టి. ఉడయవర్లు
తెలంగాణ తెలుగు ప్రాభవం దశదిశలా విస్తరించేలా, భాషాభిమానం పొంగిపొరలగా మహోజ్జ్వలంగా మొట్టమొదటిసారి ఐదు రోజలపాటు జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సంబరాలతో భాగ్యనగరం పులకించిపోయింది. దేశవిదేశాలనుంచి మహోధృతితో తరలివచ్చిన తెలుగువారు ఐదు రోజులపాటు ఆత్మీయత, అనురాగం, బాంధవ్యం పెనువేసుకోగా ఆనందోత్సాహాలతో గడిపారు. భాషపట్ల ప్రేమ, అభిమానం కలిగినవారికి ఈ ప్రపంచ మహాసభలు ఒకచోట కలియడా నికి దోహదపడ్డాయి. 42 దేశాలు, 17 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో సహా తెలంగాణలోని 31 జిల్లాలనుంచి 16వేలమంది ప్రతినిధులు హాజరయ్యారు.ప్రారంభోత్సవ సభలో నలభైవేలమందికి పైగా పాల్గొన్నట్టు ఒక అంచనా. ఈ సభలలో జరిగిన వంద పైచిలుకు సదస్సులు, గోష్ఠులు, కవి సమ్మేళనాలు, అవధానాలు, సమావేశాల్లో 15వేలమంది కవులు, 500మంది రచయితలు పాల్గొన్నారు. ఇరవైకిపైగా జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలలో మరో వెయ్యిమంది దాకా కళాకారులు పాల్గొన్నారు. 250 పుస్తకాలు, 10 సీడీలు, 10 ప్రత్యేక సంచికలు ఆవిష్కరించడం జరిగింది. ప్రతి వేదిక, హాలు తెలుగు పరిమళంతో, భాషాభిమానులతో కిటకిటలాడిపోయాయి. రాజకీయ సభలకు, సినిమా కార్యక్రమాలకు మించిన స్థాయిలో భాషాభిమానులు సభలకు, సదస్సులకు తరలిరాగా, చాలా సందర్భాలలో ఆయా హాళ్ళు, సమావేశ మందిరాలు చాలక బయటనే ఉండిపోవలసి వచ్చింది.
హేవళంబి నామ సంవత్సర మార్గశిర బహుళ త్రయోదశి శుక్రవారం సాయంత్రం అంటే 2017 డిసెంబర్ 15వ తేదీన భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఐదురోజుల ప్రపంచ తెలుగు మహాసభలను ప్రారంభించారు. చదివే చదువుకు ఉద్యోగాలకు అనుసంధానం చేస్తేనే ఆయా భాషలు బతుకుతా యని సూచించారు. ఇంగ్లీష్‌వారు తమ భాషను ఉద్యోగాలతో అనుసంధానం చేసినందునే ఆ భాషపట్ల అందరికీ వ్యామోహం పెరిగిందన్నారు.
ఎవరైనా అమ్మభాషను మరచిపోకూడదనీ, మాతృభాష ఏనాటికీ మృతభాష కాకూడదన్నారు. తెలుగులో మహా నిఘంటువు రావలసిన అవసరముందన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు వారివారి మాతృభాషల్లో వ్రాయడానికి తాను చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు- తెలుగు భాషను పరిరక్షించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు. తనకు తెలుగు భాషపై ఇంతమక్కువ ఏర్పడడానికి కారకుడైన గురువు మృత్యుంజయశర్మకు ‘గురువందనం’చేసి ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగం ఒక రాజకీయ నాయకుని ప్రసంగంలాగా కాకుండా ఒక తెలుగు పండితుడి లాగా ఎంతో ప్రసన్నతతో పద్యాలు చదువుతూ సాగింది. తెలంగాణ మట్టిలో మహనీయులైన మహాకవులు, పండితులు జన్మించి ఇక్కడి భాషను సంస్కృతిని సుసంపన్నం చేశారనీ, ఇంతకాలం కాపాడి మార్గదర్శనం చేశారన్నారు. పాల్కురికి సోమన, బమ్మెర పోతననుంచి శతకకవుల నుంచి దాశరథి, కాళోజీ, సినారెనుంచి ఈనాటి గోరటి వెంకన్న, అందెశ్రీ, జయరాజ్, గూడ అంజయ్య లాంటి సృజనశీలురు రచించిన పద్యాలు, పాటలను ఆయన ఈ సందర్భంగా అలవోకగా అందరికీ అర్థమయ్యే పద్ధతిలో చదివి వినిపించారు.
