వి.ఫ్రకాష్
హైదరాబద్ నగరంలోని ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థి నాగం కృష్ణ భారీ మెజారిటీతో గెలుపొందడంతో నగర మునిసిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహిచడానికి బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం వెనుకంజ వేసి 1970 జూన్ 26న ఎన్నికలు నిలిపివేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని తెలంగాణ వాదులైన శాసన సభ్యులు, కార్పొరేటర్లు, ఉద్యమకారులు, టిపిఎస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆందోళనలు నిర్వహించారు. అయినా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు.
ఆర్డినెన్స్ అనవసరం – హైకోర్టు న్యాయమూర్తి
నగర కార్పొరేషన్‌కు ఎన్నికలను నిలిపివేస్తూ బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి పి. శ్రీరాములు జూలై 27న ”సస్పెండ్” చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్డినెన్స్ అమలును నిలుపుదల చేస్తూ నగర కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఎస్.ఎస్.పి. ఛైర్మన్ సీతల్ సింగ్ లష్కరీ రిట్ పిటీషన్ దాఖలు చేసారు.
పిటీషనర్ తనపై చేసిన ఆరోపణలను ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి ఖండిస్తూ ప్రతిగా ఒక అఫిడవిట్ దాఖలు చేయనందున ఆరోపణలు నిజమేనని పరిగణించవలసి వస్తుందని న్యాయమూర్తి తమ ఉత్తర్వులో పేర్కొన్నారు. కౌన్సిలర్లకు, సిఎంకు మధ్య తీవ్రమైన విభేదాలున్నట్లు విదితమవుతున్నదని కూడా న్యాయమూర్తి ఉత్తర్వులో పేర్కొన్నారు.
”ప్రస్తుత కౌన్సిలర్లు సక్రమంగా వ్యవహరించడం లేదని భావించినప్పటికీ (ఆర్డినెన్స్ జారీ చేయడానికి ఇదొక కారణంగా చెప్పబడింది), వారు తమ అధికారాలనుమించిన పనులను చేస్తున్నట్లు భావించినప్పటికీ, కొత్తగా ఎన్నికయ్యే వారు కూడా అదే విధమైన రీతిలో ప్రవర్తిసారని విశ్వసించడానికి ఎట్టి కారణాలు కానరావడం లేద”ని ఉత్తర్వులో పేర్కొన్నారు.
”ఎన్నుకోబడిన కౌన్సిలర్లు సమష్టిగా చేయలేకపోతే ప్రభుత్వం నియమించిన ఒకే వ్యక్తి (స్పెషల్ ఆఫీసర్) కార్పొరేషన్ ఆర్ధిక పరిస్థితిని ఏ విధంగా మెరుగుపరచగలరో తమకు అవగాహన కావడం లేద”ని న్యాయమూర్తి అన్నారు.
”ఇందుకు ప్రభుత్వం హడావిడిగా ఆర్డినెన్సును, శాసనసభ అతి త్వరలో సమావేశం కానున్న తరుణంలో జారీ చేయడం కంటే బిల్లును ప్రవేశపెట్టి ఉండవలసింద”ని న్యాయమూర్తి తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆర్డినెన్సు జారీ చేయడానికి అత్యవసరమైన పరిస్థతులేమీ ఏర్పడలేదని తాము భావిస్తున్నట్లు కూడా న్యాయమూర్తి అన్నారు.
ప్రభుత్వం తరఫున అడ్వోకేట్ జనరల్ పి. రామచంద్రారెడ్డి కోర్టుకు హాజరైనారు.
హైకోర్టు ఉత్తర్వులోని న్యాయమూర్తి వ్యాఖ్యలను గమనిస్తే కార్పొరేషన్‌కు ఎన్నికలు జరపితే ప్రజా సమితి ఎక్కువ స్థానాలు గెలుస్తుందనే భయంతోనే ముఖ్యమంత్రి స్పెషల్ ఆఫీసర్ పాలనకు తెరదీసారని స్పష్టమవుతున్నది.
నగర కార్పొరేషన్ బిల్లుకు శాసనసభ ఆమోదం – తెలంగాణ వాదుల వాకౌట్
తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నా, ఆర్డినెన్సు జారీకి సహేతుకత లేదని హైకోర్టు ఆక్షేపించినా ఖాతరు చేయని బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ నగర కార్పొరేషన్ బిల్లును శాసన సభలో జూలై 30న ప్రవేశ పెట్టగా బిల్లును సభ ఆమోదించింది. ఇందుకు అభ్యంతరం తెలుపుతూ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, యస్.యస్.పి, రిపబ్లికన్ పార్టీల సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు.
