సమాజంలో ఆడపిల్ల అంటేనే ఓ భారంగా చూసే పరిస్థితి నెలకొంది. ఇక వారికి పెళ్ళి చేయడం ఆడబిడ్డల తల్లిదండ్రులు గుండెలపై కుంపటిగా భావించే దుస్థితి దాపురించింది. ముఖ్యంగా పేదరికంతో కుమిలిపోతున్న ఎస్.సి., ఎస్.టి., ముస్లిం కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్ళిళ్లు మోయలేని భారంగా పరిణమించాయి.
అట్టడుగువర్గాలకోసం అనునిత్యం తపించే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈ వర్గాలను ఆదుకొనేందుకు ‘కల్యాణలక్ష్మి’ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం క్రింద ఈ మూడు వర్గాల వారి ఆడబిడ్డల పెళ్ళికి ప్రభుత్వం తలా రూ.51వేలు అందిస్తుంది. ఎస్.సి., ఎస్.టి.ల పిల్లలకు అమలుపరిచే ఈ పథకానికి ‘కల్యాణలక్ష్మి’ అని, ముస్లింల ఆడపిల్లలకు అందించే సహాయాన్ని ‘షాదీ ముబారక్’గా నామకరణం చేశారు.ఈ కార్యక్రమం అమలుకు ఎస్.సి.లకోసం రూ. 150 కోట్లు, ఎస్.టి.ల కోసం రూ. 80 కోట్లు, ముస్లింల కోసం రూ. 100 కోట్లు ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించారు.