మానవ జీవితాన్ని ఇప్పుడు కరెంటు నడిపిస్తున్నది. కరెంటు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. అవసరాలు పెరిగిపోవడంతో కరెంట్ డిమాండ్ కూడా పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువమంది రైతులు, ఎక్కువ సంఖ్యలో ఉన్న పారిశ్రామిక సంస్థలు, సేవారంగంలో ఉన్న ఉద్యోగులు అనునిత్యం కరెంట్‌పైనే ఆధారపడి ఉన్నారు.
సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో పాలకులు ఉద్దేశ్యపూర్వకంగా తెలంగాణ ప్రాంతంపట్ల వివక్ష చూపడంవల్ల ఇప్పుడు విద్యుత్ కొరత ఏర్పడిరది. తెలంగాణలో అపార బొగ్గు నిక్షేపాలు ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వాలు ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు పెట్టలేదు. దీనివల్ల ఇప్పడు మనకు కావలసినంత విద్యుత్ అందుబాటులో లేకుండా పోయింది. తెలంగాణలోని పరిశ్రమలపైన, వ్యవసాయంపైనా ఈ కొరత చాలా ప్రభావం చూపిస్తున్నది.
విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి తెలంగాణ ప్రభు త్వం సకల ప్రయత్నాలు చేస్తున్నది. వచ్చే ఐదేళ్ళలో 20వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇటీవలె విద్యుత్ కొనుగోలు ఒప్పందం కూడా కుదుర్చుకుని వచ్చారు. ఎన్‌టిపిసి ద్వారా రామగుండంలో 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును ఏర్పాటు చేస్తున్నారు. జెన్‌కో ఆధ్వర్యంలో 6వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్లను నిర్మిస్తున్నారు. ఇందుకోసం బి.హెచ్.ఇ. ఎల్.తో ఎంఓయూ కూడా చేసుకోవడం జరిగింది. ఇంకా సోలార్ విద్యుత్ ఉత్పత్తికి టెండర్లు కూడా నిర్వహించారు. ఈ ప్రయత్నాలన్నీ ఫలించేవరకు కొంతసమయం పడుతుంది. ఒకటి రెండేళ్లలో పరిస్థితి కొంత మెరుగవుతుంది. మూడేళ్ల తరువాత మన అవసరాలకు తగినంత విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రంలో అందరికీ 24 గంటల విద్యుత్ అందించడం, మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యంగా వుంది.ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులను ఆదుకోవడానికి శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో జలవిద్యుత్ ఉత్పత్తి చేయడంతోపాటు పవర్ ఎక్స్ఛేంజ్‌లో కూడా పెద్ద ఎత్తున కరెంట్‌కొనుగోలు చేశారు.
జల విద్యుత్, థర్మల్ విద్యుత్‌తోపాటు సోలార్ విద్యుత్‌ను కూడా అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించారు. రాష్ట్రంలోని రైతులకు సోలార్ పంపుసెట్లను అందించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఈ బడ్జెట్‌లో 200 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. రూఫ్ టాప్ సోలార్ పవర్ ఉత్పత్తికోసం 40 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రణాళికలో భాగంగా టిఎస్ జెన్‌కోలో 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నారు. నాన్‌ప్లాన్ కింద విద్యుత్ రంగానికి 3241.90 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. ఇందులో మూడువేల కోట్ల రూపాయల విద్యుత్ సబ్సిడీలు కూడా భాగం.