కల్తీలు, నకిలీలు, జూదం, మోసాలపై ఉక్కుపాదం మోపాలని, వీటి నియంత్రణకు కఠిన చట్టాలు తేవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ణయించారు. జాగీరు భూములను రద్దు చేస్తూ ఆర్‌ఓఆర్‌ చట్టంలో కూడా మార్పులు తేవాలని సీఎం సూచించారు. ఇప్పుడున్న చట్టాలకు సవరణలు చేయడంతో పాటు, కొత్త చట్టాలు కూడా రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

కల్తీలు, నకిలీలు, జూదం, మోసాలను అరికట్టే విషయంలో చేపట్టాల్సిన చర్యలపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి.సింగ్‌, డిజిపి అనురాగ్‌ శర్మ, నగర పోలీస్‌ కమిషనర్‌ పి. మహేందర్‌ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు సి. నర్సింగ్‌ రావు, రామకష్ణారావు, సంతోష్‌ రెడ్డి, పార్థసారథి, శాంత కుమారి, కార్యదర్శి స్మితా సభర్వాల్‌, వ్యవసాయ శాఖ కమిషనర్‌ జగన్‌ మోహన్‌, ఓఎస్డి ప్రియాంక వర్గీస్‌ తదితరులు పాల్గొన్నారు.

”కల్తీ విత్తనాలు, ఎరువుల విషయంలో మొదటి నుంచి కఠినంగానే వ్యవహరిస్తున్నాం. అయినా అక్కడక్కడ విత్తనాలు, ఎరువులు,పురుగు మందులు కల్తీ అవుతున్నాయి. గత ఏడాది కొంత మందిని పట్టుకుని పిడి యాక్టు ప్రయోగించి జైల్లో వేశాం. అయితే పిడి యాక్టుకు కూడా కొన్నిసవరణలు చేసి, మరింత కఠినం చేయాల్సి ఉంది. ఆహార పదార్ధాలను కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేవారి ఆట కట్టించేలా చట్టం ఉండాలి. ”తెలంగాణ రాష్ట్రంలో కల్తీ చేయలేం, చేసినా చట్టం నుంచి తప్పించుకోలేం” అనే భయం అక్రమార్కుల్లో ఉండాలి. ”దీనికోసం పిడి యాక్టులో సవరణలు తేవడంతో పాటు, కల్తీ నిరోధానికి ప్రత్యేక చట్టం కూడా తేవాలి”. సీడ్‌ యాక్టును కూడా కొత్తగా రూపొందించాలి. ఎరువులు, విత్తనాల విషయంలో మోసాలకు పాల్పడే వారిని గుర్తించాలి. వారికి సహకరించే అధికారుల పని పట్టాలి. ఇందుకోసం ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి” అని సీఎం అధికారులను ఆదేశించారు. ”నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేసే వారి పట్ల కూడా అత్యంత కఠినంగా వ్యవహరించాలి. అలాంటి ముఠాలను గుర్తించి వారి కార్యకలాపాలను అడ్డుకోవాలి. వీటిని పూర్తిగా నియంత్రించడానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోతాయా? సవరణలు కావాలా? కొత్త చట్టం రూపొందించాలా? అనే విషయం నిర్ధారించాలి. అవసరమనుకుంటే వెంటనే కొత్త చట్టం తేవాలి” అని సీఎం కోరారు.

”తెలంగాణ రాష్ట్రంలో పేకాట క్లబ్బులను మూసేశాం. కానీ ఇంకా ఆన్‌ లైన్‌ లో తీన్‌ పత్తి ఆటలు, మరికొన్ని మార్గాల్లో గాంబ్లింగ్‌ జరుగుతున్నది. దీన్ని పూర్తిగా నిరోధించడానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోవు. గాంబ్లింగ్‌ నిరోధానికి కొత్త చట్టం తేవాలి. సైబర్‌ నేరాలను అదుపు చేయడానికి కూడా అవసరమనుకుంటే కొత్త చట్టం తేవాలి. అక్రమంగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి అమ్మే వారిని గుర్తించాలి. వారిని కూడా కఠినంగా శిక్షించాలి” అని సీఎం ఆదేశించారు. ”నేరాలను అదుపు చేయడానికి, నేరస్తులను కఠినంగా శిక్షించడానికి కొత్త చట్టాలు తెచ్చుకోవడంతో పాటు వాటిని సమర్థవంతంగా అమలు చేయాలి. ఆర్డినెన్స్‌ వచ్చిన మరుసటి రోజునుంచే టాస్క్‌ ఫోర్స్‌ రంగంలోకి దిగాలి. తెలంగాణ రాష్ట్రంలో కల్తీలు, నకిలీలు,మోసాలు, గాంబ్లింగ్‌ కు తావులేదని అందరూ గ్రహించేటట్లు చేయాలి. జాగీర్‌ భూముల విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాలి. ఈ భూములు రద్దయినప్పటికీ ఇంకా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. వీటిని నిరోధించడానికి ఆర్‌ఓఆర్‌ చట్టంలో మార్పులు తేవాలి. దీనికోసం వెంటనే ఆర్డినెన్స్‌ తయారు కావాలి” అని సీఎం కోరారు. ముఖ్యంగా మిర్చి, పత్తి విత్తనాల్లో కల్తీ ఎక్కువగా జరుగుతోంది. వరంగల్‌, ఖమ్మం, మహబూబ్‌ నగర్‌ ప్రాంతాల్లో ఈ ముఠాలున్నట్లు తేలింది. మిగతా ప్రాంతాలపై కూడా దృష్టి పెట్టాలి. వెంటనే టాస్క్‌ ఫోర్సులు ఏర్పాటు చేయాలి. పోలీస్‌, వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో టాస్క్‌ ఫోర్సు ఉండాలి” అని సీఎం చెప్పారు.

Other Updates