ఖిలా వరంగల్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్ తెలిపారు. వరంగల్ నగర మాజి డిప్యూటి మేయర్ కట్టె సారయ్యతో కలిసి ఖిలా వరంగల్‌ను సందర్శించారు. శంభునిగుడి, గుండం చెరువు, పార్కు, కాకతీయుల నాటి ఇతర చారిత్రక కట్టడాలను పరిశీలించారు. కుష్‌మహల్, కాకతీయ తోరణాల నిర్మాణశైలి పట్ల అబ్బురపడ్డారు. ఇటీవల చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వాకబు చేశారు. ఖిలా వరంగల్‌లో నిర్మిస్తున్న పురావస్తు మ్యూజియం గురించి తెలుసుకున్నారు. గుండం చెరువును భద్రకాళి బండ్ వలె అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ వైభవానికి, చరిత్రకు నిదర్శనంగా నిలిచిన కాకతీయ రాజులైన గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి విగ్రహాలను గుండం చెరువు వద్ద ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర పర్యాటక శాఖ సహకారంతో నిధుల మంజూరుకు ప్రయత్నించనున్నట్లు తెలిపారు. గుండం చెరువు ప్రక్కన ఉన్న గుట్ట, చారిత్రక కట్టడాల వద్ద సినిమా షూటింగ్‌లు జరుగుతున్నందున మౌలిక వసతులు విస్తరిస్తే మరింత ప్రాచుర్యతను సంతరించుకుంటుందని అభిప్రాయపడ్డారు. గుండం చెరువు పరిసరాలలో ఉన్న భూమిని ‘కుడా’ ఆధ్వర్యంలో సేకరించినట్లు అధికారులు వివరించారు. అలాగే ఖిలా వరంగల్‌లోపల ఉన్న ఇండ్ల మధ్యలో చారిత్రక శిలాఫలకాలు, దేవతా విగ్రహాలు ఉన్నాయని, ఆ భూములు ఆక్రమణలో ఉన్నందున గతంలో కొంత పరిహారం చెల్లించి భూమిని సేకరించేందుకు ప్రయత్నం జరిగినట్లు కట్టె సారయ్య వివరించారు. ఈ అంశాన్ని పరిశీలిస్తానని ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్ తెలిపారు. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్కును పరిశీలించి, దాని నిర్వహణ తీరును తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఖిలా వరంగల్‌కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా దేశ, విదేశి సందర్శకుల తాకిడిని పెంచేందుకు మౌఇక వసతులు కల్పించి, విస్తృత ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.
అనంతరం వరంగల్ నగరపాలక సంస్థ కమీషనర్ యన్. రవికిరణ్ క్యాంప్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్‌తో కలిసి అర్వింద్ కుమార్ మొక్కలు నాటారు.
ఈ పర్యటనలో వరంగల్ నగరపాలక సంస్థ డిప్యూటి కమీషనర్ రాజు, ఉద్యోగ సంఘాల నాయకులు గౌరీశంకర్, ధర్మరాజు పాల్గొన్నారు.