tsmagazine
జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధులకు కూడా కంటిచూపు ఎంతో ముఖ్యమని, తాము ఏ పని చేసుకోవాలన్నా చూపు కావాల్సిందేనని, అలాంటి కంటిచూపును అశ్రద్ధ చేయకుండా పరీక్ష చేయించుకుని, శస్త్ర చికిత్సలు చేయించు కోవడం ఎంతో అవసరమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. మెదక్‌జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని మల్కాపూర్‌ గ్రామంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ”కంటివెలుగు” కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయిదుగురికి కంటి అద్దాలను అందచేశారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని తన స్వంత నియోజకవర్గమైన గజ్వేల్‌ నియోజకవర్గం మల్కాపూర్‌ గ్రామంలో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

సమాజంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో కంటి చూపు విషయంలో అశ్రద్ధ చేస్తున్నారన్నారు. ఇందుకు ఉదాహరణగా ఎర్రవల్లి గ్రామాన్ని ఆయన పేర్కొన్నారు. తాను దత్తత తీసుకున్న ఎర్రవల్లిలో కంటి వైద్య శిబిరం నిర్వహించి, పరీక్షలు చేయగా గ్రామంలో 217 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఒక్క గ్రామంలోనే ఇందరుమంది కంటి సమస్యలతో బాధపడుతుంటే రాష్ట్రం మొత్తంలో పరిస్థితి ఏ విధంగా ఉందోనని ఊహించానన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలందరి కళ్ళను పరీక్షించడానికి కంటివెలుగు కార్యక్రమాన్ని తెచ్చానన్నారు.

ప్రతి ఒక్కరికీ చక్కని కంటి చూపు కోసం ప్రభుత్వం ఎంత ఖర్చయినా వెనుకాడదని సీఎం స్పష్టం చేశారు. ప్రజలు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకుని కంటిచూపు మెరుగుపరుచుకోవాలన్నారు. ఈ కంటివెలుగు కార్యక్రమం ద్వారా 3.70 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కళ్ళద్దాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాటరాక్ట్‌ శస్త్ర చికిత్సలు కూడా నిర్వహింపచేస్తామన్నారు. వీటికి ఎవ్వరు కూడా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, అంతా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కాటరాక్ట్‌ ఆపరేషన్‌ విషయంలో ఎలాంటి భయాందోళనలు చెందవద్దని, అది చిన్న ఆపరేషన్‌ అని తెలిపారు.
tsmagazine

”నేను రెండు కళ్ళకు కాటరాక్ట్‌ ఆపరేషన్‌ చేయించుకున్నాను, 40 నిమిషాల తరువాత ఇంటికి పంపించారు” అని తెలిపారు. కంటి పరీక్షల్లో ఎవరికైతే కాటరాక్ట్‌ ఆపరేషన్‌ అవసరమవుతుందో వారు తప్పకుండా ఆపరేషన్‌ చేయించుకోవాలని సూచించారు. రాష్ట్రం మొత్తంలో 185 ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. వెయ్యి మంది ఉన్న గ్రామంలో వైద్య బృందం నాలుగురోజులు అదే గ్రామంలో ఉండి వైద్య పరీక్షలు పూర్తి చేస్తుందని సీఎం పేర్కొన్నారు. గ్రామాలలోని యువజన సంఘాలు, యువకులు ముందుకొచ్చి ఈ కంటి పరీక్షలకు ప్రజలు ఎక్కువ సంఖ్యలో వచ్చి పరీక్షించుకునేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.

యువకుల నేత్ర దానం
కంటివెలుగు కార్యక్రమంలో భాగంగానే మల్కాపూర్‌ గ్రామానికి చెందిన 750 మంది యువకులు నేత్రదాన పత్రాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించారు. సీఎం మల్కాపూర్‌ గ్రామంలో తిరుగుతూ ఇంటింటా మొక్కలు నాటిన తీరును పరిశీలించారు. గ్రామస్థులు శ్రమదానంతో తీర్చిదిద్దిన రాక్‌గార్డెన్‌ను పరిశీలించారు. స్వామి అనే రైతు ఇంటికి వెళ్ళి వారితో ముచ్చటించారు. బీసీ రుణాల చెక్కులను సీఎం ఇద్దరు లబ్ధిదారులకు అందచేశారు.

తొలిరోజు లక్షమందికి పరీక్షలు
కంటి పరీక్షలు ప్రారంభించిన తొలిరోజు ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా లక్షమందికి కంటి పర్షీలు నిర్వహించారు. వీరిలో సుమారు 10వేల మందికి కళ్ళద్దాలు అవసరమని నిర్ధారించి అద్దాలు సరఫరా చేశారు. రాష్ట్రం మొత్తంలో 824 వైద్య శిబిరాలను నిర్వహించారు.

సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అహోరాత్రులు కృషి
సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అహోరాత్రులు కృషిచేస్తున్నామని కేసీఆర్‌ పేర్కొన్నారు. దేశంలో ఎన్నడూ కేటాయించని రీతిలో ఒకేఒక్క ఆర్థిక సంవత్సరంలో 60వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఘనత మనదేనన్నారు. కరంటు ఇబ్బందులు తొలగిపోయా యన్నారు. ఇప్పుడు మిషన్‌ భగీరథతో మంచినీటి బాధలు కూడా తొలగిపోనున్నాయని తెలిపారు. ఇప్పటికే 20వేల గ్రామాలకు నీళ్ళు అందు తున్నాయని, మిగతా గ్రామాలకు కూడా నెలలోపు నీళ్ళు అందుతాయన్నారు.

దీపావళి వరకు రాష్ట్రంలోని అన్ని చోట్ల మంచినీళ్ళ బాధలు పోతాయన్నారు. 15 టీఎంసీల నిలువ సామర్ధ్యంతో నిర్మిస్తున్న కొండపోచమ్మ సాగర్‌ను అతితక్కువ సమయంలో సంవత్సరంలోపే పూర్తి చేయబోతున్నామని స్పష్టం చేశారు. రైతులను ఆదుకోవడం కోసం ఎకరాకు ఏడాదికి రూ. 8వేలు ఆర్థిక సహాయం చేస్తున్నామని, ఇది కేసీఆర్‌ ఉన్నంతవరకు కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని సమస్యలను ఒక్కటొక్కటిగా అన్నీ పరిష్కరిస్తున్నానని అన్నారు. సంఘటిత శక్తిలో ఉన్న గొప్పదనాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. మల్కాపూర్‌ మాదిరిగా ప్రతిపల్లె తీర్చిదిద్దబడాలన్నారు. మీకు చేతులెత్తి మొక్కుతున్నా మన బిడ్డలు మంచి వాతావరణంలో జీవించడానికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Other Updates