నెహ్రూ మంత్రివర్గంలోని ముగ్గురు ప్రధాన వ్యక్తుల్లో కృష్ణ మీనన్ ఒకరు. బక్కగా, బల హీనంగా ఉండే ఈ వ్యక్తి మనకు రక్షణమంత్రి. పార్టీలో అనుయాయుడన్న వాడు ఒక్కడూలేని నాయకుడు. నలుగురితో కమ్యూనిస్టు అనిపించుకున్న కాంగ్రెస్ మంత్రి కృష్ణమీనన్ అంటే ఒక్కమాటలో ‘కాన్‌ట్రావర్సీ’.
పార్లమెంట్‌లోనే గాక, ప్రపంచం నలుమూలలనుండి విమర్శల విసుర్లు ఆయనకు తగులుతూ ఉండేవి. ఇది నిత్య వ్యవహారమే కనుక వాటిని అడ్డుకొనడం, తప్పించుకొనడం కూడా ఆయనకు బాగా తెలుసు. జీప్ స్కాండల్ వ్యవహారం ఒకరు లేవదీస్తే, ట్రాక్టరు కొనుగోలు విషయం మరొకరు. కాన్పూర్ ఏర్‌ఫోర్స్ డిపో తమాషా ఇంకొకరు. ఒకరి వెంబడి మరొకరు ప్రశ్నల వర్షం కురిపిస్తే ఆవేశంతో, అద్భుతమైన ఇంగ్లీషులో మాట్లాడేవారు. సభ్యులు మరీ పట్టుబడితే ప్రధానమంత్రి జోక్యం ఉండనే ఉండేది.
రష్యా, హంగేరిపై దాడి సల్పినప్పుడు దాన్ని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితిలో ఒక ప్రతిపాదన పెట్టబడింది. అయితే మీనన్ దాన్ని సమర్థించకపోగా ఖండించారు. ప్ర సంగం ముగిసిన తరువాత సమితి లాబీలలో పాశ్చాత్య పత్రిక ప్రతినిధి ఒకరు మీనన్‌ను కలుసుకుని ‘హంగేరీపై మీ వైఖరిని ఎలా సమర్థించుకోగలర’ని కొంటెగా ప్రశ్నించాడు.
మీనన్ వెంటనే మండిపడుతూ హంగేరీ కాదూ, రష్యా వాళ్లు చాలా పొరపాటు చేశారు. ఈజిప్టుపై బ్రిటన్, ఫ్రాన్స్‌లు దాడిచేసినప్పుడు రష్యా, లండన్‌పైకి ఇన్ని బాంబులు కురిపించవలసిందని’ అన్నాడు. కశ్మీర్ సమస్య విషయమై ఐక్యరాజ్య సమితిలో ఆయన ఏక్‌దమ్మున పదమూడు గంటల పర్యంతం ప్రసంగించారంటే కేంద్రమంత్రి మండలిలో పనిచేసిన ఆ అయిదేళ్ల మొత్తం కాలంలో కూడా పదమూడు గంటలు ఉండకపోవచ్చు. దీనికి కారణం-పార్లమెంటు వ్యవహారం ఆయనకు నచ్చదు. అక్కడ మూగిన ‘జనం’ ఆయనకు గిట్టరు. వారి సావాసం ఆయనకు అంతగా రుచించదు. కృష్ణమీనన్ మాట నేర్పరితనం గురించి చెప్పాలంటే 1959 నవంబరు 25వ తేదీన పార్లమెంట్‌లో రక్షణశాఖ వ్యవహారంపై చర్చ సందర్భంలో కృపలానీ, మాసానీలు తను రాజీనామా చేయాలని పట్టుపట్టారు. ‘తప్పో, ఒప్పో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ద్వారా మాత్రం మంత్రుల నియా మకాలు జరుగవు’ అనడంతో వారి నోళ్ళు మూతపడ్డాయి. కుటుంబ నియంత్రణ వ్యవహారాలను వ్యతిరేకించిన కాంగ్రెస్ మంత్రి-‘కిటకిటలాడుతున్న రైలు పెట్టెలోకి ఏలాగోదూరి, కిస్సా జాగా చిక్కించుకొని, మరుసటి స్టేషనులో మరెవరినీ పెట్టెలోనికి రానీయకుండా ఆపుచేసే మనస్తత్వమే ఇది’ అని అభివర్ణించారు.
