kinnarasaniపర్యాటకుల స్వర్గధామంగా కిన్నెరసాని

శ్రీ మామిండ్ల దశరథం

కిన్నెరసాని ప్రాంతం ప్రకృతి రమణీయతకు, పక్షుల కిలాకిలా రావాలకు పెట్టింది పేరు. చుట్టూ దట్టమైన అరణ్యం, అద్భుతమైన కొండలతో చూపరులను కట్టి పడేసే సొగసులు కిన్నెరసాని సొంతం.

దట్టమైన అడవి, అద్భుతమైన కొండల మధ్య ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం యానంభైలు గ్రామం వద్ద కిన్నెరసాని రిజర్వాయర్‌ ఉంది. పచ్చదనం, జలకళ, పక్షుల కిల కిలలు, జలాశయంలో తేలియాడినట్టుండే పచ్చని కొండల ద్వీపాల సముదాయం, ఉరకలేస్తున్న జింకలు ఈ ప్రాంత అందాలను రెట్టింపు చేస్తూ పర్యాటకుల స్వర్గధామంగా మారుస్తున్నాయి.

జిల్లాకేంద్రం ఖమ్మం నుండి 104 కిలోమీటరు,్ల కొత్తగూడెం నుండి 24 కి.మీ., హైదరాబాదు నుంచి 304 కిమీ దూరం ఉన్న ఈ ప్రాంతం పర్యాటకుల సందర్శనకు అత్యంత అనువైన సుందర ప్రదేశం. సమీప రైల్వే స్టేషన్‌ కొత్తగూడెంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించింది. కొత్తగూడెం శాసనసభ్యులు జలగం వెంకట్రావు పర్యాటకానికి అన్ని విధాలుగా అనువుగా ఉన్న ఈ ప్రాంతంను అభివృద్ధి పరిస్తే పర్యాటకుల సంఖ్య మరింతగా పెరిగి, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న ఉద్దేశ్యంతో ‘కిన్నెరసాని’ ప్రాంతాన్ని పర్యాటకంగా చేయాల్సిన అభివృద్దిపై ముఖ్యమంత్రితో చర్చించి ఒప్పించారు. ఫలితంగా తెలంగాణ పర్యాటక అభివృద్ది సంస్ధ రూ.53 లక్షల వ్యయంతో డీలక్స్‌ బోట్‌, స్పీడ్‌ బోట్‌లను కిన్నెరసాని అందాలను వీక్షించేందుకు ఏర్పాటు చేసింది.

కిన్నెరసాని అందాలను మరింత చేరువ నుండి వీక్షించేందుకు వీలుగా పర్యాటక అభివృద్ది సంస్ద కిన్నెరసాని జలాశయంలో ఏర్పాటు చేసిన బోటింగ్‌ షికారును జూన్‌ 5, 2015న రాష్ట్ర పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, జిల్లా ఎస్పీ షానవాజ్‌ ఖాసీం, జిల్లా అటవి సంరక్షణాధికారి ఆనందమోహన్‌, జిల్లా పర్యాటక శాఖాధికారి సుమన్‌ చక్రవర్తిలు ప్రారంభించారు.

35 మంది పర్యాటకులు ఒకేసారి ప్రయాణించే వీలున్న డీలక్స్‌ బోటులో పెద్దలకు ఒక్కొక్కరికి రూ. 50 లు, పిల్లలకు ఒక్కొక్కరికి రూ. 35లు చొప్పున టికెట్టు నిర్ణయించారు. స్పీడ్‌ బోటింగ్‌కు నలుగురు పర్యాటకులకు రూ. 300లు, ఆరుగురు పర్యాటకులకు రూ. 400లు వసూలు చేస్తున్నారు. బోటింగ్‌కు వెళ్లే పర్యాటకులకు రక్షణకై లైఫ్‌ జాకెట్లును అందచేస్తున్నారు. దీంతో కిన్నెరసాని అందాలను మరింత చేరువగా పర్యాటకులు వీక్షించి మధురానుభూతిని పొందుతున్నారు. యువతైతే స్పీడ్‌ బోటింగ్‌కు ఆసక్తి చూపుతున్నారు. చుట్టూ పచ్చని కొండలు, పక్షుల కిలాకిలా రావాల మధ్య బోటింగ్‌ చేస్తున్నంత సేపు సందర్శకులు చిన్న, పెద్ద తేడా లేకుండా కేరింతలు కొడుతూ కిన్నెరసాని అందాలను తనివి తీరా వీక్షించి తన్మయత్వం చెందుతున్నారు. మరీ ముఖ్యంగా జాలశయంలో తేలుతున్నట్లు ఉండే పచ్చని కొండల ద్వీపాలను దగ్గరగా బోటు వెళ్లే సందర్భంలో ద్వీప అందాలను ఆశ్చర్యంతో చూస్తూ ఆనంద పారవశ్యంతో మునిగి తేలుతున్నారు.

పర్యాటక అభివృద్ది సంస్ధ కిన్నెరసాని రిజర్వాయర్‌లో ఏర్పాటు చేసిన ఈ బోటింగ్‌కు సందర్శకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పర్యాటకుల సంఖ్య మరింతగా పెరిగింది. జిల్లా నలుమూలల నుంచే కాక తెలంగాణ రాష్ట్రం పొరుగున గల ఆంధ్రప్రదేశ్‌ నుండి సందర్శకులు కిన్నెరసాని అందాలను తిలకించేందుకు వస్తున్నారు.

జింకల అభయారణ్యం

జలాశయం సమీపంలోని జింకల అభయారణ్యంలో ఉరకలేస్తున్న జింకలు సందర్శకుల ఆనందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. ఈ జింకల అభయారణ్యాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.

బోటు షికారుకు విశేష స్పందన:

కిన్నెరసాని జలాశయంలో ఏర్పాటు చేసిన బోటు షికారుకు పర్యాటకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. బోటు షికారు ప్రారంభించిన తొలి మాసంలోనే పిల్లా పెద్దలతో కలిపి మొత్తం 3,181 మంది పర్యాటకులు డీలక్స్‌ బోటులో షికారు చేయగా రూ. ఒక లక్షా 51 వేల 890 రూపాయల ఆదాయం పర్యాటక అభివృద్ది సంస్ధకు సమకూరింది. బోటు షికారు ప్రారంభం నుంచి ఆగష్టు మాసాంతం వరకు రెండు బోట్లలో కలిపి మొత్తం 15 వేల 343 మంది పర్యాటకులు బోటులో విహరించగా వీరి ద్వారా రాష్ట్ర పర్యాటక అభివృద్ది సంస్దకు 7 లక్షల 56 వేల 770 రూపాయల ఆదాయం సమకూరింది.

కిన్నెరసాని జలాశయంలో బోటింగ్‌ ఏర్పాటుతో పర్యాటకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని రాష్ట్ర పర్యాటక అభివృద్ది సంస్ద జిల్లా మేనేజర్‌ శ్రీనివాసరావు తెలిపారు. పర్యాటకుల తాకిడి సైతం ఈ ప్రాంతానికి పెరిగిందన్నారు. భవిష్యత్తులో పర్యాటకపరంగా ఈ ప్రాంతంను అభివృద్ది చేసేందుకు పెరిగిన పర్యాటకుల తాకిడి ఉపకరిస్తుందని అన్నారు.

ఇక్కడ పర్యాటకులకు అవసరమైన వసతి సౌకర్యాలు, కాటేజీలు, హోటళ్ళు, పర్యాటకులరక్షణకు చర్యలను ప్రభుత్వం చేపడుతోంది.

Other Updates