gandhiజి. వెంకటరామారావు

రామాయణ, భారతాలు మన జాతిని ఎంత ప్రభావితం చేశాయో గాంధీ అన్న వ్యక్తి కూడా గత వంద సంవత్సరాలుగా భారతీయులను అంతమంత్రముగ్ధుల్ని చేశారు. దండెత్తివచ్చే వారందరికీ దాసోహమనడం అలవాటులేని భారతజాతిని రవి అస్తమించని సామ్రాజ్యం అని విర్రవీగిన బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులను ఏ ఆయుధమూ అక్కరలేకుండా పరాజితుల్ని చేసే ఆయుధంగా తీర్చిదిద్దిన మహాశక్తి స్వరూపం గాంధీజీ. అహింసాయుత యుద్ధం నడపడంలో ఆయనకు మానవచరిత్ర అంతటిలోకూడా ఎవరూ సాటిరారు. స్వాతంత్య్ర పోరాటం నడపడానికి గాంధీజీ భారతీయ ఆత్మనే ఆయుధంగా మలుచుకున్నారు. జాతిజనులు ఆయనను ఏనాడూ రాజకీయ నాయకుడుగా చూడలేదు. స్వాతంత్య్రోద్యమం పొడవునా ఆయన నడిపిన అన్ని ఉద్యమాలూ భారతీయ ఆత్మను చైతన్యపరిచినవే. ప్రజలమీద ఆయనకున్న విశ్వాసం మరే నాయకుడికీ లేదంటే అతిశయోక్తికాదు. విభిన్నమతాలు, కులాలు, వర్గాలు, భాషలు, సంస్కృతుల సమ్మేళనం అయిన భారతజాతిని ఒక్కతాటిమీదకి తేవడం గాంధీజీకి చేతనైనట్టుగా మరొకరికిచేతకాలేదు. భారతీయ సంస్కృతి మూలాలు ఏమిటో తెలసినందువల్లే దాస్యశృంఖాలాల్లో మగ్గుతున్న ఈ నేలను ఆయన మేలుమాగాణం కింద మలచుకున్నారు. మానవ మనస్తత్వపు లోతులను అన్వేషించి వారిని ఆచరణలోకి దించగల ప్రజ్ఞాపాటవాలు అనితర సాధ్యంగా గాంధీజీలో నిబిడీకృతమైనందువల్లనే ఆయన సఫలీకృతులుకాగలిగారు. వ్యక్తిగతంగా సత్యనిష్ఠ,

రుజువర్తనం, లక్ష్యశుద్ధి ఆధారంగానే ఆయన ప్రజల్లో ధ్యేయనిష్ఠను, కర్తవ్య దీక్షను పాదుకొల్పగలిగారు. నిరాడంబరంగా ఉండడమే ఆయనకు ఆభరణం. వాగాడంబరంలేకపోయినా ఆయన మాటను సహచరులెవ్వరూ జవదాటలేకపోయారు. భారతీయ సంస్కృతీసారం గ్రహించినందువల్లే ఆయన జాతీయ పోరాటానికి కావల్సిన నైతిక విలువల వ్యవస్థను రూపొందించగలిగారు.

ఇరువయ్యో శతాబ్దపు మహా మహితాత్ముడు గాంధీజీ. అంతటి వ్యక్తి పది శతాబ్దాల్లో ఒక్కరే జన్మిస్తారని డా. లోహియా అభిప్రాయం. గాంధీజీ వ్యక్తిత్వం సాటి లేనిది. రోమారోలా, అర్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఆర్నాల్డ్‌ టాయిన్సీలాంటి విదేశీ ప్రముఖులు ఎందరో ఆయనను అనేక విధాలా స్తుతించారు. ‘గౌతమబుద్దుని తరువాత భారతదేశంలోనూ, ఏసుక్రీస్తు తర్వాత ప్రపంచంలోనూ గాంధీజీ అంతటివాడే పుట్టలేదు’ అని అన్నారు.

