మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఇటీవల కాలంలో వాయుకాలుష్యం భరించలేనంతగా, ప్రమాదకర స్థాయిలో పెరిగిపోవడంతో అక్కడి ప్రభుత్వం పరిస్థితులను చక్కదిద్దే కార్యక్రమాలు చేపట్టింది. ఈ సంఘటనలు దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ఒక హెచ్చరికగా పరిణమించాయి.
ప్రతి సంవత్సరం జూన్ 5న ”ప్రపంచ పర్యావరణ దినోత్సవం”గా పాటిస్తున్నాం. మనిషి తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకతి ప్రసాదించిన వనరులను అవసరానికి మించి వాడుకుంటున్నాడు. తన మేధో సంపత్తితో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని, ప్రపంచవ్యాప్తంగా పలు పరిశ్రమలను నెలకొల్పుతున్నాడు. ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో కోలుకోలేనంతగా వాతావరణం కలుషితమై, పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం అన్నీ కలుషిత మవుతున్నాయి. ఈ రకంగా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో సాధించిన పురోగతి కూడా ప్రకతి కాలుష్యానికి కారణమ వుతోంది. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ లాంటి విషపూరిత వాయువులు వాతావరణంలో పరిమితికి మించి పెరగడం వల్ల క్రమంగా భూమండలం వేడెక్కుతోంది. అడవులు, జల వనరులు క్రమేపీ తగ్గిపోతున్నాయి. జంతుజాలం అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతోంది.
కాలుష్యం అనేది చాలా రకాలుగా ఉన్నా, వాయుకాలుష్యం, జలకాలుష్యం, శబ్ద కాలుష్యం గురించి ప్రధానంగా చెప్పుకోవాలి.భారతీయ చింతనలో, వాఙ్మయంలో ప్రకతికి ఆరాధనా భరితమైన స్థానం ఇవ్వబడింది. సర్వేజనః సుఖినో భవంతు అనడమే కాకుండా సర్వేపి సుఖినః సంతు అనికూడా చెప్పారు. అంటే మనుషులే కాకుండా సమస్త జీవులు కూడా సుఖంగా ఉండాలని అభిలషించారు. అదేవిధంగా ప్రకతిలోని ప్రతి అణువుకు దైవత్వాన్ని అపాదించారు. అందుకే భూమికి శాంతి, నింగికి శాంతి, అంతరిక్షానికి శాంతి, అగ్నికి శాంతి, నీటికి శాంతి, దిక్కులకు శాంతి, ఓషధులకు శాంతి, చివరికి శాంతికే శాంతి కావాలని ఋగ్వేదంలో ఆకాంక్షించారు.
వేల సంవత్సరాల క్రితంనుంచే ప్రకతిని ఆరాధించడం భారతీయ సంస్కతిలో అంతర్లీనంగా ఉన్నది. నేటికి మన దేశంలో చెట్టు , పుట్ట, రాయి, పాము మొదలగు వాటిని ఆరాధించడం చూస్తున్నాం. కొంతమంది దీనితో ఏకీభవించక పోవచ్చు. దీనిని మూఢత్వంగా భావించవచ్చు. కానీ పర్యావరణ పరంగా మనిషితోపాటు, జీవరాసులన్నింటినీ పరిరక్షించడం ప్రకతిని కాపాడటమే అవుతుంది.
పరిసరాల కాలుష్యం నేడు మనిషి మనుగడకే ప్రమాదం కలిగించే స్థాయికి చేరుకున్నది. పరిశ్రమల నుంచి, వాహనాల నుంచి వచ్చే వ్యర్థాలు గాలిని, నీటిని, భూమిని, అంతరిక్షాన్ని అన్నింటిని కాలుష్యం చేస్తున్నవి. కర్బన ఉద్గారాల వల్ల భూ తాపం పెరిగిపోతున్నది. భూగోళం అగ్నిగోళంగా మారుతోంది. ప్రస్తుతం ఉన్న రీతిలోనే వాతావరణ కాలుష్యం పెరిగితే ఈ శతాబ్దపు అంతానికి భూ తాపం 3.5 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగి ప్రళయ విలయాలు సంభవించి జీవుల మనుగడ కష్టమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు..
