తెలంగాణలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరందించే కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జూన్‌ 21న సరిగ్గా ఉదయం 11.23 గంటలకు మేడిగడ్డ బ్యారేజి వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. 11.26 గంటలకు మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు. 1.07 గంటలకు కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను స్విచాన్‌ చేశారు. పంప్‌ హౌజ్‌లో మధ్యాహ్నం 1.15 గంటల నుండి నీటి పంపింగ్‌ ప్రారంభమయింది. దీంతో పవిత్ర గోదావరి జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లించే భగీరథ ప్రయత్నమైన బృహత్తర కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఉపయోగంలోకి వచ్చినట్లయ్యింది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు.

అంతకు ముందు మేడిగడ్డ బ్యారేజీ వద్ద, కన్నెపల్లి పంప్‌ హౌజ్‌ వద్ద శృంగేరీ పీఠం అర్చకుల ఆధ్వర్యంలో జలాశయ ప్రతిష్టాంగ యాగం, జలసంకల్ప మహోత్సవ యాగం జరిగింది. వేద మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత శాస్త్రయుక్తంగా జరిగిన యాగం పూర్ణాహుతితో ముగిసింది.

ఈ సందర్భంగా వేద పండితులు ముగ్గురు ముఖ్యమంత్రులను, గవర్నర్‌ను ఆశీర్వదించారు. మేడిగడ్డ బ్యారేజి వద్ద జరిగిన యాగంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు, కన్నెపల్లి పంప్‌ హౌజ్‌ దగ్గర జరిగిన యాగంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు దంపతులు పాల్గొన్నారు. ఇదే సమయంలో అన్నారం బ్యారేజీని మంత్రి నిరంజన్‌ రెడ్డి, అన్నారం పంప్‌ హౌజ్‌ను మంత్రి మహమూద్‌ అలీ, సుందిళ్ల బ్యారేజీని, పంప్‌ హౌజ్‌ లను మంత్రి కొప్పుల ఈశ్వర్‌, మేడారం పంప్‌ హౌజ్‌ను మంత్రి మల్లారెడ్డి, లక్ష్మీపూర్‌ పంప్‌ హౌజ్‌ను మంత్రి జగదీష్‌ రెడ్డి ప్రారంభించారు.

బ్యారేజీ చుట్టూ కలియ తిరిగిన ముఖ్యమంత్రి, గవర్నర్‌
మేడిగడ్డ బ్యారేజీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. బ్యారేజికి అనుబంధంగా గోదావరి నదిపై తెలంగాణ – మహారాష్ట్రాల మధ్య నిర్మించిన బ్రిడ్జిని కూడా ప్రారంభించారు. ముగ్గురు ముఖ్యమంత్రులు గవర్నర్‌ ఒకే కారులో తెలంగాణ సరిహద్దు నుండి బ్యారేజీ మీదుగా మహారాష్ట్ర సరిహద్దు వరకు ప్రయాణించారు. అనంతరం బ్యారేజీ లోపలికి నీరు నిలువ ఉంచే చోటును పరిశీలించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ గోదావరి నీటి వినియోగానికి ప్రాజెక్టుల ఆవశ్యకతను గుర్తించిన విధానాన్ని వివరించారు. మేడిగడ్డ బ్యారేజ్‌ ద్వారా తెలంగాణ ప్రాంతానికి ఏ విధంగా నీరు అందిస్తున్నది విడమరిచి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్రతో చేసుకున్న చారిత్రక ఒప్పందమే కీలకమని ముఖ్యమంత్రి అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ అన్ని రకాలుగా సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు. కన్నెపల్లి పంప్‌ హౌజ్‌ ప్రారంభం సందర్భంగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ నరసింహన్‌ను పంప్‌ హౌజ్‌ అడుగు భాగంలో ఏర్పాటు చేసిన పంపుల వద్దకు తీసుకువెళ్లి చూపించారు. పంపుల సామర్ధ్యం, ఉపయోగంపై విపులంగా చెప్పారు. మెగా ఇంజనీరింగ్‌ కంపెనీ ప్రతినిధి కృష్ణారెడ్డి అతిథులకు నిర్మాణాల విశిష్టతలను వివరించారు.

ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసిన చారిత్రక సందర్భం
నదీ జలాల వాటాలు, పంపకాల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య, అటు దేశాల మధ్య ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో నదీ పరీవాహక ప్రాంతానికి చెందిన ముగ్గురు ముఖ్యమంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొనడం చరిత్రలో నిలిచిపోనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మహారాష్ట్రతో అంతరాష్ట్ర వివాదాల నేపథ్యంలో తెలంగాణ ప్రాజెక్టులు ముందుకు పడలేదు. నిన్న మొన్నటి వరకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంలోను విభేదాలు ఉండేవి. నీటి వాటాలు, పంపకాల విషయంలో పేచీలు పెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత మహారాష్ట్ర ప్రభుత్వంతో, ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఏర్పడిన జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్నేహ పూర్వక దౌత్య సంబంధాలు నడిపారు. గోదావరి జలాలు ప్రతీఏటా వేల టీఎంసీల చొప్పున సముద్రం పాలు కావడం కన్న సమర్ధవంతంగా వాడుకునేందుకు ప్రాజెక్టులు నిర్మించుకోవాలనే ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు ముఖ్యమంత్రులు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