ఈ ప్రారంభోత్సవ సంరంభంలో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు తన ఊహకందని రీతిలో తెలంగాణ నేల నడిబొడ్డున ఇంత వైభవంగా జరగడం తనకు అమితానందం కలిగిస్తున్నదని విద్యాసాగర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. పి.వి. నరసింహారావు, సి. నారాయణరెడ్డి తెలంగాణ మకుటాయమానమైన వ్యక్తులని గుర్తు చేశారు. ప్రాంతాలకు, దేశాలకు అతీతంగా ప్రపంచంలోని తెలుగువారందరినీ ఒకేతాటిపైకి తీసుకురావ డానికి ముఖ్యమంత్రి కృషి చేయాలని అభ్యర్థించారు.
తెలంగాణ కిరీటంలో కలికితురాయి
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ప్రపంచ తెలుగు మహాసభలను ఇంత విజయవంతంగా నిర్వహించడం తెలంగాణ రాష్ట్ర కిరీటంలో మరో కలికితురాయిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభివర్ణించారు. డిసెంబర్ 19వ తేదీ సాయంత్రం సమాపనోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్రపతి తెలుగు భాష ప్రపంచ భాష అనీ, దక్షిణ ఆఫ్రికానుంచి ఆగ్నేయ ఆసియా దేశాల వరకు మాట్లాడే భాష తెలుగు అన్నారు. దేశంలో హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగు అని ఆయన కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఫార్మా, సాంకేతిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో ఎందరో తెలుగువారు పేరు ప్రఖ్యాతులు పొందారని పలువురిని ఉదహరించారు. తెలుగు భాషను పరిరక్షించాలంటే తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలుగు పుస్తకాలు బహూకరించాలనీ, మీడియా ముఖ్యపాత్ర పోషించాలనీ విశిష్ట అతిథిగా పాల్గొన్న గవర్నర్ నరసింహన్ పిలుపునిచ్చారు.
ప్రతియేటా తెలంగాణ తెలుగు మహాసభలు
సభకు అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రసంగిస్తూ ఇకనుంచి ప్రతియేటా తెలంగాణ మహాసభలు డిసెంబర్ మాసంలో రెండు రోజులపాటు వైభవంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఒకటవ తరగతినుంచి ఇంటర్ మీడియట్ వరకు తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్‌గా నేర్చుకోవాలనే ఉత్వర్వులను కచ్ఛితంగా అమలు చేస్తామన్నారు. భాషా పండితుల సమస్యల పరిష్కారంలోగల న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి, త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. భాషా పండితుల పెన్షన్ విషయాన్ని ప్రస్తావిస్తూ అందులోగల కోతను రద్దు చేస్తామన్నారు.
తెలుగు భాష అభివృద్ధికోసం కొన్ని చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రారంభోత్సవంనాడు తాము ప్రకటించిన దృష్ట్యా వందలు, వేల సంఖ్యలో సూచనలు తనకు అందాయన్నారు. వాటన్నింటిని పరిశీలించవలసి ఉందన్నారు. ఈ కారణంగా వచ్చే జనవరి మొదటివారంలో భాషా సాహితీవేత్తల సదస్సు నిర్వహించి, వచ్చిన ప్రతిపాదనలు కూలంకషంగా పరిశీలించి, క్రోడీకరించి నిర్ధిష్టమైన ప్రణాళికను ప్రకటిస్తామన్నారు. ఈ సభల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి తెలుగు భాష అభివృద్ధిపట్ల గల నిబద్ధత స్పష్టంగా వెల్లడైందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సభలు విజయవంతమైనందుకు, ఆశించిన లక్ష్యం నెరవేరినందుకు వ్యక్తిగతంగా తనకెంతో సంతోషంగా, సంతృప్తిగా ఉన్నదని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి కృషిని అభినందించారు.
