”అతడు గట్టి నిర్ణయం తీసుకున్నాడు”, ”వాడు స్థిర నిశ్చయం చేసుకున్నాడు”, ”అతనిలో ఏ విధమైన ద్వైదీభావం లేదు” మొదలైన వాక్యాల్ని మనం తరచుగా చదువుతుంటాం. అయితే ఈ మోస్తరు వాక్యాలన్నింటికి సమానంగా, దీటుగా తెలంగాణలో ఓ వాక్యం వినిపిస్తూ వుంటుంది. అది ఏమిటంటే ”వాడు ఒక్క చిత్తం చేసుకున్నడు” అని. ఎంత గొప్ప అభివ్యక్తి యిది! అంటే ఇక ఏ విధమైన ఊగిసలాటలేదు. ఏరకమైన డోలాయమాన పరిస్థితికాదు. సందేహం లవలేశం కూడా లేని దృఢ నిర్ణయాలు అన్నమాట. మనకు ఒక్క చిత్తం కాకుండా ఏదేని విషయంలో రెండు చిత్తాలు ఉన్నాయనుకోండి! ఎంత యిబ్బంది!! అది ఒక్కో పడవలో ఒక్కో కాలువేసి సముద్రంలో పయనించడం వంటిది. మునగడం ఖాయం. రెండు కన్నా ఎక్కువ చిత్తాలు ఉంటే మానసిక స్వాస్థ్యం దెబ్బతింటుంది. మనశ్శాంతి కరువవుతుంది. పిచ్చి ఎక్కువవుతుంది. తెలంగాణ వాసుల సంభాషణలో సందర్భానుసారంగా వెలువడే అతి సహజమైన అభివ్యక్తీకరణ ”ఒక్క చిత్తం” అనే మాట. ఈసారి ”పలుకుబడి”లో ఈ ”ఒక” లేదా ”ఒక్క”తో కూడిన యితర వాక్య విన్యాసాలను చూద్దాం.
ఇద్దరు హేమాహేమీలై సమ ఉజ్జీలుగా ఉన్నప్పుడు ”వాళ్ళిద్దరు ఒక్క ఆకుల చదువుకున్నరు” అంటున్నారు తెలంగాణలో. ఈ ఆకు ఏమిటో కాదు తాళపత్రం. పూర్వం అవే కదా గ్రంథాలు. ఇక… దేనికీ సరిపోని చాలని బొటాబొటి పరిస్థితిని తెలుపడానికి ”అది ఒక్క తుసురుకు సాలది” అంటారు. దేని గురించి చెప్పదలచుకున్నారో ఆ పదార్థం అది ”తుసురుకు కూడా” అంటే రవంత సైతం, అణుమాత్రం కూడా సరిపోదని చెప్పడం. ”కాస్త సాయం చేయరాదూ?” అనే అర్థంలో లేదా ఏదేని బరువును ఒక వ్యక్తి ఎత్తుతున్నపుడు మరొకరి సహాయార్థం ”ఒక్క చెయ్యి ఎయ్యరాదా బిడ్డా!” అని అడుగుతుంటారు. ఒకరు బరువు ఎత్తుకుంటున్న తరుణంలో మరొక వ్యక్తి వచ్చి ఆ భారాన్ని లేపడానికి ఒక చెయ్యి వేస్తే అది తొందరగా తేలికగా లేస్తుంది. మనం మరొకరితో కొంతదూరంగానీ మరో చోటికిగానీ వెళ్ళాల్సిన సందర్భంలో ”ఒక్క అడుగు పొయిరారాదు బిడ్డా!”అని బతిమిలాడుతారు. ఈ ”ఒక్క చెయ్యి ఎయ్యరాదూ!”, ”ఒక్క అడుగు పొయి రారాదు” వంటి అభ్యర్థనలు ఎదుటి వ్యక్తిలో సానుకూల ప్రభావాలు కలిగిస్తాయి. ఈ వసతులవల్ల ఆ వ్యక్తిసాయపడటానికి ముందుకొస్తాడు, లేదా కోరిన ప్రదేశానికి వెళ్లి వస్తాడు.
”వాడు మగత నిద్రలో వున్నాడు”, లేదా ”వాడు కాస్త మేనువాల్చాడు” అని అర్థంలో తెలంగాణలో ”వాడు ఒక్క కునుకు తీసిండు” అని వ్యవహరిస్తారు. ”కునుకు” అంటే నిద్రలో కునికిపాటు. ఇదే తెలంగాణలో కూర్పాట్లు.
”నేను ఆ విషయం అతనికి అదేపనిగా, పదేపదే చెప్పాను” అనే వాక్యం ”నేను ఆ ముచ్చెట ఆయనకు ఒక్కతీరుగ చెప్పిన” అనే పద్ధతిలో వినిపిస్తుంది. ”అదే పనిగా”, ”పదేపదే” అనే మాటలకు బదులుగా తెలంగాణలో ”ఒక్కతీరుగ” అనేది కనిపిస్తుంది. అంటే తదేకంగా చెప్పడం. ఏకధాటిగా విప్పడం.
భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రజలందరూ ఆంగ్లేయులను ఎదిరించడానికి ”ఏకత్రాటిమీద నడిచారు”. ఈ ”ఏకత్రాటిమీద నిలవడం, నడవడమే తెలంగాణలో ”ఒక్క కట్టుమీద ఉండటం”. ”సకల జనుల సమ్మె”లోగానీ, ”మిలియన్ మార్చ్”లోగానీ, యావత్ తెలంగాణోద్యమంలోగానీ ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ప్రజలంతా ”ఒక్క కట్టు మీద ఉన్నరు”. ఇది గొప్ప విజయం.
