అయన వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్. పేరు ప్రశాంత్ జీవన్ పాటిల్. పేరునుబట్టి మహారాష్ట్ర లేదా కర్ణాటకలో పుట్టి ఉండవచ్చు. పేరుకు తగ్గట్టే ప్రశాంత, ప్రశస్త జీవనం కోరుకునే వ్యక్తి.
మాములుగా మన తెలుగురాష్ట్రాల్లో ఎల్‌కేజీ నుండి సివిల్ సర్వీసు పరీక్షలదాకా ఏ ఫలితాలు వచ్చినా అత్యుత్తమ ర్యాంకులు ప్రముఖ కార్పొరేట్ విద్యాలయాలకు పోగా మిగిలిన పరిగలు మిగతా యావత్ప్రపంచ విద్యాలయాలు పంచుకుని బిక్కుబిక్కుమంటూ ఎవరికీ చెప్పుకోలేక సిగ్గుతో తలవంచుకుని ఉంటాయి. ఈ లోపు ఒకటి ఒకటి ఒకటి రెండు రెండు రెండు అంటూ వందదాకా పదునాల్గు లోకాల్లో అత్యుత్తమ ఫలితాలు మావే అని టీ వీ ప్రకటనలు మొదలవుతాయి. మరుసటి రోజు అన్ని పేపర్లలో ఇవే ప్రకటనలు, వార్తలు కళ్లు మూసుకున్నా కనబడతాయి. చెవులు మూసుకున్నా వినపడతాయి. ఈ ప్రవాహంలో మిగతావన్నీ కొట్టుకుపోతాయి. ఇదొక పెద్ద కార్పొరేట్ వ్యూహం, కుట్ర, వేల కోట్ల వ్యాపారసూత్రం, పెద్ద వల, ఎవరూ ఛేదించలేని విషవలయం. పాఠం ఆత్మహత్యలను నేర్పుతున్నా, పరీక్ష శిక్షిస్తున్నా , ఎండమావుల్లో ఎప్పటికీ దొరకని నీటిలా ర్యాంకులు భ్రమగా మిగిలినా – గొర్రె కసాయివాడినే నమ్ముతుందన్న సామెతను నిజం చేయడానికి మనపిల్లలు ఆ కార్పొరేట్ విద్యాలయాల్లోనే ఇరుక్కుపోతారు.
ఈ విషవలయాన్ని ఎంతో కొంత ఛేదించి వైవిధ్యంగా నిలబడ్డారు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్. పదో తరగతి పరీక్షల్లో పదికి పది జీపిఏ తెచ్చుకున్న ప్రభుత్వ పాఠశాలల పిల్లలను, వారికి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను తన క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి వారితో కలిసి భోంచేశారు. విద్యార్థులను అభినందించారు. వారితో ఆత్మీయంగా గడిపారు. ఫోటోలు తీసుకున్నారు. ఇది తెలిసి తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి రాష్ట్రమంతా ఇలాగే విద్యార్థుల అభినందన సభలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
నిజానికి ఇది మంచి వార్త. పదిమందికి తెలియాల్సిన వార్త. కానీ ఎగ్జిట్ పోల్స్ వార్తలు పత్రికలను ముంచేయడంతో ఈ వార్తకు ప్రాధాన్యం తగ్గింది. కొన్ని పత్రికలకు ఇది వార్త కానే కాలేదు.
ఆత్మహత్యల పాఠాలు నేర్పుతున్న యాంత్రిక బట్టీ బడుల మధ్య ఈ వార్త ఒక ఆశాజ్యోతి. ఒక మెరుపు. ఒక వెలుగు. ఒక స్ఫూర్తి. ఒక ఊరట. ఒక ధైర్యం. ఒక చక్కటి రేపటికి గ్రామీణ భావిభారత పౌరులు పది ఫలితాలతో పేర్చిన మంచి వంతెన. భవిష్యత్తులో కూడా ఆ విద్యార్థులు ఇలాగే రాణించి పదిమందికీ స్ఫూర్తి కావాలని కోరుకుందాం.
కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు, విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డికి, డిఈఓకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులు, వారి తలిదండ్రులకు – ఈ అభినందనోత్సవ విందుకు కారణమయిన అందరికీ పేరుపేరునా హదయపూర్వక అభినందనలు.
పి. మధుసూదన్