ఈ సభలు ప్రారంభోత్సవంలో, సమాపనోత్సవంలో పదిహేను నిమిషాల పాటు వెలుగులు నింగిలోకి చిమ్ముతూ, తారలు భువికి దిగివచ్చినాయనిపించేట్టు బాణాసంచా ఆహుతులనే కాకుండా జంట నగర వాసులను అలరించాయి.
ప్రధాన వేదిక కాకుండా తెలుగు మహాసభలలో పద్యం, గద్యం, వచన కవిత, పాట, ఆట, కథ, నవల, విమర్శ, అవధానం, కవి సమ్మేళనాలు-ఆరు వేదికలలో-తెలుగు విశ్వవిద్యాలయం, లాల్‌బహదూర్ ఇండోర్ స్టేడియం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, రవీంద్రభారతి రెండు వేదికలు, తెలంగాణ సారస్వత పరిషత్తులు తెలుగు భాషా ప్రేమికులను ఆనందసాగరంలో ముంచెత్తాయి. నృత్యం, సంగీతం, గేయం, చిత్రలేఖనం, ప్రదర్శనలు ఆహూతులను గంటలసేపు కట్టిపడేశాయి. ప్రధాన వేదికపై ప్రారంభోత్సవం, సమాపనోత్సవంలో ప్రభుత్వ సలహాదారు డా||కె.వి. రమణాచారి వ్యాఖ్యానం తెలుగు పరిమళాన్ని విరజిమ్మింది. సమాపనోత్సవంలో తెలంగాణపై ప్రదర్శించిన 20 నిమిషాల డాక్యుమెంటరీ ప్రేక్షకులను అలరించింది.
తెలంగాణ వచన కవితా వికాసం సదస్సు, కథా సదస్సు, తెలంగాణ నవలా సాహిత్యం; కథ; నవలా రచయితల గోష్ఠి; తెలంగాణ విమర్శ; పరిశోధన; శతక, సంకీర్తన, గేయ సాహిత్యంపై జరిగిన సదస్సులలో పెద్దఎత్తున రచయితలు పాల్గొన్నారు. దేవరాజు మహారాజు అధ్యక్షతన కవి సమ్మేళనం, ములుగు అంజయ్య అష్టావధానం, శంకర నారాయణ హస్యావధానం, పుల్లూరు ప్రభాకర్ అక్షర గణితావధానం, ముదిగొండ అమరనాథశర్మ ముత్యంపేట గౌరీశంకర శర్మ జంటకవుల అష్టావధానం, రావికంటి వసునందన్ అధ్యక్షతన పద్య కవి సమ్మేళనం, అష్టకాల నరసింహరామశర్మ అష్టావధానం, కుమారి ఎస్వీ శిరీష నేత్రావధానం, సంగనభట్ల నర్సయ్య రచన, దర్శకత్వంలో శ్రీప్రతాపరుద్ర పరిచయం తదితర కార్యక్రమాల్లో కూర్చునే చోటు కూడా చాలామందికి లభించలేదు. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో శనివారంనుంచి చివరిరోజు దాకా బృహత్ కవి సమ్మేళనం శీర్షికన ముప్ఫై ఒక్క సమావేశాలు ఏర్పాటు చేశారు. బాల సాహిత్యంపై సదస్సు, బాలకవి సమ్మేళనం, తెలంగాణ మహిళా సాహిత్యంపై సదస్సు, కవయిత్రుల సమ్మేళనం జరిగాయి.
