ప్రపంచంలోని ఏ భాషలోనైనా భాషాభాగాలు ముఖ్యమైనవి. వీటినే ఆంగ్లంలో పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్‌ అంటారు. తెలుగు భాషలో భాషాభాగాలు ఐదు. అవి వరుసగా నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, క్రియలు, అవ్యయాలు. అయితే ప్రతి భాషకు ఈ అంగాలు ఎంత ప్రధానమైనవో, అంతే ప్రముఖమైనవి సామెతలూ, పలుకుబళ్ళూ. పైగా ఈ రెంటిలో ”పలుకుబడి”కి ప్రత్యేకత ఉన్నది. కాళోజీ, బడిపలుకులకన్న పలుకుబడుల భాష కావాలని చాలాసార్లు ప్రస్తావించారు. పలుకుబడి ప్రత్యేకత ఏమిటంటే అవి దాదాపు పదాలలోని సాధారణార్థానికి భిన్నంగా ఉంటాయి. అవి ఆ భాషకు మాత్రమే ప్రత్యేకించి వుంటాయి. అంత తొందరగా పలుకుబళ్ళు అనువాదానికి లొంగవు. భాషతో బాగా పరిచయమున్న వారికే వీటి అర్థాలు తెలుస్తాయి. పలుకుబళ్ళనే భాషీయాలు, జాతీయాలు, పదబంధాలు, గాలికబుర్లు యిట్లా రకరకాల పేర్లతో పిలుస్తున్నాము. తెలంగాణ తెలుగులో ఈ పలుకుబళ్ళు తామరతంపరలుగా, ఓ హరిసాహరులుగా, ఓ తప్రోతములై వున్నాయి.

”ఫలానావాణ్ణి శంకరగిరి మాన్యాలు తిప్పుతున్నారు. పాపంవాడు శంకరగిరి మాన్యాల్లో తిరుగుతున్నాడు”వంటి వాక్యాల్లో ”శంకరగిరి మాన్యాలు తిప్పడం లేదా తిరగడం” అన్నది పలుకుబడి అంటే ఆ ఫలాన మనిషి తన యింటికి దగ్గర్లో లేక దూర ప్రాంతాల్లో తిరుగుతున్నాడని అర్థం. అయితే ఇది తెలంగాణ పలుకుబడికాదు. మరి తెలంగాణలో ఏమంటారు దీన్ని? ”వాడు తాళ్ళు, తంగెల్లు పట్టుకొని తిరుగుతున్నాడు” అని అంటారు. ఆ వ్యక్తి తన ఉద్యోగరీత్యానో, యితర కారణాలవల్లనో వున్న వూళ్ళోకాక దూర ప్రదేశాల్లో మారుమూల చోట్లలో పనిచేయవలసి రావడం అన్నమాట. ఇంకో పలుకుబడి: నగానట్రా. ఇది జంటపదరూపంలోనిది. మొదటి పదానికి అర్థం తెలుసు మనకు. ”నట్ర” అంటే ఏమిటో తెలీదు. అయినా అది ‘నగ’కు సపోర్టింగ్‌గా వచ్చి చేరింది. దీన్నే తెలంగాణలో ”నగలు గిగలు” అంటారు. వాల్మీకిగీల్మీకి అన్నట్లున్నది ఈ పలుకుబడి. ఇక్కడ కూడా అంటే తెలంగాణలో ఈ ”గిగలు” పదానికి అర్థంలేదు. ”పురుగుపుట్రా” ఇంకో పలుకుబడి. ”పుట్ర” అంటే కూడా పురేగే! అంటే పాముల్లాంటివి అని సారాంశం. తెలంగాణలో ఈ పురుగుపుట్రను ”పురుగుబూచి” అంటారు. మరి ఈ ”బూచి” ఏమిటి? అది బూచికాదు, పూచి. ఈ ‘పూచి’ నిజానికి తమిళ ”పూచ్చి”లోంచి వచ్చింది. తమిళభాషలో ”పూచ్చి” అంటే పురుగు అనే! తెలంగాణ పలుకుబడిలో తమిళపదం కూడా వుండటం ప్రత్యేకత. ‘స్నానం గట్రా’ చేశారా అనే వాక్యంలో ఈ ‘గట్రా’ ఏమిటి. వగైరా అనే అర్థంలో ‘గట్రా’ వాడబడింది. ఇదే తెలంగాణలో ‘తానం గిట్ట చేసిన్రా’ అనే రీతిలో వుంది. తెలుగు భాషలో ”గట్రా”, తెలంగాణలో ”గిట్ట”గా వుంది.

