‘సౌతెన్’ అనే హిందీ సినిమాలో రాజేష్‌ఖన్నా చాలా డబ్బున్న మనిషి. అందులో రెండవ హీరోయిన్‌తో స్నేహం ఏర్పడుతుంది. చాలా రోజులు అతన్ని గమనించి ఒక రోజు ‘‘క్యోం ఆప్ నె ఆప్ సే లడ్‌తే హో’’ అంటుంది. అంటే ‘‘ఎందుకు మీరు మీలోనే పోట్లాడుతారు’’ అని, చిత్రంగా లేదు మనతో మనకు పోరాటమేంటని? కాని ఇది నిజం.
ప్రతిరోజు ఏదో ఒక విషయంలో మనకు రెండు దారులు కనిపిస్తాయి. కాని రెండూ బాగానే ఉంటాయి. రెండు చేయాలనిపిస్తుంది లేదా ఏదైనా ఒక్కటి చేయాలనిపిస్తుంది. కాని ఆ ఒక్కటి ఏదో సెలక్ట్ చేసుకోవడం చాలా కష్టంగా వుంటుంది. రెండింట్లోనూ మంచి కనిపిస్తుంది. చెడు కన్పిస్తుంది. రెండింట్లో నష్టం, లాభం కన్పిస్తాయి. ఎలా! అనేది చాలామందిని వేధించే సమస్య. ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ రోజులు గడిపేస్తారు చాలా మంది. అప్పుడే వారికి తెలియకుండానే వారిమీద వత్తిడి (Stress) పని చేస్తుంది. ఇలాంటి సంఘర్షణను Psychologyem Approach – Approach Conflict అంటారు.
బజారుకెళ్ళి దుస్తులు చూస్తాం. అందులో మనకు నచ్చిన దుస్తులు రెండు కనపబడతాయి. వివిధ రంగులలో ఉన్నాయి. ఏది తీసుకోవాలో తెలియదు. రెండు కొనడానికి కావాల్సిన డబ్బు లేదు. కాని రెండు కొనాలనే భావన ఇలా దుస్తులలోనే కాదు చాలాసార్లు మనం ఇలాంటి మానసిక సంఘర్షణను ఎదుర్కొంటాం. మనలోనే మనం తర్జనభర్జన పడుతుంటాం.
ఇవే కాకుండా జీవితంలో ముఖ్య విషయాలైన చదువు, వివాహం విషయాలలో కూడా చాలామందికి మానసిక సంఘర్షణ వస్తుంటుంది. ఉదాహరణకు – నేను గత సంవత్సరం ఆదిలాబాద్ నుండి హైదరాబాద్‌కు బస్సులో ప్రయాణం చేస్తున్నాను. నా పక్క సీట్లో ఇద్దరు స్టూడెంట్స్ కూర్చుని ముచ్చట్లు పెడుతున్నారు. అందులో ఒక అబ్బాయి పరీక్షలు వారం రోజులున్నాయి కదా! ఇవ్వాళ సినిమా చూసి తర్వాత వెళ్దాంలే అంటున్నాడు. అతని స్నేహితుడికి నిజానికి వెళ్ళిపోయి చదువుకోవాలని వుంది. కాని అతడి స్నేహితుడి కోరికమేరకు బలవంతంగా బస్సుదిగి వెళ్ళిపో యారు. మధ్యలో నన్ను జడ్జిని చేసి ఇద్దరూ వాళ్ళ ఆలోచనలు చెప్పారు. నేను నవ్వుతూ మీరే నిర్ణయించుకోండి అని చెప్పాను. అతని స్నేహితుడు అన్యమనస్కం గానే వెళ్ళిపోయాడు. నేను ఇదొక కేస్ స్టడీలాగా ఏం చేస్తారో చూసాను. మనకు ఇష్టంలేకపోయినా సరే! అవతలవాళ్ళు చెప్పిందానికి తలవూపడం… లోపల లోపల బాధపడడం సహజంగా చాలా మందిలో చూస్తుంటాం.