తెలంగాణ సారస్వత పరిషత్తులో శతావధాని డాక్టర్ జి.యం. రామశర్మ శతావధాన కార్యక్రమం చివరి రోజు వరకు ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉత్సుకతతో సాగింది. శనివారంనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పృచ్ఛకులు అడిగిన విధంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరును వ్యక్తంచేస్తూ ఆశువుగా పద్యాలు, గీతాలు చెప్పాడు.
ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనడానికి మలేసియానుంచి దాదాపు వందమంది తెలుగువారు ఇక్కడికి వచ్చారు. మలేసియా దీవులకు పొట్టచేత పట్టుకుని కట్టుబట్టలతో 170 సంవత్సరాల క్రితం వెళ్ళిన తెలుగువారు ఇంతకాలం మాతృభాష మర్చిపోకుండా, పిల్లలకు ప్రణాళిక ప్రకారం నేర్పుతూ, మన సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తున్నారు. వారు ప్రదర్శించిన బతుకమ్మ కూచిపూడి నృత్యం తిలకిస్తే వారి తెలుగుదనం ధ్యోతకమవుతుంది. హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుని అక్కడ పిల్లలకు తెలుగు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
లాల్ బహదూర్ స్టేడియం కేంద్రస్థానంగా దాని పరిసరాలలోని ఐదు ప్రాంగణాలలో ఇతర వేదికలు ఏర్పాటు చేయడంవల్ల దూరభారం లేకుండా ఒక్కోచోటి నుంచి మరో చోటికి భాషాభిమానులు సులువుగా చేరుకో గలిగారు. ప్రతి వేదిక ప్రాంగణం అనూహ్యరీతిలో కిటకిటలాడిపోవడంతో ప్రతినిధులను సంతృప్తిపరచడం సాధ్యంకాక నిర్వాహకులు తమను మన్నించాలని విజ్ఞప్తి చేయవలసిరావడంతో భాషాభిమానం ఎంత గాఢంగా సందర్శకులలో ఉందో అర్థమవుతుంది.
పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో తెలుగు
పత్రికలు, ప్రసార మాధ్యమాలలో ప్రామాణిక తెలుగు భాష వాడకానికి, తెలుగు భాషలో సజావుగా పాలన సాగేందుకు స్వతంత్ర ప్రతిపత్తిగల ప్రాధికార వ్యవస్థ ఏర్పా టు చేయవలసిన అవసరం ఉందని తెలుగు పాత్రికేయ రంగంలోని ప్రముఖులు అభిప్రాయపడ్డారు. కేవలం ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణవల్ల భాష సుసంపన్నమౌతుందని, ప్రామాణిక భాషకు ఒక మార్గం ఏర్పడుతుందన్న ఆశలేదని వక్తలు పేర్కొన్నారు. పాలన తదితర అన్నిరంగాల భాషపై ప్రభావంచూపే పత్రికలు, ప్రసార మాధ్యమాలలో శుభ్రమైన, ప్రామాణిక తెలుగు వాడకానికి దోహదం చేసేందుకు కేవలం నిపుణులతో కూడిన, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సాధికార వ్యవస్థ అవసరమని మీడియా అకాడమి అధ్యక్షుడు అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సు తీర్మానించింది. ఈ సందర్భంగా పాత్రికేయ ప్రముఖులు జి.యస్. వరదాచారి, పొత్తూరి వెంకటేశ్వరరావులను సత్కరించారు. కె. కేశవరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
న్యాయ, పరిపాలన రంగాలలో తెలుగు
న్యాయ స్థానాలలో వాదనలు, సాక్ష్యాల నమోదు, మాతృభాష తెలుగులో జరుగనంతకాలం, న్యాయమూర్తుల తీర్పులు తెలుగులో వెలువడనంతకాలం కక్షిదారులకు నష్టమే తీవ్రంగా ఉంటుందని, అది మానవ హక్కులకు విరుద్ధమని కేంద్ర, సమాచార కమిషనర్ మాఢభూషి శ్రీధర్ నొక్చి చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ భాగం వారి మాతృభాషలోనే కోర్టు వ్యవహారాలు సాగుతున్నాయని, కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ నిస్సహాయస్థితి నెలకొని ఉందన్నారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవాదాయశాఖమంత్రి ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ చట్ట, న్యాయ, పాలనా వ్యవస్థలు మూడింటిలో తెలుగు అమలు అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు. న్యాయవ్యవస్థ ప్రజల భాషలో అమలు జరిగినప్పుడే న్యాయవ్యవస్థపై ప్రజలలోగల అపోహలు తొలగిపోతాయన్నారు. ప్రభుత్వం ఇందుకు కృషి చేస్తుందన్నారు.
