శ్రీధర్ రావు దేశ్ పాండే,
ప్రాజెక్టుల కాలువల కింద ఒక టిఎంసి నీటికి ఎన్ని ఎకరాలు సాగు అవుతాయి? తరి పంటలకైతే 5 నుంచి 6 వేల ఎకరాలు, ఆరుతడి పంటలకైతే 10 వేల ఎకరాలు అనేది అందరికీ తెలిసిన జవాబు. కానీ ప్రపంచంలో నీటి నిర్వాహణ పద్ధతుల్లో అనేక సాంకేతిక పద్ధతులు అమల్లోకి వచ్చిన తర్వాత ఒక టిఎంసి కి 13 వేల ఎకరాల పైబడి తరి పంటలను, 15 వేల నుంచి 20 వేల ఎకరాల ఆరుతడి పంటలను పండించడం సాధ్యం అవుతున్నది. మెరుగైన నీటి యాజమాన్య పద్ధతులు అమలు చేయడం, వరి సాగులో పంట కాలం తక్కువగా ఉండే వరంగల్, జగిత్యాల, శ్రీ వరి లాంటి వంగడాలని ప్రోత్సహించడం, ఆయకట్టులో మైక్రో ఇరిగేషన్ పద్ధతులను అవలంభించే విధంగా రైతులను చైతన్య పరచడం, ఆరుతడి పంటలను, కూరగాయల సాగును ప్రోత్సహించడం, పూలు, పండ్ల తోటలను పెంచేందుకు ప్రోత్సహించడం తదితర చర్యల ద్వారా ఒక టిఎంసికి 13 వేల ఎకరాలను సాగు చెయ్యడం అసాధ్యం ఏమీ కాదు.
మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలలో Piped Irrigation పద్ధతిని అవలంభించి ఒక టిఎంసికి 15 నుంచి 20 వేల ఎకరాల సాగు సాధిస్తున్నారు. తెలంగాణా ఏర్పడిన తర్వాత మూడు ప్రధాన ప్రాజెక్టులు శ్రీరాంసాగర్, నిజాంసాగర్, నాగార్జునసాగర్ కాలువల కింద వారాబంది (ఆన్ & ఆఫ్), కింద నుంచి పైకి (టెయిల్ టు హెడ్) పద్ధతులని సమర్ధవంతంగా అమలు చేసినందున వరి సాగులోనే ఒక టిఎంసికి 13 వేల ఎకరాలు సాగుబడి సాధ్యం అయింది, పంట దిగుబడి పెరిగింది. టెయిల్ టు హెడ్ పద్ధతిన నీటి సరఫరా చేసినందువలన ఎన్నడూ నీరు పారని చిట్ట చివరి భూములకు నీరు పారించగలిగినారు. కాబట్టి పైన పేర్కొన్న నీటి నిర్వాహణ పద్ధతుల వలన ఒక టిఎంసికి 13 వేల ఎకరాలు సాగు చేయడం సాధ్యమే.
గత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల కాలంలో తెలంగాణ ప్రాజెక్టులు దారుణమైన నిర్లక్ష్యానికి లోనై నిర్వహణ లేక కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆయకట్టు సగానికి సగం పడిపోయింది. చివరి భూములకు నీరందే పరిస్థితి లేదు. కాలువల్లో పూర్తి మోతాదులో డిస్చార్జ్ పోయే పరిస్థితి లేదు. ప్రభుత్వం తెలంగాణలో పాత సాగునీటి ప్రాజెక్టులను పునరుద్ధరించాలని, ప్రాజెక్టుల్లో పెరిగిపోతున్న ఈ గ్యాప్ ఆయకట్టుని తగ్గించాలని సంకల్పించింది. నాగార్జునసాగర్, నిజాంసాగర్, ఘన్ పూర్ ఆనకట్ట కాలువల ఆధునీకీకరణ పనులని పూర్తి చేసి మొత్తం ఆయకట్టుకు నీరందించడం జరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువల ఆధునీకీకరణ కోసం ప్రభుత్వం వెయ్యి కోట్లను నిధులను మంజూరు చేసింది. పనులు వేగంగా జరుగుతున్నాయి. సదర్ మాట్ ఆనకట్ట ఆధునీకీకరణ, సాత్నాల, చెలిమేలవాగు, స్వర్ణ, ఆధునీకీకరణ పనులు పూర్తి అవుతున్నాయి. రాష్ట్రంలో 28 ప్రాజెక్టుల ఆధునీకీకరణ కోసం ప్రధాన మంత్రి కషి సీంచాయి యోజన పథకంలో ఒక భాగమైన Incentivization స్కీంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయానికి ప్రతిపాదించడం జరిగింది. 34 డ్యాముల పునరుద్ధరణ కోసం DRIP (Dam Rehabilitaion and Improvement Project) పథకంలో 675 కోట్ల అంచనా వ్యయం తో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయానికి ప్రతిపాదించడం జరిగింది.
