ఇంజినీరింగ్ చదివి, పోటీ పరీక్షలు వ్రాస్తూ, ఇంకా రాబోయే గ్రూప్ పరీక్షలకోసం ప్రిపేర్ అవుతున్న ఓ ఉద్యోగార్థి కౌన్సిలింగ్‌కోసం వచ్చాడు. నేను చాలా పట్టుదలతో గత రెండు సంవత్సరాలుగా
ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాను. కాని విజయం నా దగ్గరగా వచ్చి వెళ్ళిపోతోంది. ప్రతీసారి ఇలాగే జరుగుతోంది ఇంకా కొన్ని ఫలితాలు రావాలి.. ఏం చెయ్యమంటారు అని అడిగాడు.
ఎకనామిక్స్‌లో పి.జి. చేసిన మరో అమ్మాయి గ్రూప్స్‌కోసం ప్రిపేర్ అవుతోంది. కొన్ని రోజుల వరకు చదువుకోవాలనే పట్టుదల బాగుంటుంది. తర్వాత మెల్లిమెల్లిగా ఆసక్తి తగ్గి, చదువుకోసం కేటాయించే సమయం తగ్గి, స్నేహితులతో చాటింగ్, సినిమాలు, వాట్సప్, ఫేస్‌బుక్‌లతో ఎక్కువ సమయం గడిచిపోతోంది. నేను ఎలాగైనా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో హైదరాబాద్ వచ్చాను. కానీ, నా లక్ష్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాను.. ఎలా దీనినుంచి బయటకు రావడం ఇది నన్ను చాలా బాధకు, అశాంతికి లోను చేస్తోంది ఎలా! నన్ను నేను మోటివేట్ చేసుకొని లక్ష్యానికి సంబంధించిన పని మాత్రమే చేసేటట్టు, నా ఏకాగ్రత చెదరకుండా, నా ఆలోచనలు చేస్తున్న పనినుంచి ప్రక్కకు మళ్ళకుండా
ఉండాలంటె ఏం చెయ్యాలో చెప్పండి నేను తప్పకుండా పాటిస్తాను అంది.
పై ఇద్దరి సమస్యలు పరిశీలిస్తే, వాళ్ళు లక్ష్యం నిర్దేశించుకోవడంలోనే సమస్యలున్నట్టు అర్థం అవుతుంది. లక్ష్యం నిర్ధారణ అయ్యాక, లేదు చేసుకునే క్రమంలో ఈ క్రిందివాటిని పరిగణనలోకి తీసుకుంటే, మళ్ళీ లక్ష్యాన్ని తప్పకుండా సాధించగలరు.
1. Finding Purpose లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం
2. Acquiring Skills లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసిన నైపుణ్యాలు నేర్చుకోవాలి
3. Establishing Habits నైపుణ్యాలు నేర్చుకుని, లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసిన అలవాట్లను అలవరచుకోవాలి.
4. Becoming grittingనిర్దేశించుకున్న లక్ష్యం పట్ల దృఢంగా వుండాలి
5. Handling set back మనకున్న బలహీనతలను అధిగమించాలి
6. Overcoming Limits పరిమితులను అధిగమించే విధంగా శ్రమించాలి
7. Finishing Strong అంతిమ లక్ష్యాన్ని సాధించాలి
1.Finding Purpose: లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం
లక్ష్య నిర్ధారణ జరిగిన తర్వాత చాలామంది వ్యక్తులకు లక్ష్యంపై ఆసక్తి తగ్గుతుంది. దాంతో ఏం చెయ్యాలో తెలియదు. రకరకాల పద్ధతులను పాటిస్తుంటారు సినిమాలకు పోవడం, స్నేహితులతో మాట్లాడుతూ ఉండడం, ఇవ్వన్నీ తమ ఆసక్తిని తిరిగి తెస్తాయని నమ్ముతారు. నిజానికి లక్ష్యం చాలా రోజులు మిమ్మల్ని ఉత్తేజపరచాలంటె, ఆ లక్ష్యానికి ఒక ప్రయోనాన్ని కూడా జత చెయ్యాలి. ఎక్కువమందికి ప్రయోజనం చేూకూరెటట్టుగా నీ లక్ష్యానికి కొత్త అర్థం ఇవ్వాలి. నీ లక్ష్యాన్ని చేరుకోవడం వేలం నీ ఒక్కడి సంతోషం వరకు కాదు నీ చుట్టూరా వున్న వ్యక్తుల జీవితంలో వెలుగులు వస్తాయి. అంతేకాదు, నువ్వు చదువుకున్న స్కూలు పిల్లలకు ఒక మార్గదర్శకత్వం లభిస్తుంది. మీ వూర్లో వాళ్ళకు ఒక స్ఫూర్తి అంది వస్తుంది. ఎంతోమంది పిల్లలకు వాళ్ళ చదువులో ఉత్సాహాన్ని నింపుతుంది. వాళ్ళ జీవితాల్లో ఒక కొత్త కాంతికి దోహదం చేస్తోంది అనే ప్రయోజనాలను మీ లక్ష్యానికి జతచేయండి.