చరిత్రను తిరగరాయాలి
తెలంగాణ అస్తిత్వ మూలాలను వెలికితీయడానికి చరిత్రను తిరగరాయవలసిన అవసరముందని పలువురు చరిత్రకారులు ఉద్ఘాటించారు. ‘తెలంగాణ చరిత్ర’పై జరిగిన సదస్సుకు టిఎస్‌పీఎస్సీ అధ్యక్షుడు ఘంటా చక్రపాణి అధ్యక్షత వహించారు. శాసనమండలి అధ్యక్షుడు స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, చరిత్రకారుడు ఈమని శివనాగిరెడ్డి, డాక్టర్ రాజారెడ్డి, కుర్రా జితేంద్రబాబు, ఆచార్య అడపా సత్యనారాయణ ప్రభృతులు పాల్గొన్నారు.
తెలంగాణలో తెలుగు
తెలంగాణలో తెలుగు పునరుద్ధరణకు ఈ ప్రపంచ తెలుగు మహాసభలు మరోసారి శ్రీకారం చుట్టాలని, మరో పర్యాయం ఈ తెలంగాణ నేలనుంచే తెలుగుకు పట్టాభిషేకం జరుగాలని భాషా పండితులు, నిపుణులు ముక్తకంఠంతో సూచించారు. తెలుగు భాషకు జన్మస్థానం తెలంగాణ అని చరిత్రకారులు పేర్కొంటున్న ఈ తరుణంలో తెలుగుకు పునర్వైభవం ఇక్కడనుంచే ప్రారంభం కావాలని ఆచార్య ఎస్. లక్ష్మణమూర్తి అధ్యక్షతన జరిగిన ‘తెలంగాణ తెలుగు భాష సదస్సు’లో పాల్గొన్న వక్తలు మాతృభాష తెలుగు అన్నిరంగాలలో విస్తృతంగా వినియోగించడానికి వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సదస్సులో ప్రముఖ పండితుడు కోవెల సుప్రసన్నచార్యను ముఖ్య అతిథి, విద్యుత్‌శాఖమంత్రి జగదీశ్వర్‌రెడ్డి సత్కరించారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందినవారికి బహుమతులను అందజేశారు.
తెలుగులో అనేక సాహితీ ప్రక్రియలు ఉద్భవించాయి. తెలంగాణా నేలలోనే అంటూ ఎల్‌ఈడీ తెరపై విశ్లేషించి నిజామాబాద్ లోక్‌సభ సభ్యురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. ప్రవాస తెలుగువారి భాషా సాంస్కృతిక విద్యా విషయాలపై విదేశీ తెలుగువారితో జరిపిన గోష్ఠిలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు భాషకు రెండువేల సంత్సరాలపైబడిన చరిత్ర వుందని ఆమె సోదాహరణంగా తెలిపారు. కందపద్యం తెలంగాణలోనే పుట్టిందని, కరీంనగర్ జిల్లా కురిక్యాలలోని బొమ్మలగుట్టవద్ద లభించిన తొలి కందపద్య శాసనం ఆమె ప్రస్తావించారు. తెలుగు భాష ప్రాచీనత ఈ కందపద్యాలవల్ల సుస్పష్టమవుతున్నదన్నారు. నన్నయ్య మహాభారతం సంస్కృతంనుంచి చేసిన అనువాదమనీ, తెలుగులో తొలి స్వతంత్ర రచన పాల్కురికి సోమనాథుడి బసవ పురాణమన్నారు. నిజానికి నన్నయ్యకంటే వందేడ్లముందే తెలంగాణలో సాహిత్య సృజన జరిగినా గుర్తింపునివ్వలేదన్నారు. మల్లియరేచన 935 సంవత్సరంలోనే లక్షణగ్రంథం వ్రాశారన్నారు. ఈ గోష్ఠికి యూ.యస్.కు చెందిన నారాయణస్వామి వెంకటయోగి అధ్యక్షత వహించారు. గౌరవ అతిథిగా డా|| వంగూరి చెట్టెన్‌రాజు, ఆత్మీయ అతిథిగా ఆచార్య టి. గౌరీశంకర్ పాల్గొన్నారు.
