తెలంగాణ ప్రభుత్వం వరంగల్ నగరంలో ఏర్పాటుచేస్తున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో తమిళనాడు రాష్ట్రంలోని తిరుపూర్‌కి చెందిన టెక్స్‌టైల్ పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా ఒక బ్లాక్ ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర చేనేత, జౌళి, పరిశ్రమల శాఖామంత్రి కె. తారక రామారావు ప్రకటించారు. ఈ టెక్స్‌టైల్ పార్కులో కనీసం 10 యూనిట్లు ఏర్పాటు చేసేందుకు తిరుప్పూరు వస్త్రవ్యాపారులు ముందుకు వచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధిపై దృష్టిసారించిన సందర్భంగా, టెక్స్‌టైల్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న తమిళనాడులోని కోయంబత్తూరులో ఫిబ్రవరి 16న మంత్రి కె.తారకరామారావు ఆధ్వర్యంలో అధికారుల బృందం పర్యటించింది. 35 కోట్ల రూపాయల వస్త్రపరిశ్రమగా ఎదిగిన కోయంబత్తూరులోని తిరుపూర్‌ను మంత్రి సందర్శించారు. తిరుప్పూర్, పల్లాడంలోని టెక్స్‌టైల్ పరిశ్రమలు సాధించిన విజయాలు, ప్రగతి, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ వ్యూహం, ప్రయివేటు భాగస్వామ్యం, ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలు, తదితర అంశాలను ఈ బృందం పరిశీలించి, అధ్యయనం చేసింది. అక్కడి నేతన్నలు, కార్మికులతో మంత్రి కె.టి.ఆర్ స్వయంగా మాట్లాడారు. తిరుపూర్ ఎక్స్‌పోర్టు అసోసియేషన్ ప్రతినిధులతో కూడా మంత్రి సమావేశమయ్యారు. పెట్టుబడులు పెట్టేవారికి దేశంలోనే అత్యుత్తమ ప్రోత్సాహకాలతోపాటుగా ప్యాకేజి ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా వున్నదని మంత్రి తెలిపారు. పల్లాడం హైటెక్ వీవర్స్ పార్కును కూడా మంత్రి సందర్శించారు.
పి.ఎస్.జి.తో ఒప్పందం
టెక్స్ టైల్ ఇంజనీరింగ్‌లో కోయంబత్తూరుకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ పి.ఎస్.గోవింద స్వామినాయుడు (పీ.ఎస్.జీ) విద్యా సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పంద పత్రాలపై టెక్స్‌టైల్ డైరెక్టర్ శైలజా రామయ్యర్, పీ.ఎస్.జి డైరెక్టర్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం వరంగల్లులో ఏర్పాటుచేయబోయే టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటులో పరస్పర భాగస్వామ్యం, విద్య, సాంకేతిక సాయం, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ శిక్షణలో ఆధునిక సాంకేతక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి అవసరమైన అకడమిక్ సౌకర్యాన్ని ఈ విద్యాసంస్థ అందిస్తుంది. ఈ కళాశాలలోని సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ ను కూడా మంత్రి కె.టి.ఆర్ సందర్శించారు.
మంత్రి వెంట పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, టెక్స్‌టైల్ డైరెక్టర్ శైలజా రామయ్యర్, అడిషినల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ రామ్ గోపాల్ , తదితరులు వున్నారు.