అంతకు ముందు ప్రతిపక్షాల సభ్యులు ప్రతిపాదించిన సవరణల నన్నింటినీ సభవారు త్రోసిపుచ్చారు.
మున్సిపల్ శాఖామంత్రి చెంచు రామానాయుడు మాట్లాడుతూ ”కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ కృషిని ప్రతి ఆరు నెలలకోసారి సమీక్షించి నివేదికను సభకు సమర్పించడం జరుగగలద”నీ తెలిపారు.
బిల్లును ప్రాంతీయ సంఘానికి తిరిగి నివేదించాలని, స్పెషల్ ఆఫీసర్ పాలన కాలపరిమితి రెండేళ్ళు కాకుండా ఆరు నెలలకే పరిమితం చేయాలని, ఇక పై కూడా మేయర్, డిప్యూటీ మేయర్‌లను వారి ఉద్యోగాలలో ఉంచాలని వచ్చిన సవరణలను మూజువాణి ఓటింగ్‌తో తిరస్కరించారు.
మున్సిపల్ కార్పొరేషన్స్‌ను రద్దు చేసేందుకు రాజ్యాంగంలో అవకాశం లేదని ప్రగఢ కోటయ్య వాదించారు.
తెలంగాణా మిగులు నిధులు – భార్గవ కమిటీ నివేదికకు ప్రభుత్వామోదం
తెలంగాణలో మిగులు నిధులపై కేంద్ర ప్రభుత్వం నియమించిన భార్గవా కమిటీ సమర్పించిన నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించినట్లు ఉపముఖ్యమంత్రి జె.వి. నర్సింగారావు (ఆగస్టు 6, 1970న) శాసన సభలో ప్రకటించారు. భార్గవ మిగులు నిధులు 28 కోట్లుగా పేర్కొంటూ నివేదిక ప్రభుత్వానికి సమర్పించారు.
ఈ నివేదిక నమ్మశక్యంగా లేదని, ఈ సంఘం పరిగణనలోకి తీసుకున్న లెక్కలు అన్నీ అవాస్తవికమైనవని తెలంగాణ ఐక్య సంఘటన ఉపనాయకుడు కె. అచ్యుత రెడ్డి శాసనసభలో అన్నారు. అచ్యుతరెడ్డి తెలంగాణ రీజనల్ కమిటీకి తొలి అధ్యక్షులు.
”ఈ భార్గవ సంఘం చట్ట బద్ధమైనది కాదు. సంఘం పరిశీలనాంశాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. 1959లో రాష్ట్ర ప్రభుత్వం, ప్రాంతీయ సంఘం కలిసి మిగులు నిధులు నిర్ణయించడం కోసం రూపొందించిన సూత్రాలను ఈ సంఘం విస్మరించింద”ని అచ్యుతరెడ్డి అన్నారు.
కేంద్రం నుంచి రుణాలు, గ్రాంట్ల రూపంలో అందే డబ్బు కూడా రాష్ట్రానికి ఆదాయమే అవుతుందని, ఈ ఆదాయం రూ. 64 కోట్లు అని నిర్ణయించిన కుమార్ లలిత్ తెలంగాణ మిగులు నిధులు రూ. 38 కోట్లు ఉన్నట్లు తేల్చగా ఈ ఆదాయం రూ. 28 కోట్లేనని భార్గవ సంఘం చెప్పడం పరిశీలిస్తే ఈ లెక్కల్లో ఏదో గందరగోళం ఉన్నదని ఎవ్వరికైనా స్పష్టమవుతున్నదని అచ్యుతరెడ్డి అన్నారు. ఉద్దేశ్య పూర్వకంగానే ప్రభుత్వం భార్గవ సంఘానికి ఈ తప్పుడు లెక్కల వివరాలు అందజేసిందని వేరుగా చెప్పనక్కర లేదని అచ్యుతరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షులు జె. చొక్కారావు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ భార్గవ సంఘానికి నివేదించిన్పటికి వారి వాదాన్ని ఆ సంఘం ఖాతరు చేయలేదని అన్నారు.
పలువురు సభ్యులు ఈ అంశంపై మాట్లాడారు. ఉపముఖ్యమంత్రి జె.వి. నరసింగారావు చర్చకు క్లుప్తంగా జవాబిస్తూ… భార్గవ సంఘం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాను సారం ఏర్పడినదని, ఈ సంఘం నివేదికను ప్రభుత్వం ఆమోదించిందని, భార్గవ నివేదిక నిర్ణయించిన తెలంగాణ మిగులు నిధులు రూ. 28 కోట్లు తోడుగా ప్రత్యేక సహాయంగా కేంద్రం తెలంగాణకు 17 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడానికి నిర్ణయించిందని, ఈ మొత్తం రూ|| 45 కోట్లు తెలంగాణలోనే ఖర్చు చేయడం జరగుతుందని అన్నారు.
