రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. జిల్లాలో జనవరి 4, 5, 6 తేదీలలో మూడు రోజులపాటు పర్యటించిన సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి హైదరాబాద్-వరంగల్ రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేయడానికి శంకుస్థాపన గావించారు. అనంతరం గణపురం మండలం చెల్పూరులో కేటీపీపీ రెండోదశలో నెలకొల్పిన 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. వరంగల్‌లో జిల్లా అధికారులతో అభివృద్ధి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వరంగల్‌లో అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కును 3వేల ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. నగరం చుట్టూ రింగ్‌రోడ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి 3వేల కోట్ల ప్రణాళిక బడ్జెట్ ఖర్చుచేయనున్నట్లు ప్రకటించారు. నగరంలో 12 అంతస్థులతో పోలీస్ కమిషనరేట్, అధునాతన కలెక్టరేట్ నిర్మిస్తామని ప్రకటించారు. మొత్తంగా మూడు రోజులు వరంగల్‌లోనే ఉన్న కేసీఆర్ నగరంతో పాటు జిల్లా సమగ్ర అభివృద్ధికి పలు ప్రణాళికలు రూపొందించారు.
1 రహదారుల విస్తరణకు రూ. 43వేల కోట్లు
తెలంగాణలో రహదారుల విస్తరణకు రూ. 43వేల కోట్లు కేంద్రం నుంచి ఇవ్వనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణాశాఖా మంత్రి నితిన్ గడ్కరి ప్రకటించారు. జనవరి 4న ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి 163వ రహదారి (నల్లగొండ జిల్లా రాయగిరి నుంచి వరంగల్ సమీపంలోని ఆరెపల్లి వరకు) నాలుగు వరసల విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఏటూరు నాగారం ముల్లెకట్ట వద్ద గోదావరి నదిపై నిర్మించిన వంతెనను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలను హన్మకొండ సమీపంలోని మడికొండ వద్ద నిర్వహించారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహాయాన్ని అందిస్తుందని, రహదారులకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్పించిన ప్రతిపాదనలు అన్నింటినీ ఆమోదిస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన దానికి అదనంగా మరో 110 కిలోమీటర్లు జోడించి తెలంగాణ ప్రాంతంలో 1800 కిలోమీటర్ల జాతీయ రహదారులకు రూ. 43వేల కోట్లు వ్యయం చేయనున్నట్లు నితిన్ గడ్కరి ప్రకటించారు. అలాగే నౌకాయానం అతి తక్కువ ఖర్చుతో సాధ్యమవుతుందని అంటూ గోదావరి నదిపై నౌకాయానానికి అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. నౌకాయానం కాలుష్య నియంత్రణ రవాణా వ్యవస్థగా ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, తాము కేంద్రంతో కలిసి పనిచేస్తామన్నారు. ”మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు సహకరిస్తే మాకు కూడా కేంద్రంపై విశ్వాసం కలుగుతుంది, మాకు మేలు చేసిన వారిని ఎప్పటికీ మరువబోము” అన్నారు. తెలంగాణలో ఎక్స్‌ప్రెస్ హైవేకు స్థానం కల్పించినందుకు, తాము రహదారులకు సంబంధించి సమర్పించిన ప్రతిపాదనలు అన్నీ ఆమోదించి నందుకు ఆయన కేంద్ర మంత్రి గడ్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమను మళ్ళీ తెరిపించాలని కోరారు. వరంగల్‌లో ఇప్పటికే ఏర్పాటు అయిన వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం, సైనిక పాఠశాల, త్వరలో ఏర్పాటు కానున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, గిరిజన విశ్వవిద్యాలయం, టెక్స్‌టైల్ పార్కులకు జాతీయ రహదారి విస్తరణ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పలువురు మంత్రులు, ఎం.పి.లు, ఎమ్మేల్యేలు పాల్గొన్నారు.
2 విద్యుత్ కేంద్రం జాతికి అంకితం
వరంగల్ జిల్లాలో రెండోరోజు పర్యటనలో భాగంగా జనవరి 5న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జిల్లాలోని చెల్పూరు వద్ద నిర్మించిన కేటీపీపీ రెండవ దశలో నెలకొల్పిన 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. ఇది త్వరగా పూర్తికావడానికి కష్టపడ్డ అధికారులను, చైర్మన్ ప్రభాకరరావు, విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డిని ఆయన అభినందించారు.
తెలంగాణ వేరైతే విద్యుత్ కొరతతో రాష్ట్రం అంధకారమవు తుందని ప్రచారం చేశారని, కానీ ఇప్పుడు ఎంతో నాణ్యమైన విద్యుత్‌ను 24 గంటలు సరఫరా చేయగలుగుతున్నామని సీఎం అన్నారు. కష్టపడితే సాధ్యంకానిది ఏదీ లేదని మనం నిరూ పించామన్నారు. కాళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించి గోదావరిలో తెలంగాణకు రావాల్సిన వాటా నీరు తేవడానికి ప్రణాళికలు సిద్దమయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వరంగల్ జిల్లాలో పెద్ద చెరువులైన రామప్ప, లక్నవరం, గణపురం చెరువుల్లో ఎప్పుడు పుష్కలంగా నీరు ఉంటుందన్నారు. రైతులు కాలువల కిందే మూడు పంటలు పండించుకోవచ్చన్నారు.
