ktrరాష్ట్రంలోని కార్పొరేషన్ల కమీషనర్లతో మున్సిపల్‌ శాఖ మంత్రి కెటి రామారావు ఫిబ్రవరి 14న సమావేశం అయ్యారు. తెలంగాణలోని అన్ని కార్పొరేషన్లలో ప్రజలకు అవసరమయిన రోడ్లు, మార్కెట్లు, టాయిలెట్లు, పార్కులు,బస్‌ బేలు, బస్‌ షెల్టర్లు,శ్మశాన వాటికల వంటి కనీస వసతుల కల్పనపైన దృష్టి సారించాలని కమీషనర్లకు మంత్రి అదేశాలు జారీ చేశారు. ఈ సారి బడ్జెట్‌లో కార్పొరేషన్లకు ప్రత్యేకంగా కొంత నిధులను కేటాయిస్తామని మంత్రి తెలిపారు. ప్రతి కార్పొరేషన్‌ పట్టణ విజన్‌ తయారు చేయాలని, ఈ విజన్‌ మేరకు దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేయాలని మంత్రి అధికారులను కోరారు.

ముఖ్యమంత్రి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారన్న మంత్రి, సీఎం అలోచనల మేరకు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇందుకోసం పట్టణంలో రోడ్ల సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పట్టణ మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలన్నారు. రోడ్డు సౌకర్యాలతోపాటు పట్టణాల్లో బస్‌ బేలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజావసరాల కోసం ప్రభుత్వ సంస్ధల భూమిని ఏలాంటి నోటీసు లేకుండా వినియోగించుకునేందుకు గతంలో ఇచ్చిన సర్క్యులర్‌ ఉపయోగించుకుని ఈ బేల నిర్మాణం చేయాలని చెప్పారు. ఈ బస్‌ బేలు, షెల్టర్లు సాధ్యమైనంత అత్యాధునికంగా ఉండేలా ప్రయత్నించాలన్నారు. ఈ రోడ్డు నిర్మాణం చేస్తున్నప్పుడే పుట్‌పాత్‌ ల నిర్మాణం చేపట్టాలన్నారు.

పట్టణాల్లోని జనాభాకు అనుగుణంగా టాయిలెట్స్‌ నిర్మాణం జరగాలన్నారు. ముఖ్యంగా కమ్యూనిటీ టాయిలెట్స్‌ తగినన్ని ఏర్పాటు చేయాలన్నారు. రోడ్ల పైన మూత్ర విసర్జనను అరికట్టేలా టాయిలెట్స్‌కు దారి, దూరం వంటి వివరాలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పట్టణాలను ఒపెన్‌ డిపెకేషన్‌ ప్రీ చేసేందుకు ఉగాదిలోగా పెట్టుకున్న గడువు మేరకు పనిచేయాలన్నారు. ఈమేరకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపైన దృష్టి సారిస్తూ మిషన్‌ మోడ్‌లో పనిచేయాలన్నారు. పట్టణాల్లో శ్మశాన వాటికలను అభివృద్ధి చేయాలన్నారు. ఇందుకోసం హైదరాబాద్‌ లోని మహప్రస్థానం స్థాయిలో ఉండాలన్నారు.

పట్టణాల్లో డబుల్‌ బెడ్‌ రూం కార్యక్రమాలను కలెక్టర్లతో కలసి సమన్వయం చేసుకోవాలని తెలిపారు. పట్టణాల్లోని జనాభా అవసరాల మేరకు మోడల్‌ మార్కెట్ల నిర్మాణం చేపట్టాలన్నారు. కూరగాయాలకు(వెజ్‌), నాన్‌ వెజ్‌కు ప్రత్యేకంగా మార్కెట్లు నిర్మాణం చేయాలన్నారు. మెకనైజ్డ్‌ కబేలాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పారిశుధ్యం కోసం కార్పొరేషన్లకు వాహనాలు ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. పారిశుధ్ద్య నిర్వహణపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కమీషనర్లు ఉదయం 5 గంటలకే పారిశుధ్య పనులను సమీక్షించాలని ఆదేశించారు. పట్టణాల్లో అనధికారిక ప్లెక్సీలు, వాల్‌ రైటింగ్‌ చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. కేసులు నమోదు చేస్తూ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని అదేశించించారు.

పట్టణాల్లో ఏల్‌ ఈ డీ లైట్ల ఏర్పాటును పూర్తి చేయాలన్నారు. ఈ లైట్ల బిగింపు పక్రియ జరుగుతున్న తీరుని మంత్రి సమీక్షించారు. మరో మూడు కార్పొరేషన్లలో ఐదు రూపాయాల భోజన పథకాన్ని విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు అయా కార్పొరేషన్లలోని ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించారు. కార్పొరేషన్ల ఔట్‌ సొర్సింగ్‌,కాంట్రాక్ట్‌ సిబ్బంది మేయర్లు, కార్పొరేటర్లు, ఇతర అధికారుల వద్ద పనిచేస్తున్న విషయం పలువురు సోషల్‌ మీడియాలో ప్రస్తావించిన విషయంపైన మంత్రి కమీషనర్లను హెచ్చరించారు. పురపాలికల నుంచి జీతం తీసుకునే ప్రతి ఉద్యోగి, సంస్ధ కోసమే పనిచేయాలన్నారు. ఇలాంటి విషయంలో ఫిర్యాదు వస్తే కమీషనర్లపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Other Updates