ఇంకా రాష్ట్రేతర తెలుగువారితో జరిపిన గోష్ఠిలో ముఖ్య అతిథిగా వాలంతరి అధ్యక్షులు వి. ప్రకాశ్ పాల్గొనగా, ముంబైకి చెందిన సంగనేని రవీంద్ర అధ్యక్షత వహించారు.
లాల్‌బహద్దూర్ స్టేడియం పాల్కురికి సోమన ప్రాంగణం, బమ్మెర పోతన వేదికపై జరిగిన సాంస్కృతిక సమావేశానికి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ యస్వీ సత్యనారాయణ అధ్యక్షత వహించగా, నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇదే వేదికపై సాహిత్య సభకు తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు డా|| ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షత వహించగా, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన సాంస్కృతిక సమావేశానికి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు అధ్యక్షులు అయాచితం శ్రీధర్ అధ్యక్షత వహించగా, శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ముఖ్య అతిథిగా వచ్చారు.
‘మౌఖిక వాజ్ఞయం భాష’ అనే అంశంపై జరిగిన సభకు డా|| వెలిచాల కొండలరావు అధ్యక్షత వహించగా, రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సత్యవ్రత శాస్త్రిని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సన్మానించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక సమావేశానికి అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు అధ్యక్షత వహించగా శాసనమండలి అధ్యక్షుడు స్వామిగౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
తెలంగాణ పాట జీవితం అనే అంశంపై జరిగిన సభకు సినీ కవి సుద్దాల అశోక్ తేజ అధ్యక్షత వహించారు. ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గౌరవ అతిథిగా సిరివెన్నెల సీతారామశాస్త్రి పాల్గొనగా, రసమయి బాలకిషన్, జయరాజ్, దేశపతి శ్రీనివాస్ ప్రసంగాలు చేశారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు అధ్యక్షత వహించగా, ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా వచ్చారు.