సమైక్య రాష్ట్రంలో నీటిపారుదల పథకాలను తెలంగాణకు నీళ్ళు వచ్చేలా కట్టలేదని సీఎం పేర్కొన్నారు. భూపాలపల్లిలో భీంగణపూర్ చుట్టు గ్రామాలకు ఒక ఎత్తిపోతల మంజూరీ చేసి ఫిబ్రవరిలో పనులు మొదలుపెడతామని సీఎం తెలిపారు. వరంగల్ ప్రజలకు ఎంత చేసినా తక్కువేనన్నారు. జిల్లా అభివృద్ధి కోసం ప్రతి బడ్జెట్‌లో రూ. 300 కోట్లు కెటాయించనున్నట్లు ప్రకటించారు. త్వరలో దళిత, మైనారిటీ విద్యార్థుల కోసం 200 గురుకుల పాఠశాలలను ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని గాంధీనగర్‌లో పోలీస్ బెటాలియన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పీజీ, పాలిటెక్నిక్ కళాశాలలు కూడా మంజూరీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
3 జిల్లా అభివృద్ధిపై సమీక్ష
వరంగల్ జిల్లాలో జరుగుతున్న ‘మిషన్ భగీరథ’ పనులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సమీక్షించారు. అధికారులు, వర్కింగ్ ఏజన్సీలతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడత 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు మంచినీరు అందించాలని నిర్ణయించామన్నారు. వరంగల్ జిల్లా జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాలతో పాటు మెదక్ జిల్లా గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, నల్లగొండ జిల్లా ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి నియోజకవర్గాలకు నాలుగు నెలల్లోనే మంచినీరు ఇవ్వాలన్నారు.
పైపులైన్ల ఏర్పాటుతో పాటు అన్ని పనులు సమాంతరంగా జరగాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి వారం వారం కార్యాచరణ రూపొందించి, దానికి అనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు. అధికారులు, వర్కింగ్ ఏజెన్సీల వెంటపడి పనులు చేయించే బాధ్యత ప్రజాప్రతినిధులు స్వీకరించాలన్నారు.
వరంగల్ జిల్లాలో ఐదు సెగ్మెంట్ల ద్వారా పనులు జరుగుతున్నాయని, ఇన్ టేక్ వెల్స్, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు, పైప్ లైన్స్, నల్లాలు, గ్రామాల్లో పైప్ లైన్స్ తదితర పనులను సిఎం సమీక్షించారు.
ఏ మండలానికి ఎక్కడి నుంచి నీరు తెస్తారు? వాటి పనుల పురోగతి అంశాన్ని సిఎం స్థానిక అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. పైప్ లైన్ నిర్మాణానికి రైట్ ఆఫ్ వే చట్టాన్ని తెచ్చినందున, రెవెన్యూ అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. విద్యుత్ లైన్ల నిర్మాణం కూడా సిఎం సమీక్షించారు. పైప్ లైన్స్ నిర్మాణం అయిన వెంటనే నీరు ఇచ్చే విధంగా విద్యుత్ సరఫరా జరగాలని ఆదేశించారు. పాలేరు, ఎల్‌ఎండి, హెచ్‌ఎండబ్ల్యుఎస్, గోదావరి, మంగపేట సెగ్మెంట్ల ద్వారా జిల్లాలోని అన్ని మండలాలకు వచ్చే ఏడాది మార్చి నాటికి మంచినీళ్లు ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందించాలన్నారు.
4 నాణ్యత విషయంలో రాజీవద్దు
మిషన్ కాకతీయ మొదటి విడతలో చేపట్టిన 1,062 చెరువుల పునరుద్ధరణ పనులను, రెండో విడతలో చేపట్టే పనులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సమీక్షించారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు చేయాలని, గత ఏడాది చేపట్టిన పనులను మార్చి నాటికి పూర్తి చేయాలని, రెండో విడత కార్యక్రమం వెంటనే ప్రారంభించాలని, అన్ని పనులూ సమాంతరంగా జరగాల న్నారు. చెరువు భూములు కాపాడడానికి సర్వే నిర్వహించి, హద్దులు నిర్ణయించాలన్నారు. చెరువు చుట్టూ చెట్లు పెంచాలని చెప్పారు. పూడిక మట్టిని పొలాలకు తరలించాలని, పొలాలకు పనికి రాని మట్టితో పాడుపడిన బావి బొందలు పూడ్చాలని ఆదేశించారు. చెరువు హద్దులు నిర్ణయించడానికి ఔట్ సోర్సింగ్ ఏజన్సీలతో సర్వే చేయించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీ లిస్తున్నదన్నారు. చెరువుల పునరుద్ధరణ, హద్దుల నిర్ణయంలో ఆయకట్టు దారులను భాగస్వామ్యం చేయాలన్నారు.
