భారతదేశం ధర్మభూమి, కర్మభూమి. ధర్మాన్ని అనుసరించి, ఆచరించి కర్మలు నిర్వహించడం మన భారతీయ సంస్కృతిలో పరంపరగా వస్తుంది. మన ఋషులు శాస్త్రాధారంగా ధర్మబద్ధంగా మనం ఆచరించవలసిన కర్మలను నిర్దేశించినారు. వారు చూపిన మార్గంలో ఆయా సమయాల్లో మనం మన కర్మలను ఆచరించి ధర్మమార్గంలో పయనిస్తేనే ఉత్తమమైన జీవన విధానాన్ని అనుసరించగల్గుతాం. జీవనలక్ష్యమైన మోక్షాన్ని, విముక్తిని పొందాలంటే సంస్కార భావనతో నిరంతర శుద్ధి ప్రక్రియలో ఉండాలి. కాలానుగుణమైన శుద్ధి ప్రక్రియలు తప్పనిసరిగా పాటించాలి. భారతీయ జీవనవిధానంలో ఆ మార్గంలో వ్యక్తి ఉన్నతమైన సంస్కార విధుల్ని నిర్వహించే కర్మలే పుష్కర సంస్కారాలు.
పుష్కరం – విశిష్టత
పుష్కరం అంటే ఆధునిక కాలంలో ఏదైనా జీవనదికి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది అనే అర్థం చెపుతున్నారు. అయితే పుష్కరం అంటే జలం అనే అర్థం ఉంది. మనిషికి పుష్టినిచ్చే వాటిలో నీరు ఒకటి. ”పోషయతీతి పుష్కరం” పోషించేది అనే అర్థం. జలాన్ని బాహ్య శుద్ధికి, అంతఃశుద్ధికి కూడా వినియోగిస్తుంటాం. ఈ పుష్కర విజ్ఞానానికి సంబంధించి మన పూర్వీకులు ఒక కథను చెప్తారు.
పూర్వం తుందిలుడు అనే ఋషి పరమేశ్వరునిలో శాశ్వతంగా ఉండాలనే కోరికతో తీవ్రమైన తపస్సు చేసి అతన్ని ప్రత్యక్షం చేసుకున్నాడు. పరమశివుడు తన అష్టమూర్తుల్లో ఒకటైన జలరూపంలో అతనికి శాశ్వత స్థానం కల్పించి సమస్త జలరాశికి, మూడున్నరకోట్ల పుణ్యతీర్థాలకు సార్వభౌముడుగా వరాన్ని ప్రసాదించాడు. సృష్టి, స్థితి, లయాల్లో బ్రహ్మది సృష్టికార్యం. ఆ కార్యం నిర్వహించడానికి జలం అవసరమైంది. అప్పుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి, పుష్కరుడు తన కమండలంలో ఉండేటట్లు వరం పొందినాడు. జీవులను బ్రతికించే బాధ్యత బృహస్పతిది. కాబట్టి బ్రహ్మను గూర్చి తపస్సు చేసి పుష్కరుడిని (తుందిలుడు) తనకు అనుకూలంగా ఉంచమని అర్థించాడు. పుష్కరుడు బ్రహ్మను వదిలి ఉండటం ఇష్టంలేనివాడై తనకు తోడుగా బృహస్పతివద్ద ఉండమని బ్రహ్మను కోరినాడు. కాని సృష్టికార్య నిర్వహణ కష్టమవుతుంది కాబట్టి బ్రహ్మ ఒక సూచన చేశాడు. గ్రహ స్వరూపుడైన బృహస్పతి మేషాది 12 రాశుల్లో ప్రవేశించేటప్పుడు 12 రోజులు, ఆ రాశులనుండి వెళ్ళిపోయేటప్పుడు 12 రోజులు సంవత్సరంలో మిగిలిన అన్నిరోజుల్లో మధ్యాహ్న సమయంలో రెండు ముహూర్తాల కాలం గురువుతో పుష్కరుడు ఉండాలని, ఆ సమయంలో తాను (బ్రహ్మ) యావద్దేవతా గణాలతో కలిసి బృహస్పతి ఏ రాశిలో ఉంటే ఆ రాశి అధిష్ఠానమైన పుణ్యనదికి వస్తుంటానని చెప్పి అటు బృహస్పతిని, ఇటు పుష్కరుణ్ణి సంతుష్టులను చేసి, సమస్త మానవాళికి సంతోషాన్ని కూర్చినాడు. ఈ విధంగా సృష్టి స్థితులకు ఆధారమైన ఈ జలమే పుష్కరాల రూపంలో మనకు పుణ్యాన్ని చేకూరుస్తున్నాయి.