అతిథులకు, బ్యాంకర్లకు సన్మానం
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్య అతిథులు గవర్నర్‌ నరసింహన్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘనంగా సన్మానం చేసి జ్ఞాపికలు అందించారు. కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా వారికి ఘన స్వాగతం పలికిన కేసీఆర్‌ వెళ్లేటప్పుడు హెలికాప్టర్‌ దాకా వెళ్లి మరీ ఒక్కొక్కరికి ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందించిన వివిధ బ్యాంకుల ప్రతినిధులను ముఖ్యమంత్రి సన్మానించి జ్ఞాపికలు అందించారు. సన్మానం పొందిన వారిలో ఆంధ్రా బ్యాంక్‌ ఎండి & సిఇవో జె. పక్రిసామి, ఇండియన్‌ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎంకె భట్టాచార్య, ఆర్‌.ఇ.సి. లిమిటెడ్‌ డైరెక్టర్‌ (టెక్నికల్‌) ఎస్‌కె. గుప్తా, పవర్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ డైరెక్టర్‌ (కమ్యూనికేషన్స్‌) పికెసింగ్‌, అలహాబాద్‌ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కె. రామచంద్ర, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హేమంత్‌ కుమార్‌ తమ్తా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌ బినోద్‌ కుమార్‌, నాబార్డ్‌ సిజిఎమ్‌ విజయ్‌ కుమార్‌, కార్పోరేషన్‌ బ్యాంక్‌ డిజిఎమ్‌ అండ్‌ జోనల్‌ హెడ్‌ ఎంజె అశోక్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌ హెడ్‌ హైదరాబాద్‌ ఎస్‌.వి.రామకృష్ణ, ఆంధ్రా బ్యాంక్‌ మేనేజర్‌ శ్యామల్‌ గోష్‌ రె, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఎజిఎమ్‌ మహమ్మద్‌ మఖ్‌ సూద్‌ అఈ, ఇండియన్‌ బ్యాంక్‌ జోనల్‌ మేనేజర్‌ ఆర్‌. మనోహర్‌ తదితరులు వున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టును అతి స్వల్పకాలంలోనే నిర్మించి ప్రారంభించుకుంటున్న ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన రోజు అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి అన్నారు. అతిథులు, బ్యాంకర్లను సన్మానించే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ భూముల్లో బంగారు పంటలు పండించాలనే కల సాకారం కాబోతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతీ ఒక్కరికీ జోషి కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ మంత్రులు ఈటల రాజేందర్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి, డిజిపి మహేందర్‌ రెడ్డి, ఐజీ నాగిరెడ్డి, మహారాష్ట్ర డిజిపి జైస్వాల్‌, ఎంపిలు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌, బి. వెంకటేష్‌ నేత, విప్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పి ఛైర్‌పర్సన్‌ తుల ఉమ, మాజీ స్పీకర్‌ మధుసూదనా చారి, నీటి పారుదాల శాఖ ఇఎన్సీలు మురళీధర్‌ రావు, హరే రామ్‌, వెంకటేశ్వర్లు, ఎన్‌పిడిసిఎల్‌ సిఎండి గోపాల రావు, ట్రాన్స్‌ కో డైరెక్టర్‌ సూర్య ప్రకాష్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు తదితరు పాల్గొన్నారు.

మానవ నిర్మిత మహా అద్భుతం
తెలంగాణ భూ భాగంలోని దాదాపు 70 శాతం జిల్లాలకు సాగుకు, తాగుకు, పరిశ్రమలకు నీరు అందించడానికి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదించబడింది.దేశ నీటి పారుదల రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తున్న ఈ ప్రాజెక్టు మానవ నిర్మిత అద్భుతంగా నిలుస్తుందని సిడబ్ల్యుసి అధికారుల నుంచి మొదలుకుని వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, నీటి పారుదల నిపుణులు కితాబిచ్చిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే శరవేగంగా నిర్మితమైన భారీ ఎత్తిపోతల పథకం. మేడిగడ్డ వద్ద సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో గోదావరి నీళ్లను ఆరు దశల్లో లిఫ్టుచేసి 618 మీటర్ల ఎత్తులో ఉండే కొండపోచమ్మ సాగర్‌కు వరకు తరలిస్తారు. అంటే గోదావరి నది నీళ్ళను అర కిలోమీటరుకు పైగా ఎత్తుకు లిఫ్టు చేస్తారు. ఈ ఏడాది ప్రతీ రోజు రెండు టిఎంసిలను ఎత్తిపోయడానికి అనువుగా పంపు హౌజులు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రతీ రోజు మూడు టీఎంసీల చొప్పున ఎత్తిపోయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున నీటిని లిఫ్టుచేయడానికి దేశంలో గతంలో ఎన్నడూ వాడనంత పెద్ద సైజు పంపులను వాడుతున్నారు.