గత నెలలో ఒక అమ్మాయిని ‘కౌన్సెలింగ్’ కోసం నా దగ్గరకు తీసుకువచ్చారు. ఆ అమ్మాయితో మాట్లాడితే ఇలా చెప్పింది… ఆ అమ్మాయికి భర్తతో సమస్య. పెళ్ళికి ముందు తల్లి కూతురితో… ‘‘వచ్చిన సంబంధం వద్దనకు. మేము ఇంతకంటె గొప్ప సంబంధం తేలేము. నీ తర్వాత పెళ్ళి కావాల్సిన చెల్లెలున్నారు. కాబట్టి ఈ పెళ్ళికి ఒప్పుకో’’ అన్నది. పెళ్ళికొడుకు నచ్చక తల్లితండ్రిని వద్దనక మనస్సులో విపరీతమైన గుంజాటన.. ఏది సరిగ్గా చెప్పలేక చెప్పితె అమ్మానాన్నలను బాధపెట్టిన వాళ్ళనైత అని చెప్పలేక ఓకే అన్నది. ఇహ అప్పటినుండి జీవితం అంతా నరకమే. దాంతో ఇంట్లో పని సరిగ్గా చేయలేక.. ఇంట్లో వాళ్ళనెవరినీ మెప్పించలేక మొత్తానికి అందరికీ సమస్యలు తీసుకుని వచ్చింది.
మొదటి సమస్య చాలా చిన్నదే అయినా అది మన ఆలోచనా విధానాన్ని చెపుతుంది. రెండవది సమస్య ప్రభావం చాలా పెద్దది. అయినా రెండు పరిస్థితులలోనూ వ్యక్తులు వాళ్ళకు కావలసింది ఏదో తెలిసిన దానిని స్పష్టంగా చెప్పలేకపోవడం. దానివలన ఎవరికి లాభంలేని పరిస్థితి. ఎందుకు ఈ హింస పరిస్థితి. ఇది కూడా ‘‘లో సెల్ఫ్ ఎస్టీమ్’’ వలననే, మనకు ఏదైతే అవసరమో, ఏది చేస్తే బాగుంటుందో అది చేయలేం. కనీసం ఇది నా ఉద్దేశం అని కూడా చెప్పలేం. దీంతో విపరీతమైన ఆందోళన, సంఘర్షణ. నాకు ఇది ఇష్టం లేదనే సంగతి ఎదుటి వాళ్ళే తెలుసుకోవాలనుకునే వారి శాతం ఎక్కువ. మన అవసరం ఏంటో… అది ఎందుకు అవసరమో ఎదుటి వాళ్ళకు చెప్పాలన్న ఆలోచనే వుండదు. ఆ సంగతి ఎదుటి వాళ్ళే తెలుసుకోవాలి. అది వాళ్ళే కనుక్కుని తీర్చాలి తప్ప మనం చెప్పకూడదు. ఆ మాత్రం తెలుసుకోకుంటె ఎందుకు ఈ బంధాలు, అనుబంధాలు అనే లాజిక్‌తో తమను తాము నియంత్రించుకుంటారు. నేను చెపితే బావుండదు. నా సంగతి వాళ్ళకు తెలుసుకదా! వాళ్ళకు శిక్షను వాళ్ళే విధించుకుంటారు.
ఈ పద్ధతివల్ల ఆ క్షణానికి అందరూ అందరినీ సంతృప్తిపరచినట్టు ఒక గొప్ప భావన కలుగవచ్చు. అసలు కథ ఆ తర్వాత మొదలౌతుంది. తనలో తాను సంఘర్షించుకోవడం, పోట్లాడుకోవడం. ఇది మెల్లగా డిప్రెషన్‌కి దారితీయడం, ప్రతి చిన్న విషయానికి కోపంగా జవాబులు చెప్పడం జరుగుతుంది. మనం అవసరం అయినప్పుడు అసెర్టివ్‌గా ఉండలేకపోవడం వలన ఈ సమస్య వస్తుంది. ఈ విషయం మనకు తెలియకపోవడం, పెద్దవాళ్ళ మాటను ఎలాంటిదైన సరే! నచ్చలేదు! వద్దు! కాదు అని అనకూడదనే సంస్కృతివల్ల ప్రతి చిన్న విషయం కూడా ఏదీ నిర్ణయించుకోలేక మనలో మనమే సంఘర్షించుకునే పరిస్థితి వస్తుంది. మనలో ఇద్దరు వ్యక్తులు వుంటారు. వారితో రోజూ మాట్లాడడం ఇద్దరిలో ఎవరినో ఒకరిని మాత్రమే సంతృప్తిపరిచే పని జరగడం మనకు నచ్చక పోవడం, దీంతో అశాంతిగా వుండడం రోజూ జరిగే పరిణామం. నిజానికి దీని నుండి బయ టకు రావడం చాలా తేలిక. ఈ క్రింది పద్ధతిని పాటించండి.
