mo
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన విపరీత, కరువులు పరిస్థితులకు కేంద్రం నుండి అందవలసిన నిధులు సరిగా సకాలంలో అందడం లేదని, వాటిని అందజేయడంలో అలసత్వం జరుగకుండా చూడాలని చెప్పడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మే 9న ఢిల్లీ వెళ్ళారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి, కరువు నివారణ కోసం చేపట్టే శాశ్వత చర్యల కోసం అవసరమైన నిధులు అందించాల్సిందిగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరారు. ప్రధానమంత్రిని ఢిల్లీలో మే 10న ముఖ్యమంత్రి కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను వివరించారు. గంటన్నర పాటు జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం చేపట్టిన తాత్కాలిక కార్యక్రమాలను వివరించారు. దీనితో పాటు భవిష్యత్తులో కరువు వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు చేపట్టిన శాశ్వత కార్యక్రమాలను వివరించారు. వీటికి కేంద్రం ఇతోధికంగా సహాయం చేయాలని కోరారు.

కరువు వల్ల ఏర్పడిన పరిస్థితిని ఎదుర్కోవడానికి మంచినీటి సరఫరా, ఇన్‌ పుట్‌ సబ్సిడీ, పశుగ్రాస పంపిణీ, పిల్లలకు మధ్యాహ్న భోజనం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తు న్నట్లు వెల్లడించారు. శాశ్వత కార్యక్రమాలుగా మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ చేపట్టినట్లు చెప్పారు. ఎలాంటి వాతావరణ పరిస్థితులు వున్నా ప్రజలకు మంచినీరు, పొలాలకు సాగునీరు అందించడం కోసం చేపట్టిన ఈరెండు కార్యక్రమాలను ప్రధానమంత్రి అభినందించారు.

”తెలంగాణ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కన్నా ఈ సారి 14శాతం తక్కువ వర్షాలు పడ్డాయి. నిజామాబాద్‌, మెదక్‌, రంగారెడ్డి, మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఏడు జిల్లాల్లోని 231 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు.కరువు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడానికి, ఇన్‌ పుట్‌ సబ్సిడీ అందించడానికి, మంచినీటి సరఫరాకు, పశుగ్రాసం అందచేయడానికి, ప్రజలకు ఉపాధి కల్పించడానికి రూ.3,064 కోట్లు కావాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరాం. కానీ కేంద్రం కేవలం రూ.712 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మేము కోరిన మిగతా డబ్బులన్నీ విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాం” అని ముఖ్యమంత్రి విన్నవించారు.

కరువు వల్ల 13.52 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 21.78 లక్షల మంది రైతులు నష్టపోయారు. పత్తి, మొక్కజొన్న, సోయాబీన్‌ లాంటి పంటలు దెబ్బతిన్నాయి. 23,700 హెక్టార్లలో కూరగాయలు, మామిడి, బత్తాయి, పసుపు, మిరప లాంటి తోటలు దెబ్బతిన్నాయి. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మనపై వుంది. మీరు ఎంత త్వరగా నిధులు విడుదల చేస్తే మేము అంత వేగంగా ఇన్‌ పుట్‌ సబ్సిడీ ఇవ్వగలుగుతాం”

– సిఎం కేసీఆర్‌

”తెలంగాణలో రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి, రుణ విముక్తులను చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా 36 లక్షల మందికి చెందిన రూ. 17,000 కోట్ల రుణాలను మాఫీ చేశాము. ఇప్పటికే మూడు విడతల రుణ మాఫీ జరిగింది. రాష్ట్రంలో సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నాము. డ్రిప్‌, స్ప్రింక్లర్ల వినియోగం పెంచడానికి రూ. 302 కోట్లు ఈ ఏడాది ఖర్చు చేస్తున్నాం. 231 కరువు మండలాల్లో 64 లక్షల పశువులకు 5.58 లక్షల మెట్రిక్‌ టన్నుల పశు గ్రాసాన్ని అందించాం. పశువులకు తాగునీళ్లు అందుబాటులో వుంచేందుకు 10,622 నీటి తొట్టెలను ఏర్పాటు చేశాం. పశుగ్రాసం అందించడం కోసం రూ. 75.90 కోట్లు అవసరమని గతంలోనే నివేదించాం. ఆ నిధులు త్వరగా ఇప్పించగలరు” అని సిఎం ప్రధాని దృష్టికి తెచ్చారు.

కరువు వల్ల ప్రజలు ఏలాంటి ఇబ్బందులు పడవద్దనే ముందుచూపుతోనే ప్రభుత్వం 2.82 కోట్ల మందికి నెలకు 6 కిలోల చొప్పున రూపాయికి కిలో బియ్యం అందిస్తున్నామని చెప్పారు. భూగోళంపై సరైన నిష్పత్తిలో చెట్లు లేకపోవడం వల్లే వర్షాలు సరిగ్గా రావడం లేదని, కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అడవుల శాతం పెంచేందుకు తెలంగాణకు హరిత హారం అనే కార్యక్రమాన్ని చేపట్టామని, రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు పెంచుతున్నామని సిఎం వెల్లడించారు.