మహాత్మాగాంధీ పూర్తిపేరు మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ. కాథయావడ్‌లోని పోరుబందర్‌లో ధర్మనిష్ఠగల కుటుంబంలో 1869 అక్టోబరు 2వ తేదీన ఆయన జన్మించారు. ఇంగ్లాండ్‌లో బారిష్టరు పట్టాపుచ్చుకుని 1891లో స్వదేశానికి తిరిగొచ్చి న్యాయవాద వృత్తి చేపట్టారు. 1893లో ఒక కేసు సందర్భంగా దక్షిణాఫ్రికా వెళ్లారు. ఏడాదిపాటు ఉందామని వెళ్లి ఇరవై ఏళ్లపాటు అక్కడే ఉండిపోయారు. అక్కడికి వెళ్లిన భారతీయులపై తెల్లవారి ప్రభుత్వం జరుపుతున్న అత్యాచారాలపై సత్యాగ్రహం జరిపి విజయం సాధించారు. ఆత్మనే ఆయుధంగాచేసి గెలిచారు. పీడితులై, బాధితులై, దిక్కుతోచని స్థితిలో బతుకుతున్న వేలాది ప్రజల బాగోగులతో ముడిపడిన సమస్యలు ఆయన తన నైతిక సిద్ధాంతాల బలంతో పరిష్కరించారు. ఆత్మబలంపట్ల విశ్వాసాన్ని మేలుకొలిపి, ఆయన దక్షిణాఫ్రికాలోనూ, ఆ తర్వాత స్వరాజ్య ఉద్యమంలోనూ రష్యన్‌ విప్లవంకన్నా, ఫ్రెంచ్‌ విప్లవంకన్నా మహత్తర విప్లవానికి భారతదేశంలో అంకురార్పణ చేశారు. సత్యాగ్రహ అస్త్రాన్ని ప్రయోగించి, ఆయన రాజకీయరంగాన్ని ఆధ్యాత్మిక విలువలతో ముంచెత్తారు. 1914లో స్వదేశానికి తిరిగివచ్చారు.

స్వదేశానికి తిరిగివచ్చిన తర్వాత స్వరాజ్య సమర సారధి అయి భారత ప్రజానీకంలో నవ చైతన్యం పూరించారు. స్వదేశీ వ్రతం, ఖాదీ గ్రామీణ పరిశ్రమల వికాసం, మద్య నిషేధం, అస్పృశ్యతా నిర్మూలన, బేసిక్‌ విద్య, మత సామరస్యం, ప్రకృతి వైద్యం, జాతీయ భాషగా హిందూస్తానీ ప్రచారం మున్నగు ఉద్యమాలద్వారా జాతి బహుముఖ ప్రగతికి రాచబాటవేశారు. మహిళల విముక్తికి ప్రత్యేక ఉద్యమాలంటూ నడుపకుండానే ఆయన కల్లు దుకాణాల పికెటింగ్‌లోనూ, సత్యాగ్రహాలలోనూ మహిళలను ముమ్మరంగా పాల్గొనేవిధంగా చేశారు.

1916 ఫిబ్రవరిలో బెనారస్‌ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవ సభ జరిగింది. విశ్వవిద్యాలయాన్ని బ్రిటిష్‌ వైస్రాయ్‌ శంఖుస్థాపన చేశారు. దేశంలోని సంస్థానాధీశులు, రాజకీయ, సాంఘిక రంగాలలోని ప్రముఖులు ఎందరో ఆనాటి సభకు హాజరైనారు. గాంధీజీ మామూలు ఖద్దరు దుస్తులు మాత్రమే ధరించి వెళ్లారు. తనవంతు రాగానే వేదికమీద నిలబడి తనచుట్టూఉన్న మహారాజులు, సంస్థానాధీశుల ఆడంబర జీవితాన్ని నిశితంగా విమర్శిస్తూ ఇలా అన్నారు-