రాత్రింబవళ్లూ చకచకా ప్రాజెక్టు నిర్మాణం
కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసేందుకు రాత్రింబవళ్లూ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 141 టిఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 20 లిఫ్టులను నిర్మిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన 12 బ్లాకుల్లో 1531 కిలోమీటర్ల మేర ప్రధన కాల్వలు, 203 కిలోమీటర్ల మేర సొరంగాల పనులు రాత్రింబవళ్లూ సాగుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం కోసం వేలాది మంది కార్మికులు నిరంతరం షిఫ్టుల వారిగా పని చేస్తున్నారు.


2016 మార్చి 8న దశాబ్దాల తరబడి కొనసాగిన వివాదాలకు స్వస్తి పలుకుతూ, మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నది. దీని ఫలితంగా మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమయింది.

2016 మే 2న కన్నేపల్లి వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు.

మూడేళ్ళ స్వల్ప వ్యవధిలోనే కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన భాగమైన బ్యారేజీలు, పంపుహౌజుల నిర్మాణం పూర్తయింది. రిజర్వాయర్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజీలు నిర్మించారు. ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులను కూడా ఈ నీటితోనే నింపుతారు. దీంతో తెలంగాణలో మొత్తంగా 199 కిలోమీటర్ల మేర గోదావరి నది సజీవంగా ఉంటుంది.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్తగా కరీంనగర్‌ రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్‌, యాదాద్రి, నల్లగొండ, సంగారెడ్డి, నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్‌, మేడ్చల్‌, పెద్దపల్లి, నియోజకవర్గాల్లోని దాదాపు 20 లక్షల ఎకరాలకు నీరందుతుంది.

కాళేశ్వరం నీటి ద్వారానే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకం చేపట్టారు. నిజాంసాగర్‌, సింగూరు ప్రాజెక్టులకు కూడా నీరందివ్వనున్నారు. దీంతో కరీంనగర్‌, సిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్‌, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సంగారెడ్డి, నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్‌, మేడ్చల్‌, పెద్దపల్లి, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, భూపాలపల్లి, మహబూబాబాద్‌, ఖమ్మం, జనగామ, సూర్యాపేట జిల్లాల్లో మరో 20 లక్షల ఎకరాలు స్థిరీకరించబడతాయి. అంటే మొత్తంగా తెలంగాణలోని 40 లక్షల ఎకరాలకు ప్రతి ఏడాది రెండు పంటలకు నీరందుతుంది. ఏటా 80 లక్షల ఎకరాల్లో పంటలు పండుతాయి. అందుకే తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయనిగా నిలవబోతున్నది.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది రోజుకు రెండు టిఎంసిల నీరు ఎత్తి పోయడానికి 4,992.47 మెగావాట్ల విద్యుత్తు అవసరం పడుతుంది. మూడు టిఎంసిల నీటిని ఎత్తిపోయడానికి 7,512 మెగావాట్ల విద్యుత్తు అవసరం పడుతుందని అంచనా వేశారు. దీనికి తగినట్టుగానే ఏర్పాట్లు చేశారు.

చరిత్రలో మొదటిసారిగా తెలంగాణ విద్యుత్‌ సంస్థలు కాళేశ్వరం ప్రాజెక్టులో 139 మెగావాట్ల పంపులు (ప్యాకేజీ 8 రామడుగు) వాడుతున్నారు. భారతదేశంలో ఇంత భారీ సామర్ధ్యంతో ఎక్కడా ఎవరూ పంపులు వాడలేదు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ పంపులు
భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ విద్యుత్‌ సంస్థలు రాష్ట్రంలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలకు అత్యధిక విద్యుత్‌ సరఫరా అందించడానికి రికార్డు స్థాయి ఏర్పాట్లు చేశాయి. ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించడంలో విద్యుత్‌ శాఖకున్న ప్రాధాన్యాన్ని మొదట్లోనే గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందుకు అనుగుణంగా విద్యుత్‌ అధికారులను అప్రమత్తం చేశారు. విద్యుత్‌ శాఖ చరిత్రలోనే మొదటి సారిగా ట్రాన్స్‌కో లో ఎత్తిపోతల పథకాలకు ప్రత్యేక డైరెక్టర్‌ (సూర్య ప్రకాశ్‌)ను నియమించారు. జెన్‌కో – ట్రాన్స్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్‌ రావు ఆధ్వర్యంలో విద్యుత్‌, నీటి పారుదల శాఖ అధికారులు ప్రతీ వారం క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించారు. ఆస్ట్రియా తదితర దేశాలు పర్యటించి పంపుల సామర్ధ్యాన్ని మదింపు చేశారు. బిహెచ్‌ఈఎల్‌తో ఒప్పందం చేసుకుని వివిధ ప్లాంట్లలో సమాంతరంగా ప్రత్యేక పంపులను తయారు చేయించారు.

Other Updates