త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంపొందించడంలో రాజకీయ పార్టీలు ఓటర్లను చైతన్యపర్చాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితా ప్రకటన, ఎన్నికల నిర్వహణ, ఓటింగ్ శాతం పెంపు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అన్ని ప్రధాన పార్టీలు, ప్రధాన పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో దానకిషోర్ మాట్లాడుతూ, రాష్ట్ర రాజధానిగా ఉండి అత్యధిక శాతం అక్షరాస్యత కలిగిన హైదరాబాద్ జిల్లాలో గత ఎన్నికల్లో 52.90 శాతం మాత్రమే ఓటింగ్ నమోదు అయ్యిందని, ఈ ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంపొందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని అన్నారు. ఇప్పటికే ఓటరు చైతన్య కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తున్నామని, జిల్లాలోని 84 మున్సిపల్ వార్డులలో ఈవీఎం, వివిప్యాట్‌ల పై అవగాహన కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నగర ఓటర్లు తమ పోలింగ్ కేంద్రం తెలుసుకోవడానికి వీలుగా ప్రత్యేక యాప్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే తమ ఓటు
ఉన్నది లేనిది ఓటరు జాబితాలో చూసుకోవాలని, లేనట్టైతే సంబంధిత బూత్ స్థాయి అధికారి లేదా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని దానకిషోర్ స్పష్టం చేశారు.
ఫోటో పెట్టు బహుమతి పట్టు
హైదరాబాద్‌లో ఓటింగ్ శాతాన్ని పెంపొందించడానికి చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా ”ఫోటో పెట్టు బహుమతి పట్టు” అనే కార్యక్రమం ద్వారా ఫోటో పోటీలను నిర్వహిస్తున్నట్టు వివరించారు. 18 సంవత్సరాలు నిండి ఓటరు గుర్తింపు కార్డు ఉన్నవారు ఎన్నికలపై మంచి ఫోటోతో కూడిన శీర్షికతో 7993153333 అనే నెంబర్‌కు వాట్సప్ మెస్సేజ్‌ను 16 నవంబర్ 2018 వరకు పంపాలని దానకిషోర్ సూచించారు. హైదరాబాద్ జిల్లాకు చెందినవారై ఉండి వాట్సప్ మెస్సేజ్‌తో పాటు వారి పేరు, ఫోన్ నెంబర్, చిరునామాతో పాటు ఓటరు గుర్తింపు కార్డును వాట్సప్ ద్వారా పంపాలని పేర్కొన్నారు.
దివ్యాంగులకు ఉచిత రవాణా సౌకర్యం
హైదరాబాద్ నగరంలో 29వేల మంది దివ్యాంగుల పింఛన్‌దారులు
ఉన్నారని, వీరిలో ఓటర్లందరిని తప్పనిసరిగా ఓటు వేయించడానికి ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించనున్నట్టు తెలిపారు. ఈ దివ్యాంగుల ఓటర్లను గుర్తించే ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. దివ్యాంగులకు ఓటింగ్ ప్రక్రియ, వివిప్యాట్‌ల పై చైతన్య కార్యక్రమాలు కూడా నిర్వహించామని స్పష్టం చేశారు.
లక్షన్నర మంది కొత్త ఓటర్లు
హైదరాబాద్ జిల్లాలో మొత్తం 39,60,706 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 1,50,000 మంది కొత్తగా ఓటరుగా నమోదు అయినవారు ఉన్నారని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్ వివరించారు. దాదాపు 50వేల మందిని వివిధ కారణాల వల్ల ఓటరు జాబితా నుండి తొలగించామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 3,526 పోలింగ్ కేంద్రాలకు అదనంగా మరో 30కి పైగా అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో వరసగా మూడు సంవత్సరాలు పనిచేసిన రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులను ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి బదిలీ చేశామని దానకిషోర్ పేర్కొన్నారు.
అక్టోబర్ 6వ తేదీ నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని తెలిపారు. వివిధ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ర్యాలీలు, సభలు, సమావేశాల నిర్వహణకు ముందస్తుగా సంబంధిత రిటర్నింగ్ అధికారి నుండి అనుమతి పొందాలని అన్నారు. అదేవిధంగా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలలో ప్రచారం కొరకు నిర్వహించే ప్రకటనలకు ముందస్తుగా జిల్లా మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ నుండి అనుమతి పొందాలని స్పష్టం చేశారు. అదేవిధంగా పెయిడ్ న్యూస్‌లపై నిఘా ఉంచడం జరిగిందని, దీనిని ప్రత్యేకంగా ఎంసిఎంసి కమిటీ సమీక్షించి సంబంధిత రిటర్నింగ్ అధికారుల ద్వారా నోటీసులు జారీచేస్తామని దానకిషోర్ వెల్లడించారు.
ప్రచార అనుమతులకు ఇ-సువిధ
ప్రస్తుత ఎన్నికల్లో ప్రచారానికి నిర్వహించే ర్యాలీలు, సభలు, సమావేశాల నిర్వహణకై ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఇ-సువిధ యాప్‌ను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ ఇ-సువిధ యాప్ ద్వారా ముందస్తు అనుమతులు పొందడానికి సులభంగా ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమణలపై ఫిర్యాదు చేయడానికి సి-విజిల్ అనే యాప్‌ను కూడా ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిందని, ఎక్కడైనా ఎన్నికల నియమావళి అతిక్రమణపై తమ దష్టికి వస్తే వాటి వీడియోలను సి-విజిల్‌లో అప్‌లోడ్ చేయాలని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులు సి.ఇ.ఓ, జిల్లా ఎన్నికల అధికారికి చేరుతుందని, వెంటనే వాటిపై తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, అడిషనల్ కమిషనర్ కెనడి, జాయింట్ కలెక్టర్ రవిలు పాల్గొన్నారు.