మార్గం లక్ష్మీనారాయణ
సీఎం కెసిఆర్ ముందు చూపు, ప్రజల కంటి చూపు లోపాలకు కాపలా అవుతున్నది. ప్రజల కంటి చూపుకి నేను కాపలా ఉంటానంటూ కెసిఆర్ ప్రజల కళ్ళల్లో వెలుగు నింపడానికి ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని చేపట్టారు. స్వాతంత్య్రదినోత్సవం ఆగస్టు 15, 2018న కంటి వెలుగు కార్యక్రమాన్ని కెసిఆర్ ప్రారంభించారు. ప్రజలందరికీ మంచి చూపును అందించే గొప్ప నైతిక బాధ్యతను ప్రభుత్వం తీసుకున్నది. ఇక ఈ సదుపాయాల్ని సద్వినియోగం చేసుకునే బాధ్యతని ప్రజలే స్వీకరించాలి. కెసిఆర్ ఆశయానికనుగుణంగా… ఏ ఒక్కరూ వైద్యం అందక శాశ్వత అంధత్వానికి గురి కావద్దు. కంటి చూపు లోపాలను అధిగమిద్దాం… ప్రజలందరికీ ‘కంటి వెలుగు’ లు ప్రసరింప చేద్దాం.
మనిషి అవయవాలు వేటికవే ప్రత్యేకమైనవి. దేని ప్రత్యేకత దానిది. అన్ని అవయవాలు సజావుగా, సజీవంగా ఉంటేనే సంపూర్ణంగా మనిషి అంటాం.
కానీ సర్వేంద్రీయానాం నయనం ప్రధానమన్నారు. కంటి చూపు లేకపోతే ప్రపంచం-జీవితం అంధకార బంధురం. ఇతర అవయవాల లోపాలను ఎంతో కొంత అధిగమించగలిగినా, కంటి చూపుకి ప్రత్యామ్నాయం లేదు. అలాంటి కంటి చూపు మీద నిర్లక్ష్యాల నీడ కమ్ముకున్నది.
అవగాహన లేకనో, కంటి పరీక్షలు నిర్వహించే సదుపాయం అందుబాటులో లేకనో, ఆర్థిక స్థోమత సరిపోకనో, కంటి చూపు లోపాలను గుర్తించలేకనో, అనేక మంది కంటి జబ్బులను నిర్లక్ష్యం చేస్తున్నారు. అంధత్వం బారిన పడుతున్నారు. నివారించగలిగే కంటి వ్యాధులతో 80శాతం మంది బాధపడుతున్నారంటే కంటిని కాపాడుకోకపోతే అత్యధికులకు కంటి వెలుగు శాశ్వతంగా మలిగిపోయే ప్రమాదం పొంచి ఉంది.
కంటికి సంబంధించి వచ్చే వ్యాధుల్లో ప్రధానంగా వయసుతో వచ్చే చత్వారం, (Age Related Macular Degeneration (AMD), అన్ని రకాల కళ్ళ వైకల్యాలు (All Vision Impairment), అంధత్వం (Blindness), కాటరాక్ట్ (Cataract), మధుమేహంతో వచ్చే రెటినోపతి (Diabetic Retinopathy), గ్లకోమా (Glaucoma), ఓపెన్ యాంగిల్ (Open-angle), హైపోరోపియా (Hyperopia).
గణాంకాల ప్రకారం ప్రపంచంలో 253 మిలియన్ల మంది దష్టి వైకల్యాలతో ఉన్నారు. 36 మిలియన్ల మంది అంధత్వంతో బాధపడుతున్నారు. 217 మిలియన్ల మంది తీవ్ర కంటి లోపాలతో సతమతమవుతున్నారు. 50 ఏళ్ళు పై బడిన వాళ్ళల్లో 81శాతం మంది కంటి చూపు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. వయో వద్ధుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. వీళ్ళల్లో వయసుతో పాటు కాటరాక్ట్ సమస్యలు అధికమవుతున్నాయి. అవసరమైన ఆపరేషన్లు జరగకపోవడం వల్లే జబ్బులు ముదిరి ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సాధారణ చూపు లోపాలు, కంటి వైకల్యాలు, తీవ్ర కంటి చూపు లోపాలు, అంధత్వం అనే నాలుగు రకాల సమస్యలు ఉన్నాయి. వీటిల్లో 80శాతం నయం చేయతగిన సమస్యలు ఉన్నట్లుగా సర్వేలు తేలుస్తున్నాయి.