తెలుగు భాషలోని ”కూరా నారా” తెలంగాణలో ”కూరలు గీరలు” అయ్యాయి. ”ఆస్తిపాస్తులు” తెలంగాణ సీమలో ”ఆస్తులు పాస్తులు”గా కనిపిస్తున్నాయి. ”పాస్తులు” అర్థం ఏమిటో తెలీదు. కాకపోతే తెలుగుభాషలోని ”ఆస్తిపాస్తులు” అని అనడం కన్నా, తెలంగాణలో ”ఆస్తులు పాస్తులు” అనడంలో ఒక సమతుల్యత ఉంది. ‘ఆస్తులు”లో నాలుగు మాత్రలు ఉన్నట్లే ‘పాస్తులు’లో సైతం నాలుగే ఉన్నాయి. ”భూములు జాగలు”లోనూ అన్నేసి మాత్రల సమతుల్యత ఉంది. పోతే… తెలుగులో ”కూలీనాలీ” చేసుకొని బతకడంలోని ”కూలీనాలీ” ఒక పలుకుబడి. ”నాలి” అంటే ”కుత్సితపు పని” అని అర్థం. అంటే తక్కువరకం పని అన్నమాట. ఈ పలుకుబడి తెలంగాణలో ”కైకిలి గంబడి” చేసుకొని బతకడంగా ఉంది. ”కైకిలి” అంటే ఏమిటి? రోజువారీ కూలియే! ”కైక్యూలి” అనే తమిళ పదంలోంచి వచ్చింది కైకిలి. మరి ”గంబడి”కి అర్థం? అది గంబడి కాదు కంబడి. ఇంకా చెప్పాలంటే ”కంబళి” (గొంగడి). అంటే కూలీ పని చేసైనా, గొంగళ్ళు నేసైనా జీవించడం ఈ పలుకుబడికి అర్థం. తెలుగులోను ”చుట్ట పక్కాలు” తెలంగాణలో ”చుట్టాలు పక్కాలు” అయితది. ఈ పలుకుబడిలోనూ మాత్రల సమతుల్యత ఉంది. బహుశ: చుట్టాలు అంటే ఆపదలో మన చుట్టూ ఉండేవారు కావచ్చు. మరి ఈ ”పక్కాలు” ఏమిటి? విపత్సమయంలో మన పక్కన (పార్శ్వంలో) చేరేవాళ్ళు అయివుంటారు.

”ఆపాదమస్తకం చూశాడు, నఖశిఖ పర్యంతం చూశాడు”వంటి వాక్యాలు తెలంగాణలో చాలా చక్కగా తెలుగుతనం తొణికిసలాడేలా ”కిందికెల్లి మీది దాక చూసిండు” అనే వాక్యరూపంలో ఉన్నాయి. పాదంనుంచి మస్తకం వరకు చూడటమైనా, తలమీది శిఖనుంచి కాలి నఖం వరకు చూడటమైనా ”కిందికెల్లి మీదిదాకా చూసిండు”లో వున్నాయి. ”వాడు కాళ్ళా వేళ్ళా పడ్డాడు” తెలుగులో మరొక పలుకుబడి. అంటే ఎదుటివ్యక్తిని బతిమిలాడాడు, ప్రాధేయపడ్డాడు అని అర్థం. దీనికి తెలంగాణలో ”వాడు కాళ్ళు కడుపులు పట్టుకున్నడు” అంటున్నారు. కాళ్ళాపడ్డం అంటే కాళ్ళమీద పడటమే! వేళ్ళా పడటం ఏమిటి? చేతివేళ్ళు పట్టుకోవడం కావచ్చు. తెలంగాణలో కాళ్ళతోపాటు కడుపులు పట్టుకోవడం వుంది. కడుపుపట్టుకోవటం ఆత్మీయతకు సూచకం. బతిమిలాట్టంలో కాళ్ళమీద పడడంతో సమానమైన ఘట్టం. ఎదుటి మనిషి మనసు కరిగే అవకాశమున్న సన్నివేశం. ”కడుపా కొల్లేటిచెరువా?” అన్న దానికి తెలంగాణలో ”కడుపా కయ్యా!” అంటారు తిండిపోతును చూసి. మాట మార్చే వ్యక్తిని చూసి ”నాలుకా తాటిమట్టా?” అని తెలుగులో చెబితే, తెలంగాణలో ”నోరా మోరా?” అంటారు. ”మోరి” అంటే ”మురిక్కాలువ”, ”నాలుకా తాటిమట్టా”లో లేని మాత్రాతుల్యత ”నోరా మోరా?”లో వుంది. ఏది ఏమైనా భాషలో అత్యంత ప్రాధాన్యం ఉన్న పలుకుబళ్ళు తెలంగాణలో విలక్షణంగా వున్నాయి.

డాక్టర్‌ నలిమెల భాస్కర్‌

Other Updates