ఆయన అసలుపేరు జగదీశ్. నిజానికి ఆయన ఇవాళ్ళ చింతలులేని జగదీశ్. ఆయన కష్టజీవి. తన ఇష్టమైన పద్ధతిలో జీవితయాత్ర సాగిస్తున్నాడు. భార్యా పిల్లలుంటే ఆటంకాలు ఏర్పడి దృష్టి కేంద్రీకరించలేక కాలం హరించుకుపోతుందని, సదా కళకే అంకితమై అందులోనే తేలిపోతున్నాడు.
ఆయనకు ప్రతిభ ఉంది; సృజన ఉంది, పట్టుదల ఉంది, దానికి తగినట్టుగా పై చదువులు చదివాడు. గురువు చెప్పిన మాటను పక్కాగా పాటించాడు. ‘అందరిలాగా కాకుండా కొత్తగా ఆలోచించడం, ఆచరించడం’ ఆరంభించాడు. క్యాన్వాస్‌పైనే ఎందుకు బొమ్మ వేయాలి; అదే బొమ్మను మరో మాధ్యమంలో ఎందుకు వేయకూడదని-చిత్ర లేఖనంకు మూడు ఆయతనాలతో (త్రీడీ) శిల్పాలుగా తన పద్ధతిలో తీర్చిదిద్దాడు. ఆ ప్రత్యేకతతో సమకాలీన కళారంగంలో పట్టు సాధించాడు. పైకి వచ్చాడు. పాశ్యాత్య దేశాల్లోనూ పైచేయి సాధించాడు. జీవితకాలమంతా ఆ కళలోనే గడపాలనేది ఆయన తపన. సాధనే ఇవ్వాళ్ల ఆయనకు సంతృప్తి. ఆయనకు నేడు దేశంలోనే (హైదరాబాద్‌లోనే) కాదు; విదేశాలలో-అమెరికాలోను (ఫ్లోరిడా)లో ఇల్లు ఉంది, (మెషిగన్‌లో) అపురూపమైన భారీ స్టూడియో ఉంది. అంతేకాదు ఇంగ్లాండ్‌లోనూ ఇల్లు ఉంది; స్టూడియో ఉంది.
జగదీశ్ కళా జగత్తులో తెలంగాణ పల్లె పట్టులు, జన సామాన్యం, సంస్కృతి, సంప్రదాయాలు వస్తువులు. ఆ తర్వాత ఆయన అమెరికా వెళ్లి చాలా కాలం అక్కడే ఉండిపోవడంతో ఆయన పనితీరులో మార్పు వచ్చింది. అక్కడి స్నేహితులు, అక్కడి వాతావరణం, పరిసరాలు కూడా ఆయన కళలో చోటు చేసుకున్నాయి. ‘నా జన్మభూమి ఇండియా (హైదరాబాద్) నా దేశమే; పెరిగి పేరు గడించిన అమెరికా నా దేశమే అంటాడు జగదీశ్. లోగడ కొంతకాలం అక్కడ ఆరు మాసాలు, ఇక్కడ ఆరు మాసాలు ఉండేవాడు. ఎక్కడి బొమ్మలు అక్కడే ఉండేవి. ప్రస్తుతం మూడు నెలలు ఇక్కడ ఉండి, ఒక నెల రోజులు అక్కడ ఉంటున్నాడు.
కళారంగంలో ఆయన అపార సేవలకుగాను 1991లోనే ప్రతిష్ఠాత్మకమైన పొలాక్ క్రెసనర్ ఫౌండేషన్ అవార్డు వచ్చింది. 1993లోనే చికాగో, లీక్‌సైడ్ స్టూడియో ఆర్టిస్ట్ ఇన్ రెసిడెన్స్ గౌరవం లభించింది. ఇక్కడ శిఖర ప్రాయమైన రాష్ట్ర లలిత కళా అకాడమి అవార్డు ప్రదానం చేసింది. ఇవికాకుండా ఇంకా అనేక అవార్డులు ఆయనను వరించివచ్చాయి.
ఇంతటి ఖ్యాతిపొందిన జగదీశ్, ఎల్లయ్య-చిత్తారమ్మ దంపతులకు హైదరాబాద్‌లో 1956లో జన్మించాడు. తండ్రి ఉద్యోగరీత్యా కల్వకుర్తి, మక్తల్, నారంపేటలలో చదివాడు. ఆయన పుట్టినప్పుడు, వారింటి ప్రక్కన బావి త్రవ్వుతుంటే ఒక విగ్రహం బయటపడింది. అది జగన్నాధుని విగ్రహం. దానితో ఆయనకు వారి తండ్రి జగదీశ్ అని నామకరణం చేశాడట.