మేషే గంగా వృషే రేవా మిథునేచ సరస్వతీ |
కర్కటే యమునా ప్రోక్తా సింహే గోదావరీ స్మృతా ||
కన్యాయాం కృష్ణవేణీచ కావేరీ ఘటకే స్మృతా|
వృశ్చికే తామ్రపర్ణీ చ చాపే పుష్కర వాహినీ|
మకరే తుంగభద్రా చ కుంభే సింధునదీ స్మృతా ||
మీనే ప్రణీతా చ నదీ గురోస్సంక్రమణే స్మృతా |
పుష్కరాఖ్యో మునీనాం హి ప్రదేశోకత్ర బుధ్ణైుు స్మృత్ణ ||
పన్నెండు రాశుల్లో సంచరించే గురువు కన్యారాశిలో ప్రవేశించిన సమయంలో కృష్ణవేణీ పుష్కరాలు ప్రారంభం అవుతాయి. ప్రవేశించినప్పటినుండి మొదటి 12 రోజులు ప్రధానమైనవిగా చెప్తారు. సంవత్సర మధ్యంలో మధ్య పుష్కరం అని, సంవత్సరం చివరి 12 రోజులు అంత్య పుష్కరంగా వ్యవహరిస్తారు.
కృష్ణా పుష్కరాల విశిష్టత
కృష్ణా నది రంగు నలుపు. అంటే కృష్ణుని రంగు. ఈ నది ఏర్పడడానికి కూడా పెద్దలు ఒక కథ చెప్తారు. లోకానుగ్రహ తత్పరులైన రాధాకృష్ణులు కోపావేశంలో గంగాది పుణ్యనదుల పేర్లతో ఉన్న గోపికలను భూలోకంలో జన్మించమని శపించినారట. అప్పుడు ఆ గోపికలు ప్రార్థించగా భరతభూమిలో మీ మీ పేర్లతో నదులుగా జన్మించి సర్వజీవులను ఉద్ధరించమని వరమిచ్చినారట. ఆవిధంగా గంగా, యమున, సరస్వతి మొదలైన జీవనదులు ఉద్భవించినాయి. దేవతల కోరికమీద సహ్యాద్రి పర్వతప్రాంతంలో కృష్ణుడు తన వామభాగంనుండి కృష్ణానది (రాధారూపం)ని పుట్టించి ప్రవహింపచేసినట్లు ఐతిహ్యం. కాబట్టే ”కృష్ణే కృష్ణాంగ సంభూతే జంతూనాం పాపహారిణి” అనే పేరు సార్థకమైంది. ఈవిధంగా కృష్ణవేణీ నది ఉద్భవించి ప్రతి 12సంవత్సరాలకు ఒకసారి ముప్పైకోట్ల దేవతలు, సమస్త గురు, దేవతా, రాశిగణం గురువుతో వచ్చి పుష్కరమనే పేరుతో సకల జీవులకు దర్శనం, స్పర్శనం, స్నానమాత్రంచేత అనేక పాపాలను పోగొడుతూ శారీరక, మానసిక ప్రశాంతతను కల్పిస్తూ ప్రజల్లో ధార్మిక, ఆధ్యాత్మిక భావాలను ఉత్తేజపరుస్తున్నది.
”కృష్ణవేణీతి యో బ్రూయాత్ సప్త జన్మార్జితాన్యపి |
మహా పాపాని నశ్యంతి విష్ణులోకం స గచ్ఛతి||”
పుష్కర సమయంలో కృష్ణవేణీ అని ఆ తల్లి నామాన్ని స్మరిస్తేనే ఏడుజన్మల క్రింద చేసిన పాపాలు నశించి, స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని తెలుస్తుంది.
కృష్ణాపుష్కర సమయంలో స్నానం చేసే విధానం
పుష్కర సమయంలో బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, సర్వదేవతలు, ఋషులు, పితృదేవతలు అందరూ నదిలో కొలువై ఉంటారు. అందుకే వీరందరికీ నమస్కారం చేసి అర్ఘ్యం ఇచ్చి స్నానం చేయాలి.
నదిలో స్నానం చేయడానికి ముందు
‘పిప్పలాదాత్సముత్పన్నే కృష్ణే లోక భయంకరి |
మృత్తికాం తే మయా దత్తాం ఆహారార్థం ప్రకల్పయ ||
నదిలో దిగుతూ రేగిపండంత మట్టిని మూడుసార్లు నదిలో వేసి ప్రార్థించాలి.
పొద్దున్నే నిద్రలేస్తూనే భూదేవిని క్షమించమని ప్రార్థిస్తాం. అదే విధంగా నదీస్నానం చేయడానికి
”పావని! త్వం జగత్పూజ్యే! సర్వ తీర్థమయే శుభే |
త్వయి స్నాతుమనుజ్ఞాం మే దేహి కృష్ణే! మహానది ||
నదీమతల్లి ఆజ్ఞ తీసుకొని
”కన్యాగతే దేవగురౌ పితౄణాం తారణాయ చ
సర్వ పాప విముక్త్యర్థం తీర్థస్నానం కరోమ్యహమ్ ||
మనస్సులో ధ్యానం చేసుకోవాలి.
ఆ తర్వాత నదికి నమస్కారం చేస్తూ ”సర్వలోకాల పాపాలను హరించే ఓ తీర్థరాజమా! నీ నదిలో స్నానం చేయడం వల్ల భవ బంధ విముక్తుడిని చేయి” అంటూ ప్రార్థిస్తూ స్నానం చేయాలి.
ఆ తరువాత కృష్ణానదికి, తీర్థరాజుకు, బృహస్పతికి, విష్ణువుకు, శివుడికి, బ్రహ్మాది దేవతలకు, వశిష్ఠాది మునులకు, గంగాది సకల నదులకు, ప్రత్యక్ష దైవమైన సూర్య నారాయణుడికి నీటితో అర్ఘ్యమిచ్చి వచ్చినవారు ప్రార్థనా శ్లోకాలను చదువుకోవాలి. లేనిచో ఆ దైవాలను తలచుకొని అర్ఘ్యం ఇవ్వాలి.
పుష్కరాలు – పితృకర్మలు
పుష్కరాల్లో స్నానం చేయడమే ఎంతో పుణ్యం. ఇంకా పితృకర్మలు నిర్వహించాలా? అని చాలామంది సందేహం. అసలు పితృకర్మలు ఎందుకు నిర్వహించాలి. మనం నిర్వహించే ఈ కర్మలు మన పితృదేవతలకు చెందుతుందా? వారు గమనిస్తారా?, పుష్కరాలకు, పితృకర్మలకు ఎటువంటి సంబంధం ఉంది వంటి అనేక ప్రశ్నలకు సమాధానం ఈ క్రింది శ్లోకం చెప్తుంది.