సినీ సంగీత విభావరి సందర్భంగా గవర్నర్ నరసింహన్‌కూడా వచ్చారు. సినీ ప్రముఖులను సత్కరించారు. కీర్తిశేషులు టి.ఎల్. కాంతారావు సతీమణిని, డా|| ప్రభాకర్‌రెడ్డి సతీమణిని, శ్రీహరి సతీమణిని గవర్నర్ సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మిలమిలా మెరిసి ప్రేక్షకులను అలరించిన సినీనటులు కృష్ణ, విజయనిర్మల, జమున, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్, సుమన్, మోహన్‌బాబు, నరేష్, జయసుధ, ప్రభ, హేమ, బ్రహ్మానందం, పోసాని, శివాజీరాజా, కోట, గిరిబాబు, నారాయణమూర్తి, బాబూమోహన్, కీరవాణి, దర్శకులు, బి. నర్సింగరావు, కె. రాఘవేంద్రరావు, రాజమౌళి, భరద్వాజ, నిర్మాతలు సురేశ్‌బాబు, శ్యాంప్రసాద్‌రెడ్డి, ఆదిశేషగిరిరావు, అశ్వినీదత్, కె.ఎస్. రామారావు, సుధాకర్‌రెడ్డి, రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు ప్రభృతులను సత్కరించారు. సంగీత దర్శకులు కె.ఎం. రాధాకృష్ణ, వందేమాతరం శ్రీనివాస్, ఆర్పీ పట్నాయక్, శ్రీలేఖ, కృష్ణ, రేవంత్, కౌసల్యా, విజయలక్ష్మి, సునీత, కల్పన మొదలగువారు జనరంజకమైన పాటలుపాడి సభికులను అలరించారు. ఇటీవలే కన్నుమూసిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా|| సి. నారాయణరెడ్డికి నివాళి సమర్పిస్తూ సినారె పాటలను ‘భలే మంచి రోజు’ నుంచి డజనుదాకా పలువురు గాయనీ గాయకులు పల్లవులు ఆలపించారు. ఈ సందర్భంగా నందిని సిధారెడ్డి బతుకమ్మపై తీసిన లఘు చిత్రాన్ని, వంశీ పైడిపల్లి ‘హోలి’పై తీసిన, హరీశ్‌శంకర్ ‘తెలంగాణపాట’పై తీసిన లఘుచిత్రాలను ప్రదర్శించారు.
తొలిరోజు వందమంది నాట్యాచార్యులు కళాకృష్ణ నేతృత్వంలో పేరిణి నృత్య ప్రదర్శనతో ప్రారంభించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు రాత్రి వరకు కొనసాగాయి. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతలు-సీతాకాంత్ మహాచిత్ర, శ్రీమతి ప్రతిభారావులకు సత్కారం చేసిన తర్వాత, మన తెలంగాణ సంగీత నృత్య రూపకాన్ని ప్రముఖ నర్తకులు-రాజారెడ్డి, రాధారెడ్డి కన్నులపండువగా ప్రదర్శించారు. లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమి రామాచారి బృందం పాట కచేరి చేసింది. జయ జయోస్తు తెలంగాణ సంగీత నృత్య రూపకం కళాకృష్ణ నృత్యకల్పనలో సాగింది. హైదరాబాద్ సోదరులు వందమంది శిష్యులు, ప్రశిష్యులతోకూడిన ‘శతగళ సంకీర్తన’ చేశారు. ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి బంగారు తెలంగాణ గీతాన్ని వినిపించారు. ప్రముఖ నర్తకి అలేఖ్య బృందం నృత్యం, వింజమూరి రాగసుధ నృత్యం, మధు మూకాభినయం, షిర్నికాంతో బృందం, కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. రసమయి బాలకిషన్ సారథ్యంలో జానపద కళా ప్రదర్శన, కళామీనాక్షి జానపద గేయాలు ప్రేక్షకులను అలరించాయి. శ్రీమతి మంగళ, రాఘవరాజ్‌భట్ జానపద నృత్యాలు ప్రదర్శించారు.
ఇట్లా మభాసభలు జరిగిన ఐదురోజులు ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన ఆహుతులకు వసతి, రవాణా సౌకర్యంతోపాటు, తెలంగాణ వంటల రుచి చూపించి ఎలాంటి లోటు లేకుండా భేషుగ్గా నిర్వహించారని ప్రభుత్వానికి ప్రశంసలు లభించాయి. నగరం మొత్తం తోరణాలు, స్వాగత ద్వారాలు, విద్యుత్‌దీపాల అలం కరణలతో పండుగ వాతావరణాన్ని సృష్టించారు. పుస్తక ప్రదర్శనలను సందర్శించి వేలాదిమంది భాషాభిమానులు సాహిత్య గ్రంథాలను ఆసక్తితో ఆరాతీసి కొనుగోలు చేశారు. ఈ ఐదురోజుల తెలుగు పండుగలో ఎక్కడా ఏ ఒక్క అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నగర పోలీసు విభాగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ప్రశంసలు అందుకున్నారు
అక్షరోత్సవం
నిన్నటిదాకా తోటలో కమిలి వాడిన
ఒక్కో పువ్వూ – వేల స్వప్నాలతో పరిమళిస్తోంది నేడు!