‘ఇక్కడ చేరిన ప్రముఖులకు ఒక్కమాట చెప్పాలనుకున్నాను. మీవద్దగల సంపదను, ఆభరణాలను విసర్జించి, దేశప్రజల శ్రేయస్సు నిమిత్తం, ధర్మకర్తలుగా వ్యవహరించని పక్షంలో భారతదేశానికి మోక్షంలేదని నా అభిప్రాయం. చక్రవర్తి తనమీద గౌరవంతో నిండు ఆభరణాలు ధరించి రమ్మని కోరలేదు’ వైస్రాయ్‌తో సహా అంతా నిర్ఘాంత పోయారు. పీడితులన్నా, బాధితులన్నా బాపుకు ఎంతో అభిమానం. బీహార్‌ రాష్ట్రంలో చంపారన్‌ జిల్లాలో తోటల యజమానులైన యూరోపియన్లు రైతులకు కూలీ ఇవ్వకుండా నీలిమందు పండించమని బలవంతం పెట్టినప్పుడు, గుజరాత్‌ ఖేడా జిల్లాలో క్షామం, అనావృష్టి ఫలితంగా రైతులపై అన్యాయంగా పన్నులు విధించినప్పుడు, అహ్మదాబాద్‌లో మిల్లు కార్మికులకు సరిఅయిన వేతనాలివ్వడానికి యజమానులు నిరాకరించినప్పుడు గాంధీజీ వారి తరఫున నాయకత్వం వహించి వారికి న్యాయం చేకూర్చారు. ఆ తప్పులు, అన్యాయం తొలగించడానికి గాంధీజీ సత్యాగ్రహం సాగించారు. అంటే-ఎన్నో కష్టాలకులోనై ఎదుటివారి హృదయంలో పరివర్తన సాధించడం ఈ సత్యాగ్రహంవల్లనే బాపూజీ భారతదేశానికి స్వేచ్ఛ సాధించగలిగారు. 1920-21లో సహాయ నిరాకరణోద్యమం, 1930-1932లో ఉప్పు సత్యాగ్రహం, 1940-1941 లో క్విట్‌ ఇండియా ఉద్యమాలకు ఆయన నాయకత్వం వహించారు. దేశంలో పేరుపొందిన నాయకుల సహకారంకూడా పొందగలిగారు. వీటికోసం వేలాదిమంది అపూర్వ త్యాగాలు చేశారు. వేలాదిమంది పోలీసు లాఠీలకు, తుపాకుల కాల్పులకు గురై, అసువులర్పించారు, క్షతగాత్రులయ్యారు. అనేకసార్లు జైళ్లకెళ్లారు. అధికారులు పెట్టిన క్రూరమైన బాధలనీ, అవమా నాలని సహించారు. ప్రపంచ చరిత్రలో ఎన్నో స్వాతంత్య్రోద్య మాలు వచ్చాయి కానీ పీడిత ప్రజలు, తమను బానిసలుగా చేసిన పాలకులపై ఏ విధమైన హింస జరుపకుండా, తామే అన్ని బాధలుపడి స్వాతంత్య్రం సాధించిన సాహసోదంతం ఎక్కడా కనబడదు. ఈ ఉద్యమంలో ప్రజలు భయపడలేదు. హింసాత్మక చర్యలులేవు. ఆత్మబలంతో పశుబలాన్ని ప్రతిఘటించడమే ఈ ఉద్యమ లక్ష్యం.

జవహర్‌లాల్‌ నెహ్రూ చెప్పినట్టు యాభైఏళ్ళపాటు అతని క్రమశిక్షణలో పెరిగిన భారతజాతికి అతడు జాతిపిత, మన స్వేచ్ఛాజీవన నిర్మాత. భారతదేశపు పురాణ సంప్రదాయాల నాకర్షించుకుని స్వేచ్ఛాజ్యోతితో, నిద్రాముద్రితమైన జాతిని బాపు మేల్కొలిపాడు.

బాపులాంటి మహాత్ములు ఎన్ని యుగాలకోసారి జన్మిస్తారు. అతడీలోకానికి అతీతుడు. ఒక మహోజ్జ్వల తార.

ప్రపంచ విఖ్యాతి పొందిన విజ్ఞాననేత్ర అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ ‘ఈ భూమిమీద అట్టి మహాత్ముడు ఒకరు మనుగడ సాగించారంటే ముందుతరాలు బహుశా నమ్మనుకూడా నమ్మకపోవచ్చును!’ అని వివరించారు.

బాపును గురించి తలచుకున్నప్పుడు గురుదేవు రవీంద్రుడు చెప్పిన మాటలు జ్ఞాపకం వస్తాయి.

‘జ్యోతి తాను కాలిపోతున్నా ఇతరులకు వెలుతురిస్తుంది’.

ఇక్కడ చేరిన ప్రముఖులకు ఒక్కమాట చెప్పాలనుకున్నాను. మీవద్దగల సంపదను, ఆభరణాలను విసర్జించి, దేశప్రజల శ్రేయస్సు నిమిత్తం, ధర్మకర్తలుగా వ్యవహరించనిపక్షంలో భారతదేశానికి మోక్షంలేదని నా అభిప్రాయం.

చక్రవర్తి తనమీద గౌరవంతో నిండు ఆభరణాలు ధరించి రమ్మని కోరలేదు..

ఆత్మబలంపట్ల విశ్వాసాన్ని మేలుకొలిపి, ఆయన దక్షిణాఫ్రికాలోనూ, ఆ తర్వాత స్వరాజ్య ఉద్యమంలోనూ రష్యన్‌ విప్లవంకన్నా, ఫ్రెంచ్‌ విప్లవంకన్నా మహత్తర విప్లవానికి భారతదేశంలో అంకురార్పణ చేశారు. సత్యాగ్రహ అస్త్రాన్ని ప్రయోగించి, ఆయన రాజకీయరంగాన్ని ఆధ్యాత్మిక విలువలతో ముంచెత్తారు. 1914లో స్వదేశానికి తిరిగివచ్చారు.

Other Updates