ఓ రోజు ఉదయాన బాల్కనీ దండెం మీద

ఓ చివర్న నాల్గు గడ్డిపోచలు, కాసిన్ని తీగలు

అగుపించాయి ఆమెకు, ఆశ్చర్యపడింది

వాటిని దులిపేయబోయి ఆగిపోయింది

మర్నాడు దండెం మీద కిచకిచ!

పిచ్చుకొకటి గూడు అల్లుతున్నది, ఒక్కతే!

చూస్తూన్న ఆమెలో ఒక ఆందోళన, ఏ గాలికో

ఆ పోచలూ ఆ తీగలూ రాలిపోతే ఎట్లాగా అని-

పిచ్చుక మాత్రం పనిలో లీనమై-

శ్రద్ధా, ధ్యాసా, ఓపికా, నిపుణతా – వెరసి

ఒక కుదురైన గూడు, దానికొక ద్వారం, తలుపుల్లేవు-

మరో ఉదయాన ఆమె అంది ఆనందస్వరంతో-

”గూట్లో పిచ్చుక గుడ్లను పెట్టింది”

అంతలోనే ఆమెలో కొత్త ఆందోళన-

బరువుకు గూడు పికిలి కింద పడుతుందేమోనని!

”చూశారా! అది గుడ్లను పొదుగుతున్నది”

ఆమె పరవశంతో అంది మరోనాడు నాలో ఆసక్తి రేపుతూ-

నా యెదలో కిచకిచమొదలైంది

మరి కొన్నాళ్ళకు దండెమ్మీద సందడి!

”గూట్లో ఇపుడు రెండు పిల్లలు”

ప్రకటించిందామె, తల్లి మనసుతో, పరవశంతో-

ఆమె ఇద్దరు పిల్లల తల్లి కదా!

పిచ్చుక వొస్తూ పోతూ , ముక్కుతో ఏవేవో తెస్తూ,

గూటి ద్వారంనుంచి పిల్లల లేత నోళ్లకు ఓర్పుతో అందిస్తూ-

”వాటి దరికి వెళ్ళొద్దు, బెదురుతాయి”

మెత్తగా ఆమె హెచ్చరించింది, తల్లి గొంతుతో-

నేను దూరం నుంచే చూశాను, సష్టిసౌందర్యమంతా అక్కడే

ఆ గూటి దగ్గరే విప్పారి వున్నట్లనిపించింది

కిచకిచ అంత శ్రావ్యమైన భాష మరొకటి లేదని కూడా-

”తెలుసా మీకు! రాత్రిళ్లలో ఆ చిన్ని గూట్లో

ఆ తల్లీ, రెండు పిల్లలు సర్దుకుని బజ్జుంటాయి”

మురిపెంగా ఆమె అంది, బహుశా పిల్లల్ని సర్దిన సవరించిన

తన అనుభవాన్ని నెమరేసుకుంటూ-

దండెం మీద ఒక కుటుంబ నివాసం

గూడు ముందు ఇపుడు మా నాలుగ్గదుల ఇల్లు

చాలా చిన్నదనిపిస్తున్నది

మరొక తెల్లవారుఝామున ఆమె దిగులుజీరతో అంది

”గూడు ఖాళీ అయింది, తల్లీపిల్లలెగిరిపోయారు”

ఆమె చూపులో ఖాళీ ఆకాశాలు!

దండెం ఒంటరైంది, దగ్గరికెళ్ళి చూశాను

గూడు కళాత్మకంగా వుంది, అల్లిన తల్లికి దండాలు!

అనిపిస్తున్నదిపుడు-కళాప్రయోజనాన్ని ఆ తల్లిపిచ్చుక కంటె

ఇంకెవరు బాగా చెప్పగలరని!

కిచకిచలు మాయమై మా ఇల్లు మూగబోయింది

ఒక సందడి కథ ఇక ముగిసిందనుకున్నా-

ఇవాళ ఆమె పొద్దున్నే నన్ను నిద్ర లేపి

దబదబా అంది- ”పిచ్చుక మళ్ళీ వచ్చింది, కొత్త గుడ్లను పెట్టింది”

తల్లి ఆరాటాన్ని ఆమె కళ్ల తేట వెలుగులో చూశాను!

దండెం ఇపుడు మదువుగా వూగుతోంది,

గూటికి కళ వచ్చింది మళ్ళీ!

ముగిసిందనుకున్న కథ ముగియలేదు

కొత్తలేత సందడికోసం ఆమే నేనూ ఎదురుచూస్తున్నాం

ఆ తల్లి పిచ్చుక లాగే!

– దర్భశయనం శ్రీనివాసాచార్య

Other Updates