సంబరాజు రవిప్రకాశరావు
tsmagazineతెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘తెలంగాణ వరదాయిని, బహుళార్థసాధక ప్రాజెక్టులలో తలమానికమైన కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ కవులు, రచయితలు సందర్శించారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో నిర్వహించి ఈ కార్యక్రమంలో 70మంది కవులు, రచయితలు పాల్గొన్నారు. వరంగల్‌, పెద్దపల్లి, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలకు చెందిన తెలంగాణ వికాస సమితి సభ్యులు పెద్ద సంఖ్యలో ప్రాజెక్టును సందర్శించారు. ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్‌, తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షులు నందిని సిధారెడ్డిల సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమం రూపొందించబడింది.

ఉదయం 5 గంటలకే కవులు, రచయితలు హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఉన్న రవీంద్రభారతికి చేరుకున్నారు. అక్కడ తమకోసం సిద్ధంగా ఉన్న రెండు బస్సులలో కాళేశ్వరం ప్రాజెక్టును చూడడానికి బయలుదేరారు. ఆసియా ఖండంలోనే అరుదైన ప్రాజెక్టులలో ఒకటైన కాళేశ్వరాన్ని చూడబోతున్నామన్న ఉత్సాహం ప్రతి ఒక్కరిలో కనిపించింది. ప్రతి కవికి, రచయితకు ప్రాజెక్టు వివరాలు, లైన్‌ డయాగ్రమ్‌ను అందించారు. కవులతోపాటు ప్రయాణం చేసిన నీటిపారుదలశాఖ ప్రత్యేకాధికారి శ్రీధర్‌రావు దేశ్‌పాండే లైన్‌ డయాగ్రమ్‌ను వివరించారు. కవులతోపాటు తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఎస్వీ సత్యనారాయణ, అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఉప కులపతి సీతారామారావు, తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌ అధ్యక్షులు అయాచితం శ్రీధర్‌, తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి, తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, ఈ ప్రాజెక్టు సందర్శనలో పాల్గొన్నారు.

ముందుగా మేడిగడ్డ ప్రధాన ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఇంజినీర్లు మేడిగడ్డ ప్రాజెక్టు అవసరాన్ని, ఆవశ్యకతను, గొప్పదనాన్ని తెలిపారు. లైన్‌ డయాగ్రమ్‌, రిమోట్‌ సెన్సింగ్‌ డయాగ్రమ్‌ల ద్వారా మేడారం ప్రాజెక్టు ప్రాముఖ్యతను తెలిపారు.

రీ డిజైనింగ్‌, రీ ఇంజినీరింగ్‌, రివర్స్‌ పంపింగ్‌లాంటి సాంకేతిక పదాల అర్థాలను వివరంగా తెలిపి ప్రాజెక్టును సులభంగా అర్థం చేసుకొనేందుకు దోహదపడ్డారు. మేడిగడ్డ చాలా ముఖ్యమైనదని, కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటిదని, యిక్కడ సంవత్సరం పొడవునా గోదావరిలో నీటిలభ్యత ఉం టుందని, మూడు నదుల కలయిక స్థానమని చెప్పారు.