పక్షపాతం, అణచివేతా పడుగుపేకల్లా
పాలన కొనసాగినచోట-
త్యాగాల గీతికతో కొత్త పొద్దు పొడుస్తోంది నేడు!
వెటకారం వేలెత్తిన మట్టి పొరల్లో
భాషకు – పట్టాభిషేకం జరిగింది నేడు!
ఏ బొంబాయికో – దుకాయికో
వలస వెళ్ళిన పక్షులు-
ఆత్మస్పర్శతో – అమ్మ పెదవిపై చిరునవ్వై
మరలివచ్చారు నేడు!
కోటి ఎకరాల నాగేటి సాళ్ళలో..
పచ్చని ఊపిరితో-
మానవీయ కోణంతో ప్రతి పథకం
ప్రతి ఫలిస్తోన్న వేళ-
ప్రతి ఇంటా – పాటగా, సద్దిమూటగా
పాలపిట్టగా, ఎర్రకారం ముద్దగా
చెరువు అలుగుగా ప్రవహిస్తున్నాయి నేడు!
ఎన్నేళ్ళకు జరిగిందీ నేలపై
అక్షరార్చనం-
ఎన్నాళ్ళకు సగర్వంగా
ఎగరేసుకోగులుగుతుఎన్నామీ అక్షర కేతనం!
సుపరిపాలనకు మారుపేరై
వజ్ర సంకల్పానికి మరోపేరై
జానపదాలతో – జన హృదయ స్పందనలతో
భాషతోనే బంధం బలపడుతుందని
గుర్తెరిగి జరిగిన ఈ తెలుగోత్సవం-
మన అస్తిత్వ హృదయ స్పందనం-
అమ్మ ఒడి – తొలి బడి చేసినపుడే
మన భాషకు దక్కుతుంది సమున్నత గౌరవం!!
-మధుసూదనరావు
అంబరాన్ని
తాకె సంబరాలు
అమ్మ భాషకు నేడు పట్టంబు కట్టెను
కల్వకుంట్ల చంద్ర శేఖరుండు
జాతి మరువదు మరెన్ని జన్మలైనా
పంచదినముల తెలుగు మహా సభలు
అంబరాన్ని తాకె సంబరాలు
అట్టహాసంగా మొదలిడే హైదరాబాదులో
కనలేని వినలేని కమనీయ కవితలు
సుందర సుమధుర సుభాషితములు
తెలుగు కవుల నోట తేజరిల్లిన కవిత
పండించెను తెలుగు సాహితీ క్షేత్రాన
తోబుట్టువులంత నొకచోట చేరగా
పాలివారిని సైతం పలుకరించిన సభలు
ఐదు రోజుల పాటు అవధాన విద్యలు
శతక నాటక నవల చర్చా గోష్టులు
దినము దినము తెలుగు దేదీప్యమానమై
వెలుగు మనెను తెలుగు మహాసభలు
కనీవిని ఎరుగని కమ్మని వంటకాలు
ప్రాంగణాలన్ని కిక్కిరిసినా కడుపునింపె
ఖండాంతరాలకు మన కీర్తి పారించ
దేశీయులేకాక పరదేశీయులు వచ్చె
కేసిఆర్ గారి నవ్వు పద్యముతోటి
రామనాథు గారి తేట మాటల తెలుగుతో
ఎల్‌బి స్టేడియంలో ఎగిరే తారాజువ్వ
నింగినేలనొకటి చేసె రంగుల హరివిల్లు
అందాలు మన మోము కానంద మొనరించె
కనువిందు చేసెను కాంతులు విరజిమ్మి
సింగిడి వర్ణాల జిలుగు వెలుగులతో
సిరులు విరబూసి శీఘ్రాన ముగెసె.
– ఎం.రవికుమార్