తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించింది. విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తు ప్రారంభించిన ఈ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా భోజనం, ఉండడానికి వసతి సౌకర్యాలు కల్పిస్తుండడంతో ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారింది.
ఏకకాలంలో మొత్తం 119 మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాలను ప్రారంభించారు. ఇందులో బాలురకు 63, బాలికలకు 56 గురుకులాలను కేటాయించారు. వీటి ప్రారంభంతో మొత్తం బీసీ గురుకులాల సంఖ్య 281కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైైర్‌ పర్సన్‌లు, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్‌బుక్స్‌, స్కూల్‌ బ్యాగులు, ఇతర సామగ్రి అందచేశారు.

ఈ సందర్భంగా పలువురు మంత్రులు మాట్లాడుతూ గురుకులాల ద్వారా నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించడానికి అవకాశం కల్పించామన్నారు. కార్పోరేట్‌ విద్యకు దీటుగా ఇందులో నాణ్యమైన విద్య, వసతి సౌకర్యాలు కల్పించబడుతున్నాయన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం గురుకులాల వ్యవస్థను ఏర్పాటు చేస్తోందన్నారు. గురుకుల విద్యావ్యవస్థ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందన్నారు. బీసీల అభ్యున్నతికి ఇది ఎంతో దోహదపడుతుందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో కేవలం 19 గురుకులాలే ఉండగా తెలంగాణ ఏర్పడిన వెంటనే 24 గురుకులాలను టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తరువాత 2017-18 విద్యాసంవత్సరానికి గాను 119 బీసీ గురుకులాలు ప్రారంభించగా, తాజాగా 2019-20 విద్యాసంవత్సరానికి గాను మరో 119 ప్రారంభించడం జరిగింది. ఇలా మొత్తం 281 గురుకులాలు అందుబాటులోకి రాగా వీటిలో 92,340 మంది విద్యార్థులు చదువుకునే అవకాశం దక్కింది.

Other Updates