పాఠశాలలో చదువుకునే రోజులలోనే ఆనాటి ప్రసిద్ధ సినీ నటులు ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌ల పట్ల అభిమానంతో వారి బొమ్మలు, జాతీయ నాయకులు-గాంధీ, నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్‌ల బొమ్మలు వేసేవాడు. అట్లా ఇంటర్మీడియట్ కల్వకుర్తిలో పూర్తి చేస్తున్న తరుణంలో రామకృష్ణారెడ్డి సార్ తనను పిలిచి-‘ఇంటర్ తర్వాత బి.ఏ. చదువకుండా, హైదరాబాద్‌లో లలితకళల కళాశాల ఉంది. అందులో చేరి, పెయింటింగ్ నేర్చుకొమ్మ’ని సలహా ఇచ్చాడు. ఇంటర్ కాగానే 1972లో ఎంట్రన్స్ రాసి, జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం తాలూకు లలితకళల కళాశాలలో చేరిపోయాడు, 1972-78లో ఐదు సంవత్సరాల పెయింటింగ్‌లో డిప్లొమా పూర్తి చేశాడు. ఆ తర్వాత బరోడా వెళ్ళి ప్రపంచ ప్రసిద్ధ చిత్రకళా బాద్యుడు-కె.జి. సుబ్రహ్మణ్యం చెంత రెండేండ్లు కుడ్య చిత్రలేఖనంలో స్నాతకోత్సవ డిప్లొమా చేశాడు. అక్కడ గ్యాసీలాల్‌వర్మ సాంకేతికంగా ఎన్నో మెళకువలు నేర్పాడు. ముఖ్యంగా బరోడా ఎం.ఎస్. విశ్వవిద్యాలయంలో 14I10 భిత్తీ చిత్రం (ఫ్రెష్‌కో), బరోడాలోనే 14I4 ప్రమాణంలో రూపొందించిన చూర్ణలేపన శిల్పం (స్టుక్కో) జగదీశ్ పనితనానికి పరాకాష్టలాంటివి. ఆయన ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమి వారి కోసం లేపాక్షి ఆలయ కుడ్య చిత్రాల ప్రతికృతులు రూపొందించాడు.
అయితే జగదీశ్‌కు ప్రత్యేకతను, ప్రాముఖ్యతను సంతరించిపెట్టినవి మాత్రం కాగితపు గుజ్జు మాధ్యమంలో ఆక్రాలిక్స్‌తో ఆయన రూపులుదిద్దిన నిలువెత్తు అపురూప శిల్పాలే. ఈ ప్రక్రియలోమూడు ఆయతనాలలో దేశీయ, అంతర్జాతీయ మహిళలను, వివిధ వృత్తులలోని పురుషులను, వారి జీవన రీతులను ప్రతిబింబిస్తూ వేలాది కళాఖండాలు తయారు చేశాడు.
ముఖ్యంగా తెలంగాణ మహిళల భావోద్వేగాలను పొదివిపట్టుకున్న జగదీశ్ త్రివిక్రమరూపం ఆ శిల్పాలలో కన్పిస్తుంది. ‘కోడిబాయెలచ్చమ్మది, కోడి పుంజు బాయె లచ్చమ్మది’ అన్నట్టుగా.. పొరుగింటి పెద్దమ్మ పెంపుడు కోడి రాత్రి వేళ ఇంటిపట్టు చేరకపోవడంతో ఎవరో పట్టుకుని పులుసు పెట్టుకున్నారనే అభిప్రాయానికి వచ్చి, మథనపడుతూ ఆమె పంచాంగం విప్పి శాపనార్థాలు పెట్టడం, గ్రామీణులకు తెలిసిందే. అయితే అప్పుడు ఆ వేడిలో ఎవరూ ఆమెను ఏమి ప్రశ్నించలేని స్థితికదా! తెల్లవారిన తర్వాత విషయం తెలుసుకోవాలనే కాంక్షతో ఏమైందవ్వా? అని అడిగినప్పుడే-అనుకోకుండా సర్రున చెట్టుపై నుంచి దుమికిన ఆ కోడిని చూసిన యజమానురాలు, పొరుగువారి భావాలను వ్యక్తీకరిస్తూ జగదీశ్ వేసిన చిత్రం నిజంగానే చిత్రమైంది; ప్రశస్తమైంది.
ఇట్లా నిత్య జీవిత సత్యాలనే తొలి రోజులలో కళాకృతులుగా జగదీశ్ మలిచాడు. కాబట్టే ఆయనకు; ఆయన చిత్రాలకు ఈ ప్రత్యేకత, ప్రాముఖ్యత సంక్రమించాయి.