రకరకాలుగా అంధ త్వం విస్తతమవుతున్నది. 53శాతం ప్రజల్లో కంటి సమస్యలను గుర్తించక పోవడం, 25 శాతం ఆపరేషన్ అవసరం ఉన్నా చేయించుకోకపోవడం, 4శాతం వయసుతో వచ్చే సమస్యలు, 2శాతం గ్లకోమా, 1శాతం మధుమేహ సమస్యల వల్ల అంధత్వం సంప్రాస్తిస్తున్నట్లుగా తేలింది. 35శాతం మంది కంటి శుక్లాల శస్త్ర చికిత్సలు చేయించుకోకపోవడం, 21శాతం మంది కంటి సమస్యలను సరి చేసుకోకపోవడం, 8శాతం మంది గ్లకోమా వల్ల అంధత్వానికి గురవడానికి ప్రధాన కారణాలుగా గుర్తించారు. ఇక 15 ఏళ్ళలోపు పిల్లల్లో 19మిలియన్ల మంది కంటి సమస్యలతో బాధ పడుతున్నారు. వీళ్ళల్లో 12 మిలియన్ల మంది రిఫ్రాక్టివ్ సమస్యలతో ఉన్నారు. మొత్తంగా 1.4 మిలియన్లు తీర్చలేని అంధత్వంతో బాధపడుతున్నారు. ఇందుకు కంటి జబ్బుల పట్ల ప్రజలని చైతన్య పరచడం, కంటి వైద్యం అందించడమొక్కటే మార్గం. ఒకవేళ ఇది జరగకపోతే 2050 నాటికి ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న కంటి రోగుల సంఖ్య మూడింతలు పెరిగే ప్రమాదం ఉంది.
ఇక దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో….ఆధునిక పరికరాలు అందుబాటులో ఉండటం, మెరుగైన మంచి వైద్యం అందుతున్న కారణంగా 75శాతం నివారించదగ్గ కంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయినప్పటికీ అందుబాటులో ఉన్న వైద్యం, రోగుల అవసరాల మధ్య వ్యత్యాసం ఇంకా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ తేడా ఇంకా ఎక్కువగానే నమోదవుతున్నది. ఆహారపు అలవాట్లు, సూర్యోదయ, సూర్యాస్తమయాలను చూడని, చూడలేని పనుల బిజీలో ఉండే జనాలకు సహజంగానే ఇలాంటి సమస్యలు ఎక్కువగా సంప్రాప్తిస్తున్నాయి. నిరంతర గజి బిజీ జీవితాలకు తోడుగా ఒత్తిళ్ళు, నానాటికీ పెరుగుతున్న కాలుష్యాలు, మధుమేహం వంటి వ్యాధులు, బీపీ వంటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, నిర్లక్ష్యపు వాహన చోదనం, అనేక యాక్సిడెంట్లు, నిర్లక్ష్యాలు, అవగాహన లోపాలు వంటి అనేకానేక కారణాల వల్ల కూడా అనేక మంది అంధత్వం బారిన పడుతున్నారు.
మరోవైపు ప్రజలకు వైద్యాన్ని అందించడాన్ని కనీస బాధ్యతగా తీసుకోవాల్సిన ప్రభుత్వాల నిర్లక్ష్యం కూడా ప్రజల పాలిట శాపంగా మారుతున్నది. గత ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం అప్పటి రాష్ట్రాన్ని అంధకారం చేసింది. భారత ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని జాతీయ అంధత్వ నివారణ సంస్థ గత ఐదేళ్ళల్లో నిర్ధేశిత-నిర్ధారిత లక్ష్యాల గణాంకాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో 2013-14 నాటి గణాంకాల ప్రకారం నిర్ధేశిత లక్ష్యాల కంటే సాధించిన లక్ష్యాలు తక్కువగానే ఉన్నాయి. స్వరాష్ట్ర స్వయం పాలనలో నిర్దేశిత లక్ష్యాలు-సాధించిన లక్ష్యాలను పరిశీలిస్తే సాధించిన లక్ష్యాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయి. కానీ ఇవి ప్రస్తుతం
ఉన్న పరిస్థితులకు కంటి సమస్యల నివారణకు పూర్తిగా సరిపోయే విధంగా లేవు. ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా, దేశ, రాష్ట్రంలోని ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు చేస్తు న్న చైతన్యం, కల్పిస్తున్న అవగాహన ఇంకా అంధత్వ నివారణకు సరిపోవడం లేదు. అందుకే విజన్ 2020 ది రైట్ టు సైట్! అనే థీమ్‌తో ప్రపంచ ఆరోగ్య సంస్థ పని చేస్తున్నది. ఆనాటికి భూగోళంపై కనీసం 25శాతం ప్రజల్లో కంటి సమస్యలను నివారించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రపంచ దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తం చేసింది.
