ontari-mahilaరాష్ట్రంలో ఒంటరి స్త్రీలకు ప్రతినెలా వెయ్యి రూపాయల జీవన భృతి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రాష్ట్ర శాసనసభలో జనవరి 6న ప్రకటించారు. దీనివల్ల దాదాపు 3 లక్షల మంది ఒంటరి స్త్రీలకు మేలు చేకూరుతుంది.

”తెలంగాణలోని అన్నివర్గాల ప్రజలకు సమాన న్యాయం లభించాలనీ, సామాజిక వర్గాలన్నీ ఆర్థిక స్థోమతతో, ఆత్మగౌరవంతో జీవించాలనీ, దీనికోసం తెలంగాణ ప్రజల జీవికను పరిపుష్టం చేయాలని తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నది. అందుకు అనుగుణంగా పరిపాలనలో అడుగడుగునా మానవీయకోణాన్ని ఆవిష్కరిస్తున్నది. నేడు రాష్ట్ర బడ్జెట్‌లో సింహభాగం సంక్షేమ రంగానికే కేటాయించింది. మా ప్రభుత్వం పేదల పక్షం వహించేదని, తెలంగాణ ప్రజలు ఇప్పటికే గ్రహించారు. అందుకే అడుగడుగునా ప్రభుత్వానికి అండదండగా నిలుస్తున్నారు.

రాజకీయ పార్టీలు చాలా వరకు మ్యానిఫెస్టోలో ఉన్న నిర్ణయాల అమలుకే పరిమితమవుతాయి. కానీ మా ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ప్రస్తావించకపోయినా పేదలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా దృష్టికి వచ్చిందే తడవుగా వెంటనే వాటి పరిష్కారం కోసం నిర్ణయాలు తీసుకుంటున్నది. మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టుగా వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు ఆసరా పేరుతో పెద్దఎత్తున పెన్షన్లు అందజేస్తున్నాం. అయితే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో స్త్రీలు బీడీలు చుట్టి తమ కుటుంబాలని పోషించుకుంటున్నారు. ఎంత శ్రమించినా వారు తమ జీవనావసరాలకు తగినంత ఆదాయం పొందలేకపోతున్నారు. వారి కష్టాలను గమనించిన ప్రభుత్వం బీడీ కార్మికులకు నెలనెలా వెయ్యి రూపాయల జీవన భృతిని ప్రకటించింది. ‘గతంలో ఉద్యమాలు చేసినా మాకు న్యాయం దక్కలేదు. కానీ నేడు తెలంగాణ ప్రభుత్వం మేము అడగకముందే మాకు న్యాయం చేసిందని’ బీడీ కార్మికులంతా ఎంతో సంతోషపడుతున్నారు.

పేద కుటుంబాల ఆడపిల్లల పెండ్లి ఖర్చుకోసం తల్లిదండ్రులు పడుతున్న బాధలను సానుభూతితో అర్థం చేసుకున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాలద్వారా రాష్ట్రంలో వేలాది కుటుంబాలకు ఆడపిల్లల పెండ్లికోసం 51వేల రూపాయల చొప్పన ఆర్థిక సహాయం అందించిందని సభకు తెలియజేస్తున్నాను.

పై రెండు పథకాల మాదిరిగానే మ్యానిఫెస్టోలో ప్రస్తావించకున్నా నేడు మరో మానవీయ నిర్ణయాన్ని సభలో ప్రకటిస్తున్నాను. రాష్ట్రంలో ఒంటరిగా జీవితం గడుపుతున్న మహిళలు పడుతున్న కష్టాలు తీర్చేందుకు, వారికి ప్రభుత్వంనుంచి ఆర్థిక సహాయం అవసరమనే విషయం కొంతకాలంగా మా దృష్టికి వస్తున్నది. ముందుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకొని సాధ్యాసాధ్యాలను గుర్తించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాం. రాష్ట్రంలో దాదాపు రెండునుండి మూడు లక్షల మంది ఒంటరి స్త్రీలు ఉండవచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చాం. పేదరికం పురుషులకన్నా మహిళలను మరింత వేధిస్తుంది. కనుక నిస్సహాయులైన ఒంటరి స్త్రీలకు నెలనెలా వెయ్యి రూపాయలు అందించి వారిని ఆదుకోవాలని, వారికి జీవన భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. వెంటనే ఉత్తర్వులు విడుదల చేస్తున్నాం. వచ్చే మార్చి మాసంలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఇందుకోసం నిధులు కేటాయిస్తాం.

‘ఒంటరి స్త్రీలకు ప్రతి నెలా వెయ్యి రూపాయలు జీవన భృతి పథకం’ వచ్చే ఆర్థిక సంవత్సరంనుంచి అమలులోకి వస్తుంది. కనుక జిల్లా కలెక్టర్లందరూ వెంటనే పూనుకుని ఒంటరి స్త్రీల వివరాలను నమోదు చేసుకునే కార్యక్రమం చేపట్టాలని ఆదేశిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఒంటరి స్త్రీలంతా తమ పేర్లను ప్రభుత్వంవద్ద నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. శాసనసభ్యులందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి అసలైన ఒంటరి స్త్రీలకు మాత్రమే సహాయం అందేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలని, వారిపేర్ల నమోదు కార్యక్రమం బాధ్యతను శాసనసభ్యులు కూడా స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

రాష్ట్ర ఖజానామీద పడే భారాన్ని లెక్కచేయకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ మానవీయ నిర్ణయాన్ని ఈ సభ ముక్తకంఠంతో స్వాగతిస్తుందని ఆశిస్తున్నాను.

Other Updates