సమకాలీన సామాజిక, రాజకీయ విలువలతోపాటు బలహీనమైపోతున్న మానవీయ అంశాల వైనాన్ని మరికొన్ని వైయక్తిక అంశాలను కవితా వస్తువులుగా స్వీకరించి ‘ఈ మట్టి ఆక్రోషం’ కవితా సంపుటిగా తీసుకొచ్చారు కవి బండి చంద్రశేఖర్.
‘కడవలు కడవలుగా గారాబాన్ని/ నిలువెల్ల నింపికూడా/ కనుసైగలతోటే అదుపాజ్ఞల్లో/ పెంచిన నీ ఆప్యాయపు అమ్మతనం/ ఎక్కడి చదువులు నీకు నేర్పించినయి? అనే కవితా పంక్తుల్లో అమ్మ ఆప్యాయత, అనురాగంతోపాటు అమ్మ నేర్చించిన క్రమశిక్షణను గుర్తు చేసుకుంటారు. ఏ చదువులు చదవని మీకు అమ్మా…! ఇవన్నీ ఎవరు నేర్పించారు? అంటూ అమ్మ జ్ఞాపకాలలో కవి మునిగి పోతాడు. అమ్మ పట్ల తనకున్న చెదిరిపోని మమకారాన్ని గుండె నిండుగా చాటుకుంటారు ‘అంకితం’ అనే కవితలో.
ప్రపంచీకరణ యుగంలో వున్న మనం తారుమారవుతున్న అనేక సామాజిక స్థితిగతుల్ని కళ్ళారా చూస్తున్నాం. ఆ పరిస్థితులు మనదాకా వచ్చేసరికి కుదేలైపోతున్నాం. సామాన్యునికి అందుబాటులో ఉండాల్సిన విద్య అందకుండాపోయింది. ఈ నేపథ్యంలోనే ‘చదువుల కార్పోరేషన్’ కవిత రాశారు. దీనికి కారకులైన వారి నిజ స్వరూపాన్ని చక్కగా వ్యక్తీకరించారు. క్షీణించిపోతున్న విద్యా విలువలపట్ల కవి తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. గత యేడాది పుష్కరాలలో జరిగిన తొక్కిసలాటలో ఎంతోమంది పెద్దలు, పిల్లలు చనిపోయారు. ఆ పాపానికి కారణం ఎవరు అంటూ ప్రశ్నించే కవిత ‘పాపం ఎవరిది?’ ఈ కవితలో పాపం నాదే అంటూ వ్యంగ్యంగా పాలకులనుద్దేశించి చురక వేస్తారు కవి.
ప్రజల గొంతును తొక్కిపడుతున్నారని వాపోతారు ‘శాలువాల పంపకమా.. కవి సమ్మేళనమా?’ అనే కవితలో.
‘ఇట్లైతే ఎట్లా…?’, ‘ఝండా’ బొమ్మలమ్మ గుట్టసాక్షిగా’ కవితలు క్షీణిస్తున్న రాజకీయ, సామాజిక విలువలకు దర్పణంగా ఉన్నాయి. ‘నేనెవ్వరో నాకు ఎదురైనప్పటినుంచి విహంగంలా విశ్వమంతా వెతుకుతూనే ఉన్నా…’ అంటున్న బండి చంద్రశేఖర్ కనుమరుగవుతున్న అనేక విలువలపై ప్రశ్నలను సందిస్తూ ఎక్కుపెట్టిన కవితాస్త్రమే ‘ఈ మట్టి ఆక్రోశం’. ఈ పుస్తకానికి అన్నవరం శ్రీనివాస్ అర్థవంతమైన ముఖచిత్రాన్ని ఇచ్చారు. మొత్తం యాభై తొమ్మిది కవితలున్న ఈ కవితా సంపుటి సరళమైన భాషలో, చక్కని ఉపమానాలతో కవితా ప్రియులను అలరిస్తుంది.. ఆలోచింపచేస్తుంది.
పుస్తకం: ఈ మట్టి ఆక్రోశం; కవి: బండి చంద్రశేఖర్, వెల: రూ. 80/-;
ప్రతులకు: 7-2-904/1, మంకమ్మతోట, కరీంనగర్-505001.