కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో లిఫ్ట్-3లో ఐదో పంపు వెట్ రన్ ను ప్రాజెక్టు ఇంజనీర్లు దిగ్విజయంగా చెపట్టారు. ఇప్పటికే లిఫ్ట్-3 లో మరో నాలుగు పంపులు పని చేస్తున్నాయి. ఐదో పంప్ వెట్‌రన్‌ను కూడా పూర్తి చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో లిఫ్ట్-1, లిఫ్ట్-2, లిఫ్ట్-3 ఉన్నాయి. లిఫ్ట్ -1, లిఫ్ట్ – 2లో మూడేసి పంపులు ఇప్పటికే పని చేస్తున్నాయి. అయితే లిఫ్ట్-3 లో ఐదో పంపు పని చేయకపోవడం వల్ల కల్వకుర్తిలో పూర్తి స్థాయిలో నీటిని ఎత్తిపోసే పరిస్థితి లేదు. లిఫ్ట్ -1, లిఫ్ట్ -2లో ఉన్న మూడు పంపులకు గాను.. ఒక్కో పంపు 800 క్యూసెక్కుల నీటిని మాత్రమే ఎత్తిపోయగలవు. దీని కారణంగా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని ఇప్పటి వరకు ఎత్తిపోసే పరిస్థితి లేదు.
అంతే కాకుండా కల్వకుర్తి కింద ఉన్న 0.35 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల ఎల్లూరు రిజర్వాయర్, 0.55 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల సింగోటం రిజర్వాయర్‌ను లిఫ్ట్ -1 పంపుల ద్వారా నింపుతున్నారు. లిఫ్ట్ -2 ద్వారా 2.14 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల జొన్నల బోగడ రిజర్వాయర్ నిండుతోంది. ఇక 0.98 టీఎంసీల సామర్థ్యం ఉన్న గుడిపల్లి గట్టు రిజర్వాయర్ లిఫ్ట్ -3 ద్వారా నిండుతుంది. ఐతే ఐదో పంపు ఇప్పటి వరకు సిద్దం కాకపోవడం వల్ల పూర్తి సామర్థ్యం మేరకు నీటిని వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఉండేవి. ఐదో పంపు వెట్ రన్ విజయవంతం కావడంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా పూర్తి నీటిని ఎత్తిపోయవచ్చు. వర్షాలు బాగా కురుస్తుండటంతో శ్రీశైలం నుంచి అవసరమైన మేర నీటిని తీసుకోవచ్చు. కల్వకుర్తి ప్రాజెక్టు కింద ఆయకట్టు 3.5 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడంతో పాటు, ప్రాజెక్టు పరిధిలో ఉండే సుమారు 500 చెరువులను నింపే ప్రయత్నంలో ఇంజనీర్లు ఉన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ – 3 లోని ఐదో పంపు వెట్ రన్‌ను విజయవంతంగా నిర్వర్తించడంపై మంత్రి హరీశ్ రావు ఇంజనీర్లను అభినందించారు.