పాలమూరు జిల్లాది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విషాద గాధ. పాలమూరు ఎత్తిపోతల పథకాలవి అంతకంటే విషాద చరిత్ర. 1956 సం. లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం వల్ల అధికంగా నష్టపోయిన జిల్లా పాలమూరు జిల్లా, హైదరాబాద్ రాష్ట్రంగా కొనసాగి ఉండి ఉంటే అప్పర్ క్రిష్ణా ప్రాజెక్టు ద్వారా దాదాపు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వలన ఈ అవకాశం పూర్తిగా పోగొట్టుకున్నది. జిల్లా మొత్తము విస్తీర్ణము 43.73 లక్షల ఎకరాలు. సాగుకు యోగ్యమైనది 35 లక్షల ఎకరాలు, ఇందులో ఒక లక్ష ఎకరాలకు సాగు నీరు అందించే జూరాల ప్రాజెక్టు, 87 వేల ఎకరాలకు బదులు 30 వేల ఎకరాలే పారే RDS, 2.5 లక్షల ఎకరాలకు బదులు 75 వేల ఎకరాలు పారే మైనర్ ఇరిగేషన్ చెరువుల వలన నికరంగా 2 లక్షల ఎకరాలకే సాగు నీరు అందే పరిస్థితి ఉన్నది. సీమాంధ్ర పాలనలో సాగునీరు అందించే ఆలోచనే లేని కారణంగా పాలమూరు ప్రజలకు బ్రతుకు తెరువు కోసం వలసలే గతి అయినాయి. కృష్ణానది ఈ జిల్లా గుండా 300 కి.మీ. లు పారుతుంది. తుంగభద్ర నది కూడా ఈ జిల్లా సరిహద్దుగా పారుతుంది. అయినా సాగుకు నోచుకోని పరిస్థితి ఉన్నది. ప్రతిపాదిత భీమా, కల్వకుర్తి , నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలు నిరంతరం ఫైళ్లలో మగ్గుతూ వచ్చాయి.
ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల (AMRP) లిఫ్ట్ స్కీమ్ విజయవంతం ఐన తర్వాత, పాలమూరు ప్రజల్లో చైతన్యం వచ్చిన కారణంగా మరియు అప్పటికే ప్రత్యేక రాష్ట్ర సాధనకై ఉద్యమాలు తెలంగాణ రాజకీయ రంగంపైకి వచ్చిన కారణంగా, 2003 సంవత్సరంలో కల్వకుర్తి, 2004 సంవత్సరంలో భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలకు మోక్షం వచ్చింది. కానీ 2014 లోతెలంగాణా రాష్ట్రం ఏర్పడే దాకా 10 సంవత్సరాలైనా పూర్తి కాని స్థితిలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అయితే 8 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి. ఈ సందర్భంగా కల్వకుర్తి ఎత్తిపొతల పథకం ప్రారంభం అయిన కాడి నుంచి అడుగడుగునా ఉమ్మడి ప్రభుత్వం అనుసరించిన వివక్షాపూరిత విధానాలని గుర్తు చేసుకోవలసి ఉన్నది.
వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినాక జలయజ్ఞంలో భాగంగా 2005లో తిరిగి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2990 కోట్లకు సవరిస్తూ జి ఒ జారీ చేసినారు. 3.4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడం, దారి పొడుగునా గ్రామాలకు తాగునీరు అందించడం లక్ష్యంగా ప్రాజెక్టు పనులను మొత్తం ఆరు ప్యాకేజి లుగా విభజించి పనులని చేపట్టినారు. ఆ తర్వాత ఆయకట్టు పరిధిలోనికి మరో 25 వేల ఎకరాలు ఘన్ పూర్ బ్రాంచి కెనాల్ ద్వారా ఇవ్వడానికి నిర్ణయం జరిగింది. మొత్తం ఆయకట్టు 3.65 లక్షల ఎకరాలకు పెరిగింది. ఆయకట్టునైతే పెంచినారు కాని నీటి కేటాయింపులని మాత్రం పెంచలేదు. పెరిగిన ఆయకట్టుకు 40 టిఎంసిలన్నా కావాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కల్వకుర్తి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులని 25 టిఎంసిలనుండి 40 టిఎంసిలకు పెంచడం జరిగింది. ఆ మేరకు 28.9.2015 న జి ఒ 141 ని జారీ చేసింది. దీని వలన కల్వకుర్తి ఆయకట్టుని టెయిల్ ఎండ్ డిస్ట్రిబ్యూటరీ డి 82 ద్వారా మరో 38 వేల ఎకరాలకు అదనంగా సాగు నీరు అందుతుంది. కల్వకుర్తి ఆయకట్టు 4 లక్షల ఎకరాలకు పెంచడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కల్వకుర్తి ప్రాజెక్టుని చేపట్టి 30 సంవత్సరాలు గడిచినాయి. వలసల జిల్లా, ముఖ్యమంత్రి దత్తత జిల్లా 30 ఏండ్లుగా సాగునీటికి మాత్రం నోచుకోలేదు. ఉమ్మడి పాలకుల వివక్షకు ఇంతకు మించిన ఉదాహరణ ఇంకేమి ఉంటుంది? జలయజ్ఞంలో ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులు ఇదే గతిన ఉన్నాయా? లేదు. ఆంధ్రా, రాయలసీమ ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి అయినాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తూములను పెంచుకునే పనులు ఉరుకులు పరుగులతో పూర్తి చేసుకున్నారు. రాయలసీమలో సుమారు 250TMCల సామర్థ్యం కలిగిన కృత్రిమ రిజర్వాయర్లు కట్టుకున్నారు. పులిచింతల కట్టుకున్నారు. పోలవరం ఆలస్యమవుతున్నదన్న కారణంతో ప్రత్యామ్నాయంగా ప్రారంభమైన తాడిపూడి, పుష్కర ఎత్తిపోతలు పూర్తి అయినాయి. తెలంగాణ ప్రాజెక్టులు మాత్రం అనేక సమస్యల్లో కూరుకుపోయి మూలన పడినాయి లేదా నత్తకన్నఅధ్వాన్నంగా పనులు కొనసాగినాయి.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2005లో జలయజ్ఞంలో భాగంగా తెలంగాణలో 19 భారీ ప్రాజెక్టులని , 12 మధ్యతరహా ప్రాజెక్టులని , 2 ప్రాజెక్టుల అధునీకీకరణ (నిజాంసాగర్, నాగార్జున సాగర్), వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గోదావరి కరకట్టల నిర్మాణం ప్రతిపాదించి ప్రారంభించడం జరిగింది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడే నాటికి వీటిల్లో రెండే ప్రాజెక్టులు పూర్తి అయినాయి. అవి నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన అలీసాగర్ ఎత్తిపోతల పథకం, అర్గుల రాజారాం గుత్పా ఎత్తిపోతల పథకం. ఇక మిగతా ప్రాజెక్టులు 10 సంవత్సరాలు గడిచినా అనేక సమస్యల్లో కూరుకుపోయి నత్తనడక నడిచినాయి. భూసేకరణ జరగక, అటవీ అనుమతులు పొందక, రైల్వే, రోడ్డు క్రాసింగులను సమన్వయం చేయక, అంతర రాష్ట్ర సమస్యలను పరిష్కరించక, కాంట్రాక్టు చేపట్టిన ఏజెన్సీల ఒప్పంద సమస్యలు, బిల్లుల చెల్లింపులు, కేంద్ర జల సంఘం లేవనెత్తిన సాంకేతిక అంశాలపై నివేదికలు సమర్పించక, ప్రాజెక్టుల డిజైన్లను సకాలంలో పూర్తి చేయక ప్రాజెక్టులు ముందుకు సాగలేదు. జలయజ్ఞం ప్రతిపాదిత లక్ష్యాలను అందుకోలేకపోయింది. వేల కోట్ల రూపాయలు ఖర్చుఅయినా ప్రాజెక్టులు ఆయకట్టుకు నీరిచ్చే దశకు చేరుకోలేకపోయినాయి. ఇట్లా పూర్తి కాని ప్రాజెక్టుల్లో కల్వకుర్తి కూడా ఒకటి.
కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు గ్రామం వద్ద రేగుమానుగెడ్డ వద్ద శ్రీశైలం జలాశయం నుండి 3 స్టేజిల్లో 258 మీటర్ల ఎత్తుకు 4000 క్యూసెక్కుల నీరు పంపు చేస్తారు. ఈ నీరు శ్రీశైలం జలాశయం నుండి అప్రోచ్ చానల్ ద్వారా మొదటి స్టేజీ పంప్ హౌజ్ సర్జి పూల్ లోనికి పంపుల ద్వారా 95 మీటర్ల ఎత్తులో సిస్టర్న్ కు చేరి అక్కడి నుంచి ఎల్లూరు బ్యాలెన్సింగ్ జలాశయానికి చేరుతాయి. ఇక్కడి నుంచి వాలు కాలువ ద్వారా సింగోటం జలాశయానికి చేరుతాయి. అక్కడినుండి వాలు కాలువ , టన్నెల్ ద్వారా రెండో స్టేజీ పంపుహౌజ్ సర్జిపూల్ కి చేరుతాయి. స్టేజి 2 పంపు హౌజ్ నుండి పంపులు 86 మీటర్ల ఎత్తుకి నీటిని సిస్టర్న్ చేరవేస్తాయి. ఆ తర్వాత జొన్నలబొగుడ జలాశయానికి నీరు చేరుతుంది. ఇక్కడి నుండి వాలు కాలువ మరియు టన్నెల్ ద్వారా స్టేజీ 3 లిఫ్ట్ సర్జిపూల్‌కు చేరుతాయి. ఈ మధ్యలో రిడ్జ్ కాలువ ద్వారా 13 వేల ఎకరాలకు, ఎడమవైపున పసుపుల బ్రాంచి కాలువ ద్వారా 44 వేల ఎకరాలు, బుద్దారం ఎడమ కాలువ ద్వారా 13 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తారు. చివరగా 117 మీటర్ల ఎత్తున ఉన్న గుడిపల్లిగట్టు జలాశయానికి నీరు చేరు తుంది. ఇక్కడి నుండి ఎడమవైపున 160 కి మీ పొడవైన కల్వకుర్తి ప్రధాన కాలువ ద్వారా 1 లక్ష 80 వేల ఎకరాల ఆయకట్టుకు, కుడివైపున 80 కి మీ అచ్చంపేట ప్రధాన కాలువ ద్వారా 90 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అంది స్తారు. ఇది కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సంక్షిప్త రూపం.
ఈ పదేండ్లలో ప్రాజెక్టు పనులు 50% మాత్రమే పూర్తి అయినాయి. అందులోఅత్యంత కీలకమైన పంప్‌హౌజ్, సర్జిపూల్, పంపులు, మోటార్ల బిగింపు, వాటికి విద్యుత్ సరఫరా చేసే సబ్ స్టేషన్లు, ట్రాన్సిన్స్‌మిషన్ లైన్లను వేయడం పట్ల శ్రద్ద వహించలేదు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రాజెక్టుల స్థితిగతులను ఇంజనీరింగ్ నిపుణులతో కూలంకషంగా సమీక్షించినారు. పైన పేర్కొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నది. నిరంతరం ప్రాజెక్టు పనులని ఇంజనీర్లతో, కాంట్రాక్టర్లతో సమీక్షించడం, ప్రధాన అడ్డంకిగా ఉన్న భూసేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టడం, ప్రాజెక్టుకు అవసరమైన నిధులని వెనువెంటనే ప్రాధాన్యతా క్రమంలో విడుదలచెయ్యడం, అవసరమైన