నాగార్జున సాగర్ నీటి నిర్వహణ – ఫలితాలు
రబీ పంట కాలంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధి లోని నల్లగొండ, సూర్యపేట, ఖమ్మం జిల్లాల్లో విస్తరించిఉన్న జోన్ 1, జోన్ 2 ఆయకట్టులో గత రెండేళ్ల నుంచి నీటి నిర్వహణ ఆన్ & ఆఫ్ పద్ధతిలో టెయిల్ టు హెడ్ పద్ధతిలో జరిపినందున మునుపెన్నడూ లేని విధంగా చివరి భూములకు కూడా నీరందించడం జరిగింది. 2017-18 సంవత్సరంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద మొత్తం 44.77 టిఎంసిల నీటి వాడకంతో 5.258 లక్షల ఆయకట్టుకు నీరు అందించడం జరిగింది. అంటే మెరుగైన నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా 1 టిఎంసికి 11,796 ఎకరాల ఆయకట్టు సాగు చేయడం, అతి ఎక్కువ పంట దిగుబడి సాధించడం జరిగింది. 2008-09, 2009-10, 2010-11 సంవత్సరాల్లో 1 టిఎంసికి 3000 నుంచి 5600 ఎకరాల ఆయకట్టు మాత్రమే సాగు అయినది. 2014-15 నుంచి 1 టిఎంసి కి ఆయకట్టు సాగు విస్తీర్ణం పెరిగింది. 2013-14లో 5837 ఎకరాలు, 2014-15 లో 7356 ఎకరాలు, 2016-17 లో 11,228 ఎకరాలు 2017-18 లో 11,796 ఎకరాలు 1 టిఎంసికి సాగు అయినది. ఎకరానికి 35 బస్తాలు వరి పండించే పరిస్థితి నుంచి ఏకరాకు 50 బస్తాలు పైచిలుకు వరి దిగుబడి సాధించాము. ఇంకా మెరుగైన ఫలితాలు సాధించే దిశలో సాగవలసి ఉన్నది.
శ్రీరామ్ సాగర్ నీటి నిర్వహణ – ఫలితాలు
శ్రీరామ్ సాగర్ మొత్తం ఆయకట్టు 9,68,640 ఎకరాలు. శ్రీరామ్ సాగర్ డ్యామ్ నుంచి దిగువ మానేరు డ్యామ్ దాకా ఉన్న ఆయకట్టు 4,62,920 ఎకరాలు. దిగువ మానేరు డ్యామ్ కింద ఉన్న ఆయకట్టు 5,05,720 ఎకరాలు. కాలువల ఆధునీకీకరణ, ఆన్ & ఆఫ్ పద్ధతి లో నీటి సరఫరా, టెయిల్ టు హెడ్ పద్ధతి అమలు జరిగినందున గత 20 ఎండ్లుగా నీరు అందని చివరి ఆయకట్టు గ్రామాలకు నీరు చేరింది. నీటి వినియోగ సామర్ధ్యం పెరిగింది. డి-83 కాలువ కింద చివరి గ్రామాలైన పెద్ద బొంకూరు, బొంపల్లి, పెంచికల్ పేట్, కమాన్ పూర్, జూలపల్లి మరియు డి-86 కాలువ కింద చివరి గ్రామలైన రాయిపేట్, పందిళ్ళ, జగ్గయ్యపల్లి, ఇప్పలపల్లి, మల్యాల, తారుపల్లి గ్రామాలకి చాలా ఏండ్ల తర్వాత నీరు పారించడం జరిగింది. గతంలో ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రాజెక్టు కింద ఒక టిఎంసికి 4 నుంచి 6 వేల ఎకరాలకు మించి సాగుబడి అయ్యేది కాదు. మెరుగైన నీటి యాజమాన్య పద్ధతులు అమలుచేసినందున 2016-17 సంవత్సరంలో 40 టిఎంసిల నీటిని వినియోగించి 4.97 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడం జరిగింది . అంటే ఒక టిఎంసికి 12,427 ఎకరాలు సాగు అయింది. రబీ లో 72 టిఎంసిల నీటిని వినియోగించి 6 లక్షల 15 వేల ఎకరాలు సాగు చేయడం జరిగింది. అంటే ఒక టిఎంసికి 8 వేల 542 ఎకరాలు సాగుబడి అయింది. 2017-18 రబీలో అది 9250 ఎకరాలకు పెరిగింది. రబీలో ఒక టిఎంసికి సాగుబడి అయ్యే భూమి పడిపోవడం సహజమే.
