సంబరాజు రవిప్రకాశరావు
‘బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్’ పద్యంలో బమ్మెర పోతన ‘సత్కవుల్ హాలికులైన నేమి?’ అని ప్రశ్నిస్తాడు. దానిని నిజం చేసినవాడు ఇమ్మడిజెట్టి చంద్రయ్య. నాగరకర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలో 1934 మార్చి 31న జన్మించిన చంద్రయ్య హాలికుడు, సత్కవి, యోగి, అవధూత, సంకీర్తనాకారుడు. తెలంగాణ గర్వించదగ్గ కావ్యకర్త. స్థల పురాణ ప్రబంధ కవి. శతకకర్త. హరికథా రచయితనే కాక స్వయంగా కమ్మని కంఠస్వరం కలిగిన హరికథా భాగవతార్.
ఇమ్మడిజెట్టివారిది బుడుపాల గోత్రం. వీరి పూర్వీకులైన బొల్లన రాయచూరు సైన్యాధిపతిగా, నరసింగుడు దేవరకొండ సేనానిగా గొప్ప కీర్తి పొందారు. నరసింగుని కుమారులలో ఒకరైన పాపన్న గొప్ప మల్లయోధుడు. పాపన్న, లక్ష్మమ్మ దంపతులకు పుట్టిన చంద్రయ్య దేవరకొండను వదిలి తాళ్లపల్లి చేరి పంటపొలాలు కొని వ్యవసాయం మొదలుపెట్టారు. చంద్రయ్య ముగ్గురు కుమారులలో చిన్నవాడైన వెంకటయ్యకు వివిధ శాస్త్రాలలో ప్రవేశంతోపాటు సంస్కృతాంధ్రాలపై పట్టు ఉండేది. నిరంతరం హరి ధ్యానంలో ఉండేవాడు. దాన గుణం ఇతనికి అలంకారంగా ఉండేది. ఈ వెంకటయ్య, అనంతమ్మ దంపతులకు జన్మించినవాడే ఇమ్మడిజెట్టి చంద్రయ్య.
గుండూరు హనుమచ్ఛర్మ, పోకూరి కాశీపతి వంటి మహాపండితుల శిష్యరికంలో కావ్యకళాకౌశలాన్ని గ్రహించిన చంద్రయ్య ప్రబంధకవిగా, శతకకర్తగా, హరికథా రచయితగా సాహిత్యలోకంలో నిలిచిపోయాడు. దొంతోజు నారాయణాచార్యుల శిష్యరికంలో యోగ రహస్యాలు తెలుసుకొని అవధూతగా మారాడు. ‘అంటరానటువంటి వాడు అంటరమ్మంటున్నడు,
‘ఇంటి మగని జంట బాసి వెంట రమ్మంటున్నడు’ వంటి కీర్తనలను రాసిండు.
ధారాశుద్ధి రసంబు రమ్యపద సంధానంబు పాకం బలం
కారంబు బరిపుష్ఠమౌచితి చమత్కారంబు భావంబు శ
య్యారీతి స్ఫురణంబునై వెలయుకావ్యంబట్లు సల్లక్షణ
స్ఫారంబై దనరారు చూపరకు నశ్వవ్రాత మువ్వీడునన్
అని తనకున్న కావ్య నిర్మాణ సామర్థ్యాన్ని కర్పరాద్రి మాహాత్మ్యంలో చంద్రయ్య అన్యాపదేశంగా చెప్పుకున్నాడు. తనకున్న కావ్య నిర్మాణ సామర్థ్యంతో శ్రీశిరీషనగ గండికా మాహాత్మ్యము, కర్పరాద్రి మాహాత్మ్యము అను రెండు స్థల చారిత్రక ప్రబంధాలను; రామప్రభు, పాలెం వెంకటేశ్వర, మృత్యుంజయ, చంద్రమౌళీశ్వర శతకాలను; హనుమద్రామ సంగ్రామం మరియు వీరబ్రహ్మేంద్ర విలాసము అను రెండు హరికథలను రచించాడు. ఇవన్నీ ముద్రితాలు. మద్యపాన నిషేధం, సిరియాళ మహారాజు హరికథ, మహర్షి దయానంద మంజరీ ప్రబంధము రచనలు అముద్రితాలుగా ఉన్నవి.
