శ్రీరామ నామస్మరణతో భద్రాద్రి ఉప్పొంగి పోయింది. నలుమూలలా రామనామం మార్మోగుతుండగా మార్చి 28న సీతారామ కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కన్నులపండువగా సాగిన కల్యాణమహోత్సవాన్ని చూసి భక్తకోటి పులకించిపోయింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అభిజిత్‌లగ్నంలో సీతారాముల కల్యాణం కమనీయంగా సాగింది.
తెలంగాణ రాష్ట్రం అవతరించిన అనంతరం తొలిసారిగా జరిగిన ఈ కల్యాణో త్సవాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దంపతులు హాజరయ్యారు. స్వామివారి కల్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణవేడుకలను తిలకించారు.
భద్రాచలంలోని మిథిలా స్టేడియం భక్తులతో కిటకిటలాడింది. స్టేడియంలో అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన కల్యాణవేదికపై సీతారాముల కల్యాణోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణం సందర్భంగా మార్చి 28న వేకువజామున రెండుగంటలకే రామాలయం తలుపులు తెరిచారు. స్వామివారికి సుప్రభాతసేవ అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళాశాసనం, అభిషేకం నిర్వహించారు. గర్భగుడిలో మూలవరులకు తొలుత కల్యాణం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను అందంగా అలంకరించిన పల్లకీలో ఉంచి వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ సకల రాజలాంఛనాలతో గిరిప్రదక్షణ నిర్వహించారు.
మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల కోలా హలం మధ్య ఉత్సవమూర్తులను ఊరేగింపుగా మిథిలా స్టేడియం కల్యాణ వేదికపైకి తీసుకొని వచ్చారు.
సీతారాములకు భక్తరామదాసు చేయించిన ఆభరణాలను అలంకరించారు. అభిజిత్‌లగ్నంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు జీలకర్ర, బెల్లాన్ని సీతారాములపై ఉంచారు. అనంతరం మాంగల్యధారణ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ముత్యాల తలంబ్రాలతో తలంబ్రాల తంతు కన్నుల పండువగా జరిగింది.
పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన కేసీఆర్ దంపతులు శ్రీసీతారాముల కల్యాణోత్సవాలకు హాజరయ్యేందుకు ఒకరోజు ముందుగా మార్చి 27 సాయంత్రానికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు భద్రాద్రికి చేరుకున్నారు. శ్రీరామనవమి రోజున ఉదయం కుటుంబ సమేతంగా శ్రీ సీతా రామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు కె.సి.ఆర్‌కు వరిపట్టంకట్టి ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు.
అనంతరం మిథిలా స్టేడియంలో స్వామివారికి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి కల్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, లక్షలాదిమంది భక్తులు పాల్గొన్నారు.
శ్రీరామ పట్టాభిషేకం
శ్రీ సీతారాముల కల్యాణం జరిగిన మరుసటి రోజున శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించడం ఆచారంగా వస్తోంది. ఇందులో భాగంగానే మార్చి 29వ తేదీన మిథిలాస్టేడియంలో నిర్వహించిన శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.