తెలంగాణ నుంచి కరువును శాశ్వతంగా తరిమి కొట్టేందుకు రాష్ట్రంలోని 46 వేల చెరువులను పునరుద్ధరించేందుకు మిషన్‌ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సిఎం చెప్పారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో సాగునీరు అందుబాటులో వుంటుందని, భూగర్భజల మట్టాలు పెరుగుతాయని, కులవృత్తులకు చేయూత లభిస్తుందని సిఎం వివరించారు. గత ఏడాది మొదటి దశ మిషన్‌ కాకతీయ విజయవంతమైందని, ఈ ఏడాది రెండవ దశ పనులు పురోగతిలో వున్నాయని చెప్పారు. మిషన్‌ కాకతీయ మంచి కార్యక్రమమని ఈ సందర్భంగా ప్రధానమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా చేసే పనులను అడిగి తెలుసుకున్నారు. మిషన్‌ కాకతీయతో పాటు కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు వున్న వాటాకు అనుగుణంగా ప్రాజెక్టులు కూడా నిర్మిస్తున్నామని, 38 చోట్ల రిజర్వాయర్లు, బ్యారేజిలు కడుతున్నామని ప్రధానమంత్రి దృష్టికి తెచ్చారు. నీరు అందుబాటులోకి రావడం వల్ల రైతులకు కరువు నుండి శాశ్వత విముక్తి కలుగుతుందనేది తమ అభిమతమని ముఖ్యమంత్రి వెల్లడించారు.

వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రతిసారి భూగర్భజలాలు అడుగంటిపో తున్నాయని, మంచినీటికి ప్రజలు తరచూ ఇబ్బంది పడాల్సి వస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈసారి కూడా ఈ దుస్థితి వచ్చిందన్నారు. ఫలితంగా బోర్‌ వెల్స్‌, మంచినీటి పథకాలు ఉపయోగంలోకి రావడం లేదని చెప్పారు. ప్రజలకు మంచినీరు అందించడం కోసం ఇప్పటికే రూ. 303 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. 2420 ఆవాస ప్రాంతాలకు ఇతర ప్రాంతాల నుండి నీటి సరఫరా చేస్తున్నామని, ఏడు వేలకుపైగా ప్రైవేట్‌ బోర్లను కిరాయికి తీసుకున్నామన్నారు. తాత్కాలికంగా ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యల కోసం రూ.227 కోట్లు ఇవ్వాలని ప్రధానిని కేసిఆర్‌ కోరారు. భవిష్యత్‌ లో కరువు పరిస్థితులు వచ్చినా సరే ప్రజలకు మంచినీటికి ఢోకా వుండవద్దనే ఉద్దే శ్యంతో మిషన్‌ భగీరథ కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు. రాష్ట్రంలోని 24 వేలకు పైగా ఆవాస ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరు అందించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు. మిషన్‌ భగీరథ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమమని ప్రధానమంత్రి కొనియాడారు. కార్యక్రమం అమలు తీరు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పనుల పురోగతిని ప్రధానికి వివరించిన సిఎం 2017 నాటికే 90 శాతం లక్ష్యం నెరవేరుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కరువు వల్ల పేదలు ఇబ్బంది పడవద్దని, ముఖ్యంగా భావితరం బాధపడవద్దనే ఉద్దేశ్యంతో ఎండా కాలంలో కూడా రాష్ట్రంలోని 24 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్నం పూట భోజనం పెడుతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వపు వాటాను కూడా కలిపి ఉపాధి హామి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని, కరువు పరిస్థితుల్లో ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. 13 లక్షల కుటుంబాలకు 150 రోజుల పాటు పని కల్పిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.20 లక్షల ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. కరువు పరిస్థితులు వున్నా సాధారణ జీవితానికి ఇబ్బంది కలుగవద్దనే ఉదేశ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 35.89 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. పెన్షన్ల కోసం కేంద్ర ప్రభుత్వం 253 కోట్లు మాత్రమే ఇస్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 4800 కోట్లు ఖర్చు చేస్తున్నదని వెల్లడించారు. రాష్ట్రంలోని 14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ, ఇబిసి విద్యార్థులకు రూ. 2800 కోట్ల మేర స్కాలర్‌ షిప్పులు అందిస్తున్నట్లు చెప్పారు.

పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇవ్వాల్సిన ప్రత్యేక నిధుల్లో ఇప్పటి వరకు ఒక్క విడత మాత్రమే అందాయి. మిగతా డబ్బులు అందితే మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ లాంటి దీర్ఘకాలిక ప్రజోప యోగ కార్యక్రమాలకు వినియోగించుకోవడానికి ఉపయోగ పడతాయని సిఎం అన్నారు.

ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బిఆర్‌ మీనా ఉన్నారు. ప్రధానమంత్రితో పాటు కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌, వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్‌ సింగ్‌, ఇతర ముఖ్య అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

Other Updates