అనుమతులని సత్వరమే జారీ చెయ్యడం , రైల్వే, రోడ్డు క్రాసింగ్‌ల సమస్యను ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహించి పరిష్కరించడం, కీలకమైన పంపులు, మోటార్లను బిగించడం, వాటికివిద్యుత్ సరఫరా కోసం సబ్ స్టేషన్లు, ట్రాన్స్‌మిషన్ లైన్ల నిర్మాణం, తరచుగా ప్రాజెక్టులని సందర్శించడం, ప్రాజెక్టుల వద్ద నిద్ర … ఇట్లా రెండేండ్లు శ్రమించి ప్రాజెక్టు పనులని 50 శాతం నుంచి 95 శాతానికి పూర్తిచెయ్య గలిగింది. గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పనులు 95% పూర్తి అయినాయి. రెండేండ్లల్లో 5 శాతం పనులని పూర్తి చెయ్యలేకపోతున్నది అని ప్రతిపక్షాలు విమర్షలు చేస్తున్నాయి. కల్వకుర్తి ప్రాజెక్టు 95% కంప్లీట్ అయ్యిందనడం పూర్తిగా అబద్దం. 95% పూర్తి అయితే నీరెందుకు సరఫరా చెయ్యలేకపోయినారు? 2014 వరకు కల్వకుర్తిలో వారు నీరు అందించింది 13 వేల ఎకరాలకు మాత్రమే.
2005లో జలయజ్ఞంలో ప్రాజెక్టుని ప్రారంభించినప్పుడు ప్రభుత్వం 2990 కోట్లకు పరిపాలన అనుమతి మంజూరు చేసింది. 2016 లో ప్రభుత్వం సవరించిన అంచనా 4896.24 కోట్లు.భూసేకరణకు అప్పటి అంచనాలో పెట్టిన మొత్తం కేవలం 67.50 కోట్లు మాత్రమే. ఇప్పుడు సవరించిన అంచనా విలువ 366.44 కోట్లు. అంటే ఒక్క భూసేకరణపై పెరిగిన అంచనా విలువ 298.94 కోట్లు. అప్పుడు వారు ఎకరాకు కేవలం 30000 రూపాయలు మాత్రమే కేటాయించినారు. అయితే ఇప్పుడు భూసేకరణ కోసం ప్రభుత్వం ఎకరాకు 5 లక్షల రూపాయలని చెల్లించింది. ప్రాజెక్టులో మరో 25000 ఎకరాలను చేర్చడం వలన కాలువల నిర్మాణానికి 91. 26 కోట్లు అదనంగా ఖర్చు అవుతున్నది. సబ్ స్టేషన్లు, ట్రాన్స్‌మిషన్ లైన్లు, వీటి పర్యవేక్షణకు గత ప్రభుత్వం ఒక్క పైసా అంచనా విలువలో పెట్టలేదు. ఇది ఎత్తిపోతల పథకానికి కీలకమైన అంశం. వీటి కోసం ప్రభుత్వం 414.20 కోట్లు కేటాయించింది. ప్రాజెక్టు పనుల్లో బ్యాలెన్సింగ్ జలాశయాలు , కాలువల లైనింగ్ , రోడ్లు , భవనాలు, సిమెంట్, స్టీల్, ఇంధనం, లేబర్ , పంపులు , మోటార్ల కొనుగోళ్ళు , ఇన్సూరెన్స్‌లపై ధరల పెరుగుదల కోసం , ప్రత్యామ్నాయ అటవీ భూముల కోసం ప్రభుత్వం 1102.34 కోట్లు కేటాయించింది. మొత్తం మీద గత ప్రభుత్వం వదిలేసిన సమస్యలని పరిష్కరించి ప్రాజెక్టు పనులని పురోగతిలో పెట్టడానికి ప్రభుత్వానికి ప్రాజెక్టుపై 1906.24 కోట్ల అదనపు భారం పడింది. ఇది 63.75 % ఎక్కువ.
