నకార్తీక నమోమాసః నదేవం కేశవాత్పరమ్ |
న చ వేద సమంశాస్త్రం నతీర్థం గంగయాస్సమమ్ ||
భారతీయ కాలగణన కర్తలు చంద్రుని గమనాన్ని ఆధారం చేసుకుని సంవత్సరకాలంలో పన్నెండు మాసాలుగా విభజించి వాటికి నామకరణం చేశారు. కృత్తికా నక్షత్రంలో పౌర్ణమీ తిథినాడు చంద్రుడుండే నెలరోజుల్ని కార్తీక మాసంగా పిలిచారు. చైత్ర వైశాఖాది అన్ని మాసాల్లోనూ పౌర్ణమి నాడు చంద్రుడున్న నక్షత్రాన్ని బట్టి ఆయా మాసాలకు పేర్లు స్థిర పరచారు.
– కె. గీత
ఈ ద్వాదశ మాసాల్లోనూ ప్రతి మాసానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. కార్తీక మాసంలోనూ అనేక ప్రత్యేకతలున్నట్లు గ్రంథాలు చెబుతున్నాయి. కార్తీక మాసాన్ని దామోదర మాసమని కూడా పిలుస్తారు. ఈ కార్తీక మాసం శైవులకు, వైష్ణవులకు కూడా పవిత్రమైన మాసమని పురాణాలు చెబుతున్నాయి. శివ పూజలు, విష్ణు పూజలు కూడా ప్రత్యేకంగా చేస్తూ భక్తులు తరిస్తూ ఉంటారు. అంటే కార్తీక మాసమన్నది శివ కేశవులకిద్దరికీ ప్రీతికరమైన మాసమని తెలుస్తున్నది. అంతే కాదు స్కాంద పురాణం అనేక విధాలుగా కార్తీక మాస విశిష్టతను తెలిపింది. కార్తీక పురాణంగా ప్రసిద్ధి చెందిన ఈ భాగంలో ప్రతి నిత్యం చదివి తమ ఇష్టదైవాన్ని పూజించుకునే విధానానికి కూడా చోటిచ్చారు. కార్తీక మాస విశిష్టతలు తెలిపే కథలున్న ఈ పురాణం ఈ మాసంలో చేయవలసిన అనేక పద్ధతుల ఆరాధనాంశాలను తెలిపింది.
కార్తీక మాసంలో దీపానికి చాలా ప్రాముఖ్యం ఉంటుంది. దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించే మన ధర్మంలో దీపాన్ని గురించిన అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఈ నెలలో ప్రతి రోజు మన ఇంటికి ఇరు ప్రక్కల దీపారాధన చెయ్యాలని కార్తీక పురాణం చెబుతున్నది. అదే విధంగా శివాలయంలోకాని విష్ణాలయంలోకాని, ఆలయాల గోపురాలపై కానీ, స్వామివారి సన్నిధిలోకాని, ఆలయ ప్రాంగణాల్లో కాని, దీపారాధన చెయ్యడం పాపహరంగా భావించారు మన పూర్వులు. వీలైనంతవరకు ఈ దీపాలకు ఆవునెయ్యిని వాడటం శ్రేష్ఠమని చెప్పి గోమాత విశిష్టతను తెలిపారు. రోజూ దీపారాధన చెయ్యడానికి వీలుకాని వారు శుక్ర వారాలలో కాని నెలలోని తిథులైన ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమీ దినాలలో చేస్తే ఫలితం ఉంటుందని కార్తీక పురాణం చెబుతున్నది. కార్తీక సోమవారాలకు విశిష్టతననుసరించి, ఆ రోజుకాని, కార్తీక పౌర్ణమి రోజు కాని ప్రత్యేకంగా ఉసిరి కాయలలో వత్తులు వేసి దీపారాధన చెయ్యడం మరింత పుణ్యప్రదంగా భావించారు. దీపారాధన అనంతరం బిల్వంతో శివుని, తులసితో శ్రీమహావిష్ణువును పూజించడం శ్రేయస్కరమైనదిగా భావించారు.
కార్తీక మాస సందర్భంగా మరో విశేషమైన అంశం, కార్తీక స్నానాలు. కార్తీక మాసమంతా సూర్యోదయాత్వూర్వమే స్నానాదికాలు పూర్తి చేయాలని చెప్పారు. కార్తీక పౌర్ణమి రోజు సముద్ర స్నానాలు చెయ్యడం కూడా ప్రత్యేకంగా ఈ నెలలో నిర్వహించడం జరుగుతుంటుంది. కార్తీక సోమవారాల్లోనూ ఈ పవిత్ర స్నానాలు చెయ్యడం చాలా ఆలయాలలో, పుణ్యనదుల్లో జరుగుతూ
ఉండటం మనం గమనించవచ్చు. కార్తీక స్నానాలకు ప్రత్యేకత ఉన్నట్లుగా పురాణాలు పేర్కొన్నాయి. స్నానానంతరం దీప దానాలు కూడా ముత్తైదువలు చేస్తుంటారు. పుణ్యప్రదమైన దీపదానం కార్తీక మాస ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. కొందరు భక్తులు కార్తీక పౌర్ణమి నాడు పవిత్ర స్నానాలు చేసి 365 వత్తులు నేతిలో తడిపి దీపారాధన చేస్తుంటారు. కొందరు ఆలయాల్లో ఆకాశదీపాన్ని వెలిగిస్తుంటారు. సాధారణంగా తాము వెలిగించే ఈ దీపాల్ని నాలుగు దిక్కుల్లోనూ పెట్టి నమస్కరిస్తారు. హనుమదాలయాల్లో హనుమంతుని ఎదురుగా దీపాన్ని ఉంచడం మరింత శ్రేష్ఠమైనదిగా కొందరు భావిస్తారు.