వ్యర్ధ పదార్ధాలని, కలుషితాలని నది మురుగు వ్యవస్థల యొక్క ఉపరితలంలో పాలబోయడం, నాచు పేరుకుపోవటం వలన, వ్యర్థ జలాలను వదిలివెయ్యటం వలన, వ్యర్ధాలు పేరుకుపోవటం వలన జలకాలుష్యం ఏర్పడుతోంది. దీనివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఇన్నిన్ని కావు. ఇక వాహనాల రొద, యంత్రాల ధ్వని,వల్ల ధ్వని కాలుష్యం ఏర్పడుతోంది.ధ్వని కాలుష్యం వల్ల వినికిడి శక్తి కోల్పోవడం, అధిక రత్పోటు, ఒత్తిడి, నిద్రాభంగం, మొదలైన సమస్యలు ఎదురవుతున్నాయి.
పర్యావరణాన్ని రక్షించటానికి ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు, వివిధ రకాలైన కాలుష్యాలను నియంత్రించటానికి, అదే విధంగా కాలుష్య దు ష్ప్రభావాలను తగ్గించటానికి వివిధ చట్టాలను అమలుచేస్తున్నాయి. అదే విధంగా మన దేశంలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కాలుష్య భూతాన్ని తరిమివేయడానికి పలు చట్టాలను రూపొందించి అమలుచేస్తున్నాయి..
తెలంగాణ ప్రభుత్వ చర్యలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కు పటిష్టమైన చర్యలు చేపడుతోంది. అడవులను, పర్యావారణాన్ని రక్షించేందుకు ఇతర చర్యలతోపాటు, అతిముఖ్యమైన తెలంగాణకు హరితహారం అనే బహత్తర కార్యక్రమాన్ని రూపొందించి గత కొన్ని సంవత్సరాలుగా యుద్ధప్రాతిపదికపై కోట్లాది మొక్కలు నాటి పర్యావరణ సంరక్షణ చేపడుతోంది. ఈ కార్యక్రమంలో ప్రజలను పెద్దఎత్తున భాగస్వాములను చేస్తోంది. ఫలితంగా, ఢిల్లీ లాంటి కాలుష్య పూరిత వాతావరణం తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో రాబోదన్న భరోసాన్ని ప్రభుత్వం ప్రజలకు కల్పించింది. రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చి దిద్దుతోంది.
రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పలు చట్టాలను, నిబంధనలను అమలుపరుస్తోంది.జల కాలుష్యం, వాయుకాలుష్యం నివారించడం, నియంత్రించ డానికి, హానికర వ్యర్ధ పదార్ధాల తరలింపు, నిర్వహణకు, ఘన వ్యర్ధాల నిర్వహణ, ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ, నిర్మాణ, కూల్చివేతల వ్యర్ధాల నిర్వహణ,ఇ- వ్యర్ధాల నిర్హణకు సంబంధించిన చట్టాలు, నిబంధనలను కఠినతరంగా అమలు పరుస్తోంది. శబ్దకాలుష్యాన్ని క్రమబద్ధీకరించడానికి, నియంత్రించడానికి సంబంధించిన చట్టాలను కూడా అమలుచేస్తోంది.
రాష్ట్రంలో పరిశ్రమల కాలుష్యంపై నిఘా
మొత్తం పరిశ్రమలను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నాలుగు తరగతులుగా విభజించింది. ఆయా పరిశ్రమల నుండి వెలువడే కాలుష్య కారకాలను అనుసరించి ఎరుపు, నారింజ, ఆకుపచ్చ, తెలుపు పరిశ్రమలుగా వర్గీకరించింది. అత్యధిక కాలుష్యాన్ని వెదజల్లేవాటిని ఎరుపు వర్గంగాను, మధ్యస్తంగా కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను నారింజ వర్గంగాను, తక్కువ కాలుష్యాన్ని వెదజల్లేవాటిని ఆకుపచ్చవర్గంగా, కాలుష్యానికి ఆస్కారమివ్వని వాటిని తెలుపువర్గంగా వర్గీకరించింది. తెలుపు వర్గంలో ని పరిశ్రమలు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలినుంచి అనుమతిపత్రాలేవీ పొందనవసరం లేదు.కాగా, తెలంగాణ రాష్ట్రంలో మండలి నుంచి అనుమతి పొందవలసిన పరిశ్రమలు 6388 ఉన్నాయి. వీటిలో 2,667 ఎరుపు వర్గంలోనూ, 3123 నారింజ, 598 ఆకుపచ్చ వర్గాల్లో ఉన్నాయి. ఈ పరిశ్రమలంన్నింటినీ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి క్రమబద్ధంగా పర్యవేక్షిస్తోంది. ఈ పరిశ్రమలు ఎటువంటి కాలుష్యాన్ని విడుదలచేయకుండా చూస్తూ, ఒక వేళ నిబంధనలు అతిక్రమిస్తే వాటిపై చర్యలు తీసుకొంటోంది.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జాతీయ జల నాణ్యతా పరిశీలన కార్యక్రమంలో భాగంగా, రాష్ట్రంలోని నదులు, ఉపనదులు, సరస్సులు, చెరువులు, భూగర్భ జలాలు, మురికి కాల్వలను పరిశీలించడం జరుగుతంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 160 కేంద్రాలలో పరిశీలన జరుగుతుంది.
