కర్నాటక-సంగీత-సాగరంలో--ఎగిసిపడే-కెరటం-మాళవిక2కర్నాటక సంగీత సాగరంలో
ఎగిసిపడే కెరటం మాళవిక
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న సామెతకు ఆ బాలిక చక్కటి ఉదాహరణ. ఎంతో సాధన చేస్తే కానీ రాని సంగీతాన్ని అలవోకగా నేర్చుకుని అందరినీ ఆకట్టుకోవడమే కాదు మైసూర్‌ దసరా ఉత్సవాల్లో కూడా తన సంగీత కచేరీని చేసిందంటే ఆ బాలికలో ఎంతటి కళాతృష్ణ దాగుందో అర్దమవుతుంది. ఆ బాలిక పేరే మాళవిక.
సమాజం కొత్త పోకడలు పోతున్న ఇప్పటి రోజుల్లో పాశ్చాత్య రీతులు పెడదోరణులు పడుతున్న పరిస్థితుల్లో కూడా కర్నాటక సంగీతంపై మక్కువతో ఆ సంగీతాన్ని నేర్చుకోవడమే కాకుండా కచేరీలు కూడా చేసిన ఘనత మాళవిక సొంతం చేసుకుంది. చిరు ప్రాయంలోనే నాలుగు భాషలలో ఆల్బమ్‌లు రూపొందించిన మాళవిక వరుస కచేరీలతో ఆకట్టుకుంటోంది. 14 సంవత్సరాల వయసులోనే నాలుగు రికార్డులు సొంతం చేసుకోవడం మాటలు కాదు. అందులోను శాస్త్రీయ సంగీతమంటే కూనిరాగాలు తీయటం కాదు. ఎంతో సాదన చేస్తే తప్ప కచేరి చేయలేము. ఎందరో ఉద్దండ సంగీత పండితుల ముందు చేయాల్సి వచ్చినప్పుడు సంగీతంలో నిశ్నాతులైన వారు కూడా కాస్తా జంకుతారు. కానీ మాళవిక అలవోకగా తన సంగీతాన్ని వినిపించి భేష్‌ అనిపించుకుంది. ప్రస్థుతం హైదరాబాద్‌ సిస్టర్స్‌ వద్ద సాదన చేస్తున్న మాళవిక గురించి తెలుసుకుందాం.
నగరంలోని బర్కత్‌పురలో నివాసముంటున్న వివేకానంద, సుచిత వి.ఆనంద్‌ దంపతులకు 8 డిసెంబరు 1999లో మాళవిక జన్మించింది. మాళవిక అమ్మ వైపున పూర్వీకులు వయోలిన్‌ విద్వాంసులుగా కీర్తి పొందారు. బహుశా వారి జీన్స్‌ ప్రభావమేమో కానీ మాళవిక చిన్ననాటి నుంచే కర్నాటక సంగీతం పట్ల మక్కువ పెంచుకున్నారు. కర్నాటక సంగీతంపై ఆమెకున్న ఆసక్తిని గమనించిన తల్లితండ్రులు ప్రోత్సాహాన్ని అందించారు. వారి ప్రోత్సాహంతో మాళవిక సంగీత సాధన చేయడం ప్రారంభించింది.
రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో సుమారు 70కి పైగా సంగీత కచేరీలు తెలుగు, తమిళ, కనడ, హిందీ భాషలలో చేసింది. భక్తిగీతాలతో కూడిన సీడీ, రామదాసు కీర్తనలతో కూడిన సీడీలను 9 నుండి 11 సంవత్సరాల వయసులోనే రూపొందించారు. కర్నాటకలో ప్రతిష్టాత్మకమైన మైసూర్‌ దసరా ఉత్సవాలలో తన సంగీత కచేరిని చేసి ప్రశంసలందుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం దేవాలయంలో ఇచ్చిన సంగీత కచేరి సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ దంపతుల చేతుల మీదుగా శాలువా కప్పించుకుని దీవెనలు పొందారు. అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా యునిక్‌ వరల్డ్‌ రికార్డును అందుకున్నారు. తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో తన గానాన్ని వినిపించారు. ఇలా పలు రికార్డులు సొంతం చేసుకున్న మాళవిక కర్నాటక సంగీతంలో పిహెచ్‌డీ చేయడమే తన ధ్యేయంగా చెప్పుకొచ్చారు.

Other Updates