గంగాయాం పుష్కరే శ్రాద్ధే అర్ఘ్యమావాహనాదికమ్
తృప్తి ప్రశ్నాదికం పిండం యథావిధి సమాచరేత్ ||
బ్రహ్మావిష్ణుశ్చ రుద్రశ్చ ఇంద్రాద్యాస్సర్వ దేవత్ణా |
పితరో ఋషయశ్చైవ తత్రైవ నివసంతి హి ||
కృష్ణాయ్ణా పుష్కరే కృత్వా స్నానం దానం చ పైతృకమ్ |
గంగాయాం కోటి గుణితం ఫలమాప్నోతి మానవ్ణ ||
పుష్కరాల సమయంలో పుణ్యఫలం మీద అపేక్షతో త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు, ఋషులు, పితృదేవతలు వస్తారు. ఆ సమయంలో మనం స్నానం, దానం, పూజ, పితృ తర్పణాలు శ్రాద్ధ కర్మలు చేస్తే పుణ్యం కోటిరెట్లు పెరుగుతుందని పెద్దలు చెప్తారు.
సాధారణంగా ఇంట్లో ఎవరైనా చనిపోతే వారికి నెల నెల మాసికాలు సంవత్సర విమోకం, ప్రతి సంవత్సరం వారు మరణించిన తిథినాడు ఆబ్దికాలు నిర్వహిస్తారు. ఆవిధంగా చేయడం వల్ల వారిని మనం స్మరించుకుని వారి పేరు మీద నలుగురికి అన్నదానం చేయడం, బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులు ఇవ్వడం చేస్తారు.
ఆధునిక కాలంలో అవి నిర్వహించే సమయం, ఓపిక, అవకాశాలు లేకుండా పోయాయి. అటువంటివారు తప్పనిసరిగా పుష్కర సమయాల్లో పితృదేవతలు కూడా పుష్కరస్థానంలో ఉంటారు కాబట్టి వారు మరణించిన తిథి నాడు లేదా అమావాస్యల్లో కాని పితృకార్యాన్ని, శ్రాద్ధాన్ని నిర్వహిస్తే పితృదేవతలు సంతృప్తులవుతారు. ఆ కర్మ నిర్వహించినవారు కూడా తృప్తి చెందుతారు. ఆ కారణంగా పుష్కర సమయాల్లో శ్రాద్ధ కర్మలు నిర్వహించాలనే నియమం ఏర్పడింది.
పితృకర్మల విషయంలో ఇంకో విశేషం కూడా ఉంది. ఉన్నతమైన, పవిత్రమైన జీవితం గడిపిన ఒక వ్యక్తి మరణానంతరం అతని జీవన విధానం ఆ ఇంట్లో కొనసాగుతూ ఉంటే వారు ఆ ఇంట్లో సంతానంగా జన్మిస్తారనే నమ్మకం ఉంది. అందుకు ఈ పితృ తర్పణాలు ఎంతో ఉపకరిస్తాయి. ఇట్లా మళ్ళీ మళ్ళీ జన్మించడం వల్ల కుటుంబ సంస్కారం విలువలు పడిపోకుండా నిలబడటానికి, భారతీయ ధర్మాన్ని కొనసాగించడానికి వీలవుతుంది. అట్లా అని శ్రాద్ధకర్మలు చేయనివాళ్ళంతా పతనం వైపు పయనిస్తారని కాదు. కాని ఒక ప్రశాంతమైన జీవన విధానంలో ఉన్న సుఖం, సౌలభ్యం వేరేచోట లభించదు కదా. అందుకే మన పూర్వీకులను తలచుకుని, వారికి శ్రాద్ధకర్మలు నిర్వహించి పితృ ఋణం తీర్చుకొని, వారి ఆశీస్సులను పుష్కరసమయంలో పొందడం పుష్కరాలకు, శ్రాద్ధకర్మల నిర్వహణకు ఉన్న సంబంధం. తమ భౌతికదేహానికి, మానసిక వికాసానికి కారకులైన వారికి జన్మ ఉన్న సమయంలో సేవ చేసుకోవడం, మరణం తర్వాత పవిత్ర క్షేత్రాలు, తీర్థాలు, పుష్కరాదులలో స్మరించి వారి కోసం ప్రత్యేక అర్చనలు చేయడమే శ్రాద్ధం. దీనిలో శ్రద్ధ ప్రధానం. దీనివల్ల పెద్దల ఆశీస్సులు, మార్గదర్శనం తరువాతి తరాలకు లభిస్తుంది.