శ్రీశిరీషనగ గండికా మాహాత్మ్యం పద్నాలుగువందల గద్యపద్యాలతో ఉన్న ఏడు ఆశ్వాసాల ప్రబంధం. ఇది కల్వకుర్తి సమీపంలో ఉన్న సిరుసనగండ్ల క్షేత్ర చరిత్ర. రామశర్మ అనే భక్తుడు రామాలయం నిర్మించడం ఇందలి ప్రధాన ఇతివృత్తం. అవతారిక, ఆశ్వాసాంత గద్యలు, ప్రబంధ వర్ణనలు, ఉపకథలు, వస్త్వైక్యత, ఛందో వైశిష్ట్యము దీనిలో కనబడుతున్నవి. ఈ కావ్యాన్ని చంద్రయ్య రామునికి అంకితమిచ్చాడు.
”చంద్రయ్య కావ్యరచనాశక్తి ప్రసిద్ధ అలంకారికుడైన రాజశేఖరుడి మాటలను గుర్తు తెచ్చుకుంటే ఆయన చెప్పిన కారయిత్రి శక్తి సమృద్ధిగా ఉందనటానికి ఈ కావ్యం స్పష్టమైన ఉదాహరణ” అన్న కోవెల సంపత్కుమారాచార్య ముందుమాట చంద్రయ్య రచనాశక్తికిచ్చిన గొప్ప ప్రశంసగా భావించాలి. రామశర్మలోని మంచి గుణాలను చంద్రయ్య వర్ణించిన తీరు సమాజానికిచ్చిన సందేశంగా ఉంది.
తనతల్లి చందంబు దలచు వినిర్మల /
శీలమొప్పగ పరస్త్రీని గన్న
గురుభావముంజేసి గొలుచు వినమ్ర సం /
కలితాత్ముడగుచు పెద్దలను గన్న
స్వాంతంబునందశాశ్వతములటంచు సం /
భావించుచుండు సంపదలటన్న
అనుపమ భాగ్యంబటంచు భావించు హృ /
త్సరసిజంబున సదాచారమన్న
విధిత కర్తవ్యమని మనోవీధినెంచు
ప్రకటితాగమ సంచయ పఠనమన్న
ఆర్యజన సమ్మతుండునై యటులతాను
తరచు నొప్పుల కుప్పయై తనరుచుండె
ప్రముఖ పండితుడు శ్రీరంగాచార్య అన్నట్టు ఈ కావ్యం సంప్రదాయమైన మార్గంలో నడిచి సాహిత్యాకాశములో
శుక్రతారవలె ప్రకాశిస్తున్నది. దీనికి తుమ్మల సీతారామమూర్తి బహుమతి వచ్చింది.
కర్పరాద్రి మాహాత్మ్యం కుమ్మెరగట్టు క్షేత్ర మహత్యాన్ని చెప్పే ప్రబంధం. చంద్రయ్య దీనిని ఐదాశ్వాసాల మహాప్రబంధంగా తీర్చిదిద్దాడు. ఈ గ్రంథం చంద్రయ్యకున్న మంత్ర జ్యోతిష శాస్త్ర పరిచయాన్ని వెల్లడి చేస్తున్నది. భ్రమర విలసితం, చంచరీకావళి, ప్రభాతం, మత్తకోకిల, సుగంధి, మాలిని వంటి విశేష వృత్తాలను ఈ కావ్యంలో ఉపయోగించాడు. దీనిలో చంద్రయ్యకున్న విస్తృత లోకజ్ఞానం, నిఘంటు పాండిత్యం తెలుస్తున్నవి. ఇందులో కొన్ని అచ్చ తెలుగు పద్యాలున్నవి. కుమ్మెరగట్టుపై మల్లయ్య కొలువున్నాడు కాబట్టి దీనిని శివునికి అంకితమిచ్చాడు. తన రెండు కావ్యాలలో ఒకదానిని శ్రీరామునికి, మరొకదానిని శివునికి అంకితమిచ్చి చంద్రయ్య హరిహరాద్వైతాన్ని చాటాడు.
శివమంత్ర జపతపాదుల వలన కలిగే ఫలితాన్ని చెప్పి భక్తి మకరందాన్ని వెదజల్లాడు.