ఒక్క ఎకరం, ఏ రైతు నష్టపోకుండా, ఒక్క గ్రామం ముంపుకు గురికాకుండా నిర్మించడం జరుగుతున్నదని, కరకట్టల నిర్మాణం చురుగ్గా సాగుతున్నదని, అనుకున్న సమయంలో నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. తమ్మిడిహట్టివద్ద తగినంత నీటిలభ్యత లేదని కేంద్ర జలసంఘం తేల్చినందువల్ల ప్రాణహిత రీ ఇంజినీరింగ్‌ అవసరమైందని, అందుకే రీడిజైనింగ్‌ చేశామని చెప్పారు. ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్టువల్ల శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌, సింగూరువంటి జలాశయాలకు పుష్కలంగా నీరు లభిస్తుందని వివరించారు. ముంపును అనుమతించమని చెప్పిన మహారాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ ప్రాజెక్టుకు సహాయ సహకారాలను అందిస్తున్నదని, కేంద్ర జలసంఘం కూడా పూర్తి సంతృప్తిని ప్రకటించిందని తెలిపారు.
tsmagazine
మేడిగడ్డ నిర్మాణానికి ముందు ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసిందని, అనుభవజ్ఞులైన ఇంజినీర్లు, వాప్కోస్‌ సంస్థ కలిసి సాంకేతిక అంశాలను సూక్ష్మస్థాయిలో పరిశీలించి, అధునాతన సాఫ్ట్‌వేర్‌ ద్వారా అధ్యయనం చేసి మేడిగడ్డవద్ద 283 టి.యం.సి.ల నీటి లభ్యత ఉందని తేల్చిన కారణంగా మేడిగడ్డ ప్రాజెక్టును చేపట్టామని చెప్పారు. అనంతరం కవులు, రచయితలు బ్యారేజీ పనులను స్వయంగా పరిశీలించి తమ సందేహాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తరువాత కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను, సర్జికల్‌ఫూల్‌ను పరిశీలించారు. కన్నెపల్లి పంప్‌హౌజ్‌ పనులు ముగింపు దశలో ఉన్నాయని, ఆస్ట్రియా, ఫిన్‌లాండ్‌, జర్మనీ మొదలగు దేశాలనుంచేకాక మన బి.హెచ్‌.ఇ.ఎల్‌. పంపులు, మోటార్లను వినియోగిస్తున్నామని చెప్పారు. మేడిగడ్డలో ఎక్కువ సివిల్‌ నిర్మాణాలుంటే కన్నెపల్లిలో ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్‌, మెకానికల్‌ విభాగాలకు సంబంధించిన పనులు ఎక్కువున్నాయని కవులు అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టులో గోదావరి నీటిని 100 మీటర్ల ఎత్తునుంచి 620 మీటర్ల ఎత్తు వరకు పంప్‌ చెయ్యడం మామూలు విషయం కాదని ఇది ఒక ఇంజినీరింగ్‌ అద్భుతమని, సాధారణంగా నది మనకు నీళ్లిస్తుందని కాని తెలంగాణ ప్రభుత్వం నదికే నీళ్లిచ్చి గోదావరిని నిజమైన జీవనదిగా చేస్తున్నదని కవులు, రచయితలు అభిప్రాయపడ్డారు.

కన్నెపల్లి పంప్‌హౌజ్‌నుంచి అన్నారం బ్యారేజీ చేరుకున్నారు. అక్కడ ఇంజినీరు యాదగిరి ప్రాజెక్టును వివరించారు. 14 నెలల తక్కువ సమయంలో జరిగిన నిర్మాణాలను చూసి కవులు, రచయితలు ఆశ్చర్యానికి గురయ్యారు. అన్నారం బ్యారేజీ నిర్మాణం నమ్మలేని నిజమని అభివర్ణించారు. మేడిగడ్డకు ఎగువన నిర్మించిన అన్నారం బ్యారేజీనుంచి రోజుకు రెండు టియంసిల నీటిని ఎత్తిపోయడం జరుగుతుందని చెప్పారు. ఒకవేళ వర్షాలు బాగా కురిసి ఎల్లంపల్లిలో పుష్కలంగా నీటి లభ్యత ఉంటే ఇక్కడ ఎత్తిపోసే అవసరం ఉండదని చెప్పారు. సీకెంట్‌ ఫైలింగ్‌ సాంకేతికను ఉపయోగించి అన్నారంలో పిల్లర్స్‌ నిర్మాణం చేసినట్లు, దాదాపు 30 అడుగుల లోతుకు పైగా భూగర్భంలో ఇసుక ఉన్నందున ప్రాజెక్టు గట్టిదనం కొరకు అధునాతన సాంకేతికతను ఉపయోగించాల్సి రావడం వలన నిర్మాణ వ్యయం కొంత పెరిగినట్లు తెలిపారు. గోదావరి వెడల్పు తక్కువగా ఉండడం, నది ఒంపులు తిరిగి ఉండడం వల్ల నీటి ప్రవాహవేగం ఎక్కువగా ఉంటుందని దానికి తగినట్లుగా పిల్లర్ల పొడవు, వెడల్పులను డిజైన్‌ చేయడం జరిగిందని, దీనికొరకు దేశ, విదేశీ నిపుణుల సలహాలను తీసుకున్నామని చెప్పారు. 12 అడుగుల ఎత్తువరకున్న ఇనుపగేట్లు కూడా చాలా వరకు బిగించారు. బ్యారేజీపైన రవాణా కొరకు రోడ్డు నిర్మాణం కూడా ఉంటుందని దానివలన ప్రాంతాలమధ్య దూరం తగ్గుతుందని చెప్పారు. అన్నారం బ్యారేజీ రాబోయే రెండునెలలలోపే పూర్తవుతుందని దానికొరకు రేయింబవళ్లు కార్మికులు, ఇంజినీర్లు శ్రమిస్తున్నారని వివరించారు.