అంతర్జాతీయ వ్యవహారంలో భారత్‌కు గొప్ప పేరు తెచ్చిపెట్టిన వ్యక్తి. అనేక అంతర్జాతీయ సమావేశాలలో భారత ప్రతినిధివర్గానికి నాయకత్వం వహించారు. వియత్నామీయుల మన్నన పొంది కొన్నేళ్లుగా సాగుతున్న రక్తపాతాన్ని ఆపి బ్రిటన్, ఫ్రాన్స్, వియత్నాంలమధ్య సంధి కుదిర్చారు. ‘ఫిలిం ఇండియా’ ఎడిటర్ బాబురావు పటేల్, కృష్ణమీనన్ రాజకీయాలపై వ్యాఖ్యానిస్తూ ? ‘నెహ్రూ చితి మంట’ అన్నారు. ఇంటా బయటా కమ్యూనిస్టులతో ఉన్న ఆయన సంబంధం రహస్యమైనదికాదు. కానీ, ఆయన దేశభక్తి ఎవరు శంకించలేదు.
ప్రతిభావంతుడు దేశ్‌ముఖ్
భారత ఆర్థికమంత్రులలో సి.డి. దేశ్‌ముఖ్ అత్యంత ప్రతిభావంతుడు. ఎందుకంటే ఆయన హయాంలో దేశంలో విదేశీ మారక కొరతలేదు. లోటు బడ్జెటు ప్రస్తావన రాలేదు. ద్రవ్యోల్బణం రేటు వెర్రితలలు వేయలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో మన రూపాయి విలువ తగ్గలేదు.
1943లో రిజర్వు బ్యాంకు గవర్నర్ టెయిలర్ మరణించాడు. డిప్యూటీ గవర్నరుగా ఉన్న సి.డి. దేశ్‌ముఖ్‌ని ఏకగ్రీవంగా గవర్నరుగా ఎన్నుకున్నారు. అవి రెండవ ప్రపంచ యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్న రోజులు. ఆనాటి వైస్రాయ్ లిన్‌లిథ్‌గో, ఆర్థిక సభ్యుడు రెయిస్‌మెన్ ఇద్దరూ కూడా భారతీయుడు ఈ ఉద్యో గానికి పనికిరాడన్నారు. యుద్ధం సమయంలో ఏం అడ్డువస్తాడోననే భయం కానీ ఇండియా కార్యదర్శి అమెరా ఇందుకు అంగీకరించలేదు. ఏకగ్రీవంగా ఎన్నుకున్న మాటను తప్పకూడదన్నాడు. పైగా దేశ్‌ముఖ్ సామర్థ్యాలను మీరు కూడా కొనియాడుతున్నవేకదా అన్నాడు. రిజర్వు బ్యాంక్ గవర్నరుగా 1949 నుంచి దేశ్‌ముఖ్ దేశానికి ఎంతో సేవ చేశాడు.
1945లో సిమ్లా సమావేశంలో వైస్రాయ్ సభ సభ్యులంతా భారతీయులే ఉండాలని తీర్మానించారు. ఆ జాబితాలో ఆర్థిక సభ్యుడుగా దేశ్‌ముఖ్ పేరు వేయాలని ప్రయత్నించారు. కానీ దేశ్‌ముఖ్ తనకు రాజకీయాలు పడవని తప్పించుకుని ఖజానా తాళం చెవిని గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు. 1950లో ప్లానింగ్ కమిషన్ ఏర్పడింది. ఆ బాధ్యత దేశ్‌ముఖ్ మీద పడింది. అదే సంవత్సరం డా. జాన్ మత్తయ్ ఆర్థికమంత్రిగా రాజీనామా ఇచ్చినప్పుడు దేశ్‌ముఖ్ ఆ స్థానం పొందాడు. ప్లానింగ్ కమిటీ సభ్యుడుగా ఉంటూనే ఆర్థికమంత్రిగా ఉన్నాడు. 1951లో దేశ్‌ముఖ్ వివాహం దుర్గాబాయమ్మతో జరిగింది. అది దేశంలో గొప్ప సంచలనం సృష్టించింది. వారి పెళ్లిపత్రంపై నెహ్రూ, కృపలానీ దంపతులు సాక్షులుగా సంతకాలు చేశారు. ఇందిరాగాంధీ వారి వివాహంపట్ల ఎంతో ఆసక్తి కనబరిచారు.