ప్రాజెక్టుపై మే 2014 వరకు పెట్టిన ఖర్చురూ. 2716కోట్లు . సవరించిన అంచనాతో పోలిస్తే ఇది 55 % మాత్రమే. వాస్తవంగా పూర్తి అయ్యింది 50 % పనులే. ఎత్తిపోతల పథకాల్లో క్రిటికల్ వర్క్స్‌అయిన పంప్ హౌజ్ ల నిర్మాణం పూర్తి కాలేదు, పంపులు, మోటార్లను బిగించడం పూర్తికాలేదు. విద్యుత్ సరఫరాకు సబ్ స్టేషన్లు , ట్రాన్స్‌మిషన్ లైన్ల నిర్మాణం, ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ పూర్తికాలేదు. పునరావాస పనులు పూర్తికాలేదు. ఇవ్వన్ని కొత్త ప్రభుత్వం ముందు
సవాళ్ళుగా ముందుకు వచ్చినాయి. వీటి పరిష్కరించి రెండేండ్లలో ప్రాజెక్టులను పూర్తి చేయగలిగింది. 123 జి ఒ కింద భూసేకరణ చేయగలిగినాము. మిగిలిపోయిన కాలువలను తవ్వకం పూర్తి అయ్యింది. వందలాది స్ట్రక్చర్ల నిర్మాణం, పంప్ హౌజ్ ల నిర్మాణం, పంపులు , మోటార్లను బిగించే పనులు పూర్తి చేసి 2016-17 సంవత్సరంలో కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1.60 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించడం,300 చెరువులు నింపడం జరిగింది.2017 ఖరీఫ్ నాటికి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ శ్రీశైలం జలాశయానికి సెప్టెంబరు మూడో వారంలో నీటి రాకడ ప్రారంభమయ్యింది. ఖరీఫ్ పంటకు నీరివ్వలేని పరిస్థితి. ఇప్పుడు శ్రీశైలం నిండు కుండలా ఉన్నది. పూర్తి స్థాయికి నీరు నిండింది. ఇప్పటికే ఐదింటిలో నాలుగు పంపులని అమర్చడం జరిగింది. ఐదో పంపు బిగింపు పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతంమూడు పంపుల ద్వారా 2800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయడం జరుగుతున్నది. 2017 రబీ పంటకు 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టింది. మొదటి బడ్జెట్ సమావేశాల్లోనే మహబూబ్ నగర్ , ఆదిలాబాద్ జిల్లాల పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చెయ్యడం తమ ప్రథమ ప్రాధాన్యత అని ప్రభుత్వం ప్రకటించింది. ప్రాధాన్యతా క్రమంలో నిధులను సమకూర్చింది.ఈ రెండేండ్లలో 45 శాతం పనులని పూర్తి చేసి తన బాధ్యతని నిర్వర్తించింది.కల్వకుర్తి ప్రాజెక్టుకు2014 జూన్ వరకు పదేండ్లలో పెట్టిన ఖర్చు 2716 కోట్లు. ఈ మూడేళ్ళలో చేసిన ఖర్చు 1121.17 కోట్లు. 2017-18 బడ్జెట్ లో కల్వకుర్తి ప్రాజెక్టుకు 1000 కోట్లు కేటాయించింది. కల్వకుర్తి నియోజకవర్గానికి నీరందించడానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న ఆవంచ ఆక్విడక్టు పనులని పూర్తి చేసి ఇప్పుడు మొదటిసారి కల్వకుర్తి నియోజకవర్గానికి నీటిని విడుదల చేయడం జరిగింది.
