‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’
అందుకే చాలాకాలంగా పలు స్వచ్ఛంద సంస్థలు నేత్ర చికిత్సా శిబిరాలను ఏర్పాటుచేసి ప్రజలకు సేవలందించడం మనకు తెలుసు. కానీ, స్వయంగా ఒక రాష్ట్రప్రభుత్వమే ఉచితంగా, భారీ ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు కంటిపరీక్షలు నిర్వహించడం ఏనాడైనా, ఎక్కడైనా విన్నామా, కన్నామా!ఎన్నో వినూత్న కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా నిలచిన తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు ఈ అద్భుత ఘట్టానికి కూడా తెరదీయడం నిజంగా మనందరికీ గర్వకారణం.

మానవీయ కోణంలో ఆలోచించి, ప్రజలకు ఏది ఎప్పుడు అవసరమో దానినివారికి అందించడంలో మన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అందరికంటే ముందుంటారని గతంలో అనేక సందర్భాలలో వెల్లడైంది. ముఖ్యంగా పేదల ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ, ఆరోగ్య లక్ష్మి, ప్రభుత్వ ఆసుపత్రులలో వసతులు, వైద్యసేవలను విస్తృత పరచడం, ఉచితంగా వ్యాధి నిర్థారణ పరీక్షలు, కిడ్నీబాధితుల కోసం ఉచిత డయాలసిస్‌ సేవలు, తల్లీబిడ్డల ఆరోగ్యానికి దోహదంచేసే కె.సి.ఆర్‌ కిట్ల పథకం, వైద్యసేవలను మరింత చేరువచేసే బస్తీ దవాఖానాలు వంటి మరెన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్న రాష్ట్రప్రభుత్వం ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవంనాడు ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.

కనుచూపు కరవైన బ్రతుకెందుకో… అన్నవిధంగా చూపు లేకపోతే సర్వం శూన్యం. బతుకే అంధకార బంధుర మవుతుంది. కానీ, చాలామంది నేత్రసంబంధిత వ్యాధులపట్ల తగిన అవగాహన లేక, దవాఖానాకు వెళ్ళి పరీక్ష చేయించుకొనే వెసులుబాటు, తీరిక, ఆర్థిక స్థోమత లేక, నిర్లక్ష్యంతో కంటి వెలుగు కోల్పోతున్నారు. అందుకే, ప్రజలలో చైతన్యం రేకేత్తించి, కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలు, మందులు ఇవ్వడంతోపాటు, అవసరమైనవారికి ఉచితంగా శస్త్రచికిత్సలు కూడా నిర్వహించే బహత్తర కార్యక్రమమే కంటి వెలుగు.

సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్వయంగా ప్రారంభించ నున్న ఈ కంటివెలుగు కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 కోట్ల 70 లక్షల మందికి నేత్రపరీక్షలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం అమలుకు అధికార యంత్రాంగం ప్పటికే 799 బృందాలను ఏర్పాటుచేసింది. ప్రతీ బృందంలో ఒక డాక్టరుతోసహ, ఇతర సిబ్బంది ఉంటారు. వీరు రాష్ట్రంలోని ప్రతీ గ్రామానికి వెళ్ళి కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో బృందం రోజుకు 250 మందికి పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ పరీక్షలకు అవసరమైన పరికరాలు, మందులు, తదితర ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అవసరమైన వారికి కంటి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 114 కంటి దవాఖానాలను కూడా అధికారులు గుర్తించారు.

ఇంతటి భారీ కార్యక్రమాన్ని గతంలో ఎవ్వరూ, ఎన్నడూ చేపట్టలేదు. కానీ, ఒకే రోజులో ఇంటింటి సర్వే విజయవంతంగా నిర్వహించిన ఘనత, అనుభవం ఉన్న మన ప్రభుత్వం, అధికారయంత్రాంగం ఈ బృహత్తర కంటివెలుగు కార్యక్రమాన్ని సయితం విజయవంతం చేస్తుందనడంలో సందేహం లేదు. ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రజల వంతు.

Other Updates