ktrటర్‌ రింగురోడ్డు చుట్టూ అన్ని సౌకర్యాలతో మరో కొత్త హైదరాబాద్‌ను నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌, పురపాలక శాఖల మంత్రి కె. తారక రామారావు చెప్పారు. ఫ్యాబ్‌సిటీ వంటి చోట్ల రోడ్లు, నీళ్లు, విద్యుత్‌ తదితర మౌలిక సదుపాయాలు కల్పించి, అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రాంతానికి మాల్స్‌, హాస్పిటల్స్‌, హోటల్స్‌ వంటివి తీసుకొస్తామని, ఔటర్‌ రింగురోడ్డు చుట్టూ 13 చోట్ల అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడంద్వారా రేపటి కొత్త హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించిన సందర్భంగా టీఎస్‌ ఐపాస్‌ అద్భుతమని ప్రశంసించారని, అన్ని రాష్ట్రాలు ఈ తరహా విధానాన్ని అనుసరించాలని పేర్కొన్నారని కేటీఆర్‌ గుర్తు చేశారు. ప్రధాని అభినందనలు ఆషామాషీగా వచ్చిందేమీ కాదని చెప్పారు. రాష్ట్రంలో మైక్రోమాక్స్‌ కంపెనీ ఏర్పాటే ఇందుకు నిదర్శనమని అన్నారు. వేరే రాష్ట్రంలో మైక్రోమాక్స్‌ తన కంపెనీ ఏర్పాటు చేసేందుకు రెండున్నరేండ్లు పడితే.. తెలంగాణలో ఆరు నెలల సమయమే పట్టిందని చెప్పారు.

రంగారెడ్డి జిల్లా రావిర్యాల పరిధిలోని ఫ్యాబ్‌సటీలో నెల కొల్పిన మైక్రోమ్యాక్స్‌ సెల్‌ఫోన్‌ తయారీ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్‌ ఏప్రిల్‌ 7న లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు మైక్రోమాక్స్‌ ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. రాబోయే ఐదేండ్లలో భారీ పెట్టుబడులతో 2వలే నుంచి 3వలే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం, అందులో స్థానికులకే పెద్దపీట వేయడంపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో మనమే నంబర్‌వన్‌ టీఎస్‌ ఐపాస్‌ ద్వారా రాష్ట్ర స్థాయిలో 389 సంస్థలు, జిల్లా స్థాయిలో 1302 కంపెనీలు.. మొత్తం 1691 కంపెనీలు వచ్చాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మొత్తం రూ .20,347 కోట్ల పెటుబ్టడులు రావడమే కాకుండా 30వేల మందికి ప్రత్యక్ష ఉపాధి దక్కిందని చెప్పారు. ఎంవోయూలు కుదుర్చుకోవడం, అనుమతులివ్వడమే కాకుండా, అలా ముందుకు వచ్చిన సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించాలి. అందుకే మేం అనుమతిచ్చిన వాటిలో 840 కంపెనీల యూనిట్లు ఉత్పత్తులకు వచ్చాయి అని కేటీఆర్‌ తెలిపారు. మైక్రోమాక్స్‌ సహా ఈ కంపెనీలన్నీ కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా అనుమతులు పొందాయన్నారు. ఒక్క ఆన్‌లైన్‌ దరఖాస్తుతోనే అనుమతులన్నీ పొందవచ్చు. కార్మిక చట్టాలను సవరించాం. ఒక్కసారి అనుమతి పొందితే పదేండ్లు పునరుద్ధరణ తలనొప్పులు లేకుండా చూశాం. ఇలా వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో తెలంగాణ టాప్‌లో నిలుస్తున్నది అని మంత్రి వివరించారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం పెట్టుకున్న వారి కండ్లల్లో ఆనందం చూసేందుకు సీఎం కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారని కేటీఆర్‌ చెప్పారు. అందుకే ఉన్నత విద్యావంతులకే కాకుండా.. ఐటీఐ, ఇంటర్‌, డిగ్రీ, పదో తరగతి చదివిన వారికి కూడా ఉద్యోగాలు కల్పించగల సంస్థలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

స్థానికులకు 90% ఉపాధి కల్పించడం అభినందనీయం నిర్ణీత సమయంలో మైక్రోమాక్స్‌ కంపెనీ తమ ఉత్పత్తిని ప్రారంభించడం, స్థానికులకు 90% ఉపాధి కల్పించడం అభినందనదనీయమన్నారు మంత్రి మహేందర్‌ రెడ్డి. రంగారెడ్డి జిల్లా మొత్తం అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం క్రియాశీలకంగా ముందుకువెళ్తున్నదని చెప్పారు. ఇందుకు జిల్లా ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గాన్ని వేగంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకంగా పనిచేస్తున్నదని తెలిపారు. ఐటీ, ఎలక్ట్రానిక్‌, మెడికల్‌ కంపెనీలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా నియోజకవర్గంలో నూతన మార్పులు చోటుచేసుకుంటున్నాయని అన్నారు.