కార్తీక పౌర్ణమీ తిథికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఆ రోజే చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉండటం ఒక విశేషం. ఆనాటి చంద్రుని కిరణాలు కనీసం 5 లేక 10 నిమిషాలైనా మన మీద ప్రసరించేట్లుగా చూసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ముఖ్యంగా కళ్ళకు, నరాలకు మంచి చేస్తుందని విశ్వసిస్తారు. ఆ రోజు చేసే ఆకాశదీప దర్శనం సాక్షాత్తూ శివదర్శనంగానే భక్తులు తలంచడం విశేషం. పౌర్ణమి నాటి సముద్ర స్నానాలు కాని, దీప దాన, దీప దర్శనాలు కాని సర్వ శ్రేష్ఠమైనవిగా చెప్పబడ్డాయి. ఆ రోజు చేసే మృత్యుంజయ మంత్ర జపం కూడా ఉత్తమ మైనదిగా చెప్పారు. కార్తీక పౌర్ణమి నాడే కుమార స్వామి తారకాసుర వధ చేశారని మహాభారతం చెబుతున్నది. నమక, చమకాలతో ఆ రోజు శివాలయాల్లో శివాభిషేకాలు కూడా జరుపుతుంటారు.
కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః
జలేస్థలే యే నివసంతి జీవాః |
దృష్ట్యాప్రదీపం నచ జన్మ భాగినః
భవంతి తైః విశ్వ వచాహి విప్రాః ||
అనే ఆధారాన్ని బట్టి కార్తీక పౌర్ణమి నాటి దీపపు వెలుతురు ఎంత దూరం ప్రసరిస్తుందో ఆ ప్రాంతంలోని మానవులే గాక పురుగులు, దోమలు, ఈగలు మొదలైన సమస్త జీవకోటికి మోక్షం లభించడమేగాక జన్మ రాహిత్యం కూడా లభిస్తుందని చెప్పవచ్చు. ఆ రోజు జ్వాలా తోరణాల కాంతివల్ల, దీప స్తంభాల వల్ల కూడా ఈ సందర్భం వర్తిస్తుంది. ఈ కార్తీక పౌర్ణమీ తిథి హిందువులకే గాక జైనులకు, పంజాబీలకు కూడా పుణ్య ప్రదమైన దినంగా పరిగణింపబడుతున్నది. సిక్కుల మత గురువు గురునానక్ జన్మదినం కూడా కార్తీక పౌర్ణమియే కావడం మరో విశేషం.
ఈ మాసంలో అనేక పర్వదినాలు వస్తుంటాయి. ఆ పవిత్రమైన దినాల్లో ఆయా ప్రాంతాలవారు అనేక విధాలైన ఆచార వ్యవహారాలతో పూజలు చేస్తుంటారు. కార్తీక స్నానాలు ఆశ్వీయుజ బహుళ అమావాస్య నుండి ప్రారంభించి ఈ నెలంతా చేస్తుంటారు. కొందరు సోమవారాల్లోనూ, కొన్ని ప్రత్యేకమైన తిథుల్లోనూ నిర్వహిస్తుంటారు. ప్రతి నిత్యం పురాణ పఠనం చేసి పునీతులవుతుండటం ఈ మాసంలో చూడవచ్చు. కార్తీక శుద్ధ విదియ నాడు ‘భగీనీ హస్త భోజనం’ చేయడం అపమృత్యు భయాన్ని దూరం చేస్తుందన్నది ఒక విశ్వాసం. అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో ‘భ్రాతృద్వితీయ’గా కూడా దీన్ని పిలుస్తుంటారు. మరికొన్ని ప్రాంతాలలో శుద్ధ చవితి నాడు ‘నాగుల చవితి’ పండుగ చేసుకోవడం ఆనవాయితిగా వస్తున్నది. శుద్ధ ద్వాదశి రోజు ప్రత్యేకంగా తులసీపూజ చేసుకోవడం ఈ కార్తీక మాసాననే జరుగుతుంది.
స్కాందపురాణంలో వశిష్ఠ మహర్షి ముఖతః ప్రవచింపబడ్డ ‘కార్తీక మాస మాహాత్మ్య’ విశిష్టతలో ఎన్నెన్నో అంశాలు చెప్పబడ్డాయి. కార్తీక శుద్ధ ఏకాదశికి మరో ప్రత్యేకత ఉంది. ఈ ఏకాదశిని
‘ఉత్థాన ఏకాదశి’ ‘ప్రబోధన ఏకాదశి’ అని అంటుంటారు. చాతుర్మాస్య ప్రారంభ దినంగా శయనైకాదశిగా వ్యవహరించే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించి ఈ ఏకాదశి నాడు మేల్కొంటాడు. కనుకనే దీన్ని ‘ఉత్థాన ఏకాదశి’ అన్నారు. ఈ ఏకాదశిని మహాపర్వదినంగా, ప్రత్యేక వ్రత దీక్షలతో నిర్వహించుకోవడం భారతీయ సంస్కృతిని, ఆచార వ్యవహారాలను గౌరవించేవారి విశ్వాసం. ఈనాటితో చాతుర్మాస్య వ్రత దీక్ష పరిసమాప్తమవుతుంది.
అత్యంత నియమ నిష్ఠలతో, భగవన్నామస్మరణలతో శివకేశవారాధన జరిగే కార్తీక శోభ వర్ణింపనలవి కానిదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తీ లేదు.