అంతేకాదు చనిపోయినవారు దానం చేసినా చేయకపోయినా మరణించిన 12 రోజుల్లో చేసే కర్మల్లో దశదానాలు, షోడశ దానాలు వారి సంతానం చేస్తారు. దానివల్ల వైతరణిని దాటుతారని పెద్దలు చెప్తారు. పుష్కరాల్లో కూడా పెద్దల పేరుమీద దానాలు చేయడం కూడా అటు వంటిదే. పుష్కరాదుల్లో దానాదులకు అత్యంత వైశిష్ట్యం ఉంది.
కేవలం పితరులే కాదు మనకు సన్నిహితులు, గురువులు, మిత్రులు, ఉపకారం చేసినవారు, సేవకులు ఇలా ఎవరికైనా ధర్మపిండ ప్రదానం చేయడంవల్ల వారికి సద్గతి ప్రాప్తిస్తుంది. తత్ఫలితంగా కర్మ చేసినవారికి పుణ్యం లభిస్తుంది.
పుష్కరాలు 12 రోజుల్లో చేయవలసిన దానములు
మొదటిరోజు: బంగారం, వెండి, ధాన్యం, భూమి
రెండవరోజు: వస్త్రాలు, ఉప్పు, రత్నం
మూడవరోజు: బెల్లం, అశ్వం (వాహనం), పండ్లు
నాల్గవరోజు: నెయ్యి, నూనె, పాలు, తేనె
ఐదవరోజు: ధాన్యం, ఎద్దు, దున్నపోతు, నాగలి
ఆరవరోజు: ఔషధం (మందులు), ర్పూరం, కస్తూరి, చందనం
ఏడవరోజు: ఇల్లు, చాప, మంచం, పల్లకి
ఎనిమిదవరోజు: గంధపుచెక్క, పూలు, అల్లం
తొమ్మిదవరోజు: పిండ ప్రదానం చేసి పరుపు, మెత్త, కంబళి వంటి శయ్యాదానం
పదవరోజు: కూరగాయలు, దేవతామూర్తులు
పదకొండవరోజు: సాలగ్రామం, పుస్తకాలు, కంబళి
పన్నెండవరోజు: నువ్వులు
ఆయారోజుల్లో ఈవిధమైన దానాలు చేయడం మంచిదని పెద్దలు సూచించినారు. అయితే అన్నిరోజులు కచ్చితంగా ఇవే ఇవ్వాలనే నియమం లేదు. ఎవరికి ఎంత శక్తి ఉంటే, వీలునుబట్టి వారి స్థాయికి తగిన దానాలు నిర్వహించుకోవచ్చు.
దంపతీ స్నానం
భారతీయ ధర్మంలో భర్త ఏ కార్యం నిర్వర్తించినా భార్య తోడుంటేనే అతడు చేసే కర్మలకు ఫలితం దక్కుతుంది. యజ్ఞయాగాలు నిర్వహించినా, వివాహ తంతులోనైనా, ఏ కార్యానికైనా భార్యతో కలిసి చేయడం మన సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని అనుసరించే పుష్కరాల్లో కూడా దంపతులు కలిసి స్నానం చేయడం ఆచారంగా మారింది. అంతేకాకుండా అత్తవారింటికి వచ్చిన తర్వాత ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి అవుతుంది, అత్తమామలు తల్లితండ్రులతో సమానం కాబట్టి వారికి సంబంధించిన పితృకార్యాల్లో భార్య తప్పనిసరిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఇద్దరు కలిసి చేసే పనుల వల్ల కుటుంబం సౌఖ్యంగా, పిల్లలు వారిని అనుసరించి తమ జీవన విధానాన్ని ఏర్పరచుకుంటారు.