2. Acquiring skills
ఒక పోటీ పరీక్షను ఎదుర్కోవాలంటె ఏం చెయ్యాలి. పరీక్షకు సంబంధించిన సిలబస్ చదవాలి దానికి కావలసిన నైపుణ్యాలు ఏమిటో తెలుసుకోవాలి. ఏకాగ్రతతో చదవడం, ప్రతి ముఖ్యమైన అంశాలను వ్రాసుకోవడం, వల్లె వేయడం, ప్రశ్న పత్రాలను సాధించడం, ఎక్కడ వేగం తగ్గిందో, దానిని గుర్తించి, ఆ నైపుణ్యాన్ని నేర్చుకొని వేగంగా చదవడం, అర్థం చేసుకోవడం సమయాన్ని హరించే పనులు మానుకొని, ఉపయోగకరమైన పనులు చేయడం, పై నైపుణ్యాలను నేర్చుకొని చదువును కొనసాగించడం.
3. Establishing habits:
పోటీ పరీక్షలకోసం చదివే అభ్యర్థులకు ఉండాల్సిన అలవాట్లు, చాలా గంటలపాటు చదవాలి. చదువుకునేప్పుడు స్నేహితుల పిలుపులకు నో చెప్పడం, అన్నిరకాల సమయం వృధా చేసే సెల్‌ఫోన్ సంభాషణలు, ఫేస్‌బుక్‌వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండడం. నిజాయితీగా నేర్చుకున్న అంశాలను తిరిగి పరిశీలించుకోవడం, అర్థంకాని అంశాలను తిరిగి నేర్చుకోవడం. ఫలానా సబ్జెక్ట్ సరిగ్గా రావడం లేదు, ఏకాగ్రత తగ్గుతుంది అని గుర్తించి దానిని అభివృద్ధి పరుచుకొనే ప్రయత్నాలు చేయడం. ఉత్సాహం తెచ్చుకోవడానికి విజయానికి దారిలాంటి పుస్తకాలు చదవడం.
4..Becoming:
నిర్ణయం జరిగింది, లక్ష్యం నిర్ధారణ అయ్యింది దృఢంగా సంకల్పం తీసుకోవాలి. ఎన్ని అవాంతరాలు వచ్చిన సరే! పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే తలంపు నిన్ను చాలా ధృడంగా మార్చాలి.
5. Handling set Backs
పోటీ పరీక్షలలో ఉన్న సిలబస్‌లో ఉన్న అంశాలు, మన వ్యక్తిత్వంలోవున్న లోపాలను గుర్తించాలి. లేదా నిపుణులను కలిసి చర్చించి వాటిని సరిచేసుకోవాలి. చదివిన ప్రతి అంశంలో తనకున్న పరిజ్ఞానాన్ని ప్రతి వారం, 15 రోజులకొకసారి పరీక్షించుకోవాలి. సమాచారం వెనుకబాటును, విషయాలను విశ్లేషించటంలోని వెనుకబాటును, ప్రశ్నకు సరియైన సమయంలో జవాబును గుర్తించడంలోని వెనుకబాటును గుర్తించి వాటిని సరిచేసుకునే లక్షణాలను పెంపొందించుకోవాలి. వాటిని సరిచేసుకోవడానికి వీలయితే సైకాలజిస్ట్‌లను కలిస్తే చాలా ప్రయోజనకరంగా వుంటుంది.
6. Overcoming Limits:
గత అనుభవాలు మన జీవితానికి ఒకసారి పాఠాలుగాను, ఒక్కొక్కసారి పరిమితులను కూడా విధిస్తాయి. పూర్తిగా ఆ పరిమితులకు లోబడి, మన ప్రయాణం కొనసాగిస్తే ఎన్నటికీ విజయం సాధించలేము. ఆ పరిమితి రావడానికి కారణమైన వాటిని శోధించి పట్టుకొని దాన్ని ఛాలెంజ్ చేసి.. హద్దులు చెరిపేసి నిరాటంకంగా ముందుకు వెళ్ళేందుకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకుంటె మీలోవున్న అపరిమితమైన శక్తి మీ వశం అవుతుంది. అది మీ విశ్వరూపాన్ని మీకు పరిచయం చేస్తోంది. అప్పుడు మీరు విజేతగా రూపాంతరం చెందుతారు.
7. Fininshing strong:
పై వాటిని పాటిస్తూ మీ ప్రిపరేషన్‌ను కొనసాగించండి విజయం మీతోపాటే నడుస్తుంది లక్ష్యం సాధించే వరకు గమ్యంవైపు నడక మారకుండా, ఆసక్తితో సాధన పరుగెత్తుతుంది.. గమ్యాన్ని ముద్దాడుతుంది.
శ్రీ డా|| సి. వీరేందర్