నిజాంసాగర్ నీటి నిర్వహణ – ఫలితాలు
నిజాంసాగర్ మొత్తం ఆయకట్టు 2,31,339 ఎకరాలు. ఈ ప్రాజెక్టు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉంది. ఒక ప్రధాన కాలువ, 82 డిస్ట్రిబ్యూటరీలు, 243 సబ్ డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. ప్రధాన కాలువ పొడవు 155 కిలోమీటర్లు. డిస్ట్రిబ్యూటరీలు, సబ్ డిస్ట్రిబ్యూటరీల పొడవు 1770 కిలోమీటర్లు. రూ. 954 కోట్లతో కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టి 95% పనులు పూర్తి చేయడం జరిగింది. కాలువలు ఆధునీకరించడం వలన నీటి పంపిణీ సామర్ధ్యం గణనీయంగా పెరిగింది. చివరి ఆయకట్టు భూములకు నీరు చేరుతున్నది. ఆన్ & ఆఫ్ పద్ధతి, టెయిల్ టు హెడ్ పద్ధతి అవలంభించినందున ఒక టిఎంసి కి సాగు అయ్యే భూమి విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. నిరంతర నిఘా, పటిష్ట నీటి పంపిణీ నిర్వహించడం వలన ఈ క్రింది గుణాత్మక మార్పు నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా వచ్చినది. 2016-17 లో 16 టిఎంసి ల నీటి వినియోగం తో 2,10,000 ఎకరాల ఆయకట్టు సాగుబడి అయింది. అంటే ఒక టిఎంసికి 13,125 ఎకరాలు, 2017-18 లో 15.36 టిఎంసిల నీటి వినియోగం తో 2 లక్షల ఎకరాల ఆయకట్టు సాగుబడి అయింది. అంటే ఒక టిఎంసికి 13,021 ఎకరాలు సాగు చేయడం జరిగింది. బోధన్ మండలం చివరి గ్రామలైన సుంకిని, జాడీ జమాల్ పూర్, రామ్ పూర్, నిజామాబాద్ రూరల్ మండలం చివరి గ్రామాలైన పాల్దా, జన్నెపల్లి ఆర్మూర్ మండలం లో చివరి గ్రామాలైన చిక్లీ, గూంగ్లీ, కంతం లకు చాలా ఏండ్ల తర్వాత నీరు అంధించడమైనది. ఎకరానికి 25 క్వింటాళ్ళ వరి దిగుబడి వచ్చే పంట పొలాల్లో ఈ సారి ఆన్ & ఆఫ్ పద్దతి లో సాగునీటిని అందించడంతో రికార్డు స్థాయిలో రైతులకు ఎకరానికి 35 క్వింటాళ్ళ పై చిలుకు వరి దిగుబడి రావడం జరిగింది.
తెలంగాణా రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలో ఈ వినూత్న ప్రయోగం సఫలం కావడం శుభ సూచకం. గతంలో రైతులు కూడా వరి పంటకు పొలంలో నిలువ నీరు ఉండాలన్న తప్పుడు అవగాహనతో ఉండేవారు. కాని ఆన్ & ఆఫ్ పద్ధతిలో కూడా వరి పంట పండించవచ్చునని, అధిక దిగుబడులు సాధించవచ్చునని రైతులకు అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. నీటి కొరత ఉన్న ఈ కాలంలో దుబారా తగ్గించి పొదుపుగా వాడుకోవడం, నీటి నిర్వహణలో జోక్యం చేసుకోకుండా, కాలువలను తెగ్గొట్టకుండా క్రమశిక్షణ పాటించగలిగితే సాగునీటి ప్రాజెక్టుల్లో ఇంజనీర్లు చివరి భూములకు కూడా నీరు అందించడానికి కషి చేస్తారు. అది వారు శ్రీరాంసాగర్, నాగార్జున సాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లో నిరూపించి చూపారు. రాబోయే కాలంలో తెలంగాణలో ఎత్తిపోతల పథకాల నుంచి నీటి సరఫరా జరుగుతుంది కనుక ఆయకట్టు రైతులు ఈ క్రమశిక్షణ పాటించాలి. ఇంజనీర్లు మెరుగైన నీటి నిర్వాహణ పద్ధతులను అవలంభించాలి.