”కృష్ణవేణీతి యో బ్రూయాత్ సప్త జన్మార్జితాన్యపి |
మహా పాపాని నశ్యంతి విష్ణులోకం స గచ్ఛతి||”
అన్న శ్లోకాన్ని స్మరిస్తూ మూడుసార్లు నదిలో మునిగి ఆ తరువాత సర్వదేవతలకు నమస్కరించి తరువాతి కార్యక్రమాలు నిర్వహించాలి.
గౌరీ పూజ, మూసి వాయనాలు
పుష్కరాల సమయంలో ఆడవారు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. వీరు గౌరీ పూజను నిర్వహిస్తారు. అదేవిధంగా నదీమతల్లికి తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని, సంతానం వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ పసుపు, కుంకుమ, పూలు, వస్త్రం, నల్లపూసలు, అద్దం వంటివి సమర్పించుకుంటారు. తోటి ఆడవాళ్ళకు పసుపు కుంకుమలిచ్చి మూసి వాయనాలు ఇవ్వడం వల్ల కుటుంబాలకు శ్రేయస్సు కలుగుతుంది.
పుష్కర సమయంలో నదీతీరంలో చేయకూడనివి
పుష్కరాల సమయంలో ఇప్పటివరకు ఎటువంటి విధులు ఆచరించాలి, ఏవిధంగా స్నాన సంస్కారాలు, శ్రాద్ధ విధులు నిర్వర్తించుకోవాలో తెలుసుకున్నాం. అదేవిధంగా పుష్కరాల్లో చేయకూడనివి కూడా తెలిస్తే మన పుష్కర యాత్ర విజయవంతమవుతుంది.
– కృష్ణమ్మతల్లి పరమ పవిత్రమైనది. ఆ అమ్మను అపవిత్రం చేయకూడదు.
– నదిలో స్నానం చేసేటప్పుడు అన్ని విధులను శ్రద్ధగా ఆచరించాలి కాని ఏదో నీళ్ళలో మునగాలి కదా అని అశ్రద్ధగా ఉండకూడదు.
– నదీ జలాల్లో బట్టలు ఉతకకూడదు. అదేవిధంగా మలమూత్ర విసర్జన, ఉమ్మివేయడం, ముక్కు చీదడం వంటికి నిషిద్ధం. దీనివల్ల స్నానం చేయడంవల్ల వచ్చే పుణ్యం కంటే పాపమే ఎక్కువ వస్తుంది.
– స్నానం చేసే సమయంలో పిల్లలను జాగ్రత్తగా గమనించుకోవాలి. వారిని ఒంటరిగా వదిలిపెట్టకూడదు.
– స్నానం చేసిన తర్వాత పొడిబట్టలు కట్టుకొని ఆ తీర్థ క్షేత్రంలో కొలువై ఉన్న దైవాన్ని దర్శించుకోవాలి.
– నదీ తీరాల్లో ఏర్పాటు చేసే అన్నదాన సత్రాలకు, అన్నదానం చేసేవారివద్ద మనం భోజనం చేసినప్పుడు మనకు తోచిన సహాయం వస్తు, ధన రూపంలో చేయాలి. ఎందుకంటే ఎవరో దానం చేస్తే మనం తింటున్నాం. కాబట్టి మనం కూడా ఆ ధర్మకార్యంలో పాలుపంచుకోవడం ఆవశ్యకం.
– దేవాలయ సంద్శనం కూడా ప్రశాంతంగా దైవధ్యానం చేసుకుంటూ చేయాలి.
కృష్ణమ్మతల్లి పన్నెండు సంవత్సరాల విరామం తర్వాత మనను రుణించటానికి పుష్కరుడి రూపంలో వస్తుంది. అందరం ఆ అమ్మకు నమస్కరించి, మనపై ఎల్లప్పుడు రుణను కురిపించమని వేడుకుంటూ పుష్కర స్నానాలు నిర్వహించుకుందాం.
– డా|| సాగి కమలాకర శర్మ
– డా|| భిన్నూరి మనోహరి