మానిత భక్తి నెద్దాని జపింప దీ / ర్ఘాయురారోగ్యంబులందజేయు
తాలిమిమీర నెద్దాని పఠింపను / ద్దామరిపు ప్రమాదంబు బాపు
మరువక నెద్దాని మనమందు దలపగా / కలుషసంచయము పోకార్పగలదు
అనయమెద్దాని నత్యర్థి సంభావింప / నురుతర సంపదలొంద గూర్చి
మరియు నెద్దాని పేర్కొన మహిత కీర్తి
భవ్యతేజంబు కైవల్యపదవి నొసగు
నట్టి శివమంత్రమును శుభంబడర నీకు
హితవు చొప్పార నుపదేశమిత్తుగాను
ఈ కావ్యంలోని దుర్భిక్ష వర్ణన పాలమూరు ప్రాంతం ఎదుర్కొన్న కరువు కాటకాలకు అద్దం పట్టినట్లుగా ఉంది. ఎన్నో కావ్యాలు చదివిన అనుభవం ఉన్న చంద్రయ్య రచించిన ఉత్తమ కావ్యం కర్పరాద్రి మాహాత్మ్యం.
‘పాలెము వేంకటేశ్వరా’ అనే మకుటంతో చంపకమాల, ఉత్పలమాల పద్యాలతో పాలెం వేంకటేశ్వర శతకాన్ని ఇమ్మడిజెట్టి చంద్రయ్య రచించాడు. ఇందులోని కొన్ని పద్యాలు భగవద్గీత శ్లోకాలకు అనువాదా లుగా ఉన్నవి. శతకం చివర ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ న్న ద్వాదశాక్షరితో దశావతారాలను స్తుతించడం ఈ శతకం ప్రత్యేకత.
‘అచ్యుతార్చిత పదాబ్జా చంద్రమౌళీశ్వర’ అనే మకుటంతో అచ్చంపేట సమీపంలోని కొండారెడ్డిపల్లెలో వెలసిన చంద్రమౌళీశ్వరునిపై ‘చంద్రమౌళీశ్వర శతకాన్ని’ రాసిండు. దీనిలో భగవంతుని వర్ణననే కాక సమాజంలో కనిపించే అధర్మాలను ఎత్తి చూపిండు. దీనిలో కవి శబ్ద, ఛందః ప్రయోగ నిపుణతకు ఉదాహరణలుగా అనేక పద్యా లున్నవి. మానవులు ఏవిధంగా మెలగవలెనో, ఎటువంటి శ్రమ చేయవలెనో తెలుపు పద్యాన్ని చూడండి-
మమకారంబున కవ్వలన్ మెలగుచున్ మానావమానంబులన్
సమలీలన్ మదినెంచుచున్ నరుడశ్రాంతంబు నీయందు
విశ్వము విశ్వంబున నీవెసంగుటలు సంభావించుచున్నూర్జిత
శ్రముడు గావలె నచ్యుతార్జిత పదాబ్జా చంద్రమౌళీశ్వరా!
ఇమ్మడిజెట్టి చంద్రయ్య చాటుపద్యాలు చెప్పినట్లు ‘చాటుపద్య రత్నావళి’ వల్ల తెలుస్తున్నది. ‘స్యాలకో గృహనా శాయా – సర్వన్నాశాయ మాతులః’ అన్న సుప్రసిద్ధ విషయాన్ని చాటు పద్యంగా చెప్పాడు.
ఎలుకలు ధాన్యము చెరచును
విలసితముగ కుంజరంబు విత్తము చెఱచున్
ఇల చెరచు నాలి తమ్ముడు
సలలితముగ మేనమామ సర్వము చెరుచున్
చంద్రయ్య ఇంటిపేరులో ఉన్న ‘జెట్టి’ అతని కవిత్వానికి కూడా వర్తిస్తుంది. నిరాడంబరుడు, వేదాంతి, కుండల నీయోగ సాధకుడు, జ్యోతిష వాస్తు వైద్య శాస్త్ర పరిచయాలు గల చంద్రయ్య సర్వమతసారం తెలిసినవాడు. వారు 1997 మార్చి 11 నాడు మహాసమాధి చెందారు. ఇంతటి బహుముఖ ప్రజ్ఞావంతులైన వ్యక్తులు తెలంగాణలో అరుదు. తెలంగాణ జాతి రతనాలలో ఒకరైన చంద్రయ్యకు జోహార్లు అర్పిద్దాం.