మురుగు శుద్ధి నిర్వహణ
రాష్ట్రంలో మొత్తం 29 మురుగు శుద్ధి కర్మగారాలు
ఉన్నాయి. ఇవి రోజుకు సుమారు 769 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధిచేస్తాయి. వీటిలో జి.హెచ్.ఎం.సి పరిధిలో ఉన్న 20 కర్మాగారాలు రోజుకు 728 లీటర్లు శుద్ధిచేస్తాయి. వీటికి తోడు అదనంగా రోజుకు మరో వెయ్యి మిలియన్ లీటర్ల సామద్ధ్యంగల మురుగు శుద్ధి కర్మాగారాలు స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ తయారుచేసింది. ఈ విధంగా నీరు వధాకాకుండా మురుగునీచిని శుద్ధిచేసి, వివిధ అవసరాలకు సద్వినియోగం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
జాతీయ పరిసర వాయు నాణ్యతా పరిశీలనా కార్యక్రమం, రాష్ట్ర పరిసర వాయు నాణ్యతా పరిశీలనా కార్యక్రమం, నిరంతర వాయు నాణ్యతా పరిశీలనా కేంద్రం కింద రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఎప్పటికప్పుడు వాయుకాలుష్యాన్ని పరిశీలిస్తోంది. తెలంగాణా వ్యాప్తంగా జాతీయ పరిసర వాయునాణ్యతా పరిశీలన కార్యక్రమం కింద 22 స్టేషన్లలో రాష్ట్రమండలి వాయునాణ్యతను పరిశీలిస్తోంది. హైదరాబాద్ లోని పంజాగుట్ట, ఆబిడ్స్, జూబ్లీహిల్స్, జూపార్క్, తార్నాకా, జె.ఎన్.టి.యు, ప్రారడైజ్, గడ్డపోతారం, గచ్చిబౌలీ, ఆర్.సి.పురం వంటి 11 ప్రాంతాలలో వాస్తవ శబ్దకాలుష్య నమోదు కేంద్రాలను నిర్వహిస్తోంది. ప్రజలకోసం ఈ సమాచారాన్ని ప్రముఖంగా ప్రదర్శిస్తోంది.దీనితోపాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజలలో అవగాహనను పెంచేందుకు కూడా కాలుష్య నియంత్రణ మండలి పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోండి అన్న నినాదంతో గత ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పెద్దఎత్తున నిర్వహించింది. గత వినాయక చవితి సందర్భాగ సబ్సిడీపైన 1, 95,221 మట్టి గణపతుల ప్రతిమలను ప్రజలకు పంచిపెట్టారు. వాహన కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, పారిశ్రామిక కాలుష్యంపై లఘుచిత్రాలద్వారా ప్రజలలో అవగాహన కల్పిస్తోంది. దీపావళి సందర్భంగా శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి ఆకాశంలో బెలూన్లద్వారా దీపకాంతులు వెదజల్లడానికి వినూత్న కార్యక్రమాలు చేపట్టింది.
ప్రభుత్వం చేస్తున్న ఈ క షికితోడు ప్రజలు కూడా అవగాహనతో మసలుకోవాలి. కాలుష్యనివారణకు ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను సద్వినియోగం చేస్తుకోవాలి. అప్పుడే మనం ఆశించిన కాలుష్య రహిత రాష్ట్రాన్ని సాధించగలం.
పి. అనిల్ కుమార్, ఐ.ఏ.ఎస్
సభ్యకార్యదర్శి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి