”వాసిగన్న తెలంగాణ దేశానికే ఖజానా
బాసలోన తేనెలొలుక వాసించిన తొలిజాణ”

అంటూ తెలంగాణ వైభవాన్ని కీర్తించిన కపిలవాయి లింగమూర్తి తెలంగాణ గర్వించదగ్గ మహాకవి సాహిత్య రంగంలో లింగమూర్తికున్న విభిన్న పార్శ్వాలు మరెవ్వరిలోను కనబడవు. వారు చేపట్టని ప్రక్రియలేదు. ఎందరో అజ్ఞాతకవులకు సూర్యాలోకన భాగ్యం కల్పించారు. ఎందరో పరిశోధకులకు తన జ్ఞానాన్ని పంచారు. తనను ఆశ్రయించిన ప్రతి కవికి ‘కల్పవృక్షమై’ బాసటగా నిలిచారు. పధ్నాలుగు సంవత్సరాల వయసులో మొదలైన ‘రచనను’ జీవిత చరమాంకం వరకు నిరాఘాటంగా నడిపారు. పాండిత్యం విషయంలో ఎంత ఉన్నతుడో మర్యాద, మంచితనం, వినమ్రత, ఆదరణ తదితర ఉత్తమ మానవగుణముల విషయంలో మేరుపర్వత సమానుడు.

tsmagazine
సంబరాజు రవి ప్రకాశ రావు
నాగర్‌ కర్నూల్‌ జిల్లా బల్మూరు మండలంలోని ‘జినుకుంట’ గ్రామంలో మార్చి 31 నాడు కపిలవాయి లింగమూర్తి జన్మించారు. మాణిక్యమ్మ, వేంకటాచలం వీరి తల్లి దండ్రులు. లింగమూర్తికి రెండున్నర సంవత్సరాల వయసులోనే తండ్రి మరణించాడు. దానితో వారు అమ్రాబాద్‌లోని అమ్మమ్మవారింటికి చేరుకున్నారు. వీరి మేనమామ చేపూరు పెద్ద లక్ష్మయ్య, మంచి పండిత కవి. చిన్నతనంలో లింగమూర్తి వారివద్ద అమరం, ఆంధ్రనామ సంగ్రహం, శతకాలు, కావ్యాలు ఎన్నో చదువుకున్నారు. స్వతహాగా ఏక సంథాగ్రాహి కావడంతో లింగమూర్తి జ్ఞానపరిధి అనంతంగా విస్తరించింది. పితామహులైన వీరయ్య నుండి జ్యోతిష్యాన్ని నేర్చుకున్నారు. తన కులవృత్తియైన స్వర్ణకారవృత్తిలో రాటుదేలారు. ఏడవతరగతి వరకు పాఠశాలలో చదువుకున్న వీరు తదుపరి ఉన్నత విద్యనంతా ప్రైవేటుగా చదివారు. తెలకపల్లి, మొలకమామిడి గ్రామాల్లో ఒకవైపు స్వర్ణకార వృత్తిని చేస్తూనే మరొకవైపు ఆంధ్ర సారస్వత పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. పట్టువిడవకుండా చదివి యం.ఓ.యల్‌.వరకు విద్యాస్థాయిని పెంచుకున్నారు. బాల్యంలో ఉర్దూ మాధ్యమంలో చదివినా తెలుగు సాహిత్యం లోతులను చవిచూసి, వందకు పైగా గ్రంథాలను రచించిన కపిలవాయి లింగమూర్తి తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటిన పండితులలో అగ్రస్థానంలో ఉంటాడు.

యతిప్రాసలు తెలువని చిన్నతనంలోనే ‘కమలజు రాణి చారుతర ంజదళాక్షి పటీరగాత్రి’ అంటూ సరస్వతీ దేవిపై ఐదు పద్యాలు రాయడంతో వీరి కవిత్వ రచనా ప్రస్థానం మొదలైంది. వారికున్న నిఘంటు పరిచయం అమోఘం. 1954 నుండి 1972 వరకు జాతీయోన్నత పాఠశాల, నాగర్‌కర్నూల్‌లో తెలుగు పండితుడిగా ఉద్యోగం చేశారు. ఆ సమయంలో విద్యార్థుల ప్రదర్శన కోసం ఎన్నో నాటికలు, గేయాలు రాశారు. మంచి అవకాశం తలుపుతట్టడంతో జాతీయోన్నత పాఠశాలను వదిలి పెట్టారు. 1972 నుండి 1993 వరకు పాలెం శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో తెలుగు చరిత్రోపన్యాసకునిగా పనిచేశారు. వారు ఎంత విస్తృత పాఠకుడో వారి గ్రంథాలయాన్ని చూస్తే అర్థమవుతుంది.
tsmagazine
కపిలవాయి లింగమూర్తి ఏది రాసినా కొత్తదనం చూపెట్టేవారు. అందుకే ‘నిత్య నూతనత్వం మూర్తి లేఖినికి తెలిసిన విద్య’ అంటారు. 1972లో వారు రాసిన ‘పాండురంగ శతకం’ ఏకప్రాసలో ఉంది. ఇది వారి తొలిరచన. అది ఏకవృత్తం కూడా. కేవలం ‘ఉత్పలమాల’లోనే దానిని రచించారు. ‘తిరుమలేశ శతకం’లో లెక్కలేనన్ని జాతీయాలను, భాషీయాలను ఉపయోగించారు. చిత్రపదిలో ఆర్యాశతకాన్ని రాశారు. ఈ శతకంలోని పద్యాలన్నింటికి మొదటి రెండు పాదాలలో చమత్కారం, ఉత్తరార్థంలో దానికి సమర్ధన కనిపిస్తాయి.

కం. కఱవం గరవం కొమ్ములు
దిరిగిన గురువగును గాని తేరకు గురువై
తిరిగినయంతం గురువా
పిరువీకై లఘువుగాక వినుమా యార్యా !

‘గురువు’ పదంలోని మూడు అక్షరాలకు కొమ్ములు ఉన్నాయి. అంటే జ్ఞానంలో కొమ్ములు తిరిగిన వాడే ‘గురువు’ అన్న శబ్దానికి అర్హుడు. మిగిలిన వారంతా లఘువులే. ఈ పద్యంలోని ‘గరవ’ పదంలోని మూడు అక్షరాలకు కొమ్ములు పెడితే ‘గురువు’ అవుతుంది. ఇది దీనిలోని శబ్దచమత్కారం. కొత్తగా యక్షగానాలు రాయకపోయినా ఆ ప్రక్రియలో ఉండే దరువు, కందార్థాలు, గీతార్థాలను తన రచనలలో ప్రయోగించాడు.

లింగమూర్తికి చిన్ననాటి నుంచే గ్రామాలు, వాటి చరిత్రలపై ఎంతో అభిమానం. కాబట్టే వారు చక్రతీర్థ మహాత్మ్యం, ప్రతాపగిరిఖండం, ఇంద్రేశ్వర చరిత్ర, భైరవకోన మహత్మ్యం, శ్రీ మదానందాద్రి పురాణం వంటి కావ్యాలను రచించారు. ఇవన్నీ స్థల చారిత్రక కావ్యాలు. వీరిపైన భాగవత ప్రభావం చాలా ఉంది. తనకు భాగవతమే కవిత్వం నేర్పిందని వారి గట్టినమ్మకం. తన వచన రచనా శైలిలో మార్పు తెచ్చుకోవడానికి వీరు చదువని పత్రిక లేదు. ‘భారతి’ వీరి అభిమాన పత్రిక. వేటూరి ప్రభాకర శాస్త్రి, నిడుదవోలు వెంకటరావుల పీఠికలు తనపై చెరగని ముద్ర వేశాయని చెబుతుండేవారు.

కపిలవాయి ‘భాగవత కథాతత్త్వం’ పండితలోకంలో గొప్ప పేరును సంపాదించింది. ఆంధ్ర మహాభాగవతంలో పోతన నిక్షేపించిన అనేక రహస్యాలను దీనిలో వివరించారు. ‘పాలమూరు జిల్లా దేవాలయాలు, వీరి కీర్తి కిరీటంలో కలికితురాయి వంటింది. జిల్లా మొత్తం తిరిగి విశేషాంశాలు సేకరించి ఆలయాల సమాచారాన్ని అందించిన వీరి ప్రయత్నం ఎందరినో అబ్బురపరిచింది. తరువాతి కాలంలో రచనలు చేయడానికి ఇది మార్గదర్శకంగా నిలిచింది.