ఆరు నెలల్లో అనుమతి, ఉత్పత్తి! 
దేవుడి దయ, తెలంగాణ ప్రభుత్వం సహాయ సహకారాలవల్ల తమ ఉత్పత్తి కేంద్రాన్ని అతి తక్కువ సమయంలో ప్రారంభించుకోగలిగామని మైక్రోమాక్స్‌ సహ వ్యవస్థాపకుడు రాజీవ్‌ అగర్వాల్‌ ఆనందం వ్యక్తం చేశారు. తాము సెల్‌ఫోన్‌ల ఉత్పత్తిని 2008లో ప్రారంభించామని, ప్రస్తుతం దేశంలో టాప్‌3 స్థానంలో ఉన్నామని చెప్పారు. ప్రపంచంలోనే టాప్‌ 10 బ్రాండ్లలో తెలంగాణ రాష్ట్రం ఒకటని తెలిపారు. తాము కొత్త ప్లాంటు ఏర్పాటుకు ఓ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించగా అన్ని అనుమతులు వచ్చి ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభమయ్యేందుకు రెండున్నరేండ్లు పట్టిందని, అదే తెలంగాణ రాష్ట్రంలో ఆరునెలల్లో అన్ని అనుమతులు పొంది, ఉత్పత్తి కూడా మొదలుపెట్టామని రాజీవ్‌ అగర్వాల్‌ వివరించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. విద్యుత్‌ సమస్య ఉందని తాము చెప్పిన నాలుగు గంటల్లోగా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను తీసుకువచ్చారని తెలిపారు. మొదటి దశలో సెల్‌ఫోన్లను ఉత్పత్తి చేస్తున్నామని, రాబోయే రెండేండ్లలో సెల్‌ఫోన్‌ చార్జర్‌, బ్యాటరీవంటివి సైతం తయారు చేస్తామని వివరించారు. అటుపై ట్యాబెట్లు, ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ టీవీలు తయారు చేయనున్నట్లు ప్రకటించారు. పరిశ్రమ అవసరాలకోసం 20 ఎకరాల స్థలం ఇచ్చి, అన్ని అనుమతుల కేవలం నెలలోగా అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మొత్తం 650 మంది ఉద్యోగుల్లో 90 శాతం మంది స్థానికులకే అవకాశాలు కల్పించామని అగర్వాల్‌ చెప్పారు. ఇంటర్‌, పాలిటెక్నిక్‌ చదివిన వారిని ఎంపిక చేసుకొని తమ రుద్రపూర్‌ ప్లాంట్‌లో శిక్షణ ఏర్పాటుచేసినట్లు వివరించారు.

హౖదరాబాద్‌లో ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ 
తమ పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) సెంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే ఇక్కడే ఏర్పాటు చేస్తామని రాజీవ్‌ అగర్వాల్‌ పేర్కొనగా.. తక్షణమే సానుకూలంగా స్పందించిన కేటీఆర్‌.. ఆర్‌అండ్‌డీ సెంటర్‌కు కావాల్సిన భూమి, ఇతర అనుమతులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వేదికపైనే ప్రకటించారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి అగర్వాల్‌ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా మొబైళ్లకు డిమాండ్‌ పెరుగుతుండటంతో వచ్చే ఐదు నుంచి ఆరేండ్లలో వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. 2022-23 నాటికి హైదరాబాద్‌ యూనిట్‌లోనే విడిభాగాలు తయారు చేయాలనే ప్రతి పాదన ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొబైల్‌ క్లస్టర్‌లో విడిభాగాలకు సంబంధించిన ప్లాంట్లు కూడా వస్తుండటంతో కంపెనీకి లాభం చేకూరనున్నదన్నారు. 19 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్న ఈ ప్లాంట్‌లో 650 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, దీంట్లో 90 శాతం రాష్ట్రానికి చెందిన వారు కావడం విశేషం. వచ్చే నెల రోజుల్లో ఉద్యోగుల సంఖ్యను వెయ్యికి  పెంచుకోవాలనుకుంటన్నది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.12 వేల కోట్లుగా నమోదైన టర్నోవర్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉందన్నారు.

తమకు స్థానికంగా ఉపాధి దొరికింది 
మైక్రోమాక్స్‌ కేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత.. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల అనుభవాలు మంత్రి కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. మైక్రోమాక్స్‌ ప్లాంట్‌ అంతా కలియతిరిగిన కేటీఆర్‌.. సెల్‌ఫోన్‌ల తయారీ ప్రక్రియను పరిశీలించారు. అదే సమయంలో సిబ్బందితో మాట్లాడారు. అనంతరం సభ వద్ద సంస్థకు చెందిన మహిళా ఉద్యోగులు మాట్లాడుతూ.. తమకు స్థానికంగా ఉపాధి దొరికిందని హర్షం వ్యక్తం చేశారు. అత్యుత్తమ సదుపాయాలతో ఉద్యోగం చేసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు కె. సుదీర్ రెడ్డి మంత్రి  కేటీఆర్ కు వినతిపత్రం అందజేశారు కం పెనీల ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు.

Other Updates