ప్రణాళికలో తెలంగాణ వాటా – వెంకట్రామన్ చర్చలు
తెలంగాణకు ప్రణాళికా మొత్తం కేటాయింపు సమస్యపై ప్రణాళికా సంఘం సభ్యుడు ఆర్.వెంకట్రామన్ ఆగస్టు 8న రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షులతో సమాలోచనలు జరిపారు. తెలంగాణకు 1969-70, 1970-71లలో కూడా తెలంగాణా మిగులు నిధుల నుంచి కేటాయించిన మొత్తాలతో చేర్చి లెక్కిస్తే 42 శాతంగా వుంది.
తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షులు జె. చొక్కారావు ప్రణాళికలో తెలంగాణా వాటా ప్రస్తుతం వున్న 33 శాతం నుండి 40 శాతానికి పెంచాలని కోరుతున్నారు.
మరో ఎస్.ఆర్.సి. ఏర్పాటు జరుగదు : మంత్రి కె.సి.పంత్
”కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసేందుకై మరో రాష్ట్రాల పునర్విభజన సంఘాన్ని నియమించడం జరుగద”ని దేశ వ్యవహారాల సహాయ మంత్రి కె.సి. పంత్ ఆగస్టు 8న లోక సభలో స్పష్టం చేసారు.
తెలంగాణ, విదర్భ, గోవా, మణిపూర్, ఢిల్లీలు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు కావాలన్న కోర్కెల దృష్ట్యా రెండవ రాష్ట్ర విభజన సంఘాన్ని ఏర్పాటు చేయటం ప్రభుత్వం పరిశీలించగలదా? అని ఎం.పి. జగన్నాథ రావు జోషి ప్రశ్నించారు. ఒత్తిడులకు లొంగి ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయాలు చేయరాదని, వీటన్నిటిని గురించి ప్రభుత్వం సమగ్రమైన నిర్ణయం చేయాలని జోషి అన్నారు.
పంత్ జవాబిస్తూ ”గతంలో ఎస్.ఆర్.సి.(స్టేట్స్ రీ – ఆర్గనైజేషన్ కమీషన్) నివేదిక సమర్పించినప్పటికీ ఇంకా కొత్త కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్న కోర్కెలు బయలు దేరుతున్నాయి. ఇప్పుడు ఇంకో సంఘాన్ని నియమిస్తే మరికొన్ని కొత్త కోర్కెలు బయలు దేరవచ్చు”నని అన్నారు.
తెలంగాణ ప్రజా సమితిలో సభ్యుల చేర్పింపు
టి.పి.ఎస్.ను రాజకీయ పార్టీగా మార్చాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత అధ్యక్షులు డా|| చెన్నారెడ్డి సంస్థ నిర్మాణాన్ని బలోపేతం చేయడం పై దృష్టి పెట్టారు. ఆగస్టు 9న జంటనగరాలలో వివిధ ప్రాతాల్లో పర్యటించి ప్రచారం చేస్తూ సభ్యత్వ చేర్పింపు ఉద్యమాన్ని ప్రారంభించారు. జంటనగరాల్లో రెండున్నర లక్షల మందితో సహా మొత్తం పదిలక్షల మంది సభ్యులను తెలంగాణ వ్యాప్తంగా సంస్థలో చేర్చుకోవాలని ప్రజా సమితి లక్ష్యంగా పెట్టుకుంది. నవంబర్ 15 దాకా ఈ సభ్యత్వ చేర్పింపు ఉద్యమం కొనసాగుతుందని డా|| చెన్నారెడ్డి అన్నారు. ”తమిళనాడులో డి.ఎం.కె. మాదిరిగా తెలంగాణ ప్రజా సమితి రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో ప్రముఖంగా పని చేయగలద”ని పేర్కొన్నారు.
”తెలంగాణ ఏర్పడితే ఆదర్శవంతమైన రాష్ట్రం కాగలదని, కుల, మత, భాషా వివక్షతలు లేని చిన్న సైజు భారతదేశంగా పరిఢవిల్లగలద”ని డా|| చెన్నారెడ్డి అన్నారు. తమ పార్టీ తెలంగాణలోని ఆంధ్ర ప్రాంత ప్రజలను వెళ్ళిపొమ్మని అనడం లేదని, ఆంధ్ర పరిపాలకులను మాత్రమే వెళ్ళిపొమ్మని అంటున్నదని డా|| చెన్నారెడ్డి అన్నారు.
ఆంధ్ర పాలకులు వెళ్ళి పోయినప్పుడే తెలంగాణా ప్రజలు విముక్తులై, రెండవ శ్రేణి పౌరులుగా పరిగణింపబడటం ఆగిపోగలదని ఆయన అన్నారు.