కపిలవాయి లింగమూర్తి అత్యుత్తమ విమర్శకుడు. అయితే వారు ప్రత్యేకంగా ఏ కావ్యంపైన విమర్శ రాయలేదు. వారి ప్రతి పీఠికలో విమర్శనా దృష్టి మనకు కనబడుతుంది. కావ్యగణపతి అష్టోత్తరం, స్వర్ణశకలాలు, కళ్యాణ తారావళి గ్రంథాలు ప్రాచీన కవుల రచనలను విమర్శనాత్మకంగా పరిశీలించినవిగా ఉన్నవి. పద్యాలలోని గుణదోషాలను వ్యాఖ్యానించిన తీరు వారి పాండిత్యానికి గీటురాయిగా ఉంది.

అజ్ఞాత కవుల ప్రాచీన కావ్యాల పరిష్కరణకు లింగమూర్తి తన జీవితాన్ని ధారపోశారంటే అతిశయోక్తికాదు. ”ఎంతో ప్రతిభ ఉంటే గాని, కవి కావ్యాన్ని సృష్టించలేడు. అలాంటి మహానుభావుల ప్రతిభను ఊరికే పోనీయకూడదు” అని ఈ వ్యాసకర్తకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సాహిత్య లోకానికి నూతన కవిని పరిచయం చేయడంతో పాటు తన పేరు కూడ పరిచయమవుతుందని వారు ఉద్దేశ్యపడేవారు. ఎల్లూరి నరసింగకవి ‘చూతపురీ విలాసం’, బోయపల్లి వేంకటాచార్యుల ‘శ్రీమద్భాగవత మహాత్మ్యం’, పెన్గలూరి వేంకటాద్రి ‘రామోదాహరణం’, తాడిచర్ల వీరరాఘవ శర్మ ‘సంక్షిప్త ఆబ్దిక విధానం’ మొదలైనవి వీరు పరిష్కరించిన గ్రంథాలకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ప్రచురించబడిన ‘యయాతి చరిత్ర’ ప్రతిపదార్థ తాత్పర్యం ఆ కావ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఎందరికో ఉపయోగపడింది. లింగమూర్తి పాండిత్య విరాట్స్వరూపాన్ని అందులో పాఠకుడు దర్శించవచ్చును.

కపిలవాయి శతకాలన్నీ విలక్షణమైనవి. దుర్గా భర్గ శతకాలు అలంకార, ఛందశాస్త్ర లక్షణాలకు సంబంధించినవి. ‘సహమాన శతకం’ కొలతలకు సంబంధించినది. ఇక సుందరీ సందేశం నిర్మకుట శతకం. కావ్య కన్యకను స్తుతించిన పద్యం చదివినప్పుడు వారి రచనా విధానం, భావుకత, పాండిత్యం ఏ ప్రబంధ కవులకు తీసిపోని విధంగా ఉందనిపిస్తుంది.

సీ|| కడుకప్పుదేరిన కచము ప్రబంధంబు
శాతకటాక్షంబు శాస్త్రచయము
శ్రీకారమాకారమౌ కర్ణములు శ్రుతుల్‌
కలికి వ్యాపారంబు కావ్యసమితి
స్తనములు సంగీత సాహిత్య యుగళంబు
లక్షణంబైన తలంపు స్మృతులు
అమలినమగు దరహాసంబు చాటువు
నర్తిల్లు లేగౌను నాటకంబు
నైన భారతి సౌందర్యమమరమనుచు
వలచి తలలోని నాల్కగా నిలుపుకొనిన
అట్టి చతురాననుని రాణి ననవరతము
ఆయురభ్యుదయములిడ నంజలింతు

భావ ప్రకటనకు పద్యం ఏ మాత్రం ప్రతిబందకం కాదని చెప్పడమే కాదు. రమణీయంగా చూపించిన ఉత్తమోత్తమ కవి. ప్రబంధాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో అనేక కావ్యాలను రచించాడు. తన ప్రతి పద్యంలో ఏదో ఒక అలంకారం తప్పకుండా ఉంటుంది. శబ్ద, అర్థ చమత్కారాలకు, మాండలికాలకు, జాతీయాలకు వారి కావ్యాలు నిలయాలు. వారి కావ్యాలలో చిత్ర, బంధ కవిత్వాలు కనబడతాయి. ఈ విషయంలో వారు చూపిన నేర్పు అనన్య సామాన్యం. నాలుగక్షరాల ప్రాసను పాటిస్తూ ఎంతో సుకుమారంగా చెప్పిన ‘ప్రతాపగిరి ఖండం’లోని ఒక పద్యాన్ని చూడండి.