మనకు నచ్చని దానిని నచ్చలేదనే విషయాన్ని సౌమ్యంగా చెప్పే పద్ధతిని Assertive Communication అంటారు. చేయలేని పనికి ‘నో’ చెప్పడం నేర్చుకోవడం అవసరం. అలా చెప్పడం మన ఆత్మగౌరవంగా భావించాలి తప్ప అది ఎదుటివారిని బాధపెట్టేందుకు కాదు అని నమ్మాలి. మనలో వచ్చే రెండు విరోధ భావాలలో దేనిని, ఎలా స్వీకరించాలో తెలుసుకుంటే మనం పడే బాధనుండి విముక్తి పొందవచ్చు. అది ఎలానంటే మనిషిలో ఇద్దరు వ్యక్తులుంటారు. ఒకరు మనసు మనిషి – ఆనందరావు, ఇంకొకరు మెదడు మనిషి – ఆలోచనరావు… వీళ్ళిద్దరూ మనలోనే నివసిస్తారు. ఆనందరావు ప్రతిక్షణం ఆనందంగురిచే ప్రయత్నిస్తాడు. ఏం చేస్తే ఆనందం వస్తుందో ఆ పనినే చేయమంటాడు. భవిష్యత్తు గురించిన చింతలేదు, చేసే పనిమీద నిబంధనలు లేవు. మంచి చెడు అవసరం లేదు, నష్టం, గిప్టం అవసరం లేదు. ఇప్పుడు ఆనందం వస్తుందా లేదా! అనేదే ముఖ్యం. ఎక్కువ కష్టపడకూడదు. వీలైతే అస్సలే పనిచేయకూడదు. మజా… మస్తి. ఇది ఆనందరావు పద్ధతి.
ఇహ ఆలోచనరావు ఏది మంచి, ఏది చెడు, ఏది అవసరం. ఏది అనవసరం. భవిష్యత్తుకు ఏది మంచి జరుగుతుందో అని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం.. నష్టం జరుగుతుందన్పిస్తే వెంటనే నివారణ మంత్రం పాటిస్తాడు. దానిక్కావలసిన అన్ని చర్యలు తీసుకుంటాడు. తనకు లాభం రావడానికి ఎంత కష్టమైనా చేయడానికి సిద్ధపడతాడు ప్రతి క్షణం. ఒక దిశా నిర్దేశం చేసే రీతిలో పని చేస్తాడు. మొత్తానికి ఒక ‘జడ్జి’లా పనులు పురమాయిస్తాడు.
కాబట్టి మిత్రులారా! జీవితంలో వత్తిడిలేకుండా, భవిష్యత్తులో మంచి ఫలితాలు రావాలంటే మనలోవున్న ఈ ఇద్దరు అపరిచితుల్లాంటి మిత్రుల గురించి తెలుసుకోండి… అన్నీ మనలోనే కదా సజెషన్స్ వస్తున్నాయని అనుకొని ఆనందరావు మాటలను వింటే భవిష్యత్తు ఇబ్బందికరంగా మారుతుంది. ఆనందరావు సజేషన్ 20 శాతం వరకు వినవచ్చు లేదా 30% ఇంకా ఎక్కువైతే… ప్రస్తుతం ఆనందమే.. నరకం తర్వాత ఆలోచించండి కాబట్టి 70-80 శాతం ఆలోచనరావు సహాయం తీసుకోండి. 20-30 శాతం ఆనందరావు తోడ్పడే… అప్పుడు జీవితం ఆనందంగా హాయిగా గడుస్తుంది.