయోగపడే మరో విన్నూత్నమైన ప్రొటోటైపింగ్‌ ల్యాబ్‌ టీ-వర్క్స్‌ కూడా త్వరలోనే రూపుదాల్చనుంది.tsmagazine
ఆకాశంలోనే కాదు అవకాశాల్లో కూడా సగం
గత యేడాది హైదరాబాదులో జరిగిన ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సు గ్లోబల్‌ ఎంటర్ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ ముగింపు ఉపన్యాసంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహించేందుకు వారికోసం ప్రత్యేకంగా ఒక ఇంక్యూబేటర్‌ స్థాపిస్తామని, అవసరమైన మూలధనం కూడా అందజేస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాటను నిలుపుకుంటూ ఈ యేడాది మహిళా దినోత్సవం మార్చి 8 నాడు విమెన్‌ ఎంటర్ప్రెన్యూర్‌ హబ్‌ (వీ-హబ్‌)ను లాంచనంగా ప్రారంభించారు. మహిళలు నెలకొల్పే అంకుర పరిశ్రమలకు అన్నివిధాలా చేదోడువాదోడుగా ఉండేందుకు, వారికి అవసరమైన సలహాలు, సూచనలు, మార్గదర్శకత్వం, మూలధన సాయం చేయడానికి వీ-హబ్‌ కృషిచేస్తుంది.
ముందుంది మంచి కాలం
ప్రతి యేటా దేశ సగటు కన్నా ఎక్కువ శాతం వృద్ధిరేటుతో ఎదుగుతున్న తెలంగాణా ఐటీ రంగం ఈ యేడాది దాదాపు రు.94,000 కోట్ల ఐటీ ఎగుమతులు సాధించగా, ఈ రంగంలో ప్రత్యక్షంగా 4,75,000 మందికి ఉపాధి లభిస్తోంది. ఇప్పటికే కొత్త కంపెనీలెన్నో తెలంగాణకు క్యూ కడుతుండటంతో హైదరాబాదు నగరంలో ఆఫీస్‌ స్పేస్‌కు భారీ గిరాకీ ఏర్పడింది. భవిష్యత్తులో జరిగే అభివృద్ధి అంతా హైదరాబాదు చుట్టే కేంద్రీకృతం కాకుండా, నలుదిశలా విస్తరించాలి అన్న ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు, వరంగల్‌. కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీ హబ్‌లను ఏర్పాటు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రానున్న ఏళ్లలో మన రాష్ట్రంలో ఐటీ రంగం ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.
tsmagazine

Other Updates