చాలామంది పెత్తనం చేస్తున్నారనుకోండి! సత్ఫలితాలు రావు. మంచి పరిణామాలు కల్గవు. అందుకే ”పది మందిల పాము చావది” అంటారు. తెలంగాణలో ఒక వాక్యం దీనికి ఉపబలకంగా యిలా వుంది. అది: ”ఏ పనైనా ఒక్క చెయ్యి మీద నడువాలె” నిజమే కదా! బహుళ నాయకత్వంలోని సమస్యల్ని గుర్తెరగడం వల్లే ఈ ఆలోచన కల్గింది మరి! ”ఒక్క చెయ్యి మీద నడవడం” అంటే ఏకనాయకత్వం, ఏక చోదకత్వం. ఇక్కడ ఒక్కరి నాయకత్వం అంటే నియంతృత్వం కాదు సుమా! విశృంఖలత్వం కాని ప్రజాస్వామ్య భావనలతో కూడిన నాయకత్వం అని అర్థం.
ఇక.. పండగలూ, పబ్బాలూ మొదలైన సందర్భాల్లో ”ఉపవాసం” ఉండటం సహజం (శివరాత్రి, ఏకాదశి మొదలైన పర్వదినాల్లో). ఈ ”ఉపవాసం” తెలంగాణలో బాగా ప్రచలితమైన మాట ”ఒక్క పొద్దు”. దీన్నే ”ఉపాసం” అని కూడా వ్యవహరిస్తారు. ఇంకా కొందరు ”ఉప్పిడి ఉపాసం”, ”నిట్టు ఉపాసం” అని మాట్లాడుతూ ఉంటారు. ”అక్కడ ఎవరూ లేరు” అనే దాన్ని ”ఒక్క పురుగు గూడ లేదు”, ”ఆడ ఒక్క నరమానవుడు లేడు” మొదలైన రూపాల్లో వాక్య వినియోగం వుంది. కథలు చెబుతున్నపుడు ఊ కొడుతున్న విధంగా ఏదైనా అంశమ్మీద మాట్లాడుతున్నపుడుగానీ, పరస్పరం సంతోషిస్తున్నపుడుగానీ ”ఒక్క మాట” అంటుంటారు. ఉదాహరణకు ”ఒక్క మాట! నీతోని కొద్దిగా పనివుంది” అంటారు. అంటే అవతలివ్యక్తి అవధానాన్ని తనకు అనుకూలంగా తిప్పుకునే వీలు ”ఒక్కమాట”లో వుంది. వాళ్ళదంతా ”ఒకే ముఠా”, ”ఒకే జట్టు” అనే మాటల్ని తెలంగాణలో ”ఒక్కమూటి” అనే మాటతో సరిపెడతారు. ”వాళ్ళందరిది ఒక్కటే మాట. ఒగలను తియ్యలేం. ఇంకొంగలను పెట్టలేం” అనే వాక్యాలూ పై అర్థాలకు సమర్థకాలే!
ఇక.. మెడలో ఆడవాళ్ళు ధరించే నగల్లో ”ఒంటిపేట గొలుసు” ఒకటి. ఇది తెలంగాణలో ”ఒక్క వరుస గొలుసు”గా పిలువబడుతుంది. ”చిలువలు పలువలు కావడం” అనే జాతీయం తెలంగాణలో ”ఒక్కటి అంటే రెండు పుట్టుడు”. ”అవి రెండూ సమానంగా వున్నాయి” అంటే తెలంగాణలో ”అవ్వి రెండు ఒక్కంతనే ఉన్నయి” అంటున్నారు. ”శోభనం” అనే మాటలకు బదులు పిల్లపిలగాన్ని ఒక్కటి చేసుడు”, ”అదే పనిగా నవ్వడం” అంటే ”ఒక్కటే నవ్వుడు”, ”ఒక విధంగా మంచిదైంది”కి మారుగా ”ఒక్కందుకు మంచిదైంది”, ”అకస్మాత్తుగా, హఠాత్తుగా” అంటే ”ఒక్కసారె”, ”రకరకాల పూలు” అనడానికి ”తీరొక్కపువ్వులు” అని పలకడం తెలంగాణ ప్రత్యేకత.
”అతణ్ణి చాలా పొగిడారు” అంటే తెలంగాణలో ”ఒగ పొగుడుడు కాదు” అనీ, ”వాణ్ణి బాగా తిట్టారు” అంటే ”ఒగ తిట్టుడు కాదు” అనీ, ”వానికి పుట్టెడు బాధలున్నాయి” అంటే ”వానికి ఒగ బాధకాదు” అనీ, అభివ్యక్తులున్నాయి. ఒక పొగుడుడు కాదు” అనే నకారాత్మక వాక్యానికి అర్థం అనేకంగా పొగడ్డం అనే నకారాత్మక వాక్యమే! ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన అభివ్యక్తి సామర్థ్యం వుంటుంది. ఇక… ”టూకీగా, సంక్షిప్తంగా, క్లుప్తంగా, ఒక్కముక్కలో, సంగ్రహంగా” అనే మాటలన్నింటికీ తెలంగాణలో ”ఒకటి రెండు ముచ్చట్లల్ల” అనే వాక్యం వుంది. ”ఇగో.. బొల్లిపూస రామాయణం, చాట భారతం చెప్పకు, ఒకటి రెండు ముచ్చట్లల్ల కట్టె, కొట్టె, తెచ్చె అన్నట్లు చెప్పు” అనే మాటలు తరచూ వినబడతాయి.
డా|| నలిమెల భాస్కర్