కొన్నాళ్ళు కాగితం గుజ్జు ప్రక్రియతో కళాకృతులు రూపొందించిన తర్వాత రవాణాలో అవి కొంత దెబ్బతింటున్నాయని, ప్రస్తుతం రాతివెండితో శిల్పాలు చేస్తున్నాడు. ఏ శిల్పమైనా ఆయనకు తెలిసిన,ఆయన చూసిందే సృజన చేస్తాడు. ముఖ్యంగా వాటిలో ఆయన స్నేహితులు, ఇరుగు పొరుగువారు-ఇక్కడివారు, విదేశీయులు, వారి తీరుతెన్నులు, జంతువులు, పరిసరాలు, వాతావరణం, ప్రకృతి, సూర్యుడు, చంద్రుడు ఉన్నాయి. ‘అమెరికా స్నేహితులు’ శీర్షికన తీర్చిదిద్దిన శిల్పాలలో వారి సామాజిక, సాంస్కృతిక జీవనశైలి ద్యోతకమవుతుంది. అవి జగదీశ్ దృక్పథాన్ని, శైలిని ప్రస్ఫుటం చేస్తాయి. ‘ముగ్గురు మహిళలు’, ‘ఉత్తమ మానవుడు’, ‘సెలవు దినము’, ‘సహజీవనము’ మొదలగు అనేక శిల్పాల్లో మానవ సంబంధాల పరిశీలనాశక్తి ఆయా వ్యక్తుల శరీర భాష, రంగులు, రేఖలు, అలంకరణవల్ల తేటతెల్లం చేశాడు.
‘ముగ్గురు మహిళలు’ శిల్పంలో వారి ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సంస్కారం వ్యక్తమవుతాయి. ‘పెంపుడు జంతువులు’లో అశ్వాలు శీర్షికనగల ‘కళ్యాణి’, ‘చేతక్’నుంచి ‘షోలే’ చిత్రంలోని ‘ధను’ దాకా తీరొక్క గుఱ్ఱాలున్నాయి. వాటిని చూస్తే కొండపల్లి, నిర్మల్, ఏటికొప్పాక బొమ్మలు గుర్తుకొస్తాయి. ‘ప్రాణులు’ శీర్షికన తీర్చిదిద్దిన కళాకృతులు అనిర్వచనీయమైన ఆకృతులు, జీవకళ కలిగి ఉన్నాయి. ఇత్తడితో చేసిన సూర్యుడుపై ఇరవై ఆరు కేరట్ల్ల బంగారు పూతరేకులు, చంద్రునిపై వెండిపూత రేకులు పొదిగారు. ‘ముఖోటాలు’-వారివారి ప్రవృత్తులను వ్యక్తీకరిస్తాయి. లోహాలతో రూపొందించిన కుడ్య అలంకరణలు, తాజా పూలు, ‘తోట’ శీర్షికనగల కళాకృతులు కొంతవరకు కార్డు బోర్డుతో రూపొందించిన ‘ద్వారబంధాలు’లాంటి పాతిక శీర్షికలతో రూపొందించిన శిల్పాలను భారతదేశంలోని వివిధ నగరాల్లో, విదేశాల్లో పాతిక పర్యాయాలు వ్యష్ఠి చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు. ముప్పై ఐదు దేశాల్లో పర్యటించాడు. 1993-94లోనే ఇంగ్లాండ్‌లో సంచార ప్రదర్శన నిర్వహించాడు. అంతర్జాతీయ సమష్టి కళా ప్రదర్శనలో దేశవిదేశాల్లో పాతికసార్లు పాల్గొన్నాడు. దిగువ మధ్య తరగతికి చెందిన జగదీశ్ కష్టపడి చదువుకుని, ఇవ్వాళ తన కళాఖండాలతో ఖండాంతర ఖ్యాతి సంపాదించాడు.
ఈయన శిల్పాలు యూకేలోని గ్లాస్‌గో మ్యూజియం ఆఫ్ మోడ్రన్ ఆర్ట్, అమెరికాలోని పీబాడీ ఎసెక్స్ మ్యూజియం, ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్స్, భూపాల్‌లోని భారత్‌భవన్ మ్యూజియంలు సేకరించాయి. సంప్రదాయేతర, ప్రత్యామ్నాయ మాధ్యమం రూపొందించి కృతకృత్యుడయ్యాడు. అన్నింటికన్నా ముఖ్యంగా ఆయన ఏ ప్రక్రియలో ఎలాంటి భేదాలతో చిత్ర-శిల్పకళా సాధన చేసినా, వస్తువు, సాంకేతికత, శైలి ఏదైనా సరే, అవి జీవకళ ఉట్టిపడగా సాధారణ ప్రేక్షకుడి నాడిపట్టుకోవడం అసాధారణమైంది, అనుసరణీయమైంది.
టి. ఉడయవర్లు