sampadakeeyamరాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షపాతి అని మరోసారి నిరూపించుకుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటినుంచి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను రూపొందించి అమలుపరుస్తోంది. అందుకు అనుగుణంగా పరిపాలనలో అడుగడుగునా మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తోంది. అభివృద్ధి, సంక్షేమాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ, బడ్జెట్‌ కేటాయింపులు జరుపుతోంది. దేశంలో ఎక్కడా, ఏ ప్రభుత్వం అమలుచేయని, కనీసం ఊహించనైనా ఊహించని పథకాలకు శ్రీకారం చుట్టి ప్రజల మన్ననలు పొందుతోంది. ఇప్పుడు తాజాగా, రాష్ట్రంలోని ఒంటరి మహిళలకు నెలవారీ జీవనభృతిని చెల్లిస్తామని ప్రకటించి మరో చరిత్ర సృష్టించింది.

పేదరికం పురుషులకన్నా మహిళలనే ఎక్కువగా వేధిస్తుంది. అందుకే ప్రతివిషయంలోనూ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. దళితులకు మూడెకరాల భూమిని పంచి ఇచ్చినా, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళు ఉచితంగా కట్టించి ఇచ్చినా వాటన్నిటినీ మహిళల పేరుమీదే కేటాయిస్తుండటం ప్రభుత్వ ముందుచూపుకు నిదర్శనం. ఇప్పుడు రాష్ట్రంలోని ఒంటరి మహిళలకు అండగా నిలిచేందుకు జీవనభృతిని చెల్లిస్తామని నిండు శాసన సభలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్వయంగా చేసిన ప్రకటన ప్రభుత్వ మానవీయ కోణాన్ని మరోసారి ఆవిష్కరించింది. ఇప్పటికే వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పేరుతో పెద్దఎత్తున పెన్షన్లు అందిస్తోంది. బతుకుతెరవు కోసం బీడీలు చుట్టి జీవనంసాగిస్తూ, ఎంత శ్రమించినా తమ జీవనానికి తగినంత ఆదాయం పొందలేక పోతున్న బీడీ కార్మికులకు నెలకు వెయ్యి రూపాయల జీవనభృతి చెల్లిస్తోంది. ఆడపిల్లల పెళ్ళి పేద కుటుంబాలకు భారం కాకూడదన్న ఉద్దేశ్యంతో, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ వంటి పథకాలు అమలుచేస్తూ, ఆడపిల్ల పెళ్ళికోసం 51 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది.

పై పథకాల మాదిరిగానే, రాష్ట్రంలో ఒంటరి జీవితం గడుపుతున్న మహిళలు పడుతున్న కష్టాలను తీర్చేందుకు , వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అవసరమని గ్రహించిన ముఖ్యమంత్రి వారికి కూడా జీవన భృతి చెల్లించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో సుమారు 2 నుంచి 3 లక్షల మంది ఒంటరి మహిళలు ఉండవచ్చని ప్రాథమిక అంచనా. ఒంటరి స్త్రీలకు ప్రతినెలా వెయ్యి రూపాయల జీవన భృతి పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలుచేస్తామని, మార్చి నెలలో ప్రవేశపెట్టే బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒంటరి మహిళలు తమ వివరాలను ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు.

రాష్ట్ర ఖజానామీద పడే భారాన్ని కూడా లెక్కచేయకుండా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీసుకున్న ఈ మానవీయ నిర్ణయాన్ని హర్షించనివారు ఎవరుంటారు.

Other Updates