అప్పుడు కాలువలు.. ఇప్పుడు రిజర్వాయర్లు
ఎనిమిది వేల క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన కాకతీయ కాలువల మరమ్మతులను సిఎం సమీక్షించారు. పూర్తి స్థాయి నీటి ప్రవాహ సామార్థ్యం ప్రకారం నీరు ప్రవహించేలా కాలువలు సిద్ధం చేయాలన్నారు. మెయిన్ కాలువతోపాటు, డిస్ట్రిబ్యూటరీలు, ఫీల్డ్ కెనాల్స్ బాగు చేయాలని చెప్పారు. కాకతీయ కాలువకు ఎక్కడ ఏ పని చేయాలనే విషయంపై అంచనాలు రూపొందించాలన్నారు. దేవాదుల ప్రాజెక్టును ఉపయుక్తమైన ప్రాజెక్టుగా మార్చాలన్నారు. దేవాదుల కింద కట్టాల్సిన రిజర్వాయర్లకు భూసేకరణ జరపాలన్నారు.
గత ప్రభుత్వ హయాంలో రిజర్వాయర్లు లేకుండానే కాల్వలు తవ్వారని, ఇప్పుడు కాలువలన్నీ ఉపయోగంలోకి వచ్చే విధంగా రిజర్వాయర్లు నిర్మించాలన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ ద్వారా జిల్లా అంతటికి నీరందుతుందన్నారు. దేవాదులకు బ్యారేజ్ కట్టి ములుగు, నర్సంపేట, భూపాలపల్లి, పరకాల-మల్లన్నసాగర్, ద్వారా జనగామ, స్టేషన్ ఘనపూర్, కొంతమేర పాలకుర్తికి, ఎస్‌ఆర్‌ఎస్పి ద్వారా వర్థన్నపేట, పాలకుర్తి, మానుకోట, డోర్నకల్ నియోజకవర్గాలకు నీరు అందుతుందన్నారు. కరువు పరిస్థితులున్న జనగామ, స్టేషన్ ఘనపూర్, పాలకుర్తిపై ప్రత్యేక దష్టి పెట్టాలని, దేవాదుల ద్వారా మూడు నియోజకవర్గాల్లో చెరువులు నింపాలని ఆదేశించారు. దేవాదుల, ఎస్‌ఆర్‌ఎస్పి ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో వినియోగించుకు నేందుకు అవసరమైన రిజర్వాయర్లు కట్టాలని చెప్పారు. ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం ప్రాజెక్టు కింద రొళ్లపాడు, బయ్యారం రిజర్వాయర్ల ద్వారా మహబూబాబాద్, డొర్నకల్ నియోజకవర్గాలకు సాగునీరు అందుతుందన్నారు.
కళ్యాణలక్ష్మి – షాదీ ముబారక్
ఈ పథకం కింద అందే డబ్బులు పెండ్లికి ముందే అందించాలని, పెండ్లి చేసే ఆడపిల్ల తల్లికి డబ్బులు అందే విధానం రూపొందిస్తామని సీఎం చెప్పారు. ఈ పథకంలో ఎట్టి పరిస్థితుల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూడాలన్నారు.
నిరంతర విద్యుత్
వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరాకు తీసుకుంటున్న చర్యలను సిఎం సమీక్షించారు. చెడిపోయిన ట్రాన్స్ ఫార్మర్ల మార్పిడి పనులు తొందరగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సేద్యానికి 9 గంటల విద్యుత్ ఇవ్వడానికి అనుగుణంగా వరంగల్ జిల్లాలో కొత్త సబ్ స్టేషన్లు, లైన్లు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయాలని, ఏప్రిల్ నెలాఖరు వరకు పనులు పూర్తి కావాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 42 కొత్త సబ్ స్టేషన్లు నిర్మిస్తామన్నారు. నిరంతర విద్యుత్, రైతులకు 9 గంటల విద్యుత్ సరఫరా వల్ల ఉత్పన్న మయ్యే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, అధిక లోడ్‌ను ఎదుర్కొనే చర్యలు తీసుకోవాలన్నారు.
మేడారం జాతరపై వెబ్‌సైట్
మేడారం జాతర సందర్భంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చిపోయే విధంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆదేశించారు. ట్రాఫిక్ జాం కాకుండా, తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మేడారం పనులన్నీ జనవరి చివరి నాటికి పూర్తికావాలన్నారు. జాతర కోసం రూ. 101.87 కోట్లు ఇచ్చినందున అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
మహిళలు బట్టలు మార్చుకునేందుకు వీలుగా గదులు ఏర్పాటు చేయాలని, మంచినీటి నల్లాల దగ్గర వీధి ప్లాట్ ఫామ్ నిర్మించాలని సూచించారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జాతరలో ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించడానికి ఎన్జీవోలు, ప్రైవేట్ ఆసుపత్రులను భాగస్వామ్యం చేయాలన్నారు. జాతర కోసం చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ కరుణ, ఎస్పీ కిశోర్ జా వివరించారు. మేడారం జాతర సందర్భంగా జిల్లాలోని ఇతర చోట్ల కూడా సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది కాబట్టి, అక్కడా ఏర్పాట్లు చేయాలన్నారు. మేడారం జాతర వెబ్ సైట్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.