ఇదే దశలో నాలుగున్నరేళ్ళ క్రితం ఆవిర్భవించిన తెలంగాణలో వైద్య విప్లవం నడుస్తున్నది. వైద్యాన్ని ఓ గోలీ, సూదీ మందులా కాకుండా, బాధ్యతగా,
ఉద్యమంగా తీర్చే, దిద్దుబాటు జరుగుతున్నది. ఒక్క వైద్య రంగంలోనే గతంలో ఎన్నడూ లేనన్ని వినూత్న, విశేషమైన పథకాలు అమలవుతున్నాయి. ఇంతగా, ఇన్ని రకాల ప్రభుత్వ పథకాలు అమలు అయిన దాఖలాలు స్వతంత్ర చరిత్రలో లేవు. కెసిఆర్ నేతత్వంలో తెలంగాణ ఆవిర్భావమే కాదు. అనంతరం ఇప్పుడు జరుగుతున్న వైద్య, ఇతర రంగాల అభివద్ధి, సంక్షేమాలు కూడా చారిత్రాత్మకమే.
ఒకే సారి రాష్ట్ర ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించతలపెట్టడం ఓ చరిత్ర. ఇలా చరిత్రలో ఎక్కడా ఇలాంటి పరీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఒకే రోజు రాష్ట్రమంతా ఇంటింటి సర్వే నిర్వహించినా, సమగ్ర హెల్త్ సర్వే నిర్వహించనున్నట్లు ప్రకటించినా అది కెసిఆర్ కే చెల్లింది.
వీటన్నింటి మీదా అవగాహన ఉంది కాబట్టే, సీఎం కెసిఆర్ ముందు ‘చూపు’, ప్రజల కంటి చూపు లోపాలకు కాపలా అవుతున్నది. ప్రజల కంటి చూపుకి నేను కాపలా ఉంటానంటూ కెసిఆర్ ప్రజల కంటికి వెలుగు నింపుతూ ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని చేపట్టారు. స్వాతంత్య్రదినోత్సవం ఆగస్టు 15, 2018న కంటి వెలుగు కార్యక్రమాన్ని కెసిఆర్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలందిరికీ ఉచితంగా కంటి పరీక్షలు, వైద్య సేవలు, కంటి అద్దాలు అందిస్తూ, అవసరమైన వాళ్ళకి శస్త్రచికిత్సలు కంటి వెలుగు కార్యక్రమం కింద జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 824 వైద్య బందాలు పరీక్షలు చేస్తున్నాయి. అదనంగా 113 టీములు ప్రజలకు వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. 40 లక్షల కళ్ళ అద్దాలు ప్రజలకు అందుతున్నాయి. ఐదారు నెలల పాటు నిర్వహించే శిబిరాల సంఖ్య 12వేలు దాటనుంది. ప్రస్తుతం రోజుకు లక్షకు పైగా మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 35 ఏళ్ళ దాటిన చాలా మందిలో కంటి లోపాలు కనిపిస్తున్నాయి. కాటరాక్టు వంటి అనేక సమస్యల కు రెఫరల్స్ కూడా జరుగుతున్నాయి. సరోజినీ వంటి కంటి దవాఖానాలను మరింత బోలపేతం చేసే చర్యలు కూడా ప్రభుత్వం చేపట్టింది. సరోజినీ దవాఖానాకు అత్యాధునిక పరికరాలు రావడమే కాదు, ఐ బ్యాంకును కూడా ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల క్రితమే ఐ బ్యాంకుని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అలాగే వరంగల్‌లోని ప్రాంతీయ కంటి దవాఖానా అభివద్ధి పనులు జరుగుతున్నాయి.
ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతో పాటు దష్టి లోపం ఉన్న వాళ్ళకి అక్కడికక్కడే కళ్లద్దాలు, మందులు ఉచితంగా అందిస్తున్నారు. అవసరమైన వారికి పట్టణాలు, నగరాల్లోని మంచి కంటి దవాఖానాల్లో
ఉచితంగా ఆపరేషన్లు కూడా ప్రభుత్వం చేయిస్తున్నది. ‘కంటి వెలుగు’ శిబిరం నిర్వహించడానికి వచ్చిన వైద్యులు, అధికారులకు ప్రజలే స్వచ్ఛందంగా సహకరించి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో చొరవ తీసుకోవాలి. ప్రజలందరికీ మంచి చూపును అందించే గొప్ప నైతిక బాధ్యతను ప్రభుత్వం తీసుకున్నది. ఇక ఈ సదుపాయాల్ని సద్వినియోగం చేసుకునే బాధ్యతని ప్రజలే స్వీకరించాలి. కెసిఆర్ ఆశయానికనుగుణంగా… ఏ ఒక్కరూ వైద్యం అందక శాశ్వత అంధత్వానికి గురి కావద్దు. కంటి చూపు లోపాలను అదిగమిద్దాం… ప్రజలందరికీ ‘కంటి వెలుగు’ లు ప్రసరింప చేద్దాం.