దుర్గాబాయ్‌తో వివాహం జరిగిన తర్వాత మొదటి జన్మదినాన్ని ఆయన తన ఇంట్లో చాలా నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ సంగతి నెహ్రూకి తెలిసింది. వాళ్లని ఆట పట్టించటానికి నెహ్రూకు చక్కని అవకాశం లభించింది. ఏలాగో తీరిక చేసుకొని నెహ్రూ వాళ్ల ఇంట్లో ఊడిపడ్డారు. ‘ఏం దుర్గాబాయ్! దేశ్‌ముఖ్ నీ భర్తే కావచ్చు.. నా క్యాబినెట్ మంత్రి సుమా!’ అని ధూంధాం లాడటం మొదలుపెట్టారు. నెహ్రూని ప్రసన్నుణ్ణి చేసుకోవడానికి ఆ దంపతులు చాలా అవస్థ పడవలసివచ్చింది. కాసేపటికి వారిచ్చిన టీ బిస్కెట్ తీసుకుని నెహ్రూ మందహాసంతో వెళ్లిపోయారు. ఇలాంటి ఆప్యాయత ఈ రోజుల్లో కనిపించడం దుర్లభం. దేశ్‌ముఖ్ దంపతుల కళ్ళు ఆనందంతో అశ్రునయనులయ్యాయి. తన నియోజకవర్గం ప్రజల అభీష్ఠానికి వ్యతిరేకంగా బొంబాయి నగరాన్ని కేంద్రం అధీనంలో ఉంచడం ఇష్టపడక దేశ్‌ముఖ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌గా ఆరేళ్లు చేశారు.
దేశ్‌ముఖ్ సేవలను అంతర్జాతీయ ద్రవ్యనిధి వినియోగించుకోవాలని కోరినప్పుడు అందుకు ఆయన అంగీకరించలేదు. అప్పటికే దేశ్‌ముఖ్ దంపతులు సంక్షేమ కార్యక్రమాలను దేశమంతా విస్తరించి ఉన్నారు. సంవత్సరానికి 30వేల డాలర్ల వేతనం కాదని దేశసేవకే తన జీవితాన్ని ఆయన అంకితం చేశారు. ఇన్ని ఉద్యోగాలు చేసిన ఆయన ఎల్లప్పుడూ నిర్ధనుడే. కూడబెట్టిన ధనమంతా పూణేలో ఉన్న ఇల్లు మాత్రమే.
కాంగ్రెస్ గుర్తులు
1969లో అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి మురార్జీదేశాయ్‌ని నిష్క్రమించవలసిందిగా ఇందిరాగాంధీ కోరారు. ఆ తరువాత రెండు నెలలకు కాంగ్రెస్‌లో చీలిక సంభవించింది. దాంతో కాంగ్రెస్ ఎన్నికల చిహ్నమైన ‘కోడెద్దు’లను ఎన్నికల కమిషన్ స్తంభింపజేసింది. ఆపైన ఇందిరాగాంధీ కొత్తగా ‘ఆవుదూడ| చిహ్నాన్ని పొందగా, మురార్జీదేశాయ్ నాయకత్వంలోని పాత కాంగ్రెస్‌కు ‘రాట్నం తిప్పుతున్న మహిళ’ చిహ్నం లభించింది. 1978లో పార్టీలో తిరిగి చీలిక సంభవించడంతో ‘ఆవుదూడ’ చిహ్నాన్ని స్తంభింపజేయడం జరిగింది. ఇందిరాగాంధీ అప్పుడు కాంగ్రెస్-ఐని స్థాపించి ‘చేయి’ గుర్తు పొందారు. హస్తం గుర్తు శ్రీమతి ఇందిరాగాంధీకి ఎంతో అచ్చి వచ్చింది. కాసు బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలో కొద్దికాలం మనుగడ సాగించిన కాంగ్రెస్ (ఆర్)కు చరఖా గుర్తు కేటాయించారు.