‘పాలనయందు వాక్య పరిపాలనయందును నాజినిన్‌ భుజా
స్ఫాలనయందు దానగుణ పాలనయందును ధార్మిక క్రియా
పాలన యందు సంయమన పాలన యందజరామ భీష్మగో
పాలనల క్షమా సదృశ పాలకుడై నుతినెక్కనెంతయున్‌’

శ్రీ రుద్రాధ్యాయానికి కేవలం శాస్త్రపరంగా కాక, పౌరాణిక, చారిత్రక సాంఘిక ప్రస్తావనలతో వ్యాఖ్యానం రాసిన లింగమూర్తి ‘హనుమత్సహస్రం’ పేర ఆంజనేయుని పేర్లవెనుక ఉన్న విశేషాలను వివరించాడు. వేలకొలది పాలమూరు మాండలికాలను సేకరించి ‘పామర సంస్కృతం’పేరిట ఒక మాండలిక శబ్దమంజరిని వెలువరించారు. ఇక సాహిత్యంలోని ఇతర విషయాలకొస్తే దళిత కవితోద్యమంతో పాటు స్త్రీవాద కవిత్వం కూడా వీరిని బాగా ఆకర్షించింది. లింగమూర్తి అనువాదకులు కూడ. రవీంద్రనాథ్‌ ఠాగూరు ‘కథాకుంజ్‌’ను తొలినాళ్లలో అనువాదం చేశారు. 2013లో ‘విశ్వ బ్రాహ్మణ సంస్కృతి – అనుకరణం’ అను గ్రంథాన్ని కన్నడ నుండి తెలుగులోకి అనువదించారు. అతి కొద్ది కాలంలో వారి ఆత్మకథ ‘భగోటా’ మనముందుకు రాబోతున్నది. కపిలవాయి లింగమూర్తి జీవితం, సాహిత్యాలపై 2011వ సంవత్సరంలో వెన్నెల సాహిత్య అకాడమీ లఘు చిత్రాన్ని నిర్మించింది. అది నంది బహుమతి పొందడం విశేషం.

కపిలవాయి లింగమూర్తి సాహిత్యంపై ఇప్పటికి ఆరు పరిశోధనలు వచ్చినవి. పరిశోధక పంచానన, కవితా కళానిధి, కవికేసరి, వేదాంత విశారద, సాహిత్య స్వర్ణ సౌరభ కేసరి తదితర బిరుదులు వారిని వరించినవి. ఇక వారు అందుకున్న పురస్కారాలకు లెక్కేలేదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం 2014 సంవత్సరంలో డి-లిట్‌ పురస్కారాన్ని వారికందజేసింది. 2017 నవంబర్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో వారు విశిష్ట సన్మానాన్ని అందుకున్నారు.

తన జీవితకాలాన్ని సాహిత్యానికే అంకితం చేసి ఎన్నో స్థలపురాణాలు, శతకాలు, ఆలయ చరిత్రలు, గ్రంథ పరిష్కరణలు, సంకీర్తనలు, వ్యాఖ్యానాలు, అనువాదాలు, కథలు, గేయాలు, నాటికలు, నవలలు, ద్విపదలు, ఉదాహరణలు, వ్యాసాలు రచించిన కపిలవాయి లింగమూర్తి నవంబర్‌ 6 నాడు పరమపదించారు. వారి మృతి తెలంగాణ సాహిత్యలోకానికి తీరని లోటు. మంచి మనసుతో, నిష్కల్మషమైన హృదయంతో పాలమూరు భీష్మాచార్యుడుగా, నడిచే విజ్ఞాన సర్వస్వంగా, అజాత శత్రువుగా పేరుపొందిన కపిలవాయి లింగమూర్తిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

Other Updates