గతంలో ప్రభుత్వాలు ఎత్తిపోతల పథకాల్లో జలా శయాలని ప్రతిపాదించక పోవడం ఒక లోపమే. ఆ లోపం కల్వకుర్తిలోనూ ఉన్నది. తెలంగాణా ప్రభుత్వం ప్రాజెక్టుల రీ డిజైన్ చేపట్టినప్పుడు ఈ అంశాన్ని సీరియస్‌గా పట్టించుకున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో నిల్వ సామ ర్థ్యాన్ని 16 నుంచి 139 టి.ఎం.సి.లకు పెంచుకున్నది. పాలమూరు-రంగారెడ్డిలో, డిండి ఎత్తిపోతల పథకాల్లోనూ తగినంత నిల్వ సామర్త్యాన్ని ప్రతిపాదించింది. కల్వకుర్తిలోనూ ఈ లోపాన్ని సవరించడానికి ప్రభుత్వం ఇప్పటికే 25 టి.ఎం.సి.ల నిల్వసామర్థ్యం కలిగిన జలాశయాల కోసం సర్వేకి ఆదేశించింది. అందుకు 4.26 కోట్లను మంజూరు చేసింది. సర్వే జరుగుతున్నది. త్వరలోనే కల్వకుర్తి ప్రాజెక్టు ప్రాంతంలో జలాశయాల ఏర్పాటుకు సంబంధించి సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందుతుంది. కాలువలలైనింగ్ పనులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీనితో కాలువ ప్రవాహ సామర్థ్యం 4 వేల క్యూసెక్కుల నుంచి 5 వేల క్యూసెక్కులకు పెరుగుతుంది. ప్రాజెక్టుమొత్తం ఆయకట్టును 4 లక్షల ఎకరాలకు పెంచుతూ ప్రభుత్వం2017సెప్టెంబర్ 1 న జి ఓ జారీ చేసింది. టెయిల్ ఎండ్ డిస్ట్రిబ్యుటరీ డి 82 ని59 కి మీ పొడవున తవ్వడానికి ప్రభుత్వం178 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. నీటి కేటాయింపులను 40 టి.ఎం.సి.లకు పెంచుతూ 2015 లోనే జి ఓ జారీ చేసింది.ప్యాకేజి 29 కింద టెయిల్ ఎండ్ డిస్ట్రిబ్యుటరీ తవ్వకం పూర్తి అయితే మొత్తం 4 లక్షల ఎకరా లకు సాగు నీరు అందుతుంది. కల్వకుర్తి మండలంలో 33 వేలు, ఆమనగల్లు మండలంలో 2800, మాడుగుల మండలంలో 18,700, వెల్దండ మండలంలో 16,600 ఎకరాలకు సాగునీటి సౌకర్యం ఏర్పడుతుంది. కల్వకుర్తి నియోజక వర్గంలో సాగునీరు ఇవ్వడానికి అడ్డంకిగా ఉన్న ఆవంచ ఆక్విడక్ట్ పనులు పూర్తి కావడంతో ఈ సంవత్సరం మొదటి సారిగా కల్వకుర్తి నియోజకవర్గంలో నాగిరెడ్డిపల్లి వరకు 33 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి రంగం సిద్దం అయ్యింది. 2017 అక్టోబరు 15 న సాగునీటి శాఖా మంత్రిహరీష్ రావు కల్వకుర్తి నియోజకవర్గానికి నీటిని విడుదల చేసినారు., ఈ సంవత్సరం కొంత ఆలస్యంగా శ్రీశైలం జలాశయానికి నీరు రావడంతో మూడు పంపుల ద్వారా 2800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయడం జరుగుతున్నది.
వలస పాలనలో ప్రాజెక్టు పనుల ప్రారంభానికి ఇరవై ఏండ్లు!
1984
ప్రభుత్వం కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం సర్వే కోసం జి ఒ నంబరు 270 ని 16 జూన్ 1984 న జారీ చేసింది. జి ఒ జారీ చేసిన 5 ఏండ్లకు ఈ ప్రాజెక్టుల సర్వే కోసం నాలుగు డివిజన్లతో ఒక సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
1997
13 సంవత్సరాల అనంతరం డిసెంబరు 1997 లో సర్వే కోసం 50 లక్షల రూపాయలను మంజూరు చేసింది. రెండేండ్ల సర్వే అనంతరం 1271 కోట్లకు ప్రాజెక్టు నివేదిక తయారయ్యింది. 25 టి ఎం సి ల నీటిని ఎత్తిపోసి 22 జలాశయాల్లో నిల్వ చేసి 50 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి ప్రతిపాదన ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది.
1999
జూలైలో మొదటి దశ పనులకు 233.72 కోట్లకు పరిపాలనా అనుమతిని మంజూరు చేసింది. అప్పటి ముఖ్యమంత్రి 5 జూలై 1999 న ప్రాజెక్టు పనులకు శంకు స్థాపన కూడా చేసినారు.
2002
ప్రాజెక్టు ప్రతిపాదనలపై చర్చించి మూడు స్టేజిల ప్రత్యామ్నాయ ప్రతిపాదనలపై సమగ్ర నివేదికను తయారు చెయ్యాలని ఇంజనీర్లను ప్రభుత్వం ఆదేశించింది.
2002
ఆగస్ట్‌లో 2.5 లక్షలఎకరాలకు సాగునీరు, దారి పొడుగున గ్రామాలకు తాగునీరు అందించేందుకు 1766 కోట్లకు మరో ప్రాజెక్టు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించినారు. 4.5.2003 న ప్రభుత్వం 1500 కోట్లకు జి ఒ నంబరు 65 ని జారీచేసింది. టెండర్ల ప్రక్రియ పూర్తి.
2003
డిసెంబరు 2003లో పనులు ప్రారంభం అయినాయి. ప్రాజెక్టు సర్వేకు 1984 జి ఒ జారీ చేస్తే 20 సంవత్సరాల తర్వాత ఎన్నికలకు ముందు పనులు ప్రారంభం అయినాయి.
నిరాశే మిగిల్చిన జలయజ్ఞం!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2005లో జలయజ్ఞంలో భాగంగా తెలంగాణలో 19 భారీ ప్రాజెక్టులని , 12 మధ్యతరహా ప్రాజెక్టులని , 2 ప్రాజెక్టుల అధునీకీకరణ (నిజాంసాగర్, నాగార్జున సాగర్), వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గోదావరి కరకట్టల నిర్మాణం ప్రతిపాదించి ప్రారంభించడం జరిగింది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడే నాటికి వీటిల్లో రెండే ప్రాజెక్టులు పూర్తి అయినాయి. అవి నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన అలీసాగర్ ఎత్తిపోతల పథకం , అర్గుల రాజారాం గుత్పా ఎత్తిపోతల పథకం. ఇక మిగతా ప్రాజెక్టులు 10 సంవత్సరాలు గడిచినా అనేక సమస్యల్లో కూరుకుపోయి నత్తనడక నడిచినాయి.వేల కోట్ల రూపాయలు ఖర్చుఅయినా ప్రాజెక్టులు ఆయకట్టుకు నీరిచ్చే దశకు చేరుకోలేకపోయినాయి. ఇట్లా పూర్తి కాని ప్రాజెక్టుల్లో కల్వకుర్తి కూడా ఒకటి.
స్వరాష్ట్రంలో జలసిరులు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టింది. మొదటి బడ్జెట్ సమావేశాల్లోనే మహబూబ్ నగర్ , ఆదిలాబాద్ జిల్లాల పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చెయ్యడం తమ ప్రథమ ప్రాధాన్యత అని ప్రభుత్వం ప్రకటించింది. ప్రాధాన్యతా క్రమంలో నిధులను సమాకూర్చింది.ఈ రెండేండ్లలో 45 శాతం పనులని పూర్తి చేసి తన బాధ్యతని నిర్వర్తించింది.కల్వకుర్తి ప్రాజెక్టుకు2014 జూన్ వరకు పదేండ్లలో పెట్టిన ఖర్చు 2716 కోట్లు. ఈమూడేళ్ళలో చేసిన ఖర్చు 1121.17 కోట్లు. 2017-18 బడ్జెట్ లో కల్వకుర్తి ప్రాజెక్టుకు 1000 కోట్లు కేటాయించింది.కల్వకుర్తి నియోజకవర్గానికి నీరందించడానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న ఆవంచ ఆక్విడక్టు పనులని పూర్తి చేసి ఇప్పుడు మొదటిసారి కల్వకుర్తి నియోజక వర్గానికి నీటిని విడుదల చేయడం జరిగింది.
శ్రీధర్ రావు దేశ్ పాండే