అనంతరం ప్యాకేజీ6లో భాగంగా ధర్మారం దగ్గరున్న టన్నెల్‌ నిర్మాణాన్ని చూశారు. టన్నెల్‌ లోపలివరకు బస్సులు వెళ్లడంతో సంభ్రమాశ్చర్యాలకు గురైన ఈ బృందం సర్జ్‌పూల్‌ను చూసి విస్మయానికి గురైనారు. ఇంజనీరు వెంకటేశ్వర్లు ప్రతి ఒక్క విషయాన్ని వివరంగా తెలిపినారు. సర్జ్‌పూల్‌ ‘ఎల్‌’ ఆకారంలో ఉంది. దాదాపు 160 మీటర్ల ఎత్తు ఉండడం, కొండల గర్భాన్ని తొలిచి అద్భుత నిర్మాణాన్ని చేయడం మన ఇంజనీర్ల ప్రతిభను తెలియజేస్తున్నది. దాంట్లోనే ఉన్న పంపులు, గ్యాస్‌ ఇన్స్‌లేటెడ్‌ సబ్‌స్టేషన్లు చూసి ఆశ్చర్యపోవడం ప్రతి ఒక్కరివంతైంది. ఒక్కొక్క పంపు లక్ష హార్స్‌పవర్లను మించి ఉంటుందని చెప్పినపుడు, ఆయా పంపులలోని ప్రత్యేకతలను వివరిస్తున్నప్పుడు కవులు చాలా శ్రద్ధగా విన్నారు. ఎంతో ఆసక్తి ప్రదర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన సందర్భంగా దేశపతి శ్రీనివాస్‌, నందిని సిధారెడ్డి, ప్రొ|| సీతారామారావు, ప్రొ|| ఎస్వీ సత్యనారాయణ, అయాచితం శ్రీధర్‌ మొదలగు ప్రముఖులు పాత్రికేయులతో ముచ్చటించారు. దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ఇంజనీరింగ్‌ అద్భుతాలతో, కాళేశ్వరం ప్రాజెక్టు అగ్రస్థానంలో ఉంటుందని, ముఖ్యమంత్రి దార్శనికత వల్లనే యిది సాధ్యమైందని, ప్రభుత్వం రైతుల పక్షపాతి కావడంవల్ల భారీ వ్యయాన్ని కూడా ఆలోచించకుండా మహత్తర నిర్ణయం తీసుకుందని, రాబోయే కొద్ది కాలంలోనే తెలంగాణ సస్యశ్యామలం కాబోతున్నదని, హరీశ్‌రావువంటి కార్యదీక్షాపరుడు, అంకితభావంగల నాయకుడు నీటిపారుదలశాఖ మంత్రిగా ఉండడంవల్ల తక్కువ వ్యవధిలో ఎక్కువ పనులు జరుగుతున్నవని చెప్పారు.

Other Updates