kvishwanathతనదైన శైలి చిత్రాలతో తెలుగువారి ప్రతిభను జాతీయ స్థాయిలో చాటిన ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్‌ ను దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. భారతీయ చిత్రపరిశ్రమ అభివృద్ధికి అపారమైన సేవలు అందించిన వారికి భారత ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందిస్తోంది. 2016 సంవత్సరానికి గాను పురస్కార కమిటీ ఈ అవార్డుకు కె. విశ్వనాథ్‌ పేరును సిఫార్సు చేయగా, కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. మే 3న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ఈ అవార్డు కింద స్వర్ణ కమలం, రూ. 10 లక్షల నగదు, శాలువతో సత్కరిస్తారు.

ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్‌కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంతోషం వ్యక్తంచేశారు. కేవలం తెలుగు సినీ పరిశ్రమకే కాకుండా భారతీయ సినిమాకు గొప్ప గౌరవం తెచ్చిపెట్టిన విశ్వనాథ్‌ ఈ అవార్డుకు సంపూర్ణంగా అర్హులని ముఖ్యమంత్రి ప్రశంసించారు. కె. విశ్వనాథ్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. భారతీయ సంగీత, నృత్యకళకు, సంప్రదాయాలకు అద్దంపట్టే, వాటి ఔన్నత్యాన్ని పెంచే చిత్రాలు రూపొందించి ఉత్తమాభిరుచిని చాటుకున్న విశ్వనాథ్‌ భావితరాలకూ ఆదర్శమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

విశ్వనాథ్‌ ను దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించడం పట్ల రాష్ట్ర గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌ ఆనందం వ్యక్తంచేశారు. విశ్వనాథ్‌ కు అభినందనలు , శుభాకాంక్షలు తెలిపారు. విశ్వనాథ్‌ రూపొందించిన శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సప్తపది వంటి చిత్రాలు ఆణిముత్యాల వంటివని గవర్నర్‌ పేర్కొన్నారు. ఈ పురస్కారం ద్వారా విశ్వనాథ్‌ సేవలకు తగిన గుర్తింపు లభించినట్లయిందని ఆయన అభిప్రాయపడ్డారు.రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఈ సందర్భంగా కె.విశ్వనాథ్‌ను ఆయన నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు.

Other Updates